[ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ శ్రీ ఆసూరి హనుమత్ సూరి రచించిన ‘అంతశ్శత్రువు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
(గమనిక: కథానుసారం ఒకప్పటి అమెరికా అధ్యక్షులు రోనాల్డ్ రీగన్ పేరు ఉపయోగించుకున్నా, ఈ కథ ఇతివృత్తమూ, పాత్రలు, సంఘటనలు పూర్తిగా కల్పితం. ఎవరినీ ఉద్దేశించినవి కావు. – రచయిత]
ట్రింగ్ ట్రింగ్.. ట్రింగ్ ట్రింగ్..
నాలుగు సార్లు టెలిఫోన్ మోగడంతో ఫోన్ తీశాడు.. వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మిస్టర్ జాక్ రోజ్.
ఇటీవలి కాలంలో తన ఫోన్ మోగడం ఇదే. ఎవరయ్యుంటారబ్బా అనుకుంటూనే ఫోన్ తీశాడు జాక్. ఏదైనా అత్యవసర సమాచారం చెప్పడానికో లేదా ప్రెసిడెంట్‌తో ఎమర్జెన్సీ మీటింగ్ కోసం రిక్వెస్ట్ చేయడానికో మాత్రమే తనకు ఫోన్ చేస్తారు ఎవరైనా. లేదంటే అవుట్ గోయింగ్ కాల్స్ మాత్రమే ఉంటాయి తన నుంచి. ఇది ఇన్‍కమింగ్ కాల్.
అనుకున్నట్టుగానే సెక్రటరీ ఆఫ్ హోంలాండ్ బాబీ జార్జ్ అవతలినుంచి అడుగుతున్నాడు.. ఆత్రంగా..
“మిస్టర్ జాక్! నేనూ అలాగే సెక్రెటరీ ఆఫ్ ట్రెజరీ మిస్ జూలియానా, సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ జో స్మిత్ రిక్వెస్ట్ చేస్తున్నాం.. వియ్ నీడ్ అర్జెంట్ అపాయింట్‍మెంట్ ఆఫ్ మిస్టర్ ప్రెసిడెంట్! మేం ముగ్గురం ప్రెసిడెంట్‌తో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాం. ఇట్స్ ఇండీడ్ ఎన్ ఎమర్జెన్సీ!”
“లెట్ మీ నో ది పాయింట్ ఆఫ్ ఎమర్జెన్సీ అండ్ ఐ విల్ లెట్ యు నో ఆఫ్టర్ డిస్కసింగ్ విత్ ప్రెసిడెంట్ మిస్టర్ జార్జ్!” కూల్‌గా సమాధానం ఇచ్చాడు జాక్.
“సింపుల్‌గా చెప్పాలంటే గోల్డెన్ డోమ్‌కు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ మిస్టర్ జాక్.” అసహనంగా చెప్పాడు జార్జ్.
“ఓహ్ ఐ సీ.. అయితే వెంటనే ప్రెసిడెంట్‌తో డిస్కస్ చేస్తాను మిస్టర్ జార్జ్. మీరు కొంచెం వెయిట్ చెయ్యండి.” చెప్పాడు జాక్.
***
గోల్డెన్ డోమ్.. యూ ఎస్ ప్రెసిడెంట్ డోనాల్డ్ రీగన్ కలల ప్రాజెక్ట్.
ప్రపంచం లోని దేశాలు ఒక్కొక్కటిగా దేశాంతర, ఖండాతర క్షిపణుల్ని తయారు చేసుకుని శక్తివంతమవుతుంటే తన దేశం లోని అణుస్థావరాల్ని కాపాడుకుంటూ శత్రు దుర్భేద్యమైన దేశంగా తయారు చెయ్యాలన్న దృఢ సంకల్పంతో రూపొందించిందే ఈ గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్.
