Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఉత్కంఠభరిత పఠనం – ‘పథకం’ ప్రకారం సాగి, ఫలించిన ‘అన్వేషణ’

[శ్రీ మంజరి గారు రచించిన ‘అన్వేషణ’, ‘పథకం’ అనే నవలలని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

మంజరి అనే కలం పేరుతో ప్రసిద్ధులైన శ్రీ గంధం నాగేశ్వరరావు గారు అనేక కథలు, పలు నవలలు రచించారు. ముఖ్యంగా క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ నవలలకు మంజరిగారు పేరుగాంచారు. వారి ‘అన్వేషణ’, ‘పథకం’ అనే నవలలను సమీక్షించే ప్రయత్నం చేస్తాను.

అయితే, సస్పెన్స్ – క్రైమ్ థిల్లర్స్ నవలల సమీక్ష మామూలు నవలల సమీక్షగా వ్రాస్తే  వాటిల్లోని ఉత్కంఠ పోతుంది. అందువల్ల స్పాయిలర్స్ లేకుండా, పాఠకులే నవలని చదువుకుని ఆస్వాదించేలా సమీక్షలు ఉండాలి.

ఈ రెండు నవలల పేర్లు భలే కుదిరాయి. ‘అన్వేషణ’లో పథకం ఉంది, ‘పథకం’ లో ‘అన్వేషణ’ ఉంది.

అంటే ‘అన్వేషణ’ నవలలో ఒక వ్యక్తికై సాగిన వెతుకులాటలో ‘పథకం’ (ప్రణాళిక) ఉంది. ‘పథకం’ నవలలో ఒక నిధికై జరిగిన వెతుకులాట (అన్వేషణ) ఉంది. ఇలా కలవడం యాదృచ్చికం మాత్రమే! రెండు నవలలూ చాలా ఉత్కంఠభరితంగా సాగుతాయి.

~

‘అన్వేషణ’ నవల ‘మూడు నక్షత్రాలు’ పేరిట ఆంధ్రభూమి వారపత్రికలో సీరియల్‍గా ప్రచురితమైంది.  ఉమ్మడి విశాఖ జిల్లా గంగవరం, భీమిలి, పెద నందిపల్లి, విశాఖపట్టణం తదితర ప్రాంతాలలో సాగుతుంది ఈ నవల కథ.

భరణి ఒక రచయిత. మహాలక్ష్మి అతని భార్య. ఆమె ఫిషరీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తుంది. ఒక రోజున వాళ్ళింటి ల్యాండ్‌లైన్‌కి ఫోన్ వస్తుంది. గంగవరంలో చావు బతుకుల్లో ఉన్న గంగమ్మ అనే ఆవిడ భరణిని చూడాలనుకుంటోందని కబురు. వెళ్తాడు. ఫలానా ఆయన కొడుకువేనా నువ్వు అని అడుగుతుందామె. అవునంటాడు. అప్పుడామె ‘రాజారావు నీ తండ్రి కాదు’ అని చెప్పి చచ్చిపోతుంది. భరణి ఇంటికి వెళ్ళాకా జరిగినదంతా భార్యకి చెప్తాడు. భరణి ఈ సంగతి తేలిగ్గా తీసుకున్నా, మహాలక్ష్మి ఊరుకోదు. భర్త అసలు తండ్రి ఎవరో కనుక్కోవాడని ప్రయత్నాలు మొదలుపెడుతుంది. ఈ క్రమంలో ఆమె కలిసిన వ్యక్తులు, తిరిగిన ప్రదేశాలు, అక్కడ సమయోచితంగా మాట్లాడిన తీరు ఆమె తెలివితేటలని సూచిస్తాయి.

కావేరి ఆర్థికంగా చితికిన కుటుంబానికి చెందినది. కానీ వీరరాఘవయ్య చౌదరి తండ్రి ఆమెలోని దక్షతని గుర్తిస్తాడు. ఆమె తన కోడలైతే, దారి తప్పుతున్న కొడుకుని అదుపు చేసి, ఆస్తిపాస్తులని కాపాడగలదని అర్థమవుతుంది. ఆమెని కోడలిగా చేసుకుంటాడు. పెళ్ళయ్యాకా, వీరరాఘవయ్యని నియంత్రణలో ఉంచుతుంది. అతని చెడుతిరుగుళ్ళని అదుపు చేస్తుంది. పెద నందిపల్లి గ్రామానికి పెద్ద దిక్కవుతుంది. కాలక్రమంలో ఆ ఊరికి సర్పంచ్ అవుతుంది. ఓ సందర్భంలో, ఓ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ వచ్చి ఆ గ్రామం పొలిమేరల్లో నాటుసారా కాస్తున్నారనీ, అందులో ఆమె ప్రమేయం ఉందని అనుమానిస్తాడు. అప్పుడామె ఆ సమస్యని ఎదుర్కున్న తీరు, ఇన్‌స్పెక్టర్‌కి జవాబిచ్చిన తీరు, అసలు నేరస్థుడిని పట్టించిన విధానం ఆమె తెలివితేటలని సూచిస్తాయి.

