Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-23

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

దక్షిణ మారుత స్వామి

~

రిగిన గాలి అందిస్తోంది
అతని రాక తాలూకు సందేశాన్ని.
రణగొణ ధ్వనుల్తో గర్జనతో
రయాన వస్తాడతడు
కానీ అతడొచ్చే మార్గంలో
కదలదు ఒక్క గులకరాయైనా

గాలికి రెపరెపలాడే అతని దుస్తులు
గగనంలో కలిసిపోతాయి
అతని స్పర్శ మాత్రం
అనుభూతం కాదెవ్వరికీ

అతని కోపం ధాటికి
పులులు ఉలిక్కిపడి ఎగురుతై
కానీ చిన్న కీటకాన్ని సైతం
గాయపరచడతడు

అతని ఆగమనం కోసం
దేశ, నగర ద్వారాలను
రంగురంగుల పూలతో అలంకరిస్తారు
అతడొచ్చే తోవ మాత్రం
అతనికొక్కనికే తెలుసు

రైతులు శ్రామికులు మహంతలు వ్యాపారస్థులు
దొంగలు ఋషులు వేశ్యలు పాపులు పూజారులు..
స్వాగతం పలికేందుకు అందరూ
గుమిగూడుతారు విశాల మైదానంలో.

అతని ఆగమన వార్త
కరిగే గాలిలో కలిసిపోతుంది
అందరి దృష్టీ తూర్పు మీదనే..
కానీ అతడొచ్చేది
తూర్పు నుండా, పడమర నుండా?
తెలియదెవ్వరికీ!
లేక దక్షిణ మారుతంగా మారి
అజ్ఞాతంగా నిర్భీకతతో
మన మేనుల్లోంచి ప్రయాణిస్తాడేమో!

అస్సామీ మూలం, ఆంగ్లానువాదం: సత్యకామ్ బోర్తాకర్
అనువాదం: ఎలనాగ

Exit mobile version