ఇందులో భాగంగా 260 శాటిలైట్ లను భూ కక్ష్య లోకి పంపి అమెరికాపై ఆకాశం నుండీ నిరంతరం నిఘా పెట్టి ఉంచి ఎవరు ఎటువైపు నుండీ మిస్సైల్‌తో దాడి చేసినా మార్గ మధ్యంలోనే వాటిని నిర్వీర్యం చేసే రక్షణ వ్యవస్థే ఈ గోల్డెన్ డోమ్. అందుకే దానికి సంబంధించి ఎటువంటి సమాచారాన్నయినా వినడానికి సిద్ధంగా ఉంటాడు ప్రెసిడెంట్ రీగన్.
***
“మిస్టర్ జార్జ్, మిస్ జులియానా అండ్ మిస్టర్ స్మిత్ మీరు ముగ్గురూ రేపు ప్రెసిడెంట్‌ను లంచ్ తర్వాత కలవొచ్చు” ముగ్గురికీ కాన్ఫరెన్స్ కాల్‌లో చెప్పాడు జాక్.
అపాయింట్‌మెంట్ సమయం కన్నా ముందుగానే వచ్చారు జార్జ్, జులియానా, స్మిత్. వెయిటింగ్ లాంజ్‌లో కూర్చున్నారు. ముందు విషయం ఎలా చెప్పాలా అని తర్జన భర్జన పడుతున్నారు ముగ్గురూ.
“ముందుగా ఆర్ధిక పరిస్థితి గురించి చెప్తా” అంది జులియానా. “కాదు కాదు సౌత్ అండ్ వెస్ట్ రీజియన్స్‌లో ఉన్న కల్లోల పరిస్థితి గురించి చెప్పడం బెటర్” అన్నాడు హోంలాండ్ సెక్రటరీ జార్జ్. “అసలు మనం అపాయింట్‌మెంట్ తీసుకున్నదే గోల్డెన్ డోమ్ గురించి. ముందు అది చెప్పకుండా ఏదో చెప్తే ప్రెసిడెంట్ సహించరు” అన్నాడు డిఫెన్స్ సెక్రటరీ స్మిత్. ఇలా తర్జన భర్జన పడుతుండగానే ప్రెసిడెంట్ నుండీ పిలుపు వచ్చింది.
అయోమయంగానే వెళ్లారు ముగ్గురూ లోపలికి.
ప్రెసిడెంట్ రీగన్ చాలా కూల్‌గా ఉన్నాడు. ఆఫ్రికా పర్యటన ముగించుకుని వచ్చాడు కదా అందుకే కాబోలు. వెళ్ళగానే “హౌ ఆర్ యూ మిస్ జూ?” తానే పలకరించాడు ఆర్థిక శాఖ సెక్రటరీ జూలియానాని.
దొరికిందే ఛాన్స్ అన్నట్టు “ఐ యామ్ ఫైన్ మిస్టర్ ప్రెసిడెంట్. కానీ సౌత్ అండ్ వెస్ట్ రీజియన్స్‌లో ఆర్థిక పరిస్థితి ఏం బాగోలేదు. మీరు గత ఎన్నికల్లో ప్రకటించిన ప్యాకేజీల్లో కోత విధించడంతో ఈ రెండు రీజియన్స్‌లో ఉన్న డెవలప్‍మెంట్ ప్రాజెక్ట్స్ స్లో గా నడుస్తున్నాయి.” అంటూ ఏదో చెప్పబోయింది జులియానా. అసహనంగా తలాడించాడు రీగన్.
“వాట్ అబౌట్ యు మిస్టర్ స్మిత్? మన గోల్డెన్ డోమ్ నిర్వహణ ఎలా నడుస్తోంది? ముందు ఇది చెప్పండి!” ఒకింత ఆత్రంగా అడిగాడు ప్రెసిడెంట్ రీగన్.
“అదే మిస్టర్ ప్రెసిడెంట్.. అన్ని శాటిలైట్‌లూ బాగా పని చేస్తున్నాయ్. కాకపోతే వాటికి కేటాయించిన ఫండ్స్ సరిపోవటం లేదు. కరెక్ట్‌గా చెప్పాలంటే గత నాలుగేళ్లలో ఒక మిస్సైల్ కూడా మనవైపుకు ప్రయోగించడం జరగలేదు.. ముఖ్యంగా రష్యా, చైనాల నుండీ. అందుకే.. అందుకే గోల్డెన్ డోమ్ నిర్వహణ ఖర్చు కొంచెం భారంగానే ఉంది.” తటపటాయిస్తూ చెప్పాడు స్మిత్.
