[డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతిరావు గారు రచించిన ‘అంతర్మథనం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
ఈ అనంత కాలగమనంలో మనిషి జీవన ప్రమాణం నూరేళ్ళట. అలా అంటారుగానీ ఆ నూరేళ్ళు మాత్రం ఎవరు బతుకుతున్నారని? డెబ్బయ్యేళ్ళు వచ్చినప్పటి నుంచీ ‘నో గ్యారంటీ’ అన్నట్టుగా అయిపోయింది.
ఎనభై ఏళ్ళు వచ్చాకయితే – ఇవ్వాళో, రేపో అన్నట్టు ఎదురుచూపుల పర్వం మొదలవుతుంది. అదే ఆఖరి పర్వం..! ఆ తర్వాతది మనిషికి కనబడదు, వినబడదు. ‘పోతున్నాం’ అని చెప్పకుండానే ప్రాణాలు శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాయి. ఒకడి చావును అందరూ చూస్తారు గానీ ఎవడి చావును వాడు చూడలేడు. అదే విచిత్రం. అంతకన్నా విచిత్రం ఏమిటంటే – అన్నేళ్ళూ పట్టుబట్టలతో, పట్టెడు నగలతో, పెర్‌ఫ్యూమ్ లతో ఒక వెలుగు మోగిన ఆ ‘శివం’ ఇప్పుడు కంపుకొట్టే ‘శవంలా మారిపోతుంది.
శివం అంటే మనిషి, శవం. అంటే కట్టె! కట్టె ఇంకా నయం.. ఇది అంతకన్నా నికృష్టం. ఇవి అన్నీ అందరికీ తెలిసిన విషయాలే పక్కవాడి లేక సాటిమనిషి పోయినప్పుడు, జీవిత బండారం బయటపడటాన్ని అందరూ కళ్లారా చూస్తునే ఉంటారు. అయినా ఆ మూణ్ణాళ్ళ ముచ్చట అనే మత్తులో పడిపోతుంటారు. శ్మశాన వైరాగ్యం పక్కకు తప్పుకున్నాక మళ్లీ షురూ జీవనవ్యామోహం. ‘అందరూ పోతారేమో గానే నేను మాత్రం పోను. ఈ నా జీవితం అనే నేను తవ్వుకున్న గోతిలో స్థిరనివాసం ఏర్పరుచుకొని ఇక్కడే ఉండిపోతాను’ అని మునిషికి ఎంత అహంకారమో, ఎంతటి పిచ్చి నమ్మకమో. దీన్ని ‘అజ్ఞానం’ అని అనటానికే వీల్లేదు – పైన చెప్పాగా – ‘అన్ని చూస్తూనే వుంటాడు. వింటూనే వుంటాడు’ అని – ‘అందుకే దీనికి ఏం పేరు పెట్టాలో తెలియటం లేదు’ అనుకున్నాడు యోగానంద్ కాలనీ వీధుల్లో ఈవినింగ్ వాకింగ్ చేస్తూ.
