Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనుబంధాలు

[శ్రీ సి. ఎన్. చంద్రశేఖర్ రచించిన ‘అనుబంధాలు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

సుమిత్ర పెళ్ళి జరుగుతూంది.

పెళ్ళికూతురి గదిలో ఉన్న సుమిత్రకి ఆమె స్నేహితురాళ్ళు మేకప్ చేస్తూంటే బంధువులు ఆమెచుట్టూ చేరి పెళ్ళికొడుకు గురించి, అతని కుటుంబసభ్యుల గురించి మాట్లాడుకోసాగారు.

“సుమీ.. మీ ఆయన బాగున్నాడే! మీ ఇద్దరిదీ మంచి జోడీ అవుతుంది” అంది పిన్నమ్మ గీత.

“మీ ఆయన కంటే మీ అత్తగారు ఇంకా బాగున్నారే! పైగా చాలా మంచివారిలా కూడా ఉన్నారు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి” అంది ఆమె వదిన మమత.

“అది కాపురం చేసేది దాని మొగుడితోనా? అత్తగారితోనా?” నవ్వుతూ అడిగింది సుమిత్ర పెదనాన్న కూతురు సునీల.

“కాపురం చేసేది మొగుడితోనే అయినా రోజంతా గడిపేది అత్తగారితోనే కదా! అత్తగారు మంచివారైతే కాపురం స్వర్గంలాగా ఉంటుంది” అంది సుమిత్ర అక్క వందన, గయ్యాళి అయిన తన అత్తగారిని తలచుకుంటూ.

“హైదరాబాదులాంటి సిటీనుంచి చిత్తూరులాంటి చిన్న ఊరికి వెళ్తున్నావు. అడ్జస్ట్ అవగలవా?” అని అడిగింది స్నేహితురాలు లత.

“అడ్జస్ట్ కావాలి. ఊరు చిన్నదైనా, ఇల్లు చిన్నదైనా సర్దుకుపోవడం నేర్చుకోవాలి. నెమ్మదిగా ఎదగాలి, ఓ పద్దతి ప్రకారం ఎదగాలి. రోమ్ ఈస్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే!” అంది గీత.

“బాగా చెప్పావు పిన్నీ. మనసుల్ని, మనుషుల్ని కలిపేది పెళ్ళి. ఆస్తుల్ని, అంతస్తుల్ని కలిపేది కాదు” అంది సుమిత్ర.

పెళ్ళిలో మనోజ్ చాలా ఉత్సాహంగా కనిపించాడు. అవకాశం దొరికినప్పుడల్లా అతను తన వైపు చూస్తూండటం గమనించి సిగ్గు మొగ్గయింది సుమిత్ర.

‘తన కాబోయే భర్త ప్రభుత్వరంగ భీమాసంస్థలో క్లర్కు. అతని తండ్రి ఓ ప్రైవేటు కంపెనీలో మేనేజరు. పెళ్ళిలో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో, ఏదైనా లోపం జరిగితే ఎలా రియాక్ట్ అవుతారో’ అని భయపడింది తను. అయితే పెళ్ళి ఎలాంటి గొడవలూ లేకుండా జరిగిపోయింది. ‘పెళ్ళిమండపం నుంచి ఇంటికి వస్తూంటే ఓ విహారయాత్రకి వెళ్ళివచ్చినట్లు తనకి అనిపించింది’ అనుకుంది సుమిత్ర. అప్పట్నుంచే అత్తగారు, మామగార్లపై గౌరవం మొదలైంది ఆమెకి.

పెళ్ళయ్యాక తమ ఇంటికి వచ్చిన సుమిత్రతో “మా అమ్మానాన్నల్ని నువ్వు కూడా నాలాగే అభిమానంగా చూసుకోవాలి” అని చెప్పాడు మనోజ్.

“మా అమ్మానాన్న ఏమిటి? మన అమ్మానాన్నలు కారా?” అని అడిగింది సుమిత్ర. మనోజ్ ఎంతో సంతోషపడిపోయాడు ఆ మాటకు.

