[డా. సి. భవానీదేవి రచించిన ‘అంతర్ముఖం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
మనిషికి మనిషికి వ్యత్యాసం
ఏకాగ్రతలో భిన్నత్వం
జ్ఞానసాధనకు సోపానం
దృష్టిని కేంద్రీకరించే మనసే
ఏ పని అయినా చేయగలననుకోవటం
ఒక దృఢమైన వ్యక్తిత్వచిహ్నం
ఎక్కడ అదుపు చేసుకోవాలో
తెలుసుకోవటం కూడా
పరిణత మనస్సుకు అలంకారం
జంతువుకు మనిషికి.. వ్యత్యాసం
స్వచ్ఛమైన ఆలోచనగల మనస్సే
వివేచన ఉన్న మేధస్సే
మనస్సు బుద్ధి హృదయం
కలిసి వికసిస్తే నిజ భారతం
గుర్తింపు కోసం వెంపర్లాటెంత కాలం
ప్రాంతం, భాష, కులం, మతం
ఎన్నయినా.. ఎప్పటికయినా
కాలగహ్వరంలోకి జారిపోవాల్సిందే
మనిషి మనిషిగా మిగిలితే
మానవీయతను పంచితే
మనసా వాచా కర్మణా
దివ్యత్వమౌతుందిగదా
అహంకారం కమ్ముకున్నంతవరకు
స్మరించే ‘నేను’ నిజం కాదు
సకల ప్రపంచాన్ని తనదిగా
ప్రేమించే అనన్యభావం
మనకి మనల్ని బాధ్యులుగా చేస్తుంటే
మనలో అందరంగా
అంతర్ముఖీనంగా
ఏకమవుదాం.. ఏకంగా ఉందాం