Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-45

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

చాక్లెట్

~

నీ అమ్మమ్మ సమాధి
పర్వతపు ఒత్తైన జుట్టును గూడు చేసుకుని
అందులో ఒదిగి ఉంది
నీ అమ్మమ్మలాగా కనిపించే ప్రతి చెట్టుకు
ఒక పేరు పెట్టాలని ప్రయత్నిస్తావు నువ్వు
నీ మామయ్య కారు నడిపే పద్ధతి
నీ సీటు కింద దాగివున్న తుఫాను
అతడు ఓపిక వేగాన్ని మించిపోతూ
కాలాన్ని చంపాలని చూస్తాడు
వెనుకసీటులో నీ తల్లి
నిన్ను గట్టిగా అదిమిపట్టుకుని
నువ్వు కిటికీలోంచి ఎగిరిపోకుండా ఆపుతుంది,
‘ఇంత త్వరగా ఇలా నీ అమ్మమ్మను
చేరుకోబోతున్నాం’ అంటుంది

వేసవి తన తలను
నీ భుజం మీద ఆనిస్తుంది,
నీ యౌవన స్వేదం కోసం దప్పిక గొంటుంది
పడుచుదనం నిండిన వలపు ఒకటి
చెట్ల రెమ్మల మీద విస్ఫోటిస్తుంది
మీ ఆకుపచ్చని బీటిల్ కారు
కొండ అడుగున పడివుంటుంది
అది వేసవి కనుక ప్రతిదీ కరిగిపోతుంది
నీకోసం చాక్లెట్ కొంటానని నీ అమ్మ
బూటకపు వాగ్దానం చేసింది కానీ కొనలేదు
అది నీ సీటుమీద ఏర్పరచిన
చిక్కని ద్రవాన్ని నాకకు

ఆంగ్లమూలం: జిన్ హావో జి.
అనువాదం: ఎలనాగ

Exit mobile version