[ఇటీవల అన్నవరం, పాదగయ, అంతర్వేది, క్షీరారామ క్షేత్రాలు సందర్శించి, ఆ అనుభూతులను పాఠకులతో పంచుకుంటున్నారు పాణ్యం దత్తశర్మ.]
అక్కడి నుంచి అమలాపురం మీదుగా సఖినేటిపల్లి చేరుకున్నాం. అక్కడ మా నేస్తం యల్లమంద గారి తోడల్లుడు వాళ్లున్నారు. వారింట్లోనే మా మకాం, ఆతిథ్యం. “నీవంటే సరే, నేను, యోగానంద, ఇంతమందిమి వారింటికి వెళ్లి ఇబ్బంది కలిగించడం సబబా?” అని అంటే, “సబబే!” అన్నాడు మిత్రుడు. “మీ గురించి వాళ్లకు చెప్పాను. మీ వంటివారు వస్తున్నందుకు వారు ఎంతో గొప్పగా ఫీలవుతున్నారు. కాని వాళ్ళు క్రిస్టియన్స్ (యల్లమంద వాళ్లు ప్యూర్ హిందూస్) పరవాలేదా?”
“నాకు కులమత వివక్ష లేదని నీవెరుగుదువు కదా, సఖా! మరల ఈ ప్రశ్న ఏల?” అన్నాను.
“సారీ! నాకు తెలుసు నీ సంగతి” అని నవ్వాడు మావాడు! నవ్వితే ఇంకా బాగుంటాడు. ఏడు పదుల అందగాడు.
“నవ్వెరా మావాడు! నవ్వెరా నిండుగా! అందుకే మా యింట రంజను పండగా!” అని పాడాను, ‘నిప్పులాంటి మనిషి’ సినిమాలో పాట!
“ఇంకేం? సెక్యులరిజమ్ పూర్తిగా సమకూరినట్లే!” అన్నాడు మా యోగా! ఏవీ తెలియనట్లు మౌనం వహిస్తాడు గాని, ఒక్క మాట చెప్పినా, గొప్పగా చెబుతాడు వెధవ! అదే వాడితో అంటే “ఏదో సావాసదోషం లే” అన్నాడు సీరియస్‌గా.
అప్పుడు మా యల్లమంద మోహన రాగంలో ఈ శ్లోకం చదివాడు కమ్మగా.
అయం నిజః పరో వేతి గణనా లఘుచేతసామ
ఉదారచరితానాం తు వసుధైక కుటుంబకమ్
(ఇతడు తనవాడు, అతడు పరాయివాడనే లెక్క కేవలం అల్పబుద్ధులకే ఉంటుంది. విశాల దృక్పథం కలవారికి ఈ ప్రపంచమంతా తమ కుటుంబమే).
యోగా సంతోషం పట్టలేక చప్పట్లు కొట్టాడు. వంశీకి ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. “మా డాడీ స్కాలర్ అని తెలుసుగాని, అంకుల్, ఇలాంటివి మాకు చెప్పడు” అన్నాడు.
“మీ బంధం వేరు, మా బంధం వేరు, నాన్నా! మాకు సాహిత్యమే లోకం” అన్నాను. ‘కవితాయద్యస్తి రాజ్యాన కిం?’ అన్నాడు కదా భోజమహారాజు!”
“అంటే?” అన్నాడు యోగానందులవారు.
“కవిత్వముంటే చాలు, రాజ్యమింకెందుకు?” అని.
“భోజరాజు సమున్నత విగ్రహన్ని మనం ఎక్కడో చూశామే”
“మన మధ్యప్రదేశ్ టూరులో, భోపాల్‌లో!” అన్నాను.
***
మేం సఖినేటిపల్లికి చేరేసరికి సాయంత్రం అయింది. ఊరంతా కొబ్బరి తోటల్లోనే ఉంది. పక్కనే గోదావరి. ఇటు పక్క సముద్రం. ప్రకృతి సౌందర్యమంతా కుప్ప చేసినట్లుందా ప్రాంతం.
