[శ్రీ ఎం.వి.ఎస్. రంగనాధం గారి ‘అనులోమ విలోమ కందము వ్రాయడం ఎలా?’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
తెలుగులో భ్రమక పదాలను గురించి విని ఉన్నాము. అంటే, ఎడమ నుంచి కుడికి (అనులోమం), కుడి నుంచి ఎడమకు (విలోమం లేదా ప్రతిలోమం) చదివినా ఒకే పదం వస్తే దాన్ని భ్రమక పదం అంటారు. ఆంగ్లంలో అటువంటి పదాలను Palindromes అంటారు. ఉదాహరణలు వికటకవి, వలువ, ముదము లాంటి పదాలు. చిన్నప్పుడు ఒకళ్ళని ఒకళ్ళు ఆట పట్టించడానికి ‘దడిగాడువానసిరా’ అనే వాళ్ళం. ఈ పదానికి అర్థం లేదు గానీ, తిరగేసి చదివితే ‘రాసిన వాడు గాడిద’ అని మనం అనదలుచుకున్నామని అవతలి వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఇలా వ్రాసిన రెండు పదబంధాలకి (phrases) కూడా వేరు వేరుగా అర్థం ఉంటే, ఆ విధంగా పద్య పాదాలు గనక ఉంటే ఎంత అందంగా ఉంటుందో, అన్న విషయాలు కొంత వరకు పరిశీలించడమే ఈ వ్యాసం లక్ష్యం.
అనులోమ విలోమ కందము అన్నది పదాల్లో భ్రమకపదం లాంటిది. మొదటి నుండి చివరకు చదివినా చివరి నుండి మొదటికి చదివినా ఒకేలా ఉండే కంద పద్యాన్ని అనులోమ విలోమ కందము అంటారు. కందంలో మొదటి రెండు పాదాలు తిరగేసి చదివితే తరువాతి రెండు పాదాలు వచ్చేటట్లుగా రచిస్తే ఇది సాధ్యమవుతుంది. ఇటువంటి పద్యాలు వ్రాయడం కష్టం కాబట్టి సాహిత్యంలో చాలా కొద్ది ఉదాహరణలే దొరుకుతాయి. కృష్ణదేవరాయల ఆస్థానం లోని అష్టదిగ్గజాలలో ఒకడైన నంది తిమ్మనకవి తాను రచించిన పారిజాతాపహరణ కావ్యంలో, ఈ క్రింది అనులోమ విలోమ కందము రచించాడు.
కం.
నాయశరగ సార విరయ
తాయన జయసార సుభ గధర ధీ నియమా
మాయని ధీర థగభ సుర
సాయజ నయ తాయర విరసాగర శయనా.
ఇది మంచి ఉదాహరణ. పద్యం మొదటి నుంచి చివరికి చదివినా, చివరి నుంచి మొదటికి చదివినా ఒకటే. ఛందోబద్ధంగా ఉండడమే కాకుండా, రెండు విధాల కూడా అర్థవంతంగా ఉంటేనే (అర్థం వేరు అవ్వవచ్చు) దాన్ని అనులోమ విలోమ కందము అంటారు. అర్థవంతంగా ఉండేటట్లు పదాల ఎన్నిక చెయ్యడం కవి ప్రతిభే అనడంలో సందేహం లేదు. అయితే, ఛందోబద్ధంగా అనులోమ విలోమ కందము రచించడానికి పాటించవలసిన నియమాలు ఏమిటో మొదట చూద్దాం.
కంద పద్యంలో నాలుగు పాదాలుంటాయి. 1, 3 పాదాల్లో ఒక్కొక్క దాన్లో మూడు గణాలు, 2, 4 పాదాల్లో ఒక్కొక్క దాన్లో ఐదు గణాలు ఉంటాయి. అన్నీ నాలుగు మాత్రల గణాలే ఉంటాయి. అవి గగ (UU), భ (UII), జ (IUI), స (IIU), నల (IIII) అన్న గణాలు. మొదటి రెండు, చివరి రెండు పాదాల లోని 8 గణాలనీ వరుసగా 1, 2, 3, …, 7, 8 అని అనుకుంటే, బేసి సంఖ్య గల గణం జగణం కాకూడదు. 2, 4 పాదాల్లో మూడో గణం (యతికి ముందు వచ్చేది) జగణం (IUI) కాని, నల (IIII) కానీ అయి ఉండాలి. 2, 4 పాదాలలో చివరి అక్షరం గురువు, అంటే చివరి గణం గగ (UU) లేదా సగణం (IIU) అయి ఉండాలి. ప్రాస నియమం ఉంది. ప్రాసాక్షరం ముందున్న అక్షరం అన్ని పాదాలలోనూ అయితే గురువు కావాలి లేకపోతే లఘువు అయి ఉండాలి. ఒక చోట గురువు మరొక చోట లఘువు ఉంటే చెల్లదు. 2, 4 పాదాలలో 1వ అక్షరానికీ 4వ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి ఉండాలి. ప్రాసయతి చెల్లదు. మొదటి రెండు పాదాలలో ఉన్న దాన్ని వెనుక నుంచి చదివితే తరువాతి రెండు పాదాలు వస్తే అప్పుడు అది అనులోమ విలోమ కందము వస్తుంది. ఇది వ్రాయడానికి కంద పద్య లక్షణాలకు అదనంగా ఇంకా ఏ నియమాలు పాటించాలో చూద్దాం.
