[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]
నెమలి
~
కవిత అంటే సంగీతం ముగిసిన తర్వాత సంగీతం
కవితలో సంగీతం లేదు, అగాధం లోని
శిథిలాల అడుగున ఊపిరి తీసుకుంటున్న
ఊహాజనిత వాగ్గేయకారుడున్నాడు
ఇంకా అందులో
దివ్యమైన వర్ణమాలలోని వంపులున్నాయి –
తట్టుకోగల సామర్థ్యమున్న జీవకాంతి రూపంలో
సాగర గర్భంలో తట్టుకుని.
కవితలు పాడుతున్నట్టు నటించడంలో
ఏదో ఒక విశేషముంది – నెమలి తన
విశాలమైన పింఛపు పరిధిలో నటించినట్టుగానే.
ఆ నటనకు అంతం లేదు
ఎడదవ్వుల పాలపుంతల్లోని నక్షత్రాల
మామూలు కన్ను తాలూకు చూపు అది
చూసేదీ చూడబడేదీ రెండూ ఒకటే
మొదటి విచ్ఛిత్తి ఆఖరుకు అందుతుంది శ్రోతకు
అతడు వెంటనేనో లేక ఆలస్యంగానో
అర్థం చేసుకుంటాడు దాన్ని
ఆంగ్లమూలం: రోవానో రికార్డో ఫిలిప్స్
అనువాదం: ఎలనాగ
వృత్తిరీత్యా వైద్యులైన శ్రీ ఎలనాగ (డాక్టర్ నాగరాజు సురేంద్ర) ప్రవృత్తి రీత్యా సాహితీవేత్త. కవిగా, భాషావేత్తగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా సుప్రసిద్ధులు.
కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత. తెలుగులోనూ, ఆంగ్లంలోనూ రచనలు చేసే ఎలనాగ గారు సుమారు 40 గ్రంథాలు వెలువరించారు.
‘ఫేడెడ్ లీవ్స్ అండ్ ఫ్లైస్’, ‘ఇంప్రెషన్-ఇమేజెస్’, ‘మెమొరబుల్ మెలోడీ మేకర్స్ అండ్ అదర్ పోయెమ్స్ ఆన్ మ్యూజిక్’ మొదలైనవి ఆయన తెలుగు నుండి ఆంగ్లంలోకి తెచ్చిన కవితా సంపుటాలు.
వట్టికోట ఆళ్వార్ స్వామి, దాశరథి కృష్ణమాచార్య, కాళోజీ నారాయణరావు వంటి సుప్రసిద్ధ తెలుగు రచయితల కథలను, నవలలను ఆయన ఆంగ్లంలోకి తీసుకువచ్చారు. వివిధ దేశాల సాహిత్యాన్ని కూడా ఆయన తెలుగు పాఠకులకు అందించారు. వాటిలో ఉత్తమ లాటిన్ అమెరికన్ కథలు, ఉత్తమ ఆఫ్రికన్ కథలు, సోమర్సెట్ మామ్ కథలు ఉన్నాయి.
వివిధ దేశాల కథల అనువాద గ్రంథం ‘కథాతోరణం’ వెలువరించారు. పవన్ కె. వర్మ రాసిన ‘గాలిబ్: దమ్యాన్, ద టైమ్స్’ గ్రంథాన్ని ‘గాలిబ్ నాటి కాలం’ అనే పేరుతో తెలుగులోకి తెచ్చారు.
