Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-15

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

మేఘాలను మింగే పిల్లి

~

కామం నిండిన పిల్లి ఒకటి
రాత్రిపూట మేఘాలను మింగుతుంది

ఒక కీటకం
ఎడ్గార్ అల్లన్ పో ను పూజిస్తుంది

నీ నగ్నత్వం మీద మెరిసే
చంద్రకాంతిని తయారు చేశాన్నేను

మనం నరకపు ఆడిటోరియం మీద దాడి చేసి
కొన్ని శాక్సఫోన్లను చేజిక్కించుకుంటాం
చరిత్ర గురించిన నా అవగాహన బీటలువారింది
ప్లాసీ యుద్ధాన్ని గెలిచిందెవరు?

మహామహులు మరణిస్తుంటే దుష్టతారకల్ని వీక్షిస్తూ
హాయిగా కాలం గడుపుతాం మనం
అంతటా బీభత్సం..

ప్లాటినంలో తడిసిన నగరం
నీ కొత్త చిరునామా
నీ పెదవులేమో అవలీలగా గెలుచుకున్న గెలుపు ఛాయలు

నా లోలోపలి నీ మృదువైన ముఖాన్నీ స్నేహపు వెచ్చదనాన్నీ
గుర్తిస్తాన్నేను

అంతా ఐపోలేదు జూలియెట్,
అండర్‌గ్రౌండ్ ఆడిటోరియంలోని
నిషిద్ధ గీతాలలో ప్రేమకత్తికి
పదును అంతగా లేదు

ఆంగ్లమూలం: ఇనాం హుసేన్ మలిక్
అనువాదం: ఎలనాగ

Exit mobile version