అన్నట్లే సుమిత్ర అత్తామామలను తల్లితండ్రుల్లాగే భావించి గౌరవించింది. వారికి తన వల్ల ఏ ఇబ్బందీ కలగకుండా చూసుకుంది. సుమిత్ర విజ్ఞత, సంస్కారం, కృష్ణారావును, విజయలక్ష్మిని విస్మయపరచాయి. సిటీలో చదువుకుని వచ్చిన అమ్మాయి అంత అణకువగా ఉంటుందని వారు ఊహించలేదు. అందుకే ఆమెని ఓ కూతురిగానే చూసుకున్నారు. మనోజ్‌కి ఇద్దరు చెల్లెళ్ళు. పెద్ద చెల్లెలు శాంతికి పెళ్ళయిపోయింది. ఆమె కర్నూల్‌లో ఉంటుంది. రెండవ చెల్లెలు లావణ్య డిగ్రీ చదువుతూంది.

విజయలక్ష్మి సౌమ్యురాలు, అమాయకురాలు. ఎవరినీ పల్లెత్తు మాట అనేది కాదు. ఎప్పుడూ సుమిత్ర నామజపం చేస్తూండేది. ఇంటికి ఎవరొచ్చినా కోడల్ని పిలిచి గర్వంగా పరిచయం చేసేది. సుమిత్ర కూడా ఎప్పుడూ అత్తగారిని అంటిపెట్టుకునే ఉండేది. ఆవిడని ‘అమ్మా’ అనే సంబోధించేది. ఆవిడని సినిమాలకు, షాపింగ్‌లకు పిలుచుకుని వెళ్ళేది. ఎప్పుడైనా ఆవిడ ఆరోగ్యం బాగా లేకుంటే డాక్టర్ దగ్గరికి పిలుచుకుని వెళ్ళేది.

అనతికాలంలోనే విజయలక్ష్మి స్నేహితురాళ్ళందరికీ సుమిత్ర ఇష్టురాలయింది. వారు “ఇదిగో విజయా! సుమిత్ర నీ కోడలని పొంగిపోకు. ఆమె మా కూతురు కూడా!” అనేవారు విజయలక్ష్మితో. “సుమిత్రని కోడలిగా పొందిన నువ్వు చాలా అదృష్టవంతురాలివి విజయా!” అని మనస్ఫూర్తిగా ఆమెని అభినందించేవారు.

సుమిత్ర మామగారు కృష్ణారావు తను ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకునే ముందు సుమిత్ర సలహా అడిగేవాడు. ఆమె బాగా ఆలోచించి సలహా ఇస్తుందని అతనికి నమ్మకం.

ఓసారి కృష్ణారావు “నాకు శాలరీ అరియర్స్ డబ్బు కొంత వచ్చింది. పిల్లలు ఫ్రిజ్ కొందామంటున్నారు. నీవేమంటావమ్మా?” అని అడిగాడు సుమిత్రని.

“ఇంటికి మునిసిపల్ ట్యాప్ కనెక్షన్ తీసుకుందాం మామయ్యా. మనకే కాక మన ఇరుగుపొరుగు వాళ్ళకూ ఉపయోగకరంగా ఉంటుంది” అంది సుమిత్ర. కృష్ణారావు ఆ పనే చేశాడు. ఇరుగుపొరుగువాళ్ళు అతన్ని మెచ్చుకుంటూంటే ఆ మెచ్చుకోలు సుమిత్రకు చెందాలని కృష్ణారావు వారితో చెప్పేవాడు.

ఓరోజు ఇంటి బయట కనిపించిన విజయలక్ష్మితో ఎదురింటి సావిత్రమ్మ “నువ్వు మరీ అమాయకంగా ఉండకు విజయా. నీ కోడలు నెత్తికెక్కి కూర్చుంటుంది” అంది.

“నటించడం నాకు చేతకాదు. నేనెలా ఉంటానో అలాగే కనిపిస్తాను. నెత్తిమీద ఎక్కితే ఎక్కనీ. సుమిత్ర ఇప్పుడు నా బిడ్డేగా?” అంది విజయలక్ష్మి నవ్వుతూ.

‘సావిత్రమ్మ తన మేలు కోరే చెప్పిందని తనకు తెలుసు, కానీ సుమిత్ర తనంత అమాయకురాలు కాకపోయినా మంచి వ్యక్తి. తనని ఎంతో గౌరవిస్తుంది, ఇష్టపడుతుంది. అటువంటి ఆమె దగ్గర తను అత్తగారి పెత్తనం చెలాయిస్తే ఏం బాగుంటుంది? అటువంటివి తనకు చేతకాదు కూడా’ అనుకుంది విజయలక్ష్మి మనసులో.

వీరి సంభాషణ తన గదిలోనుంచి విన్న సుమిత్రకు అత్తగారిపట్ల ఇష్టం మరింత పెరిగింది.

