జీవితంలో ఆర్థిక, అనారోగ్య సమస్యలు ఎదురయినప్పుడే చాలామందికి భగవంతుడు గుర్తుకువస్తాడు. జాతకాలు పైకి తీస్తారు. జపతపాలు, అభిషేకాలు, దానధర్మాల వంటివి ఎన్నో చేస్తారు. ఫలితం కనబడకపోతే, వైద్యులని మార్చినట్లే, జ్యోతిష్కులనీ మారుస్తారు. కొంతమందైతే దేవుళ్ళను కూడా మారుస్తారు. క్రొత్తక్రొత్త మొక్కులని మొక్కుతారు. దీక్షలు చేబడుతారు. గతంలో ఎరుగని వేదప్రమాణం లేని గుళ్ళని దర్శిస్తారు. అశాస్త్రీయమైన దైవ ఆరాధనలని కొంతమంది ప్రశ్నించినా ఏదో ఒక మార్గాన ఆధ్యాత్మిక రంగంలోనే ఉన్నందుకు కొంతమంది సంతోషిస్తారు.
ఎంతమందిని ఆరాధించినా, మార్చినా, ఏమార్చినా ఫలితం కనబడకపోయేసరికి కొంతమంది మరలా మొదట్లో చూసిన జ్యోతిష్కులు, పెద్దల చెంతకే చేరుతారు. ఎన్ని చేసినా ఫలితం లేదంటూ వాపోతారు. “నేను ఎన్నో పుణ్యకార్యాలు చేశాను… చేస్తున్నాను… ఎంతో మందికి సాయం చేశాను. ఫలానా వాళ్ళు ఎవ్వరికీ సాయం చెయ్యలేదు. పైపెచ్చు అందరినీ దగా చేస్తున్నారు. అయినా హాయిగానే ఉన్నారు. నేనే ఎందుకిలా ఉన్నాను” అంటూ బాధపడతారు. కష్టాలు ఒక్కుమ్మడిగా చుట్టుముడుతున్నాయీ అంటే, పాపఫలం అంతా అనుభవంలోకి వస్తున్నట్లూ, తీరగానే మంచిరోజులు వస్తాయని, ధైర్యం కోల్పోక సాధనని మరింత తీవ్రతరం చెయ్యమని సలహా వస్తుంది. “నేను ఇంతవరకు చేసిన పుణ్యకార్యాలకు కొంచెమైనా ఫలితం కనబడుంటే అలాగే చేసేవాడినే” అని నిరుత్సాహపడితే భగవంతుని పరీక్షా సమయం ఆసన్నమైందనీ, మరి కొంత కాలం ఓపిక పట్టమని నమ్మకాన్ని కోల్పోవద్దని చెబుతారు.