‘ఏంటో ఈ మధ్య రిటైర్ అయినప్పటి నుంచీ జీవితం మీద ఆలోచనలు ఎక్కువై పోయాయి. వయసు పెరుగుతున్న కొద్ద వృద్ధాప్యం ఛాయలు వంట్లో పొడసూపుతుంటే మృత్యువు ఈ కొద్దికొద్దిగా సమీపానికి వస్తున్నాం అన్న ఆలోచనలు ఇలాంటి ఆలోచనలకు దారితీసాయోమో.. వయసులో ఉన్నప్పుడు అందమైన అమ్మాయిలు వాళ్ళతో చేరువ, సెక్సువల్ కోరికలు, ప్రేమభావాలూ తప్ప మరో ఆలోచనలు వచ్చేవి కావు తనకి. అప్పుడు అమ్మాయిల అందాలనూ, ఎత్తుపల్లాలనూ వర్ణిస్తూ కవితలు కూడా గిలికేవాడు. తనలోని భాషాభిమానం ఓ అమ్మాయికి లవ్ లెటర్ రాసేలా కూడా చేసింది. అది ఆడపిల్లలు పద్ధతిగా ఉన్న కాలం గనుక లవ్ లెటర్ చేతిలో పెట్టగానే చదివి, గొంగళి పురుగును చేతిలో పట్టుకున్నంత చిరాకుగా కాగితాన్ని కిందకు దులిపేసి చెంప వాయగొట్టింది. దాంతో ఇలా లాభం లేదని – సంప్రదాయ బద్ధంగా పెళ్ళిచూపులకెళ్లి సావిత్రి మెడలో బుద్ధిగా మూడుముళ్లు వేసాడతను. అప్పుడే ‘నాకూ ఒక పెళ్ళాం వచ్చింద’నే సంబరంలో తనతో సరస సల్లాపాలు, ముద్దు ముచ్చట్లు అదే లోకం అయిపోయింది. ఆహా! జీవితమంటే ఇదే కదా. స్త్రీపురుషుల కలయికకు మించిన సుఖసంతోషాలు ఈ ప్రపంచంలో మరొకటి లేదు కదా అనిపించింది. దాంతో అప్పుడు ఈ చావులూ, బాధామయ జీవితాలకు సంబంధించిన వేదాంతం ఇవేవీ తన జీవితం దరిదాపులకు కూడా రాలేదు. ఆ తరువాత పిల్లలు పుట్టుకొచ్చాక వాళ్ళ ముఖం చూస్తుంటే ‘వాత్సల్యం’ లోనుంచి పెల్లుబుకి నట్లయి వాళ్ళకోసం కలలు కనటం మొదలు పెట్టాడు. సతీసమేతంగా వాళ్ళకోసం జీవన ప్రణాళికలూ అప్పుడే మొదలయ్యాయి.. దాని వెంటే వాళ్ళ పోషణకు, చదువుకు, ఆ తర్వాత డబ్బు ఇబ్బం దులేవీ వాళ్ళకు కలగకుండా ఉండటం కోసం ఎర్నింగ్సు, సేవింగ్సు, ఎక్స్‌పెంపండిచరు వీటికి సంబంధించిన మాస్టరు ప్లాన్స్ సిద్ధమయ్యాయి. ‘నేను కష్టపడ్డా పర్వాలేదు గానీ నా పిల్లలు కష్టపడకూడదు – వాళ్ళు రాజాల్లా దర్జాగా – లైఫ్ లీడ్ చెయ్యాలి’ అనే పిచ్చిప్రేమలతో కూడిన పిచ్చి కోర్కెలు తన జీవితాన్ని బిజీ బిజీ చేసేసాయి, ఆ అవిశ్రాంత జీవితంలో, ‘అప్పుడూ’ ఈ అశాశ్వత జీవితాల గురించిన ఆలోచన రాలేదు. జీవితం శాశ్వతం అన్న భ్రమ లోనే ఉన్నాడు. కానీ ఇప్పుడు, ‘ఇక ఇంట్లోనే రెస్ట్‌గా ఉండు. చేసీ చేసీ అలసిపోయావు’ అని ప్రభుత్వం ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ ఇచ్చి ఇంటికి పంపాక – ‘ఏం చెయ్యాలో తోచక, చెయ్యటానికి పనేమిలేక ఇంట్లో వాలుకుర్చీలో పడకా, రోడ్ల మీద వాకింగ్ చేస్తున్నప్పుడు ఇప్పుడొస్తున్నాయి ఈ పనికి మాలిన ఆలోచనలన్నీ!’ అని అనుకొని మళ్లీ అంతలోనే ‘నిజంగా ఇవి పనికిమాలిన ఆలోచనలా లేకుంటే ఇవే అసలైన పనికొచ్చే ఆలోచనలా – మనిషికి జ్ఞానోదయమై జీవనతత్వం బోధపడేది ఈ నడివయసునూ దాటేసిన మూడొంతుల జీవన ప్రాయంలోనేనా?!’ అనుకుంటూ నడుస్తుంటే యోగానంద్‌కు లెప్ట్ సైడ్ ఒకప్పటి తన కొలీగ్ విహారి ఇల్లు కనిపించింది. ఆయన ఇంకా సర్వీసులో ఉన్నాడు, ఇంటికి వచ్చేవుంటాడు గనుక కాసేపు కాలక్షేపం చేసి రావాలనిపించి అటువైపు వెళ్ళాడు.