మొదటి రెండు పాదాలలో 1వ గణము తిరగేస్తే వచ్చేది చివరి రెండు పాదాల లోని 8వ గణము. ఆ 8వ గణము గురువుతో ముగుస్తుంది కాబట్టి, మొదటి పాదం లోని మొదటి గణం గురువుతో మొదలవ్వాలి. అందుకని మొదటి రెండు పాదాలలో మొదటి గణం UII గానీ UU గానీ కావచ్చు. ఈ గణం తిరగేస్తే ఆఖరి రెండు పాదాలలోని 8వ గణం వస్తుంది కాబట్టి, అది IIU గానీ UU గానీ అవ్వాలి. మొదటి పాదం లోని మొదటి గణం గురువు. అది ప్రాసాక్షరానికి ముందున్న అక్షరం కాబట్టి, 2వ, 3వ, 4వ పాదాలలో కూడా మొదటి అక్షరం గురువై ఉండాలి. అంటే, మొదటి రెండు పాదాల లోని 1వ గణము, 4వ గణము, తిరగేస్తే వచ్చే చివరి రెండు పాదాల లోని 1వ గణము, 4వ గణము గురువుతో మొదలవ్వాలి.
మొదటి పాదం లోని 2వ గణము తిరగేస్తే వచ్చేది చివరి రెండు పాదాల లోని 7వ గణము. ఆ 7వ గణం బేసి గణం కాబట్టి జగణము ఉండకూడదు. జగణము (IUI) తిరగేసినా జగణమే వస్తుంది కనుక మొదటి పాదం లోని 2వ గణం కూడా జగణం అవడానికి వీలు లేదు. అందుచేత, మొదటి రెండు పాదాలలోని 2వ గణము UII గానీ IIU గానీ IIII గానీ UU గానీ అవ్వ వచ్చు. అది తిరగేస్తే ఆఖరి రెండు పాదాలలోని 7వ గణం రావాలి గనుక, ఆ గణము IIU గానీ UII గానీ IIII గానీ UU గానీ అవ్వ వచ్చు.
మొదటి రెండు పాదాల లోని 3వ గణము తిరగేస్తే వచ్చేది చివరి రెండు పాదాల లోని 6వ గణము. ఆఖరి రెండు పాదాల లోని 6వ గణము అంటే 4వ పాదంలోని 3వ గణము. అది సాధారణంగా IUI (జగణము) గానీ IIII గానీ అయ్యి ఉండాలి. ఇది తిరగేస్తే మొదటి రెండు పాదాలలోని 3వ గణం రావాలి గనుక, 3వ గణం బేసి గణం కనుక, అక్కడ జగణం ఉండకూడదు. కనుక, మొదటి రెండు పాదాల లోని 3వ గణము, తిరగేస్తే వచ్చే చివరి రెండు పాదాల లోని 6వ గణము, ఒక్క IIII అన్న గణం మాత్రమే అయి ఉండవచ్చు.
మొదటి రెండు పాదాల లోని 4వ గణము తిరగేస్తే వచ్చేది చివరి రెండు పాదాల లోని 5వ గణము. ఆఖరి రెండు పాదాల లోని 5వ గణము బేసి గణము కాబట్టి జగణం ఉండకూడదు. మొదటి రెండు పాదాల లోని 4వ గణం గురువుతో మొదలౌతుంది (ప్రాసాక్షరానికి ముందున్న అక్షరము కాబట్టి). అంటే, మొదటి రెండు పాదాల లోని 4వ గణంలో UII గానీ UU గానీ ఉంటే ఆఖరి రెండు పాదాల లోని 5వ గణము IIU గానీ UU గానీ ఉండ వచ్చు.
మొదటి రెండు పాదాల లోని 5వ గణము తిరగేస్తే వచ్చేది చివరి రెండు పాదాల లోని 4వ గణము. మొదటి రెండు పాదాల లోని 5వ గణము బేసి గణము కాబట్టి జగణం అయ్యే అవకాశం లేదు. తిరగేస్తే వచ్చే ఆఖరి రెండు పాదాల లోని 4వ గణం గురువుతో మొదలౌతుంది (ప్రాసాక్షరానికి ముందున్న అక్షరము). అంటే, మొదటి రెండు పాదాలలో 5వ గణంలో UII గానీ UU గానీ ఉంటే ఆఖరి రెండు పాదాల లోని 4వ గణము IIU గానీ UU గానీ అవుతుంది.
