Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అన్నింట అంతరాత్మ-24: హలో,, హలో నేనండీ ఫోనును!

జీవులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం ఫోను అంతరంగం తెలుసుకుందాం.

నేనెంత గొంతు చించుకు అరుస్తున్నా ఎవరూ నా దగ్గరకు రావడమే లేదు. ఇటీవల కాలంలో ఇది మామూలైంది. అంతలో పాపం సుగుణమ్మ ‘ఫోన్ మోగుతుంటే ఎవరూ తీయరేం?’ అంటూ నా దగ్గరకు రాబోయింది. వెంటనే ‘ఆగు, అక్కడే ఆగు. ఆ ఫోన్ ఎత్తకు. అన్నీ పనికిరాని కాల్స్. ఆరోగ్య బీమా తీసుకోండి, మహేంద్రలోకం వెంచర్‌లో ప్లాట్ కొనండి, అనాథాశ్రమానికి ఆర్థికసాయం చేయండి, లక్కీడిప్‌లో మీ ఫోన్ నంబర్ వచ్చింది.. హెటల్ ‘మాయా’కు మధ్యాహ్నం వచ్చేసి బహుమతి అందుకోండి.. అంటూ ప్రతి వెధవ ఫోన్ చేసేవాడే.. ఎప్పుడు ఆ ఫోన్ ఎత్తాలో నేను చూసుకుంటా.. అంతేకానీ నువ్వు ఫోన్ ఎత్తి, సార్ ఉన్నారని సత్యహరిశ్చంద్రిణి లాగా చెప్పి చెత్త కాల్స్ నాకు అంటించకు. తెలిసిందా?’ సర్వేశ్వరరావు మండిపడ్డాడు.

‘సరే మీ ఇష్టం. ఆగకుండా ఆ రింగింగ్ సౌండ్ భరించలేక వచ్చా కానీ, నాకెందుకు’ అంటూ వెనుదిరిగింది. ఇంతలో నేనూ నిశ్శబ్దమైపోయా. కానీ నా ఉనికి నన్నే కించపరుస్తుంటే మనసు కలుక్కుమనే బాధ. ల్యాండ్ లైన్ ఫోనంటే అందరికీ చిన్నచూపే. ఒక్క సర్వేశ్వరరావు మాత్రమే అడపాదడపా నన్ను వాడుతుంటాడు. ఇంట్లో మిగతా వాళ్లందరికీ మొబైల్ ఫోన్లున్నాయి. సర్వేశ్వరరావు క్కూడా ఓ మామూలు మొబైల్ ఉంది.. అది కేవలం రిసీవింగ్‌కే. అందులో ఆయనకు అవసరమైన ఓ పది నెంబర్లు మాత్రమే ఉంటాయి. నేను ఊరికే పడున్నానని పిల్లలు ఒకటి, రెండుసార్లు ‘ఆ ల్యాండ్ లైన్ ఫోనెందుకు? అందరికీ మొబైల్స్ ఉన్నాయిగా. డబ్బు దండగ తప్పించి.. దాన్ని తీసేయండి’ అన్నారు. కానీ అందుకు సర్వేశ్వరరావు ఒప్పుకోలేదు. ‘లేదు, లేదు ల్యాండ్ లైన్ ఉండాల్సిందే’ అనడంతో పిల్లలు ఇక ఆ విషయం వదిలేశారు. సర్వేశ్వరరావు ఓ చిత్రమైన వ్యక్తి. నా పై దుమ్ము పడకుండా కవర్ కప్పి ఉంచి చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. నా కన్నా ముందర ఈ ఇంట్లో ఇంకో ఫోన్ ఉండేది. అది బ్రౌన్ రంగుది. నేనేమో ఎరుపు. పాతదాంట్లో కాలర్ ఐడి తెలిసే వీలు లేదు. నేను ఆ వివరం చూపగలను. అందుకే నన్ను ఇష్టపడి కొనుక్కున్నారు. మాజీ ఫోనును మరో గదికి మార్చి, నా నుంచి కనెక్షను తగిలించి, అక్కడ్నుంచి కూడా మరొకరు కాల్ వినే ఏర్పాటు చేశారు. మాజీ ఫోను ముందు నొచ్చుకున్నా, కనీసం తనకు ఆ మాత్రం ఉనికైనా మిగిల్చారని సరిపెట్టుకుంది. కాకపోయినా చేయగలిగిందేముంది కనుక.