***
“ఓ యోగానంద్ గారూ.. మీరా – రండి రండి” అంటూ ఆహ్వానించాడు విహారి యోగానంద్‌ని. తనకన్నా చిన్నవాడు గనుక ‘యోగానంద్ గారూ’ అంటూ పూర్తి పేరుతో పిలుస్తున్నాడు. ఆఫీసులో సీనియర్స్ ‘మిస్టర్ యోగి’ అని పిలిచేవాళ్ళు. ఇంట్లోనూ పెద్దవాళ్ళకు తను యోగినే అనుకుంటూ వసారాలో విహారి వున్న వైపుకు నడిచాడు యోగానంద్. ఆయన మర్యాదకి అలా నవ్వుతూ ఆహ్వానిస్తున్నాడు. ఆ నవ్వు వెనుక ‘వీడిప్పుడెందుకు తగలడ్డాడా?’ అన్న అయిష్టతతో కూడిన భావం దాగున్నట్టు అనిపించింది యోగానంద్‌కు. ఎందుకంటే ఆ నవ్వు అంత కృత్రిమంగా వుంది మరి. సర్వీసులో ఉన్నవాడికి రిటైర్ అయిన వాడంటే చులకనభావం వుంటుంది సహజంగా.. అదే ఆయనలో కనిపించింది.
యోగానంద్‌కు సైతం ఇంకా సర్వీస్‌లో వున్న విహారిని చూస్తుంటే మనసులో – ఈర్ష్య లాంటి భావమేదో కలిగింది. వయసులో పెద్ద అయిన వాడికి, తనకన్నా చిన్నవాడిని చూస్తే అసూయ కలుగుతుంది. ఆ చిన్నవాడికేమో ఈ పెద్దవాడిని చూస్తే పరమానందం కలుగుతుంది. నేను ‘యంగ్’ అన్న ఆలోచనా వీచిక అందంగా మనసులో కదలాడుతుంది అనుకున్నాడు యోగి అదంతా అవతలి నుంచి గమనిస్తూ – తను అనుభవిస్తూండటం వల్ల మనసులోకి వచ్చిన ఆలోచనలు.
“కూర్చుందాం రండి” అంటూ మధ్యహాల్లోకి తీసుక్కెడు విహరి తన పూర్వ సహోద్యోగిని.
ఎంత నార్మల్‌గా ఉందామనుకున్నా యోగానంద్ వల్ల కావటం లేదు – ఏదో ఆత్మన్యూనత మనసులో! ‘ఎందుకొచ్చాను. రాకుండా ఉండాల్సింది’ అన్న వ్యతిరేకపు ఆలోచన అతనిని కంఫర్టబుల్‍గా ఉండనివ్వటం లేదు. కుర్చీలో స్థిమితంగా కూర్చోనివ్వటం లేదు.
“ఏయ్! ఏం చేస్తున్నావ్ లోపల? రెండు టీలు పంపించు” భార్య నుద్దేశించి కాబోలు వంటింటి వైపు చూస్తూ బిగ్గరగా అన్నాడు విహారి.
‘ఎవడన్నా కొంపకొస్తే కాసిన్ని టీ నీళ్లు పోయడం కనీస మర్యాద, అది పోసేవరకూ వాళ్ళూ కదలరు’ అన్నట్టు అనిపించింది యోగానందకు విహారి ధోరణి.
“వద్దు వద్దు.. నేను వాకింగ్ చేస్తూ ఇటు వచ్చాను” అన్నాడు అందుకే.
“ఫరవాలేదు లెండి – టీ యేగా” అన్నాడు విహారి. మళ్లీ ఆ మాటలోనూ ఇందాకటి ధోరణే ధ్వనించింది యోగానంద్‌కు.
“ఏంటి విశేషాలు? ఎలా వుంది మీ రిటైర్మెంట్ లైఫ్? నాకు ఇంకా ఫోర్ ఇయర్స్ సర్వీస్ ఉంది” అన్నాడు విహారి, సంభాషణను ప్రారంభిస్తూ.
