[శ్రీ శ్రీధర్ చౌడారపు రచించిన ‘అంతే అయ్యుంటుంది’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
కన్నులే కాదు
అదిరే నీ పెదవులు
సిగ్గెక్కిన ఎర్రని బుగ్గలు
విసురుగ విసిరేసిన పైటకొంగు
విసవిసల కోపాలు, పకపకల నవ్వులు
ఓరచూపులు, మూతిముడుపులు
ముడుచుకున్న కనుబొమలు
నడకనంటి నాట్యంచేసే వాల్జడ
అదిలించే చేతిసైగ, బెదిరించే తర్జని
అడుగుల్లో మోగే అందెల రవలులు
అన్నీ.. అవన్నీ
ఎన్ని మాటలాడేవి
ఎన్నెన్ని ఊసులు చెప్పేవి శ్రద్ధగా
ఏమరుపాటు ఏమాత్రం రానీయకుండా
ఎంతబాగా వినేదో నా మనసు మౌనంగా
ఇపుడేమయింది
ఆ కళలనన్నిటిని కట్టగట్టి విసిరేసావా?
రోజువారీ అభ్యాసం పూర్తిగా మానేసావా??
నీ గొంతు మాత్రమే మాట్లాడుతోంది
మౌనాన్ని చదవడం మానేసానా?
మనసు గదికి గొళ్ళెం పెట్టి తాళం వేసానా??
నా చెవులు మాత్రమే వింటున్నాయి
కాలపు గోదాట్లో
ఏడాదుల కాగితపు పడవలను
ఎన్నెన్నింటినో వదిలేసాముగా
ఏమరుపాటుగానో అలవాటుగానో..
నువ్వు నేనూ
ఒకరికొకరం పాతబడిపోయినన్ని ఏళ్ళు
నీకూ నాకూ, నిండుగా వచ్చేసాయిగా
అంతే.. అంతే అయ్యుంటుంది.
చౌడారపు శ్రీధర్ చక్కని కవి. దీర్ఘ కవితలు వెలయించటంలో దిట్ట.