అన్నట్లు సర్వేశ్వరరావుగారు పిల్లలకు చెపుతుంటే విన్నాను. అసలు మా జాతి సృష్టికర్త అలెగ్జాండర్ గ్రహంబెల్ మహానుభావుడట. ‘హలో! ఏంటి ఆలోచనలో పడ్డావ్?’ మాజీ ఫోను పలకరించింది. ‘ఏముంది.. మనల్నెవరూ పట్టించుకోవడం లేదే అని..’ అన్నాను నేను. అందుకు మాజీ ఫోను, ‘నువ్వే అలా అనుకుంటే ఇంక నేనేమనుకోవాలి? ఒకప్పటి నా దర్జా నీకేం తెలుసు. నేను ఈ ఇంటికి వచ్చిన రోజు ఇంటిల్లిపాది స్వీట్లతో సంబరాలు చేసుకున్నారు తెలుసా? ఇంట్లో వాళ్లంతా బంధువులకి, స్నేహితులకి ఫోన్ చేసి మురిసిపోయారు. ఆ రోజుల్లో ఫోన్ కనెక్షన్ రావడమే గొప్ప. చాలామంది బయట ఫోన్ బూత్ లకు వెళ్లి ఫోన్ చేసుకునే వారు. ఎంతోమందికి, దివ్యాంగులకు కూడా టెలిఫోన్ బూత్ స్వయం ఉపాధిగా ఊతమిచ్చింది. సర్వేశ్వరరావుగారు అలా ఎన్నో సార్లు బయటి టెలిఫోన్ బూత్‌ల నుంచి ఇంటికి ఫోన్ చేసేవారు. ఆ మాట అటుంచి, ఆ తర్వాత కాలంలో ఫోన్లలో కొత్త ఫీచర్లు వచ్చాయి. కాలర్ ఐడి తెలిపే ఫోన్ ఉంటే మంచిదని నిన్ను కొన్నారు. దాంతో నా చోటు నీదైంది, నేనేమో ఇక్కడికి మారిపోయాను’ అంది నిట్టూరుస్తూ. ‘నిజమే, నేనొచ్చిన కొత్తల్లో నా దగ్గర చేరి తెగ హడావుడి చేసేవాళ్లు. ఇంట్లో లేనప్పుడు వచ్చిన కాల్ నంబర్లను వచ్చాక చూసి, నోట్ చేసుకునేవాళ్లు. అవసరమనుకుంటే తిరిగి వీళ్లే ఫోన్ చేసేవాళ్లు. వేరే ఊళ్లో పెళ్లిళ్లకు నా ద్వారానే ట్రంకాల్ చేసి గ్రీటింగ్స్ పంపేవాళ్లు. చివరకు నా వైభవమూ మూణాళ్ల ముచ్చటే అయిందిగా. మొబైల్స్ వచ్చేసరికి మనం నామమాత్రమయ్యాం.

