Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అపార్థం ప్రేమలు..

[శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి రచించిన ‘అపార్థం ప్రేమలు..’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

“అబ్బా ఏంట్రా ఈ బండి నడపడం, వృద్ధులు మార్నింగ్ వాకింగ్ చేస్తున్నట్టూ, తాబేళ్ళు పాకుతున్నాట్టూ, రోడ్ రోలర్‌లా ఇంత నెమ్మదిగానా వెళ్ళడం, దయచేసి కాస్తంత త్వరగా వెళ్లరా నాయనా, అవతల లలిత వెయిట్ చేస్తూ ఉంటుంది” కంగారు పెట్టాడు మధు.

“అబ్బాబ్బా, ఏంట్రా ఇందాకటి నుండి చెవి దగ్గర జోరీగలా పోరు పెట్టి మరీ చంపేస్తున్నావ్. నేను బైక్ నడుపుతున్నాను, ఏరోప్లేన్ కాదు. త్వరగా, త్వరగా వెళ్ళూ, వెళ్ళూ అంటే ఎక్కడికి వెళ్ళేది. ఏట్లోకా, నీ కంటికి రోడ్డు మీద ట్రాఫిక్ కనబడ్డం లేదూ, కాస్తంత నిదానంగా ఉండి కొంచెం ఓపిక పట్టు. అయినా తను రమ్మందే అనుకో, ఇంత తొందరపడి, హైరానా పడి మరీ వెళ్లలా? ఇంత కంగారు పడిపోతున్నావ్, ఇంతకీ తను ఎక్కడుందిప్పుడు.” అడిగాడు గిరి.

“ఒక రెస్టారెంట్‌లో ఉందిలే. ఆల్రెడీ తను వచ్చి ఇప్పటికే పావుగంట అయిపోయిందట” చెప్పాడు కాస్త కంగారు పడిపోతూ.

“ఏడిసినట్టు ఉంది. ఏదో అర్జెంట్‌గా ఏ ఎగ్జామ్‌కో, ఎవరికైనా బాలేకపోతే హాస్పిటల్‌కో వెళ్ళినట్టు అంత కంగారు పడిపోతున్నావెందుకూ. వెళ్లింది రెస్టారెంట్‌కే కదా, కూర్చుని నీ కోసం వెయిట్ చేస్తుందిలే. ఆ మాత్రం దానికి నువు ఇలా గుండాపిండైపోయి, ఓ తర్జన బర్జన పడిపోయి నన్ను టెన్షన్ పెట్టకు. నిదానంగా నన్ను బండి నడపనీ” అన్నాడు పళ్ళు నూరేస్తూ.

“నీకు లలిత సంగతి పూర్తిగా తెలీదు, తను రెస్టారెంట్‌కి వెళితే క్షణం ఖాళీగా ఉండదు, ఏదొకటి ఆర్డర్ చేసి తింటూ కూర్చుంటుంది. వెళ్ళాక ఆ బిల్లు నేనే కట్టాలి” ఏడుపు మొహంతో చెప్పాడు మధు.

“అదా నీ తొందరకి కారణం, సరిపోయింది” అంటుండగానే, ఏదో రెస్టారెంట్ రావడంతో,

“ఆ.. ఆపు, ఆపు. ఇక్కడే దిగాలి, ఆ రెస్టారెంటే” అరిచాడు మధు.

“సరే”, అంటూ సడన్ బ్రేక్ వేసి, “దిగరా నాయనా, వెళ్ళు. నాకు పనుంది వస్తాను” అంటూ రై మంటూ వెళ్లిపోయాడు గిరి.

రెస్టారెంట్ లోకి వెళ్తూనే “ఏవిటి అలా ఉన్నావ్. ఏమైంది” అడిగాడు మధు లలిత వంక ఆశ్చర్యంగా చూస్తూ.

“ఏం కాలేదు. నేను నీకు పొద్దున్న నుండి ఓ అయిదు సార్లు కాల్ చేస్తే ఒక్క సారి లిఫ్టు చేశావ్. నన్ను ఇలా రెస్టారెంట్‌కి రమ్మని నువ్వు మాత్రం తీరిగ్గా అరగంట తర్వాత వచ్చావ్. అయినా తెలిసి, తెలిసి నీ లాంటి లేజీ ఫెలోని ప్రేమించడం నా బుద్ధి తక్కువ” విసుక్కుంది.