మొదటి రెండు పాదాల లోని 6వ గణము తిరగేస్తే వచ్చేది చివరి రెండు పాదాల లోని 3వ గణము. మొదటి రెండు పాదాల లోని 6వ గణము అంటే 2వ పాదంలోని 3వ గణము. అది సాధారణంగా IUI (జగణము) గానీ IIII గానీ అయ్యి ఉండాలి. ఇది తిరగేస్తే వచ్చే ఆఖరి రెండు పాదాలలోని 3వ గణం బేసి గణం కనుక అక్కడ జగణం ఉండకూడదు. కనుక, మొదటి రెండు పాదాల లోని 6వ గణము, చివరి రెండు పాదాల లోని 3వ గణము ఒక్క IIII అన్న గణం మాత్రమే అయిఉండవచ్చు.
మొదటి రెండు పాదాల లోని 7వ గణము తిరగేస్తే వచ్చేది చివరి రెండు పాదాల లోని 2వ గణము. ఆ 7వ గణం బేసి గణం కాబట్టి జగణము ఉండకూడదు. జగణము (IUI) తిరగేసినా జగణమే వస్తుంది కనుక చివరి రెండు పాదాల లోని 2వ గణం కూడా జగణం అవడానికి వీలు లేదు. మొదటి రెండు పాదాల లోని 7వ గణము UII గానీ IIU గానీ IIII గానీ UU గానీ అవ్వ వచ్చు. అది తిరగేస్తే ఆఖరి రెండు పాదాలలోని 2వ గణం రావాలి గనుక, ఆ గణము IIU గానీ UII గానీ IIII గానీ UU గానీ అవ్వ వచ్చు.
మొదటి రెండు పాదాల లోని 8వ గణము తిరగేస్తే వచ్చేది చివరి రెండు పాదాల లోని 1వ గణము. ఆ 8వ గణము గురువుతో ముగుస్తుంది కాబట్టి, చివరి రెండు పాదాల లోని మొదటి గణం గురువుతో మొదలవ్వాలి. అందుకని ఆఖరి రెండు పాదాల లోని మొదటి గణం UII గానీ UU గానీ కావచ్చు. ఈ గణం తిరగేస్తే మొదటి రెండు పాదాల లోని 8వ గణం వస్తుంది కాబట్టి, అది IIU గానీ UU గానీ అవ్వాలి.
ఇవి కాక, కంద పద్యంలో ఉండే ప్రాసకి యతికి సంబంధించిన నియమాల దృష్టితో చూస్తే, అనులోమ విలోమ కందములో పాటించవలసిన నియమాలు ఏమిటో చూద్దాం.
ప్రాస: మొదటి రెండు పాదాలలో ఉండే 8 గణాలు తిరగేస్తే చివరి రెండు పాదాలలోని 8 గణాలు వస్తాయి కాబట్టి ప్రాసాక్షరాలు మొదటి 8 గణాల లోనే చూడ వచ్చు. అవి మొదటి గణంలో 2వ అక్షరము, 4వ గణంలో 2వ అక్షరము, 5వ గణంలో చివరి నుండి 2వ అక్షరము, 8వ గణంలో చివరి నుండి 2వ అక్షరము.
యతి: యతి విషయానికి వస్తే, కంద పద్యంలో 2వ 4వ పాదాల్లో యతి నియమం పాటించాలి. మొదటి రెండు పాదాలలో ఉండే 8 గణాలు తిరగేస్తే చివరి రెండు పాదాలలోని 8 గణాలు వస్తాయి కాబట్టి యతి మైత్రి మొదటి 8 గణాల లోనే చూడ వచ్చు. 4వ గణం మొదటి అక్షరంతో 7వ గణం మొదటి అక్షరానికి, 5వ గణం చివరి అక్షరానికి 2వ గణం చివరి అక్షరంతోను యతి మైత్రి ఉండాలి.
పైన చెప్పబడిన నియమాలు పాటిస్తూ, ఒక అనులోమ విలోమ కంద పద్యం వ్రాయడానికి ప్రయత్నం చేశాను. అది గొప్ప అర్థవంతమయిన పద్యం కాకపోయినా, అసలంటూ అర్థం లేకపోలేదు. ఆ పద్యం క్రింద ఇవ్వబడింది, మీరే చూడండి:
కం.
మానగ నవ్విన మననమ?
నానా? మన నా నగవుఁ గన నటనఁ గనమా?
మానగ నటన నగవుఁ గన
నా నమనా? నా మననమ? నవ్వినఁ గనమా?
(మానగ = మానివేయు, మననము = చింతన, నాన = సిగ్గు, మను = జీవించు, నగవు = నవ్వు, కను = చూచు, నటన = కపట ప్రవర్తనము, నమన = వందనము)
మానివేయడానికి నవ్వితే చింతనా? సిగ్గా? వీక్షించమా జీవించడానికి నా నవ్వును చూస్తే కపట ప్రవర్తనము? కపట ప్రవర్తనము మానెయ్యడానికి నవ్వును చూస్తే నా వందనమా? నా చింతనా? నవ్వితే చూస్తాంగా?
ఎం.వి.ఎస్. రంగనాధం గారు సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్‌లో డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు.