కాలేజీ చదువు పూర్తయి, ఉద్యోగాల వేటలో ఉన్న శ్రీకాంత్‌కు మొబైల్ అవసరం ఉందని అతడి కోసం మొబైల్ కొన్నారు. అదే ఈ ఇంట్లో తొలి మొబైల్. దాని రింగ్ టోన్ వింటే చాలు అంతా మంత్రముగ్ధులయ్యే వాళ్లు’ అన్నాను నేను. వెంటనే నా గది లోనే కిటికీలో సెటిలయిన ఆ మొబైల్ ‘నా భోగం మాత్రం ఎన్నాళ్ళుందేమిటి? మొదట్లో కొద్దిమంది దగ్గరే ఉండటంతో అదో గొప్పగా ఉండేది. కానీ అంతలోనే కొత్త హంగులతో సరికొత్త రకాల మొబైల్స్ వచ్చేసరికి నేను ఎవరి కంటికీ ఆనలేదు. ఆండ్రాయిడ్ వ్యవస్థతో పనిచేసే టచ్ స్క్రీన్‌తో కూడిన స్మార్ట్ ఫోన్లు రంగప్రవేశం చేశాయి. దాంతో నా మీద చిన్నచూపు మొదలైంది. ‘చిన్న స్క్రీన్. ఒట్టి నెంబరు తప్ప ఏం కనిపిస్తుందని?’ అంటూ విసుక్కుని, సర్వేశ్వరరావుని సతాయించి పిల్లలు త్రీ జి ఫోన్, ఆ పైన ఫోర్ జి ఫోన్ కొనుక్కున్నారు. ఇప్పుడు ఐ ఫోన్ లేదని గునుస్తున్నారు. ఆఁ అన్నట్లు ఫైవ్ జీ కూడా ఇప్పుడిప్పుడే పాదం మోపుతోంది. ఎందుకు పనికిరానని నన్ను ఇక్కడ పడేశారు’ నిస్పృహగా అంది పాత మొబైల్.

అంతలో ఫోర్ జీ ఫోన్ ‘హాయ్ ఫ్రెండ్స్’ అంటూ ఉల్లాసంగా పలకరించింది. ‘అదేమిటి! నీకెలా ఖాళీ చిక్కిందీ?’ అడిగాం ముగ్గురం ఒక్కసారిగా. ‘మీమాట నిజమే. నాకు తీరిక దొరకనే దొరకదు. కానీ అమ్మాయి నవీన జ్వరమొచ్చి పడుకుంది. నన్ను సైలెంట్ మోడ్‌లో పెట్టింది. మీ మాటలన్నీ విన్నాను. తీరిగ్గానే ఉన్నా కదా, నేనూ కొన్ని కబుర్లు చెబుదామని పలకరించా’ అంది. ‘చాలా సంతోషం. ఇన్నాళ్లకు నీతో మాటా మంతీ… అన్నట్లు నువ్వు చాలా స్మార్టు కదా. ఈ మనుషులంతా నిరంతరం ‘హలో హలో అంటుంటారు కదా. ఈ హలో మాట పుట్టుపూర్వోత్తరాలు నీకేమైనా తెలుసా?’ అడిగాం ముగ్గురం.