“ఈ మాత్రం దానికేనా. పొద్దున అర్జెంట్‌గా రైల్వే స్టేషన్‌కి వెళ్ళవలసి వచ్చింది. అందుకే నీ ఫోన్ ఎత్తలేదు. సరే నీ దగ్గరకే కాళ్ళకి చక్రాలు కట్టుకుని బయలుదేరబోతుంటే, అప్పుడే చీరాల నుండి మా చుట్టాలు వచ్చారు. సరే మరీ వెంటనే వచ్చేస్తే బావుoడదని, కొంచెం సేపు వారితో మాట్లాడి ఇలా వచ్చాను” అని ఇంకేదో చెప్పేంతలో,

“వద్దు ఇక చాలు. ఇలాగే చేస్తూ పోతూ ఉంటే నేను మనసు మార్చుకునే అవకాశం ఉంది. అసలే ఈ మధ్య నాకు, ఫోన్లు మెస్సెజ్‌లు చేస్తూ నన్ను ఆరాదిస్తున్న ఓ అజ్ఞాత ప్రేమికుడు తయారయ్యాడు. అతను రోజూ ఫోన్ చేసి, నేను ఏ కలర్ డ్రస్ వేసుకున్నానో చెప్తున్నాడు, నా ఫుడ్ హాబిట్సు ఏంటో చెప్తున్నాడు, ఆఖరికి ప్రతిరోజూ సాయంత్రం తను నన్ను చూడటం తన అధృష్టంగా భావిస్తున్నానని కూడా చెప్పాడు. ఈ రోజు అయితే ఓ కవిత కూడా రాసి పంపాడు తెలుసా”

“అవునా, నువ్ నెంబర్ ఎవరికీ ఇవ్వలేదు కదా”

“ఎవ్వరికీ ఇవ్వలేదు, కానీ అతనే నా మీద ప్రేమతో కనిపెట్టాడు” చెప్పింది కాస్త సిగ్గుపడిపోతూ.

“నా అనుమానం నిజవైతే నువ్ నిజంగానే సిగ్గుపడతావ్ “అని ఇంకో క్షణం ఆలోచించి,

 “ఇలా ఎప్పటి నుండి చేస్తున్నాడు”

“మొన్న సాయంత్రం నుండి” చెప్పింది లలిత కాస్త గర్వంగా

“అలాగా” అని ఓ క్షణం ఆలోచించి, కొంచెం నవ్వు ఆపుకుని, “వాడ్ని నువు సీరియస్‌గా తీసుకోకు, ఇదొక అపార్థం అయి ఉండొచ్చు, కనుక నువ్ మరీ ఎక్కువ ఊహించుకోకు” చెప్పాడు మధు.

“ఏంటీ జెలసీనా, తట్టుకోలేకపోతున్నవా, బాధతో నీ గుండె గిలక్కాయిలా కొట్టుకుంటోందా” అడిగింది నిర్లక్ష్యంగా.

“అయ్యో అదేం కాదు. నువ్వు, నేను, మా చెల్లెలు కలిసి మీ వీధి చివర బజ్జీ బండి దగ్గర పకోడీ, బజ్జీ తిన్నాం గుర్తుందా”, అడిగాడు

“అవును అయితే”,

“వాడి దగ్గర ఫోన్ పే లేదన్నాడు. నువ్వేమో యాభై చేంజ్ ఉందా అని నన్ను అడిగావ్, నేనే ఆ చీకట్లో, నువ్ నాకు ఎప్పుడో నీ నెంబర్ రాసి లవ్ సింబల్ వేసి ఇచ్చిన నోటుని, ఇంకో నోటు అనుకుని నీకు ఇచ్చేసాను. అది నువ్ వాడికి ఇచ్చేశావ్. వాడు ఆ లవ్ సింబల్‌నీ, నీ నెంబర్‌నీ చూసి,ఆ లవ్ వాడి పైనే అనుకుని నీకు తెగ మెసేజ్‌లు పెడుతున్నాడని నా అనుమానం. కావాలంటే ఫోన్ చేసి చూడు” అని కొంచెం నవ్వాపుకుంటూ చెప్పాడు.

ఆమె వెంటనే ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసి “మీరు పకోడీ బండి బుజ్జి” అని ఆపింది,

అంతే అవతలి నుండి పెద్ద గొంతుతో, “మేడం ఈ జన్మకి ఇది చాలు మేడమ్, మీ ప్రేమ అనే నూనెలో నేను వంకాయ బజ్జీలా మునిగిపోయాను. మిరపకాయ్ బజ్జీలా వేగిపోతున్నాను, నా మనసు మెత్తని పకోడీ, మీరు కాదంటే మాత్రం కారప్పూసలా విరిగిపోతుంది” అని ఇంకా అతను కవిత చెప్తుండగానే ఫోన్ కట్ చేసింది లలిత.

మధు మాత్రం నవ్వు ఆపుకోలేక ఇంకా గట్టిగా నవ్వేసాడు.

Exit mobile version