ఆ రెండు మాటలూ నచ్చలేదు యోగానంద్‌కు.
‘రిటైర్ అయిన వాళ్ళకు ‘మీరు రిటైర్ అయ్యారు’ అంటూ మాటిమాటికీ ఆ విషయాన్ని గుర్తుచేయాలా’ అనిపించింది మొదటి మాట చెవిలోబడగానే. ‘తనకు ఇంకా ఎంత సర్వీస్ ఉంది’ అని నేను అడిగానా బడాయికాకపోతే.. ‘ఫోర్ ఇయర్స్’ అని గొప్పగా చెబుతున్నాడు!’ అనిపించింది రెండో మాట విన్నాక.
‘మనుషుల మనసుల్లో ఇంతటి విరోధి భావనలు, ఇంతటి భేదభావాలూ ఎందుకు?’ అనుకున్నాడు తన మనసు సంగతి తాను మర్చిపోతూ.
ఏదో మాట్లాడాలి గనుక “ఎలా ఉన్నారు అంతా?” అని అడిగాడు యోగానంద్ పూర్వ సహోద్యోగుల నుద్దేశించి.
దాంతో పేరుపేరునా అందర్ని “వాడికి పనిరాదు, వీడికి వచ్చినా పనిదొంగ, ఫలానా వాడికి ఎప్పుడూ ఆ నెల రాబోయే జీతం గురించే. ఎరియర్స్ గురించి ఆలోచించటం లెక్క తీసుకోవటం తప్ప ఆఫీసు బాగు గురించి పట్టదు” అంటూ విమర్శించడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత బాసుల గురించి తగులుకున్నాడు. “వాడు పరమ స్టిక్టు – వీడు ఎప్పుడూ చాంబర్లో నిద్రపోతుంటాడు!” అంటూ. అందరి గురించీ వాడు, వీడు అంటూ తక్కువ చేసి వ్యతిరేకంగా మాట్లాడటం తప్ప ఒక్కరి గురించే సజావుగా చెప్పలేదు. అదంతా వింటున్న యోగానంద్ ‘నీ సంగతి నాకు తెలియదా. నువ్వో డబ్బు కక్కుర్తి మనిషి వన్నది ఆఫీసంతా తెలిసిన విషయం. పని చేయించుకోవటానికి వచ్చే వాళ్ల దెగ్గర చెయ్యి జాపుతావన్నది బహిరంగ రహస్యమేగా?’ అనుకున్నాడు మనసులోనే.
టీలు వచ్చాయి. “తీసుకోండి” అంటూ తను ఓ కప్పు తీసుకున్నాడు విహారి.
ఇంతలో కుడివైపు నున్న ఒక రూమ్ గుమ్మం దగ్గర ఏదో అలికిడి అయింది. ఆ వెంటనే ఏదో ఠక్కుమన్న శబ్దం. కర్టెన్ తొలగించుకొని వాకర్ పట్టుకొని నడుస్తూ బయటికి వచ్చాడు ఓ వృద్ధుడు. ఆయన జుట్టంతా నెరసి వుంది. ఒళ్ళంతా చర్మం ముడతలు పడివుంది. బక్కచిక్కి వుంది శరీరం. అక్కడ కొత్త వ్యక్తి అయిన యోగానంద్‍ని చూసి బోసినోటితో నవ్వాడు ఆయన.