‘ఓ.. ఎందుకు చెప్పనూ.. శాస్త్రవేత్త ధామస్ ఆల్వా ఎడిసన్ పద్దెనిమిది వందల ఇరవై ఏడులో ఈ హలో పదాన్ని పరిచయం చేశాడట. తాను రూపొందించిన ఫోన్ వాడేవారు ‘హలో’ అనే పలకరింపును ఉపయోగించాలని మనవి చేసుకున్నాడట. అలెగ్జాండర్ గ్రహంబెల్ మాత్రం ‘అహోయ్’ అనే పలకరింపును ఇష్టపడి చివరి వరకు ఆ పదమే వాడేవాడట. కానీ ఆ తర్వాత క్రమంగా ‘హలో’ పలకరింపే ప్రాచుర్యం పొంది ఇలనంతటినీ ఏలేస్తోంది. ఇంక తొలి మొబైల్ కాల్ గురించి కూడా చెపుతా వినండి.. పంధొమ్మిది వందల డెబ్బైమూడులో మోటరోలా కంపెనీ ఉద్యోగి మార్టిన్ కూపర్, న్యూజెర్సీలోని బెల్ ల్యాబ్‌లో పనిచేస్తున్న జోయెల్‌కు తొలిసారిగా మొబైల్ కాల్ విజయవంతంగా చేశాడు. మన దేశంలో అయితే స్మార్ట్ ఫోన్లు అంటే మేం రెండువేల ఏడు సంవత్సరం నుంచి ఉన్నాం. రకరకాల రింగ్ టోన్లతో ఇరవైనాలుగ్గంటలూ అలరిస్తున్నాం. మామూలు కాల్స్, మెసేజులు, ఫొటోలు తీసుకోవడం, వేర్వేరు యాప్స్ ద్వారా వీడియో కాల్స్, మ్యూజిక్, గేమ్స్, ఛాటింగ్, గ్రూప్ కాల్స్, సెర్చ్, మెయిల్స్, వీడియోలు, సినిమాలు చూడటం.. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ అన్నీ మాతోనే.. ఇక కారులో ప్రయాణిస్తుంటే దారి కూడా మేమే చూపుతాం. ఒకటా, రెండా ఎన్ని పనులు మా ద్వారా జరుగుతాయో.. మమ్మల్ని చేతిలో అమరే కంప్యూటర్లు అనుకోవచ్చు. ఇప్పుడు మనుషులకు చేతిలో చరవాణి లేకుంటే కరచరణాలు ఆడని పరిస్థితి..’ ఫోర్ జి పోజు కొడుతూ చెపుతుంటే మేం ముగ్గురం చెవులప్పగించి వింటున్నాం.

ఫోర్ జి మళ్లీ మొదలెట్టింది.. ‘చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, కొనుగోళ్లు, అమ్మకాలు, ఆర్థిక లావాదేవీలు, బ్యాంకింగ్ ఒకటేమిటి సర్వం మా ద్వారానే నడుస్తున్నాయి. సత్యనారాయణ వ్రతాలు, అభిషేకాలు చేయించే పురోహితులు కూడా స్మార్ట్ ఫోన్ చూస్తూ పూజలు చేయిస్తున్నారు, అమెరికాలో ఉన్న కూతురికి వంట ఎలా చేయాలో ఇండియా నుంచి తల్లి మొబైల్ లోనే నేర్పిస్తోంది. అంతెందుకు.. శుభోదయం నుంచి శుభరాత్రి వరకు మేమే.. మా మీద కవులు, కథకులు కవితలు, కథలు ఎన్నెన్నో అల్లారు.. అల్లుతున్నారు. ‘కరాగ్రే వసతే లక్ష్మీ, కర మధ్యే సరస్వతి.. అని కాకుండా కరాగ్రే వసతే చరవాణి..’ అంటున్నారు. చాలామంది దగ్గర స్మార్ట్ ఫోన్లం ఇద్దరు చొప్పున ఉంటున్నాం తెలుసా? మాటలే మాటలు, పాటలే పాటలు, ఫొటోలే ఫొటోలు.. మనిషైనా, చెట్టయినా, ఆకు అయినా, పువ్వయినా, పురుగైనా, జంతువైనా, నది, సముద్రం, గుళ్లు, గోపురాలు, కొండలు, రాళ్లురప్పలు, కారు, బస్సు, రైలు, విమానం, ఇల్లు, వాకిలి, చేతికర్ర, గొడుగు.. ఏదైనా సరే ఫొటోగా నా గేలరీకి చేరాల్సిందే. పదిమందికీ షేర్ కావలసిందే. సాహిత్యాభిమానులు గ్రూపులుగా ఏర్పడి సాహితీ వికాసం పొందుతున్నారు. అలాగే ఎవరి అభిరుచికి తగ్గట్టు వారు గ్రూపులుగా ఏర్పడి ఆయా కళల పెంపుకు తోడ్పడుతున్నారు. ఇది కాకుండా ఇప్పుడయితే సెల్ఫీల ట్రెండ్ నడుస్తోంది. ఏ ప్రదేశంలో నిలుచుంటే అక్కడ సెల్ఫీ దిగడానికి తెగ ముచ్చటపడుతున్నారు. స్నేహ బృందాలు కూడా సెల్ఫీలు తీసుకుంటున్నారు. వీడియోలు తీసుకుంటున్నారు. ఏవైనా నేరాలు జరిగినపుడు నేనే కీలక ఆధారం, సాక్ష్యం అవుతున్నాను’ అలసట వచ్చి ఆగింది.

