Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-18

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

కవితా ప్రవేశిక

~

ప్రతి ఊహను పదాల్లో పెట్టగలమా?
కవిత్వం వెనకాల, కథల వెనకాల
వేదికల వెనకాల అప్రకటితాలై ఉండిపోతై ఎన్నో భావాలు
ఓ వృద్ధుడు కాలం చేశాడు
కొంత కాలం క్రితం.
ఎవరికి తెలుసు ఆయన
ఎలా చనిపోయాడో?
అతడు వాడిన వస్తువులకు
తెలిసి ఉండవచ్చు కానీ
అవి సాక్ష్యం చెప్పగలిగేదెలా?
నిశ్శబ్దం ఆవరించిన రాత్రిలో
చెట్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకోవడం చూశావా
ఎప్పుడైనా?
వాటి మాటల అర్థాలను
విప్పిచెప్పగలిగేదెవ్వరు?

వినువీధిలో నక్షత్రాలు సైతం
కొన్నిసార్లు ఒకదానితో ఒకటి
మాట్లాడుకుంటై
వాటిలో మన పూర్వీకులు సైతం
ఉండొచ్చు
కానీ వాటి సంభాషణలు
మనకు అర్థమవటం చాలా అరుదు
కొన్నిసార్లు గ్రహాంతర వాసులు
వస్తారు మన భూమ్మీదికి
కానీ వారి మాటల్ని మనం
ఎలా అర్థం చేసుకోగలం?
వాటిని కవిత్వంలో కథల్లో
వ్యక్తీకరించే ప్రయత్నం వృథా
కొందరు వాటి ఆధిపత్యాన్ని
అంగీకరించరు బహుశా.
ఎగిరిపోయి మబ్బుగూళ్లలో ఆశ్రయం పొందేందుకు
పక్షులు ఏదో ఒకరోజు విసిగిపోతాయి
అప్పుడు మనం నిస్సహాయంగా వాటి రాక కోసం నిరీక్షిస్తాం

ఆంగ్లమూలం: ప్రదీప్ బిస్వాల్
అనువాదం: ఎలనాగ

Exit mobile version