[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]
అజ్ఞాన కవి
~
బహుశా ఈ భూమి
గాలిలో తేలుతున్నదేమో
నాకు తెలియదు
బహుశా నక్షత్రాలు
ఒక పెద్ద కత్తెర కత్తిరించిన
చిన్న కాయితపు ముక్కలు కావచ్చు
తెలియదు నాకు
బహుశా ఈ చందమామ
గడ్డకట్టిన ఒక కన్నీటి చుక్క కావచ్చు
నాకు తెలియదు
బహుశా దేవుడు ఒక చెవిటివాడు వినే
సత్వం నిండిన శబ్దం కావచ్చు
తెలియదు నాకు
బహుశా నేను ఎవరినీ కాకపోవచ్చు
నాకు శరీరమున్నది, నిజమే.
దాన్నుండి బయటపడలేను
నా తలలోంచి బయటికి ఎగిరిపోవాలనే
కోరిక ఉంటుంది నాకు
కానీ అలా జరిగే ప్రశ్నే లేదు
నేను ఈ మానవ రూపంలో చిక్కుకున్నానని
ఈ విధిసమాధి శిలాఫలకం మీద
రాసివుంది కనుక నా సమస్యను
మీ ముందుంచుతున్నాను
నా లోపల ఒక జంతువుంది
అది నా గుండెను గట్టిగా కరచుకుని వున్న
ఒక పెద్ద ఎండ్రకాయ
బోస్టన్ లోని డాక్టర్లు చేతులెత్తేశారు
వాళ్లు కత్తులు, సూదులు, విషవాయువులు
మొదలైనవి వాడి చూశారు
కానీ ఎండ్రకాయ ఉంది అట్లానే
అది నా గుండెమీద ఉన్న పెద్ద బరువు
నేను దాన్ని మరిచేందుకు ప్రయత్నిస్తాను
నా పనులు చూసుకుంటాను
బ్రాక్లీ వండుకుంటాను
పుస్తకాలు తెరుస్తాను, మూస్తాను
దంతాలు తోముకుంటాను
బూట్ల నాడాలు కట్టుకుంటాను
నేను ప్రార్థన చేశాను కానీ
ఆ పని చేస్తుంటే ఎండ్రకాయ
మరింత గట్టిగా కరచుకుంటుంది
నొప్పి ఎక్కువవుతుంది
ఒకసారి నాకు కల వచ్చింది
బహుశా అది కలేనేమో
దేవుని ఉనికిని గురించిన నా అజ్ఞానమే
ఆ ఎండ్రకాయ కావచ్చు
కానీ కలలను నమ్మేదుకు నేనెవర్ని?
ఆంగ్లమూలం: ఆన్ స్టన్
అనువాదం: ఎలనాగ
వృత్తిరీత్యా వైద్యులైన శ్రీ ఎలనాగ (డాక్టర్ నాగరాజు సురేంద్ర) ప్రవృత్తి రీత్యా సాహితీవేత్త. కవిగా, భాషావేత్తగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా సుప్రసిద్ధులు.
కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత. తెలుగులోనూ, ఆంగ్లంలోనూ రచనలు చేసే ఎలనాగ గారు సుమారు 40 గ్రంథాలు వెలువరించారు.
‘ఫేడెడ్ లీవ్స్ అండ్ ఫ్లైస్’, ‘ఇంప్రెషన్-ఇమేజెస్’, ‘మెమొరబుల్ మెలోడీ మేకర్స్ అండ్ అదర్ పోయెమ్స్ ఆన్ మ్యూజిక్’ మొదలైనవి ఆయన తెలుగు నుండి ఆంగ్లంలోకి తెచ్చిన కవితా సంపుటాలు.
వట్టికోట ఆళ్వార్ స్వామి, దాశరథి కృష్ణమాచార్య, కాళోజీ నారాయణరావు వంటి సుప్రసిద్ధ తెలుగు రచయితల కథలను, నవలలను ఆయన ఆంగ్లంలోకి తీసుకువచ్చారు. వివిధ దేశాల సాహిత్యాన్ని కూడా ఆయన తెలుగు పాఠకులకు అందించారు. వాటిలో ఉత్తమ లాటిన్ అమెరికన్ కథలు, ఉత్తమ ఆఫ్రికన్ కథలు, సోమర్సెట్ మామ్ కథలు ఉన్నాయి.
వివిధ దేశాల కథల అనువాద గ్రంథం ‘కథాతోరణం’ వెలువరించారు. పవన్ కె. వర్మ రాసిన ‘గాలిబ్: దమ్యాన్, ద టైమ్స్’ గ్రంథాన్ని ‘గాలిబ్ నాటి కాలం’ అనే పేరుతో తెలుగులోకి తెచ్చారు.