‘నిజమే.. చాలా పనులు చేస్తున్నావు కానీ నవ్వించే మాటలేమైనా ఉంటే చెప్పు’ అంది మాజీ ల్యాండ్ లైన్. ‘దానికేం బోలెడు.. ఈ మనుషులు ఫోన్లలో తెగ అబద్ధాలు చెబుతారు. తాము ఒకచోట ఉంటే మరెక్కడో ఉన్నట్లు చెపుతారు. మాట్లాడటం ఇష్టం లేకపోతే డబ్బులయిపోయినయి అనో, చార్జింగ్ అయిపోవచ్చిందనో చెపుతారు. లేదంటే నెట్ వర్క్ సరిగా లేదని, వినపడటం లేదని, తర్వాత మాట్లాడదామని పెట్టేస్తారు. పెద్దవాళ్లు ఛాటింగ్లు చేస్తూ, వీడియోలు చూస్తూ, పిల్లల్ని మాత్రం ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారని కోప్పడుతుంటారు. అన్నట్లు ఇప్పుడు ఐ ఫోన్ మీదే అందరి కళ్లు. కానీ ధర అందుబాటులో లేకపోవడంతో నా ఆధిక్యత ఇంకా నిలబడిందనుకోవాలి.. అదిగో.. నవీన కదులుతోంది. నన్నందుకుంటోంది. మరి ఉంటా నేస్తాలు’ అంది. ‘ఓ.కే. ఓ.కే’ అన్నాం మేం ముగ్గురం.

ఫోర్ జి అన్ని గొప్పలు చెప్పింది. కానీ అది నాణేనికి ఒక వైపే. మరో వైపు నుంచి చూస్తే స్మార్ట్ ఫోన్ ఎన్ని నష్టాలు, ప్రమాదాలు తెచ్చి పెడుతోందో నాకు తెలియంది కాదు. ఎలాగంటే సర్వేశ్వరరావు, తన మిత్రులతో జరిపే సంభాషణల్లో అనేక విషయాలు నా చెవిన పడుతుంటాయి. మేం అంటే ల్యాండ్ లైన్ ఫోన్లు మాత్రమే ఉన్నప్పుడు సమాచారం తెలియజేయడం, సంభాషించడం మాత్రమే జరిగేది. ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక అవసరం, అనవసరం అనేది లేకుండా నిరంతరం మాటల ప్రవాహాలు.. అనుకుంటుంటే మాజీ ల్యాండ్ లైన్ ఫోన్ మళ్లీ నన్ను ‘హలో’ అంటూ పలకరించి, ‘ఫోర్ జి గొప్పలు విన్నావా.. కరోనా కాలంలో పిల్లల చదువులు చెడకుండా ఆన్లైన్లో చదువుకోవడానికి ఇంట్లో కంప్యూటర్ లేకపోయినా స్మార్ట్ ఫోన్ ఆదుకుందన్న మాట నిజమే అయినా ఆ చదువుతో పిల్లలకు సాంకేతిక జ్ఞానం అబ్బిందే కానీ అసలైన చదువు అబ్బింది మాత్రం అంతంత మాత్రమే. క్లాసు జరుగుతుంటే వీడియో ఆఫ్ చేసి, వేరే పనులు చేసుకోవడం, పరీక్ష అంటే అమ్మ, నాన్నల సాయంతో రాయడం చేస్తున్నారని ఫోన్లలో చెప్పడం మనం వినలేదా ఏమిటి? ఇప్పటి పిల్లలకు ఎంత సేపూ వీడియోలు చూస్తూ, వింటూ విషయాలు గ్రహించడమే కానీ చదవడం, తగ్గిపోయింది. వీడియో గేమ్స్ ఆడటం ఎక్కువైంది. స్మార్ట్ ఫోన్ చూసీ చూసీ పిల్లల కళ్లు దెబ్బతింటున్నాయి’ అంది.

