Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-19

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

సన్నటి వానలు కురుస్తాయి

~

న్నటి వానలు కురిసి
మట్టి పరిమళం వీస్తుంది
మధుర ధ్వనుల్ని వెలయిస్తూ
పికిలెంక పిట్టలు వర్తులాకారంలో
చక్కర్లు కొడుతాయి

రాత్రివేళ చెరువుల్లో కప్పల పాటలు,
తరళమైన ధవళిమతో రేగుచెట్లు..

పిచ్చుకలు జ్వాల రంగును పులుముకుని
కంచెతీగ మీద ఇష్టమైన పాటలు పాడుతాయి

కానీ యుద్ధం గురించి తెలియదెవ్వరికీ
అది జరుగుతున్నా ఎవ్వరూ
లక్ష్యపెట్టరు దాన్ని
మానవజాతి సాంతం మట్టిలో కలిసినా
పిట్ట, చెట్టు, మానవ సమాజం..
ఏదీ దాన్ని పట్టించుకోదు.

ఆంగ్లమూలం: సారా టీస్ డేల్
అనువాదం: ఎలనాగ

Exit mobile version