***

“మా అందరితో ఇంత బాగా కలసిపోతావని నేను ఊహించలేదు. నీకు చాలా థాంక్స్” అన్నాడు మనోజ్ ఓ రోజు సుమిత్రతో.

“అలా కాక మరెలా ఉంటాను? మీరు ఉద్యోగం చేసి నన్ను పోషిస్తున్నారు. అంతవరకూ పరిచయం కూడా లేని నన్ను అత్తయ్యా మామయ్యలు ఎంతో అభిమానంగా చూసుకుంటున్నారు. మరి నేనూ అలాగే ఉండాలి కదా! ముఖ్యంగా అత్తయ్యగారు మీ చెల్లెలితో సమానంగా నన్ను చూసుకుంటున్నారు. చదువైన వెంటనే పెళ్ళి కాబట్టి మా ఇంట్లో నేనేమీ నేర్చుకోలేదు. అత్తయ్యగారి దగ్గర నేను వంట నేర్చుకున్నాను. మనుషులతో ఎలా మెలగాలో, బంధువులను ఎలా ఆదరించాలో, వచ్చినవారికి ఎలా ఆతిథ్యమివ్వాలో ఆవిడని చూసే నేర్చుకున్నాను. పూజావిధానాలూ, భక్తి పాటలూ కూడా ఆవిడ దగ్గరే నేర్చుకున్నాను. ఆవిడతో ఉంటే మా అమ్మ ప్రక్కన ఉన్నట్లే ఉంటుంది నాకు” అంది సుమిత్ర.

మనోజ్ పెద్దచెల్లెలు శాంతి గడుసుది. పుట్టింటికి తరచుగా వస్తూండేది. సుమిత్రని ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ ఉండేది. అయితే సుమిత్ర ఆ మాటలు పట్టించుకునేది కాదు. కొంతకాలానికి మనోజ్ చెల్లెలు లావణ్య తను ఓ అబ్బాయిని ప్రేమించానని, అతను లేకుండా బ్రతకలేనని, ఇంట్లో ఒప్పుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానని సుమిత్రతో చెప్పింది. కులాంతర వివాహం కనుక మనోజ్‌తో సహా ఇంట్లో ఎవరూ అంత సులభంగా ఒప్పుకోరని తెలుసు సుమిత్రకి. లావణ్యతో ‘ఇంట్లో అందరినీ తాను ఒప్పిస్తానని, ధైర్యంగా ఉండమని’ చెప్పింది. అంతకంటే ముందు ఆ అబ్బాయితో ఓసారి తాను మాట్లాడాలని చెప్పింది. మరుసటిరోజే ఆ అబ్బాయిని లావణ్యతో పాటు పార్కులో కలిసి మాట్లాడింది. అతని రూపం, మాటలు, భావాలూ.. అన్నీ నచ్చాయి సుమిత్రకి.

విషయం తెలియగానే మనోజ్ మొదట ఆవేశపడినా సుమిత్ర అతనికి నచ్చచెప్పి ఒప్పించింది. తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కరినీ ఒప్పిస్తూ చివరికి పెళ్ళి జరిగేలా చూచింది. లావణ్య సుఖంగా కాపురం చేసుకుంటూండటం, లావణ్య భర్త గ్రూప్ వన్ పరీక్షల్లో పాసయి పెద్ద ఉద్యోగంలో స్థిరపడటం చూశాక అందరూ సంతోషించారు. ఇంట్లో సుమిత్రకు గౌరవం మరింత పెరిగింది. శాంతి కూడా సుమిత్రపై నోరు పారేసుకోవడం మాని అభిమానంగా మాట్లాడటం మొదలుపెట్టింది.

పుట్టింటికి వచ్చిన సుమిత్రని చూసి ఆమె స్నేహితురాళ్ళు “నీ అందం మరింత పెరిగిందే? ఏమిటి సంగతి? మీ ఆయన నిన్ను అంత బాగా చూసుకుంటున్నాడా?” అని అడిగారు.

“అవును. అయితే నా అందానికి అసలు కారణం అది కాదు. మనసులో ఏ కల్మషం లేకుండా ఉంటున్నాను. ఎవరేమన్నా ఓ చిరునవ్వు నవ్వేసి ఆ విషయం మర్చిపోతున్నాను. అందువల్ల మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాను. మనసు ఆరోగ్యంగా ఉంటే ముఖం అందంగా కనపడుతుంది. ఈ విషయం నాకు నేర్పింది ఎవరో తెలుసా.. మా అత్తగారు! ఆవిడని చూసే నేనూ అలా ఉండటం నేర్చుకున్నాను” అంది సుమిత్ర.