ఆయన్ని చూడగానే విహారి ముఖంలో రంగులు మారాయి. అయిష్టంగా ముఖం పెట్టుకొని “మా నాన్న – యనభై మూడేళ్లు వయసు” అని పరిచయం చేసాడు. ‘ఆయన వయసు చెప్పడం ఇప్పుడు అవసరమ్మా’ అని మనసులో అనుకుంటూ.. వెంటనే యోగానంద్ లేచి “నమస్కారమండీ” అన్నాడు చేతులు జోడిస్తూ. కూర్చోమన్నట్టుగా మునివేళ్ళతో సైగ చేసాడు ఆయన. ఈలోగా విహారి “మీరు కూర్చోండి” అని రెండుసార్లు అన్నాడు. ‘లేవాల్సిన అవసరం లేదు’ అన్న అర్థం ఆ మాటల్లో వినిపించింది. ఆ పెద్దాయన ఠక్కఠక్కు మని వాకర్ శబ్దం చేస్తూ బాత్రూమ్ వైపు కాబోలు వెళ్ళాడు. ఆయనకు అక్కడ కాసేపు కూర్చొని మాట్లాడాలని వుందని ఎందుకో ఆ చూపులు చెప్పకనే చెప్పాయి. యోగానంద్ కానీ విహారి ఆయన్ని కూర్చోమని అనలేదు. అదిగాక ఆయనెందుకో కొడుక్కి భయపడతున్నట్లుగా అనిపించింది. తండ్రి అటు వెళ్ళగానే విహారి “ఆయనకు మోకాళ్ళ సొప్పులు, నడవలేడు, బొక్కలు బాగా అరిగిపోయాయని చెప్పారు డాక్టర్లు..” అని ఒక్క సెకండ్ ఆగి, “అసలు ఇంత వయసు వచ్చే వరకూ బతకకూడదండీ” అన్నాడు విహారి లోగొంతుతో. ఆ మాటతో అదిరిపడ్డాడు యోగానంద్.
‘ఒక కొడుకు ‘తండ్రి’ మరణాన్ని కోరుకుంటున్నాడా? వయసు ఎక్కువున్నంత మాత్రాన, అవయవాలు సరిగా పనిచెయ్యనంత మాత్రాన పనికిరాని పాత సామానును అవతల పారేసినట్టు ఆ మనిషినీ పారేయాలని అనుకుంటున్నాడా.. మనిషికీ, సామానుకూ తేడా లేదా? మనుషుల్లో మనసులు – ఆ మనసుల్లో వుండే ప్రేమలూ, అనుబంధాలూ వాటి మాట మిటి మరి?’ అని ఆలోచిస్తూ, ఎందుకో ఇక అక్కడ ఉండబుద్ధి కాక “ఇక వస్తాను” అంటూ లేచాడు యోగానంద్.
దారిపొడుగునా, మళ్లీ ఆలోచనలు – బుర్రను తినేసాయి. మనిషి జీవితం, వందేళ్ళు అనుకుంటాం కానీ, కాదు. అది దేవుడి పెట్టిన ఆయుష్షు అయితే కావొచ్చు గానీ అంతకాలం ఈ సాటి మనుషులు అతన్ని బతకనివ్వొద్దూ? ఒంట్లోని జవసత్వాలు మనిషిని మూడొంతుల జీవితకాలం జీవించి వుండేలా చేస్తే ఆ ఆఖరి ఒక వంతూ బతికేలా చేసేవి మనస్తత్వాలు. ‘అయ్యో వీళ్లు పెద్దవాళ్ళవుతున్నారు. ఇంకెతో కాలం వుండరు. వీళ్లు లేకుంటే ఎలా?’ అన్న చింత నడివయసు పిల్లల్లో వుంటే ఏళ్లని ఎలా కాపాడుకోవాలి – వాళ్ళ శిథిల శరీరాలను ఎలా భద్రంగా గాజుబొమ్మలా సంరక్షించుకోవాలి అన్న బెంగ, దిగులు వాళ్ళలో వుంటే వాళ్లలో అందరికయినా పూర్ణాయుష్షు సాధ్యమవుతుందేమో. అలా గాక ఎప్పుడు పోతారా అన్న ఎదురు చూపులు – పోకుంటే విసుగులు, విసుర్లు మనిషిని జీవచ్ఛవంగా మార్చేస్తాయి. అప్పుడు ఇక ఉండే వాళ్ళు ఉండలేనట్టే లెక్క’ అనుకుంటూ ఇల్చు చేరుకున్నాడు యోగానంద్.
బైట చెప్పులు విప్పి, లోపలికి మధ్యహాల్లోకి వెళ్ళగానే మంచం మీద పక్షవాతంతో కదలని, మెదలని కరచరణాలతో వున్న ఎనభైయేళ్ళ తల్లి కనిపించింది. కొడుకుని చూడగానే ‘వచ్చావా’ అన్నట్టుగా వంకర మూతితో నవ్వింది ఆమె.