“మీరేం చెప్పాలనుకుంటున్నారు మిస్టర్ జార్జ్?” అడిగాడు రీగన్.
“సౌత్ అండ్ వెస్ట్రన్ రీజియన్స్‌లో శాంతి భద్రతల సమస్య ఎక్కువగా ఉంది మిస్టర్ ప్రెసిడెంట్. అది మెల్లిగా నార్త్ ఈస్ట్ వైపుకు పాకుతోంది. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా అది మిడిల్ వెస్ట్‌కు కూడా వ్యాపించే అవకాశం ఉంది.” చెప్పాడు హోంలాండ్ సెక్రటరీ జార్జ్.
“ఓకే ఆల్.. సెక్రెటరీస్. మీట్ యు లేటర్.” అంటూ అర్ధాంతరంగా సమావేశాన్ని ముగించాడు ప్రెసిడెంట్ రీగన్.
***
గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత రీగన్ చేపట్టిన ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టులలో గోల్డెన్ డోమ్ ఒకటి. దీని ద్వారా అమెరికాను శత్రు దుర్భేద్యంగా మార్చడమే కాకుండా తాము ఏ దేశం పైనైనా దాడి చెయ్యగలిగే సామర్థ్యం కలిగి ఉండాలన్నది అతని ప్లాన్. అందుకే ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్రీ ఎడ్యుకేషన్, ఇంకా ఇండస్ట్రీస్ కి ఇచ్ఛే సబ్సిడీలు వంటి వాటికి కోత విధించి సుమారు 200 బిలియన్ డాలర్ల భారీ బడ్జెట్ కేటాయించాడు దీని కోసం.
అమెరికా లోని 16 రాష్ట్రాలతో కూడిన సౌత్ రీజియన్, అలాగే 13 రాష్ట్రాలతో కూడిన వెస్ట్ రీజియన్ లలో వెనుకబడిన ప్రాంతాలైన టెన్నీస్, ఉటాహ్ రాష్ట్రాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు నెమ్మదించాయి. అత్యధిక జనాభా కలిగిన ఈ ప్రాంతాల్లో ఒక విధమైన అసంతృప్తి ఉంది ప్రజల్లో.
***
షాంఘై.. చైనా.. (సరిగ్గా నాలుగేళ్ల క్రితం)
అమెరికా అధ్యక్షుడు గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే చైనా అధ్యక్షుడు జెడాంగ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసాడు. దీని గురించి ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేశాడు. అందులో స్పేస్ సైంటిస్టులు, రాజకీయ నిష్ణాతులు, సామాజిక శాస్త్రవేత్తలు, ఆర్థిక నిపుణులు అలాగే తత్వవేత్తలనూ నియమించాడు.
వీరంతా కలిసి ఈ ప్రాజెక్ట్ కోసం ఏమేం చేస్తారో, ఎన్ని నిధులు ఖర్చవుతాయి, మొదలైనవి సైంటిస్టులు, ఆర్థికవేత్తలు అంచనా వేస్తారు. ఇది అమలైన తర్వాత పర్యవసానాలను రాజకీయ, సామాజిక శాస్త్రవేత్తలు అంచనా వేస్తారు. ఇక తత్వవేత్తల పని ఏమిటంటే సైద్ధాంతికంగా, మానసికంగా పైచేయి సాధించడం.
ఇందుకు మూలం భారతీయ తత్వశాస్త్రాలనుండీ తీసుకున్నారు. శాంతి ఎక్కడో ఉండదు.. మన లోపలే ఉంటుంది. కాబట్టి దానికోసం బయట వెతకడం వ్యర్థం. సరిగ్గా దీనికి వ్యతిరేక భావనే.. “అశాంతి లోపల ఉంటే బయటి నుండీ ఏ శక్తీ అవసరం లేదు మనల్ని నిర్వీర్యం చెయ్యడానికి.”