‘అవును దేశంలో యువతకు స్మార్ట్ ఫోన్ ఒక వ్యసనమైపోయింది. కూర్చున్నా, నిలుచున్నా, నడుస్తున్నా దాని ధ్యాసే. ఆ మధ్య ఒక సర్వేలో యువత సగటున రోజుకు నూటయాభై సార్లు స్మార్ట్ ఫోన్ చెక్ చేస్తున్నారని, అలా చేయకుండా ఉంటే ఏదో మునిగిపోతుందని ఆదుర్దా పడుతున్నారని, ఈ రకంగా అదేమిటి.. ఆఁ యాంగ్జైటీ న్యూరోసిస్‌కు గురవుతున్నారని తేలిందట. విద్యార్థులు స్మార్ట్ ఫోన్ మాయలో పడి, తమ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. సిటీ బస్సుల్లో అయితే టికెట్ కొనకుండా ఫోన్లో అదేపనిగా మాట్లాడుతూ ఉండేవారితో కండక్టర్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అంతే కాదు, ఫుట్ బోర్డ్ మీద నిల్చుని ఫోన్ మాట్లాడే వారితో కండక్టర్‌కు రోజు పెద్ద తంటా. ఇదిలా ఉంటే సెల్ఫీల పిచ్చిలో కొండశిఖరాల్లో, నీటి ప్రవాహాల్లో, మేడలపై పిట్టగోడల వద్ద ఫొటోలు దిగుతూ కొందరు ప్రమాదాల బారిన పడడం, ప్రాణాలు కోల్పోవడం జరుగుతోంది. ఇంకొంత మంది దుర్మార్గులు స్మార్ట్ ఫోన్ సాయంతో అసభ్యరీతిలో అమ్మాయిల ఫొటోలు తీయడం, ఫొటో మార్ఫింగ్లు చేయడం, ఆ తర్వాత వాటిని అడ్డం పెట్టుకుని వారిని బ్లాక్‌మెయిల్ చేసి, వారి జీవితాలతో చెలగాటమాడడం.. రోజూ టీవీలో ఎన్నెన్ని వింటున్నాం, చూస్తున్నాం.. అలాగే ఆర్థిక మోసాలు కూడా చేస్తున్నారు’ అంది.

అందుకు నేను ‘అయినా జనాలు మొబైల్ మాయ నుంచి బయట పడలేకపోతున్నారు. పిల్లలు ఆన్లైన్ క్లాసుల్లో అతి తెలివిగా టీచర్లను బురిడీ కొట్టిస్తుంటే కొంతమంది తల్లిదండ్రులు అది చూసి ముసి ముసిగా నవ్వుకోవడమే కాదు, ‘అబ్బో మా సిసింద్రీ ఎంత స్మార్టో’ అని మురిసిపోతున్నారు. కలికాలం మరి’ అన్నాను. ‘ఆఁ ఎదురింటి రాజేశ్వరి గురించేగా నువ్వు చెప్పేది. మొన్న ఆమె వచ్చి ఈ మాటలు చెప్పినప్పుడు నేనూ విన్నాను’ అంది. అప్పటి దాకా మౌనంగా ఉన్న పాత మొబైల్. “పెద్దలే అలా ఉంటే పిల్లల గురించి చెప్పేదేముందీ. ఈ మనుషుల తీరే అంత. ఎంత తెలివి ఉందో, అంత తిక్క కూడా ఉంది’ అంది మాజీ ల్యాండ్ లైన్ ఫోన్.

