Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-25

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

నేనెందుకు రాస్తాను?

~

వంచనకూ బాధకూ మధ్య అగాధాన్ని పూడ్చలేక ఆక్రోశం
భారంగా, నిస్సిగ్గుగా నా హృదయంమీద కూర్చుంటుంది కనుక.
ఆత్మగౌరవాన్ని కోల్పోయిన అక్షరాల గొంతుకలు అసంబద్ధంగా
గొణుక్కుంటాయి. వాటి ఒంటరితనాన్ని మోసే సంతకాలతో
ఒక దృశ్యచిత్రం ఏర్పడుతుంది కనుక. అపరిచితులు చనువు అనే
ముసుగేసుకుని, అప్పటికే దాదాపు మరణించినవారిని చంపేందుకు
కత్తుల్ని సిద్ధం చేసుకుంటారు. వారిలో అసూయ, పాదముద్రలు నెలకొని
వుంటాయి కనుక. నేను ప్రపంచాన్ని ఎదుర్కొంటుంటే నాలో తలెత్తే
కోపాన్ని కరిగించి, నేను ఉబికి పైకి వచ్చేలా చేసే వెచ్చదనం కోసం రాస్తాను.
నీకోసం – కేవలం నీకోసం మాత్రమే – నా పాటలను ఆమ్లద్రావకంలో
ముంచి ఎంతో తాజాగా, పదిలంగా, దాదాపు పూర్తి సజీవంగా
బయటికి వచ్చేందుకు రాస్తాను.

ఆంగ్లమూలం: రాను ఉనియాల్
అనువాదం: ఎలనాగ

Exit mobile version