[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]
ఇమ్రోజ్‌కు ఐదు మాటలు
~
1
ఫిబ్రవరి నెలలో గంగానది
దిగ్మండలాన్ని తాకదు
నీటిపక్షులు మా ప్రేమ మంచానికి
తపాలా బంట్రోతుల్లాగా
వస్తూ పోతుంటాయి
2
ఈ ఘాట్‌ల మీద
శవాలు ఊళ పెడుతుంటాయి
నేను నీ హృదయనగరంలోని
మతం గురించి ఆలోచిస్తూ
శ్మశానంలో బోగెన్ విల్లాల కొమ్మలకింద
ఫియట్ కారులో నిద్రిస్తాను
3.
నువ్వు దూరాన ఒక పడవలో ఉండి
నా దేహపు సూర్యుని దగ్గరికి వస్తూ,
కోల్పోయిన నీ నమ్మకాన్ని
నా చర్మం మీద చెక్కి ఆవిష్కరిస్తావు
నేనప్పుడు విశ్వాసిగా మారుతాను
4
మనం ఒక లైబ్రరీని, కొన్ని పుస్తకాలను,
ఒక కుర్చీని పంచుకుంటాం
గుర్తుగా ఒకరి పుటల్ని ఒకరం మడుస్తాం
కానీ గదిని మాత్రం అస్సలు పంచుకోము
5
నేను రాసే ప్రతి కవితలో
నా పంక్తుల గుండా నడిచే
నీలోని కొంత భాగం ఉంటుంది
ఆంగ్లమూలం: రెబెకా వేదవతి
అనువాదం: ఎలనాగ
వృత్తిరీత్యా వైద్యులైన శ్రీ ఎలనాగ (డాక్టర్ నాగరాజు సురేంద్ర) ప్రవృత్తి రీత్యా సాహితీవేత్త. కవిగా, భాషావేత్తగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా సుప్రసిద్ధులు.
కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత. తెలుగులోనూ, ఆంగ్లంలోనూ రచనలు చేసే ఎలనాగ గారు సుమారు 40 గ్రంథాలు వెలువరించారు.
‘ఫేడెడ్ లీవ్స్ అండ్ ఫ్లైస్’, ‘ఇంప్రెషన్-ఇమేజెస్’, ‘మెమొరబుల్ మెలోడీ మేకర్స్ అండ్ అదర్ పోయెమ్స్ ఆన్ మ్యూజిక్’ మొదలైనవి ఆయన తెలుగు నుండి ఆంగ్లంలోకి తెచ్చిన కవితా సంపుటాలు.
వట్టికోట ఆళ్వార్ స్వామి, దాశరథి కృష్ణమాచార్య, కాళోజీ నారాయణరావు వంటి సుప్రసిద్ధ తెలుగు రచయితల కథలను, నవలలను ఆయన ఆంగ్లంలోకి తీసుకువచ్చారు. వివిధ దేశాల సాహిత్యాన్ని కూడా ఆయన తెలుగు పాఠకులకు అందించారు. వాటిలో ఉత్తమ లాటిన్ అమెరికన్ కథలు, ఉత్తమ ఆఫ్రికన్ కథలు, సోమర్సెట్ మామ్ కథలు ఉన్నాయి.
వివిధ దేశాల కథల అనువాద గ్రంథం ‘కథాతోరణం’ వెలువరించారు. పవన్ కె. వర్మ రాసిన ‘గాలిబ్: దమ్యాన్, ద టైమ్స్’ గ్రంథాన్ని ‘గాలిబ్ నాటి కాలం’ అనే పేరుతో తెలుగులోకి తెచ్చారు.