ఆమె అలా మంచం పట్టి ఆరు నెలలయింది. ఒక కాలు, ఒక చెయ్యీ మూతీ పని చెయ్యవుగానీ కంటిచూపు, చెవి వినికిడి బాగానే ఉన్నాయి. తల్లిని చూడగానే వెనుకనుంచి ఎవరో వెన్ను మీద ఒక చరుపు చరిచినట్టయింది యోగానంద్‌కి. ‘యోగి – యోగి’ అంటోంది ఆమె నంగినంగిగా.
తల్లి ముఖం వంక తదేక దీక్షతో చూస్తూ, మనసులో ‘అమ్మా, విహారి వాళ్ళ నాన్నకులా నేనూ ఎప్పుదయినా నీకు నా మాటలతో చర్యలతో మనస్తాపం కలిగించానా? ఎందుకంటే – నేనూ మనిషి కదా. మనుషుల మనస్థత్వం ఎలాంటిదంటే, ఎదుటి వాళ్ళలో కనిపించే తప్పులు – తనూ అదే తప్పు చేస్తున్నాసరే – తన కంటికి, మనసుకి కనిపించవు. తప్పులెన్నువారు తమ తప్పు లెరుగరు. నేనూ ఎప్పుడయినా విహారి లాగా ‘నువ్వు చనిపోవాల’ని – నాకు పైకి ఆ మాట ఊరికే అనటానికి కూడా నోరు రావటం, ఎప్పుడయినా నీకు సేవ చేయలేక – లేక చేయించలేక.. నీ ఉనికిని భరించలేక నేనూ అలా అనుకొని వుంటే నన్ను క్షమించమ్మా. నువ్వు నిండు నూరేళ్లు నా కళ్ళముందు ఇలాగే ఉండాలి.
చావును ఎలాగూ తప్పించలేంగానీ – మనిషి జీవన ప్రమాణం తగ్గి పోకుండా – అదీ మన చేతులారా – చూసుకోగలం కదా. బ్రతికున్న మనిషి చనిపోవాలని కోరుకోవటం – వయసు పెరిగిన వృద్ధుల మీద ప్రేమలు తగ్గిపోవడం అన్నది ఘోరాతిఘోరం కదా. జంతుసంస్కృతి, పక్షి సంస్కృతి కాని ఈ వికృత సంస్కృతి కేవలం మనిషిదే. అలాంటి సంస్కృతి నాలోనూ ఏ మూలనైనా వుండివుండే మనిషినై పుట్టినందుకు సిగ్గుపడుతున్నానమ్మా.. అందులోనూ నీ అత్తమామలకు ఆఖరిదశలో సేవ చేసి వాళ్లకు శతమానాన్ని జీవితకానుకగా ఇచ్చిన నీ కడుపున పుట్టి’ అనుకున్నాడు యోగానంద్ తల్లి పక్కన కూర్చొని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ.
కొడుకు మనసులోని ఆలోచనలేవీ తెలియని ఆ తల్లి ఆ ఆప్యాయతకు కరిగిపోతూ – ‘దీర్ఘాయుష్మాన్ భవ’ అని మనసులోనే కొడుకుని దీవించింది నిండు మనస్సుతో.
యోగి మనసులోని అంతర్మథనం మాత్రం అలా కొనసాగుతూనే ఉంది.
అది అతని మనసులోనే కాదు – జీవనసాగరాన్ని మనసు అనే కవ్వంలో చిలకడం అనేది ప్రతినిత్యం బుద్ధి జీవులు చేసే పనే.
డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు డిగ్రీ కాలేజీ లో తెలుగు లెక్చరర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. వారు వ్రాసిన 500 పైన కథలు వివిధ పత్రికలలో వచ్చాయి.
కథా వాణి పేరిట వారికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో తన కథలనే 500 వీడియోల దాకా తన స్వరంతో వినిపించారు ఇప్పటి వరకూ..
ఇంకా రాస్తున్నారు.. వినిపిస్తున్నారు. ఫోన్: 9849212448