గాజువాకలో ఉండే మేరీ తన కూతురు జెన్నీ చదువు మీద దృష్టి పెట్టక, ప్రేమ పేరుతో ఓ కుర్రాడితో తిరుగుతోందని గ్రహిస్తుంది. ఇంట్లో అలవోకగా అబద్ధాలు చెప్పేస్తున్న జెన్నీ గురించి అసలు విషయాలు తెలుసుకోవాలని ఓ రోజు జెన్నీని రహస్యంగా అనుసరిస్తుంది. కూతురు నిర్వాకమంతా స్వయంగా గ్రహిస్తుంది. తర్వాత మేరీ ఎలా రియాక్ట్ అయింది? జెన్నీ ఏం చేసింది?

మేరీకీ, కావేరీకి ఉన్న ఉమ్మడి అభిరుచి ఏమిటి? దానికి భరణికి సంబంధం ఏమిటి? ఇలా గ్రామ రాజకీయాలను, కాలేజీ రాజకీయాలను ప్రస్తావిస్తూ, ఓ వ్యక్తి పట్టుదలను ప్రదర్శిస్తూ – ముగ్గురు స్త్రీమూర్తుల మేధని అద్భుతంగా ప్రెజెంట్ చేసి నవలని ముగిస్తారు మంజరి.

~

‘పథకం’ నవల చాలా ఏళ్ళ క్రితం చతురలో ప్రచురితమైంది. చతురకి ఉన్న పేజీల పరిమితి వల్ల అప్పట్లో ఈ నవల్ని కుదించి రాశారట రచయిత. 2022లో పుస్తకరూపంలో తెస్తున్నప్పుడు నవలని విస్తరించి రాశారు. ఈ నవల క్రైమ్ థ్రిల్లర్. ఎందరో నేరగాళ్ళుంటారు, వాళ్ళని వెంటాడే పోలీసులు ఉంటారు. ప్రస్తుతం నేరాలని దూరంగా ఉంటున్న పాత నేరస్థులుంటారు. ప్రస్తుత, మాజీ నేరస్థులపై ఒక కన్ను వేసి ఉంచే ఇంటలిజెన్స్ సిబ్బంది ఉంటారు. వీళ్ళంతా ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి పథకాలు వేస్తుంటారు. ఎవరి పథకాలు వారివి. మరి ఎవరి పథకం పారిందో తెలియాలంటే నవల చదవాలి. ద్వివేది ఒక దొంగ, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ సూరి, కాంట్రాక్ట్ కిల్లర్ రామ్ బెహరా, వస్త్ర వ్యాపారి నిహ్లాని, మాజీ నక్సలైట్లు రామసుబ్బారెడ్డి, బసవప్ప, వీరికి ద్రోహం చేసిన గోర్కీ, మాజీ సైనికుడు నంబియార్.. ఇలా ఎన్నో పాత్రలున్నా.. అన్నిటికి కనెక్టివిటీ ఉంటుంది. ముంబై నగరంలో మొదలయ్యే కథ, అనేక మలుపులు తిరిగి, బరంపురం మీదుగా ఇచ్ఛాపురం చేరి, అక్కడ్నించి, ఏజన్సీ ఏరియా గుండా ఒరిస్సా లోని సూదికొండ గ్రామానికి చేరుతుంది. అక్కడి కోందు గిరిజనుల ఆచార వ్యవహారాలను సందర్భానుసారంగా, విస్తృతంగా వెల్లడిస్తారు రచయిత. ఈ వివరాల కోసం గిరిజనుల సంప్రాదాయాలు సంస్కృతిపై చాలా అధ్యయనం చేసినట్టు పాఠకులకు తెలుస్తుంది. వీరంతా అన్వేషిస్తున్న నిధి అసలు ఉందా? ఉంటే, చివరికి దాన్ని ఎవరు చేజిక్కించుకున్నారు, దాంతో ఏం చేసారనేది ఆసక్తికరం. 216 పేజీల నవల చదవడం మొదలుపెడితే, ఆపడం కష్టం. ఏకబిగిన చదివిస్తుంది. నిజానికి ఈ నవల చదువుతుంటే, ఓ వెబ్ సిరీస్ చూస్తున్నట్టుంటుంది. గ్రిప్పింగ్‌గా సాగే క్రైమ్ థ్రిల్లర్ మూవీ చూస్తున్నట్టుంటుంది. పైసా వసూల్ పుస్తకం!!

***

అన్వేషణ (సస్పెన్స్ మిస్టరీ నవల)
రచన: మంజరి
ప్రచురణ: క్లాసిక్ బుక్స్
పేజీలు: 184
వెల: ₹ 150/-
ప్రతులకు:
క్లాసిక్ బుక్స్
#32-13/2-3A, అట్లూరి పరమాత్మ వీధి
మొగల్రాజపురం,
విజయవాడ 520 010.
సెల్: 85220 02536
ఆన్‍లైన్‍లో:
https://www.amazon.in/ANVESHANA-SUSPENCE-MISTARY/dp/B0FHQWYNDR

పథకం (క్రైమ్ థ్రిల్లర్ నవల)
రచన: మంజరి
ప్రచురణ: క్లాసిక్ బుక్స్
పేజీలు: 216
వెల: ₹ 200/-
ప్రతులకు:
క్లాసిక్ బుక్స్
#32-13/2-3A, అట్లూరి పరమాత్మ వీధి
మొగల్రాజపురం,
విజయవాడ 520 010.
సెల్: 85220 02536
ఆన్‍లైన్‍లో:
https://www.amazon.in/Pathakam-Manjari/dp/B0DKVFDG58/

~

శ్రీ మంజరి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-manjari-gnr/

Exit mobile version