Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-27

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

అనుసంధానం కోసం

~

సందేహాస్పదమైన జాతీయాల
తాటాకుల పందిరి కింద కూర్చుంటాను
ఒక్క లొంగుబాటుతో ఎన్ని ముత్యాలను
దక్కించుకున్నానో లెక్క పెట్టుకుంటాను
ఈ అపారమైన తపనను, ఈ లోతైన గాయపు గాటును,
ఈ మౌనాన్ని, ఈ స్వచ్ఛతను,
పట్టుకునేందుకు ఆధారం లేని
అనంతమైన ఈ నమ్మకాన్ని
వర్ణించమని అడుగుతాను

ఈ రాత్రి, హృదయ ద్వారాన్ని తడుతూ
చరిత్రలను పిలుస్తాను
నా తాత ఆత్మ తాలూకు దయ్యంలా
పాత బాధ నా యింటిద్వారం ముందర
నిలుస్తుంది మళ్లీ
రాయవద్దని, సోమరిగా కూర్చోవద్దని
నాకు హెచ్చరికలు జారీ ఔతుంటాయి మళ్లీ మళ్లీ

నా రోజువారీ ఊహలతో నడవాలని క్షణాలను,
నీతో అనుసంధానం కావాలని నా మనోభావాలను
ఆహ్వానించేందుకు చేతులు చాస్తాను
కాలసఖివైన నీకోసం ఎంచుకోబడలేదు నేను
దప్పిక గొన్న జలపాతాలను
నీ రెండుచేతుల్లో పట్టుకుని ఉంటావు నువ్వు

ఆంగ్లమూలం: జైదీప్ సారంగి
అనువాదం: ఎలనాగ

Exit mobile version