Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-40

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

ఇనిస్ ఫ్రీ దీవి

~

నేను నిద్ర లేచి ఇనిస్ ఫ్రీ కి వెళ్తాను
వెళ్లి, మట్టితో పొడుగాటి బద్దలతో
ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకుంటాను
తొమ్మిది వరుసల్లో చిక్కుళ్లు నాటుతాను,
తేనెటీగల కోసం తుట్టెను నెలకొల్పి
వాటితో పాటు ఆరుబయట
ఏకాతంలో నివసిస్తాను

అక్కడ కొంత మనశ్శాంతిని పొందుతాను
కానీ కీచురాళ్లు గానం చేసే ప్రభాతపు మంచుతెరల్లోంచి
ప్రశాంతి చాలా మెల్లగా దిగుతుంది
అక్కడ –
మధ్యరాత్రి ఒక మెరుపు,
మధ్యాహ్నం ఊదారంగు కీల,
సాయంత్రం మైనా రెక్కల
రెపరెపలు నిండిన హేల

నేనిప్పుడు లేచి వెళ్తాను
ఒడ్డు దగ్గర నిరంతరం నాలుకతో గతికే
చెరువునీళ్ల శబ్దాన్ని వింటాను
రోడ్డుమీద గానీ దానికి ఆనుకుని వున్న
కాలిబాట మీద గానీ నిలబడినప్పుడు
ఆ శబ్దాన్ని గుండెలోతుల్లో వింటాను

ఆంగ్లమూలం: విలియం బట్లర్ యేట్స్
అనువాదం: ఎలనాగ

Exit mobile version