యల్లమంద మరదలు, ఆమె. పిల్లలు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు. ఇల్లు చాలా ఆర్టిస్టిక్‍గా కట్టుకున్నారు. డూప్లెక్స్. నాకు, యోగాకు క్రింద రూమ్ ఇచ్చారు. యల్లమందకు, అతని కొడుకుపైన. ‘గోదారోళ్ల ఆతిథ్యం’ అంటే ఏమిటో మాకు ఆ రెండురోజులు తెలిసివచ్చింది. మెత్తటి చపాతీలు, పనీర్ బటర్ మసాలా, మేతీ ఆలూ, రైస్, కొచ్చరిపచ్చడి. పెరుగు. తొమ్మిదింటికి భోజనం చేసి హయిగా విశ్రాంతి తీసుకున్నాం.
రూమ్‍లో యోగా అడిగాడు, “కోనసీమ అంటే ఇదేనా శర్మా?” అని. “కరెక్ట్‌గా చెప్పలేను. కాని దీన్ని డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటారురా. ఇక్కడ గోదావరి పాయ వశిష్ట గౌతమిని దాటడానికి మూడు మార్గాలున్నాయి. ఒకటి సఖినేటిపల్లి – నర్సాపురం, రెండు కోటిపల్లి – ముక్తేశ్వరం, మూడు బోడసకుర్రు – పాశర్లపూడి. ‘పంటు’ అని పెద్ద బల్లకట్టు ఉంటుంది. దానిమీద లారీలు కూడా ఎక్కిస్తారు. కార్లు, బైకులు సరేసరి. రేపు మనం పంటు మీదనే వెళ్ళాలి నర్సాపురానికి. అక్కడే హైదరాబాదుకు రైలెక్కుతాం!” అన్నాను.
వాడు ఆశ్చర్యపోయాడు.
“ఇది ఒక మండలకేంద్రం. ఈ మండలం అని లక్ష్మీనరసింహ స్వామి వారి అంతర్వేది క్షేత్రం ఉందనుకుంటున్నాను. ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం వచ్చాను, మీ చెల్లితో.”
“ఇంకా చెప్పు.”
“దీన్ని ‘సఖినేటిపల్లి లంక’ అని అంటారు. శ్రీరామచంద్రుడు తమ వనవాసంలో ఒక రోజు ఇక్కడ బస చేస్తూ, సీతమ్మవారితో ‘సఖీ, నేటి పల్లి ఇదే!’ అన్నారని ఐతిహ్యం!”
యోగా నవ్వాడు. “రాముడికి తెలుగు రాదు కదా!” అన్నాడు.
“నీవన్న దానికి ప్రముఖ పాత్రికేయుడు, రాజకీయ సామాజిక విశ్లేషకుడు శ్రీ కస్తూరి రాకాసుధాకర్ గారు వివరణ ఇచ్చారు.
ఒక సాహితీ సమావేశంలో, ‘భారతీయులు ప్రాంతాలకు అతీతంగా సీతారాములను తమ స్వంతం చేసుకున్నారు. ఇక్కడ సీతమ్మ చీర ఆరవేసిందనో, అక్కడ లక్ష్మణుడు చలిమంట వేశాడనో.. అలా. రామాయణం భారతీయుల ఆత్మ’ – అన్నారాయన.”
“ఎంత గొప్పగా చెప్పాడురా!”
***
ఉదయం 8 గంటలకు వేడి వేడి ఇడ్లీ, కొబ్బరి, అల్లం చట్నీలతో మా బ్రేక్‌ఫాస్ట్ సుసంపన్నమైంది. యల్లమంద మరదలి పేరు సరోజనమ్మ. యల్లమంద అర్ధాంగి భారతమ్మ. అతిథి సత్కారంలో అక్క కంటే రెండాకులు ఎక్కువే చదివింది చెల్లి! చక్కగా నవ్వుతూ పలకరిస్తుంది. అరమరికలు లేవు! ఆమె పిల్లలిద్దరూ వంశీ ఈడు వారే, ఇంచుమించు. ఒకబ్బాయి రాజమండ్రిలో డాక్టరట. ఇంకొకబ్బాయి హైదరాబాదులో సాఫ్ట్‌వేర్. తోడల్లుడు రమేష్ లేడు. ఆయన పభుత్వ ఉపాధ్యాయుడు. ఏదో ఓరియంటేషన్ పోగ్రాంకు వెళ్లాల్సి వచ్చిందట. అయినా మాటిమాటికి భార్యకు పోన్ చేసి, మాకు మర్యాదలు సరిగా జరుగుతున్నాయా లేదా అని కనుక్కుంటున్నాడు.