అందుకే ఒక పథకం ప్రకారం కవ్వింపు చర్యలకు దిగి గోల్డెన్ డోమ్ అవసరాన్ని ఫీల్ అయ్యేలా చేసి అమెరికాను ట్రాప్ చేశారు.. చైనీయులు. ఎప్పుడైతే ఆ ప్రాజెక్టు కోసం అధిక నిధులు ఖర్చు చెయ్యడం కోసం ప్రజల అవసరాలకు సంబంధించిన నిధుల్లో కోత విధించారో.. ఆయా వర్గాల ప్రజల్లో అశాంతి నెలకొంది. మెల్లిగా ఈ వర్గాలను రెచ్చగొట్టే విధంగా చేసే ఒక టీమ్‌ని ఏర్పాటు చేశారు. ఎక్కడ అశాంతి ఉందో అక్కడ మరింత అసహనాన్ని పెంపొందింపచేయడం, దానికి అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాలన్నిటినీ ఉపయోగించడం.. వీరి పని.
***
ప్రస్తుతం.. వాషింగ్టన్ (అమెరికా)
ప్రెసిడెంట్ కేబిన్‌లో అత్యవసర సమావేశం జరుగుతోంది. జాతీయ భద్రతా సలహాదారు, ఆర్థిక సలహాదారులతో పాటు ముందు రోజు తనతో చర్చించడానికి వచ్చిన జార్జ్, స్మిత్, జూలియానాలను పిలిపించాడు ప్రెసిడెంట్ రీగన్.
ఈసారి ముందు హోంలాండ్ సెక్రటరీ జార్జ్‌కి అవకాశం ఇచ్చాడు రీగన్, తన వర్షన్ ఏమిటో చెప్పమని. జార్జ్ చెప్పనారంభించాడు.
“మిస్టర్ ప్రెసిడెంట్, దేశం లోని బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాలైన న్యూయార్క్, న్యూజెర్సీ లాంటి 9 రాష్ట్రాలతో కూడిన నార్త్ ఈస్ట్; అలాగే సుమారుగా అభివృద్ధి చెందిన ఇల్లినాయిస్ లాంటి 12 రాష్ట్రాలతో కూడిన మిడిల్ వెస్ట్ ప్రాంతాల్లో పరిస్థితి బాగానే ఉంది. ఎటొచ్చి కొద్దిగా వెనుకబడిన ప్రాంతాలైన సౌత్ అండ్ వెస్ట్ రెజియన్లలో ఉన్న 29 రాష్ట్రాల ప్రజల్లో ఉన్న అసంతృప్తి ఈమధ్య కనీస అవసరాలైన విద్య, వైద్య రంగాల్లో నిధుల కోత వల్ల ఇంకా పెరిగింది. దీని పర్యవసానమే అంతర్గత శాంతి భద్రతల సమస్య. ఇది దేశంలో రాజకీయ అస్థిరతకి దారి తీస్తోంది మిస్టర్ ప్రెసిడెంట్..!” వివరంగా చెప్పాడు.
“మిస్ జులియానా, మీరు చెప్పండి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? గోల్డెన్ డోమ్‌కి సరిపడా నిధులకు ఢోకా లేదు కదా?” అడిగాడు ప్రెసిడెంట్ రీగన్.
జూలియానా చెప్పనారంభించింది..
“మిస్టర్ ప్రెసిడెంట్. గోల్డెన్ డోమ్ నిధులకు ఢోకా లేదు. కానీ మనం 60 శాతం రాష్ట్రాలతో కూడిన సౌత్ అండ్ వెస్ట్ రీజియన్స్‌ని నిర్లక్ష్యం చేస్తున్నామనిపిస్తోంది. దాని వల్ల అభివృద్ధి కుంటుపడుతోంది. ప్రజల్లో అశాంతి కూడా ప్రబలుతోంది. దీన్ని మనం ఎంత మాత్రం నిర్లక్ష్యం చెయ్యడానికి వీల్లేదనిపిస్తోంది మిస్టర్ ప్రెసిడెంట్!” కూలంకషంగా చెప్పింది జూలియానా.