సుమిత్ర, మనోజ్‌లకు బాబు పుట్టాడు. అతని ఆలనా పాలనలో సుమిత్ర, విజయలక్ష్మి, కృష్ణారావు బిజీ అయిపోయారు. సుమిత్రకి ఓ ప్రైవేటు స్కూల్‌లో ఉద్యోగం వచ్చింది. అత్తామామల ప్రోత్సాహంతో ఆమె ఉద్యోగంలో చేరింది. సుమిత్ర స్కూల్లో ఉన్న సమయంలో బాబును కృష్ణారావు, విజయలక్ష్మి చూసుకోసాగారు.

ఓ రోజు సుమిత్రకి స్కూల్లో మీటింగ్ ఉండటం వల్ల ఇంటికి రావడానికి ఆలస్యమయింది. ఆమె ఇంటికి రాగానే విజయలక్ష్మి టిఫిన్ ప్లేటు ఆమె చేతికిచ్చింది. “అయ్యో.. మీరెందుకు చేశారు. నేను చేసుకునేదాన్నిగా?” అని ఇబ్బందిగా ఫీలయి అంది సుమిత్ర.

“ఫర్వాలేదు. ఇందులో శ్రమేం లేదు. ఇంతసేపు స్కూల్లో ఉండి అలసిపోయి ఉంటావు. కాసేపు విశ్రాంతి తీసుకో!” అంది విజయలక్ష్మి. ఆరోజునుంచీ సుమిత్రకి మీటింగ్ ఉన్నరోజుల్లో విజయలక్ష్మి టిఫిన్ చేసి ఆమెకోసం సిద్దంగా ఉంచేది.

ఓ రోజు కృష్ణారావుకు గుండెపోటు వస్తే హాస్పిటల్‌లో చేర్చారు. హాస్పిటల్ ఖర్చులు తమ శక్తికి మించి అవుతున్నా మనోజ్ వెనుకడుగు వెయ్యలేదు. బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర అప్పు తీసుకుని ఖర్చుపెట్టాడు. పదిరోజులు పోరాడిన తర్వాత కృష్ణారావు తనువు చాలించాడు.

భర్త మరణవార్త తెలియగానే విజయలక్ష్మి భోరున విలపించింది. సుమిత్ర కొద్దిరోజులు స్కూలుకు లీవుపెట్టి విజయలక్ష్మితోనే ఉండి ఆమెని ఓదార్చింది.

కార్యాలయ్యాక ఓ రోజు “మీ నాన్నకోసం ఎంత ఖర్చుపెట్టావురా? నీకోసమైనా ఆయన బ్రతికి ఉండాల్సింది” అంది విజయలక్ష్మి కొడుకు వైపు జాలిగా చూస్తూ.

“డబ్బుదేముందమ్మా. ఈరోజు కాకపోతే ఇంకోరోజు సంపాదించుకోవచ్చు. ఇన్నాళ్ళూ అన్ని పనులూ నేనే చూసుకున్నా నా వెనక నాన్న ఉన్నారన్న ధైర్యం ఉండేది. ఇప్పుడు నాన్నలేని లోటు నాకు తెలుస్తూంది” అన్నాడు బాధగా మనోజ్.

నాలుగేళ్ళ తర్వాత ఓసారి సుమిత్ర పుట్టింటికి వెళ్ళినప్పుడు విజయలక్ష్మి జబ్బుపడింది. ఫ్యామిలీ డాక్టర్ మందులు ఇచ్చినా బాగవకపోవడంతో హాస్పిటల్‌లో చేర్చారు.

“సుమిత్రకు నా ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పకురా! లేకలేక తను పాపం పుట్టింటికి వెళ్ళింది. నాలుగు రోజులు సరదాగా గడిపి రానీ. నాకు బాగయిపోతుందిలే!” అంది విజయలక్ష్మి కొడుకుతో.

అయితే ఆమె అనుకున్నట్టు ఆమె ఆరోగ్యం బాగవలేదు. రోజురోజుకూ క్షీణించసాగింది. మనోజ్ ఫోన్ చేసి విషయం చెప్పిన వెంటనే బయలుదేరి వచ్చింది సుమిత్ర. అపస్మారకంగా పడుకుని ఉన్న అత్తగారిని చూసి కన్నీళ్ళు పెట్టుకుంది.