ఈ రోజొక మంచిపని చేస్తే దాని తాలూకా పుణ్యపలం రేపే కనబడదు. కారణం నీ ఆలోచన పుణ్యకార్యం మీద కన్నా పుణ్యఫలం మీద ఎక్కువగా ఉండడం వలన. ప్రతిఫలాపేక్ష అధికంగా ఉన్నప్పుడూ ఫలితం వస్తుంది కానీ తొందరగా రాదు. అన్నిటికన్నా ముందు నీవు నేడు చేసిన మంచి పని తాలూకా పుణ్యఫలం కన్నా ముందుగా నిన్నటి చెడ్డపని తాలుకా పాపఫలాన్ని అనుభవించాల్సి ఉంటుంది. నిన్నగాకపోతే మొన్న లేదా క్రిందటి జన్మలో చేసిన చెడు కర్మఫలాన్ని అనుభవించాలి ముందుగా. ఈ జన్మలో నీవు తెలిసి పాపము చేసి ఉండకపోవచ్చు. తెలియకుండా చేసిన పాపం కూడా నమోదయిపోతుంది. ముట్టుకొంటే కాలుతుందని తెలియని పసిపిల్లవాడు నివ్వురవ్వని పట్టుకొంటే చిన్నపిల్లాడని కాల్చకుండా ఉంటుందా? ఈ జన్మలోని వ్యవహారాలన్నింటిని మనం గుర్తుపెట్టుకోలేము… ఇంక క్రిందటి జన్మలలోని కర్మల సంగతేమిటి? బహుశ ఈ జన్మలో నీవు బాగా తీవ్రమైన సంఘటనలను మాత్రమే గుర్తుపెట్టుకోగలవు. కాని ప్రతి పనినీ అది ఈ జన్మలో చేసినా, క్రిందటి జన్మలో చేసినా దానిని నమోదు చేసి దాని తాలూకా పాపపుణ్యఫలలను బేరీజు వేసి నీ ఖాతాలో వేసే అధీకృత గణకుడొకాయన పైనున్నాడు. శాశ్వతమైన నీ ఆత్మ ఏయే శరీరాలతో ఏమేం చేసిందో అన్నిటినీ పరిగణనలోకి తీసుకొంటాడు. ఎన్ని పుణ్యకార్యాలను చేసినా పాపఫలం అనుభవించక తప్పదన్నప్పుడు ఇంక పుణ్యకార్యాలెందుకు చెయ్యాలనిపిస్తుంది. కానీ ఈ ఆలోచన తప్పు. ఈ జన్మలోని పుణ్యఫలం క్రిందటి జన్మలోని పాపఫలాన్ని చెరిపివేయదు. కానీ నీవు ఆ కష్టాన్ని ఎదుర్కునే శక్తియుక్తులను ఇవ్వడమే గాక, కష్టాల తీవ్రతనూ తగ్గిస్తుంది. అందుకు అచంచల విశ్వాసం, కఠోర సాధన అవసరం. ఈ రోజు మనం నాటిన మొక్క ఫలాలను రేపే ఇవ్వదుగా. ఎదగాలి… పండాలి. మొక్కైనా, పాపపుణ్యాలైనా అంతే!
కర్మ సిద్ధాంతాన్ని వ్యతిరేకించేవాళ్ళు, జ్యోతిష్యాన్ని, దేవుడిని, అదృష్టాన్ని, జపతపాలని కాక, నీ శక్తిని, కృషిని నమ్ముకో అని చెబుతుంటారు. ప్రతిభ కావాలి, అదృష్టం కాదంటారు. నిజానికి కర్మ అంటే పనే కదా! కర్మ అంటే అదృష్టమనీ, దేవుడనీ కర్మ సిద్ధాంతం చెప్పలేదు. కర్మ అంటే ‘పని’ చెయ్యడమే! ఆ చేసేదేదో మంచి పనులు చెయ్యండి, మంచి ఫలితాలని పొందండి అని చెబుతోంది. చెడు కర్మల తాలూకా పాపఫలాన్ని అనుభవించక తప్పదు. ఈ జన్మలో కాకపోతే మరో జన్మలోనైనా దొరుకుతావంటోంది. ఈ జన్మలో చేసినవి ఇక్కడే ఈ జన్మలోనే అనుభవించేస్తాం, మరు జన్మ అనేదే లేదు అనేవాళ్ళు మరి ఈ జన్మలో ఎన్ని పాపాలు చేసినా హాయిగా తప్పించుకు తిరుగుతూ సమస్త సుఖాలు అనుభవిస్తున్న ఘటనలకు ఎంతమంచిగా బ్రతుకును వెళ్ళదీస్తున్నా అష్టకష్టాలు పడేవాళ్ళకు కారణాలు ఏవమి చెబుతారు?