వాళ్లింటి నుంచి అంతర్వేది క్షేత్రం పన్నెండు కిలోమీటర్లుంటుంది. దారిలో ప్రకృతి సౌందర్యం చూడవలసిందే గాని చెప్పనలవి కాదు. రోడ్డు కిరువైపుల, ఆకాశాన్నంటుతున్నాయా అనిపించే టేకు చెట్లు, కొబ్బరి చెట్లు, కనువిందు గావించాయి. పచ్చదనం పసరు కక్కి పరిమళిస్తూ ఉంది. మాకు ఎడమవైపున లక్ష్మీనరసింహుని దేవాలయ శిఖరాలు కనిపిస్తున్నాయి. కుడివైపున చిన్న బోర్డు.
‘అన్నా చెల్లెలి గట్టుకు దారి; బోటింగ్ పాయింట్’ అని బాణం గుర్తుతో సూచిస్తూంది. అది మట్టి రోడ్డు. రెండు ఫర్లాంగులు ప్రయాణించాము. మా వంశీకృష్ణుడు గోదావరి నది ఒడ్డున కారును ఆపాడు. అక్కడ నాలుగైదు స్టీమ్ బోట్లు లంగరు వేసి ఉన్నాయి. మా నలుగురికి పన్నెండు వందలడిగాడు, ఒక సరంగు. అతని పేరు రాజుబాబు అట. నది సముద్రంలో కలిసి చోటు వరకు తీసుకు వెళ్లి, మళ్లీ బోటింగ్ పాయింట్‌కు తెస్తాడట. 45 ని॥ పడుతుందట. వెయ్యి రూపాయలకు బేరం కుదిరింది. తలా రూ. 250/- ఒడ్డు నుంచి పడవలోని ఎక్కడానికి ఒక వాలు బల్ల వేశారు. అది ఒక అడుగు వెడల్పు మాత్రమే ఉంది. యోగాగాడు బక్క వెధవ, అవలీలగా గబగబా ఎక్కి వెళ్ళాడు. వంశీ సరే కుర్రాడు. మా యల్లమంద కూడా పెద్దగా ఇబ్బంది పడలేదు. నేను ఎక్కుతూ చేసే విన్యాసాలు చూసి, ఈయన నీళ్లల్లో పడేటట్లున్నాడని అనుకోన్నాడో ఏమో, ఆ సరంగు పక్కన నిలబడి, నాకు చేయి అందించి, ఎక్కించాడు. వాడికి నిండా ఇరవైయేళ్ళు కూడా ఉండవు. చువ్వలా ఉన్నాడు, చురుకుగా ఉన్నాడు. షార్ట్, టిషర్టు వేసుకున్నాడు. గోదావరి తల్లికి ముద్దుల కొడుకు వాడు!
మా పడవ బయలుదేరింది, నీళ్లను చీలుస్తూ. వెనక ఒక రెయిలింగ్, చుట్టూ ఉంది. దాన్ని ఆనుకొని ఒక స్టీలు రాడ్లతో చేసిన బెంచీ. అనంత జలరాశి. గోదావరి కనుచూపు మేర పరుచుకొని ఉంది. నిండుగా పారుతూంది. దూరంగా పచ్చని కొండలు.
రాజుబాబు చెప్పాడు, “సార్, ‘అన్నా చెల్లెలి గట్టు’ అని ఎందుకంటారంటే, అన్న సముద్రం, చెల్లెలు గోదారమ్మ. ఇద్దరూ కలిసే చోటని..”