“ఇక మీరేం చెప్పాలనుకుంటున్నారు మిస్టర్ స్మిత్?” చివరిగా అడిగాడు రీగన్.
“మిస్టర్ ప్రెసిడెంట్. మన గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ అయితే నూటికి నూరు శాతం బాగానే పని చేస్తోంది. గత నాలుగేళ్లలో ఒక్కటంటే ఒక్క దేశం కూడా మనమీద దాడి చేసే సాహసం చెయ్యడానికి ప్రయత్నం చెయ్యలేక పోయారంటే మనకు అది గర్వ కారణం కదా మిస్టర్ ప్రెసిడెంట్. సో, మనం ఈ ప్రాజెక్ట్‌ని మరింతగా ముందుకు తీసుకెళితే ఈ భూ ప్రపంచం మీద మనకు తిరుగే ఉండదు. ఇంకా చెప్పాలంటే ఆకాశం మీద కూడా మన ఆధిపత్యం నిరూపిత మవుతుంది మిస్టర్ ప్రెసిడెంట్!” ఆవేశంగా చెప్పుకు పోతున్నాడు డిఫెన్స్ సెక్రటరీ మిస్టర్ స్మిత్.
“స్టాప్ నాన్సెన్స్..” గట్టిగా అరిచాడు ప్రెసిడెంట్ రీగన్.
ఒక్కసారి నిశ్శబ్దం ఆవరించింది ప్రెసిడెంట్స్ కేబిన్‌లో.
“మై డియర్ ఫ్రెండ్స్.. మనం మన సమస్త ధనాన్ని ఉపయోగించి మన బయట ఉన్న సమస్త శత్రు దేశాల్ని కట్టడి చేసాం. మరి అంతర్గతంగా బలంగా ఉన్నామని అనుకుంటున్నాం. మనం బయటి దేశాలని… ఆ మాటకొస్తే బయటి దేశాలను మాత్రమే శత్రువులుగా భావించి మన సమస్తం వారి నుండి కాచుకోవడం కోసం ధారపోశాం. చివరికి మన వాళ్ళని, మన ప్రజల్ని నిర్లక్ష్యం చేసి వాళ్ళని మెల్లిగా మన అంతర్గత శత్రువులుగా తయారుచేసుకున్నాం. శాంతి కోసం బయట కాదు లోపల వెతకాలి అని మొన్న ఐక్యరాజ్యసమితిలో చేసిన ప్రసంగంలో భారత ప్రధాని అంటుంటే అర్థం కాలేదు. మనం పోరాడాల్సింది బయటి శత్రువుతో కాదు. లోపలి శత్రువుతో.. అదే మనలోని, మన సమాజం లోని అశాంతి, అసంతృప్తులతో. అప్పుడే మనం నిజంగా అజేయులం..”
ప్రెసిడెంట్ రీగన్‌లో ఒక తత్త్వవేత్త మేలుకున్నాడు..!
అప్పుడు మళ్ళీ నిశ్శబ్దం ఆవరించింది ప్రెసిడెంట్స్ కేబిన్‌లో.
‘లోకమంతటినీ తట్టుకునే కోట, లోపల పగుళ్లుంటే నిలబడలేదు.’
రచయిత ఆసూరి హనుమత్ సూరి స్వంత ఊరు అనంతపురం. వృత్తి రీత్యా భారతీయ జీవిత బీమా సంస్థలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. ఈయన తన డిగ్రీని ఆంధ్ర ప్రదేశ్ గురుకుల కళాశాల, నాగార్జున సాగర్‌లో చేశారు. శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురంలో గణితంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ప్రస్తుతం హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. ఛందస్సులో పద్యాలు, కవితలు మరియు కథలు రాయడం ఈయన అభిరుచులు.