పోయేడప్పుడు ఏవీ పట్టుకుపోరంటారు… కానీ పాపపుణ్యాల ఖాతా మాత్రం ఆత్మ ఎన్ని శరీరాలు మార్చినా కొనసాగుతూనే ఉంటుంది. వరుసక్రమంలో ఆ ఫలం అనుభవంలోకి వస్తూనే ఉంటుంది. అనుభవించే శరీరాలు మారుతూ ఉండచ్చు. అలాంటిదేమీ లేదు, ఈ జన్మలో చేసిన కర్మల ఫలితాలు ఈ జన్మలోనే అనుభవించేస్తాం, మరో జన్మకు కొనసాగింపు ఉండదు అనే వాళ్ళకు కంచి పరమాచార్య ఓ అద్భుతమైన వివరణ ఇచ్చారు. ఒకే సమయంలో ఒకే ఆసుపత్రిలో పుట్టిన పిల్లలను చూపిస్తూ, కొందరు పసికూనలు ఏం పుణ్యం చేశారని ఆగర్భ శ్రీమంతులకు, మరికొందరు కటిక దరిద్రులకు పుట్టడానికి కారణమేమిటో తెలుసుకోమన్నారు. ఇంకా కనుగుడ్డైనా తెరవని పసికందు ఈ జన్మలో ఏం పుణ్యం చేసిందని బంగారు ఊయల చేరుకుకొందనీ, మరో గుడ్దు ఏం పాపం చేసిందని వరండాలోకి చేరిందని ప్రశ్నించారు. కేవలం కర్మ సిద్ధాంతమొక్కటే దీనికి సమాధానము చెప్పగలదని ఋజువు చేశారు.
పొన్నాడ సత్యప్రకాశరావు కవి, కథకులు. వీరు ఇప్పటి వరకు 69 కథలు, 2 నవలలు, 100కి పైగా కవితలు వ్రాశారు. 2002లో వీరి నవల ‘ఊరు పొమ్మంటోంది’ స్వాతి అనిల్ అవార్డును గెలుచుకుంది. ఈ నవలని 2010లో సాహితీప్రచురణలు వారు ప్రచురించారు. 2010లో చినుకు ప్రచురణల ద్వారా వీరి కథాసంపుటి ‘అడవిలో వెన్నెల’ విడుదలైంది. వివిధ పత్రికలలో కాలమ్స్ రాస్తున్నారు.
కర్మసిద్ధాంతం ఒప్పుకోక తప్పదు. చేసుకున్నవాళ్ళకు చేసుకున్నంత అంటారుకదా!” అంతర్మధనం ” పొన్నాడ సత్యప్రకాశరావు గారి రచన బాగుంది అభినందనలు.
పొన్నాడ సత్య ప్రకాశరావు గారి అంతర్మధనం చాలా బాగుంది. గీత లో పరమాత్మ ప్రబోధించిన కర్మయోగ సారాన్ని సరళంగా, కానీ లోతుగా విశ్లేషించారు. నిష్కామ కర్మ చేయమని భగవానుడు ప్రబోధించాడు. ఫలితాన్ని గురించి ఆలోచనలు మాని కర్మను చేయమన్నాడు. కర్మ ప్రతిఫలాపేక్ష రహితంగా చేయడమంటే ఆ కర్మ సత్కర్మే అవుతుంది, దాని ప్రతిఫలం కూడా అందుకు తగినట్లుగానే ఉంటుంది…. మరిన్ని రచనల కోసం ఎదురు చూస్తూ..
You must be logged in to post a comment.
శతక పద్యాల బాలల కథలు-4
డాక్టర్ అన్నా బి.యస్.యస్.-5
గుణం ప్రధానం
సంచిక పదసోపానం-8
తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-19
దేశ విభజన విషవృక్షం-5
హాస్యం, భావుకత్వంతో కట్టిపడేసే ‘పాచువుం అద్భుత విళక్కుం’
ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్-8
అన్నింట అంతరాత్మ-48: సర్వదా మీ సేవలో.. ‘సంచి’ని నేను!
సంచిక – పద ప్రతిభ – 65
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®