[డా. కె. ఎల్. వి. ప్రసాద్ రచించిన ‘అంటు ముళ్ళు!!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
కొన్ని విషయాలు
మనకు సంబంధం లేకపోయినా
మనసును
తొలిచి వేస్తుంటాయి!
విపరీతమైన ఆలోచనలతో
పరిస్థితిని
అల్లకల్లోలం చేస్తుంటాయి!
మనకు సంబంధం లేనివే
కానీ..
మన జీవితంలో ఎక్కడో
వాటికి ఎక్కడో
చిన్న స్థానం ఉంటుంది
అందుకే
మనసును అదే పనిగా
కలవరపెడతాయి!
మరచిపోవాలి
కానీ..
మరచిపోలేం
విషయం అలాంటిది మరి!
అయినా
మరచిపోవాలి
మరచిపోయి మనసును
తేలిక చేసుకోవాలి!
సుఖమయ జీవితానికి
స్వాగతం పలకాలి..!!
వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