నా చూపు ఇంట్లో వారి పై పడింది. అందరూ ఎవరి దారిన వారు మొబైల్స్ పట్టుకు కూర్చున్నారు. మళ్లీ నాలో ఆలోచన.. నిజానికి స్మార్ట్ ఫోన్లంటే నాకేం కోపం లేదు. ఎందుకంటే నా ప్రత్యేకత నాకుంది. నెట్ వర్క్ లేకపోయినా, వై ఫై లేకున్నా నేను పనిచేస్తాను. అయినా స్మార్ట్ ఫోన్ మా జాతే కదా, మా తర్వాత తరం. అన్ని రకాలుగా మా జాతి మానవాళికి సేవలందిస్తున్నందుకు నా కెంతో గర్వంగా ఉంది. కానీ మా జాతిని దుర్వినియోగం చేసుకోవడమే నాకు బాధ కలిగిస్తోంది. వినగలిగితే ఈ మనుషులకు ఇలా చెప్పాలని ఉంది.. ‘మాట్లాడుకోండి.. కానీ ఒకరి గురించి చెడుగా వద్దు. కుత్సితపు మాటలు వద్దు. కపట మంత్రాంగాల మాటలు వద్దు. అలాగే ప్రత్యర్థుల ఎప్పటెప్పటి ప్రసంగాల్లోని మాటల ముక్కలను కత్తిరించి, పెడార్థాలు వచ్చేలాగా జోడించి ప్రచారాలు చేయకండి. గంటలు గంటలు గాసిప్‌లతో కాలాన్ని వ్యర్థం చేసుకోకండి. ఛాటింగ్, మీటింగ్, గేమ్స్ ఏదైనా సరే పరిమితంగానే చేయండి. పెద్దలు మొబైల్ వాడకంలో పిల్లలకు ఆదర్శంగా మెలగాలి. ఏ సందేహం వచ్చినా తక్షణం మొబైల్‌ను అడిగేయకండి. ముందుగా మీ మెదడు ఉపయోగించండి. లేదంటే మీ మెదడు తుప్పు పడుతుంది. రోడ్డుమీద నడుస్తూ, డ్రైవింగ్ చేస్తూ మొబైల్‌లో మాట్లాడి ప్రమాదాలు కొనితెచ్చుకోకండి. వంట చేస్తూ మొబైల్లో మాట్లాడటం, దిండు కింద మొబైల్ పెట్టుకు పడుకోవడం చేయకండి. ఒక్కోసారి ఫోన్ పేలిపోయే ప్రమాదం పొంచి ఉంటుంది. మొబైల్ అతిగా వాడితే రేడియేషన్ ప్రభావంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని గుర్తుంచుకోండి. ఫొటోల వెర్రి తగ్గించుకోండి. పాప్ కార్న్ తిన్నా ఫొటో, పళ్లు తోముకుంటున్నా ఫొటో.. దండగే కదా.. అర్థవంతమైన ఫొటోలు ఓ.కే. ముఖ్యంగా మొబైల్‌లో ఇతరులను మోసగించడం, దోచుకోవడం, బెదరించడం వద్దే వద్దు. స్మార్ట్ ఫోన్‌ను సద్వినియోగం చేసుకోండి. మానవతకు మచ్చ తెచ్చే పనులు చేసి, అందులో మా జాతిని భాగస్థులను చేయకండి.. సవ్యంగా వాడుకుంటే మావాళ్లు, మీకు ప్రాణ మిత్రులు, లేదంటే ప్రాణాంతకులు అవుతారు. ఇంకా ఏదో చెబుదామనుకున్నా. సర్వేశ్వరరావు నన్ను సమీపించడంతో సంతోషంతో కర్తవ్య నిర్వహణకు సిద్ధమయిపోయా.

Exit mobile version