సుమిత్ర వచ్చిన రెండవరోజు విజయలక్ష్మి కళ్ళు తెరచి చూసింది. ఎదురుగా సుమిత్ర కనిపించగానే ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి. సుమిత్రని దగ్గరకి పిలిచి ఆమె చేయి అందుకుని అలాగే ఉండిపోయింది. ఆమె కళ్ళనిండా నీరు. సుమిత్రకు ఏడుపొచ్చింది. అయితే అత్తగారిముందు ఏడిస్తే తను భయపడుతుందని ఏడుపు ఆపుకుంది. తర్వాత విజయలక్ష్మి కళ్ళు మూసుకుంది. చాలాసేపటివరకూ ఆమె కళ్ళు తెరవకపోవడంతో మనోజ్ డాక్టర్ని పిలుచుకుని వస్తే ఆయన చూసి ఆమె మరణించినదని చెప్పాడు. సుమిత్ర బావురుమంది.

కార్యక్రమాలన్నీ అయ్యాక ఓ రోజు మనోజ్ సుమిత్ర చేతికి ఓ కవరిచ్చి “హాస్పిటల్‌కు బయలుదేరుతున్నప్పుడు అమ్మ నా చేతికి ఈ ఉత్తరం ఇచ్చి నీకిమ్మని చెప్పింది. ‘నేను చదవకూడదా’ అని అడిగితే ‘సుమిత్ర ఎటూ నీకు చూపిస్తుందిగా. అందాకా ఆగు’ అంది” అన్నాడు.

సుమిత్ర అందుకుని చూసింది. కవరు చివర అతికించిలేదు. లోపల ఓ ఉత్తరం, స్టేట్ బ్యాంకు వాళ్ళు ఇష్యూ చేసిన ఫిక్సెడ్ డిపాసిట్ రసీదు ఉంది. ఉత్తరం చదవసాగింది సుమిత్ర.

“సుమిత్రా! నువ్వు మనోజ్ భార్య కావడం వాడి అదృష్టమైతే నా కోడలు కావడం నా అదృష్టం. నీ సహనం, ఆలోచనా విధానం నాకు ఎంతో నచ్చేవి. మనోజ్ ఆఫీసుకు వెళ్ళిన తర్వాత మనిద్దరం కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం. అప్పుడు నీవు నాకు ఎన్నో విషయాలు చెప్పేదానివి. నీ నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నీవు నా వంటని మెచ్చుకునేదానివి. నా చీరలు సెలెక్ట్ చేసేదానివి. బాధలో ఉంటే ఓదార్చేదానివి. నిరుత్సాహంగా ఉంటే ధైర్యం చెప్పేదానివి. నీతో కలసి సినిమాలకు, ఫంక్షన్‌లకు, షాపింగ్‌కు వెళ్ళినప్పుడు, నీతో కలసి తిరుగుతున్నప్పుడు నువ్వు నాకు ఓ స్నేహితురాలిగా అనిపించేదానివి. అప్పటివరకూ ఇల్లు, పిల్లలు, వంట..ఇదే ప్రపంచంగా ఉన్న నాకు ఓ క్రొత్త ప్రపంచాన్ని చూపించావు.

నీతో ఇంకా కొంతకాలం సరదాగా కలసి తిరగాలని ఉంది కానీ నా ఆరోగ్యం క్షీణిస్తూంది. ఇక ఎక్కువ రోజులు బ్రతుకుతానన్న నమ్మకం నాకు లేదు. అయితే నిన్ను చూసేవరకూ నేను బ్రతికే ఉంటాను. నీ రాకకోసం ఎదురుచూస్తూ ఉంటాను.

నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. నలభై ఏళ్ళక్రితం మా నాన్న తన పొలం అమ్మిన డబ్బులు నా పేరుతో బ్యాంకులో వేసి పిల్లల పెళ్ళిళ్ళకు వాడుకోమన్నారు. అయితే ఆ డబ్బులు మేము ఇంతవరకూ ముట్టుకోలేదు. ఆ అవసరం రాలేదు. అందుకు కారణం మనోజ్. వాడు ఉద్యోగంలో చేరినప్పటినుంచి తను సంపాదించిన ప్రతి పైసా కుటుంబం కోసమే వాడాడు. ఇప్పటివరకూ తనకంటూ ఓ ఇల్లుగానీ, ఇంటి స్థలం కానీ వాడు కొనుక్కోలేదు. చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేశాడు. వారి శ్రీమంతం, కానుపులు, పిల్లల బారసాలలు అన్నీ వాడే జరిపించాడు. మీ మామగారి వైద్యం కోసం ఎంతో ఖర్చుచేశాడు. ఇప్పుడు నాకోసం ఖర్చు చేస్తున్నాడు. మా నాన్న ఇచ్చిన డబ్బులు మీ ఇద్దరికీ ఇవ్వాలని నేనూ, మీ మామగారూ చాలాఏళ్ళ క్రితమే అనుకున్నాము. ఈ డబ్బుకు నామినీగా నీ పేరే రాయించాము. డిపాజిట్ మొత్తం యాభైలక్షలయిందని అప్పట్లోనే మీ మామగారు చెప్పారు. దయచేసి వద్దనకుండా ఆ డబ్బులు తీసుకుని ఇంటి స్థలం కొనండి. తర్వాత వీలు చూసుకుని ఇల్లు కట్టుకుందురుగాని. ఈ విషయం నా కూతుర్లకు చెప్పకండి. మనోజ్ వారికి చేయవలసినదంతా చేశాడు, ఇవ్వవలసినదంతా ఇచ్చాడు.

నాకు ఇంకో జన్మంటూ ఉంటే నీకు కోడలిగా పుట్టి నీ ఋణం తీర్చుకోవాలని కోరుకుంటున్నాను. నీ మంచి మనసుకు నీకు అంతా మంచే జరుగుతుంది సుమిత్రా!

ఇట్లు ప్రేమతో

నీ స్నేహితురాలు విజయలక్ష్మి”

***

సుమిత్ర ఉత్తరం చదివాక ఆ ఉత్తరాన్ని మనోజ్‌కి ఇచ్చింది. మనోజ్ చదవడం పూర్తిచేసి భార్యవైపు చూశాడు. సుమిత్ర కళ్ళనిండా నీళ్ళునిండి ఉన్నాయి. అతనికీ కళ్ళు చెమర్చాయి.

“అమ్మ మనసును నాకంటే నీవే బాగా అర్థం చేసుకున్నావు. ఆమె మనసెరిగి ప్రవర్తించి ఆమె మనసును గెలుచుకున్నావు. నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది సుమీ!” అన్నాడు సుమిత్రవైపు ప్రేమగా చూస్తూ.

“ఇది నా ఒక్కదాని గొప్పదనం కాదు. కలసి ఉండాలనే మనసు, ప్రయత్నం ఇరువైపులా ఉంటేనే సాధ్యమవుతుంది. పైగా ఆవిడ నాపై చూపిన ప్రేమకు నేనే ఆమెకు ఎంతో ఋణపడి ఉన్నాను” అంటూ ఏడవసాగింది సుమిత్ర. భార్య భుజంపై చేయివేసి అనునయించాడు మనోజ్. కొంతసేపటి తర్వాత డిపాజిట్ రసీదును భార్యచేతికిస్తూ “దీన్ని ఏం చేద్దాం?” అని సుమిత్రని అడిగాడు మనోజ్.

“మూడు భాగాలు చేసి మీ చెల్లెళ్ళకు రెండు భాగాలు ఇద్దాం!”

“అలా చేస్తే అమ్మ మాటని జవదాటినట్లవుతుంది కదా?” అనుమానంగా అడిగాడు మనోజ్.

“కాదు. మీ అమ్మగారు – ఆవిడ నాన్నగారు తనకిచ్చిన డబ్బును మీకిచ్చారు. మీ అమ్మగారు మీకిచ్చినదాన్ని మీరు తోబుట్టువులతో పంచుకుంటున్నారు.. ఇది న్యాయమే కదా! ఆవిడ నాపై ఉన్న ఇష్టంతో, నమ్మకంతో నన్ను నామినీగా వేశారు. అయితే మనం మన బాధ్యతని మరువమన్న విషయం కూడా ఆవిడకు తెలుసు. మనం మన వాటాకు మరికొంత కలిపి వీలైనంత త్వరలో ఇంటిస్థలం కొందాం. అప్పుడు ఆవిడ ఆత్మ శాంతిస్తుంది” అంది సుమిత్ర.

సుమిత్ర ఆలోచనలకు, ఆమె విశాల హృదయానికి ఆశ్చర్యపోతూ ఆమెనే చూస్తూండిపోయాడు మనోజ్.

Exit mobile version