మా యోగానందులవారికి ఒక అనుమానం వచ్చింది. అనుమానం వస్తే అది తీరేంత వరకు వాడు ఊరుకోడు. ‘సంశయాత్మా వినశ్యతి’ అన్నారు కదా గీతాచార్యులు.
“శర్మా, మనం గుజరాత్ టూర్ వెళ్ళాం కద! అక్కడ ‘ద్వారక’ వద్ద నర్మదా నది సముద్రంలో కలిసే చోటును అతి దగ్గరగా చూశాము. ఇప్పుడు నీవో పద్యం పాడి, దానర్థం చెప్పావు. దాంట్లో సముద్రుడు భర్తగా, నదులు భార్యలుగా వర్ణించారు. మరి..!”
“ఆ పద్యం ఒకసారి పాడు మిత్రమా” అనడిగాడు మా యల్లమంద.
“పాడండి అంకుల్” అన్నాడు వంశీ. వాడు గోదావరి అందాలను ఫోటోలు వీడియోలు తీస్తున్నాడు. ఆ పద్యం నాకు గుర్తే. తెనాలి వారిది.
శా॥
గంగా సంగమమిచ్చగించునే? మదిన్ గావేరిఁ దేవేరిగా
నంగీకారమొనర్చునే? యమునతో నానందముం బొందునే?
రంగత్తుంగ తరంగ హస్తములతో రత్నాకరేంద్రుండు, నీ
యంగంబంటి సుఖించునేని, గుణభద్రా! తుంగభద్రా నదీ!
మావాళ్ల చప్పట్లు. కల్యాణిలో పాడానా పద్యాన్ని.
“చక్కగా పాడారండి బాబు, ఆయ్!” అని ప్రశంసించాడా కుర్ర బోట్ మ్యాన్.
నేను యోగాకు చెప్పాను – “తెనాలి రామకృష్ణుని భావన అది. ‘నిరంకుశాః కవయః’ అని, కవులు ఎలాగైనా ఊహిస్తారు. దానికి లాజిక్ ఉండదు. ఇక్కడి వారి భావన ఇది.”
పావుగంట ప్రయాణించాము. దూరంగా నురగలు కక్కుతూ, ఘూర్జిల్లుతున్న సముద్రంగా గోచరిస్తూ ఉంది. దాదాపు అర కిలోమీటరు వెడల్పున్న గోదావరి నదీ జలాలు సముద్రునిలో ఒక్కుమ్మడిగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నాయి. అక్కడ నీటి ఒత్తిడి ఎక్కువగా ఉంది. బోటు అటూ ఇటూ ఊగసాగింది.
రాజుబాబు చెప్పాడు – “చూడండి సార్. నది నీరు కొంచెం నల్లగా, సముద్రం నీరు కొంచెం ఎర్రగా కనబడుతుంది” అని. అవును. ఆ అపురూప దృశ్యాన్ని చూచి మైమరచాము. అందరికీ దప్పిక అనిపించింది. కానీ వాటర్ బాటిల్ తెచ్చుకోలేదు! వంశీ అన్నాడు – “అంకుల్, ‘వాటర్ వాటర్ ఎవ్వెరీ వేర్, నాట్ ఎ డ్రాప్ టు డ్రింక్’ అన్న కాలెరిజ్ పద్యం గుర్తొస్తుంది నాకు!”
“జయోస్తు కుమారా!” అన్నా. “పద్యం పేరు చెప్పు చిరంజీవీ?”
“ది రైమ్ ఆఫ్ ఏన్సియంట్ మారినర్, కదాంకుల్” అన్నాడు చిట్టి తండ్రి. వాడు ఇంగ్లీష్ సాహిత్యంలో పి.జి. చేశాడు. నర్సీపట్నం డాన్‌బాస్కో పబ్లిక్ స్కూల్లో వైస్ ప్రిన్సిపాల్! వినయశీలి మా వంశీ! విద్యా దదాతి వినయం! మా యల్లమంద సౌజన్యానికి, సంస్కారానికి వారసుడు! మనం వారసత్వంగా ఇవ్వాల్సింది ఇవే గాని, ఆస్తులు కాదు!
బోటు వెనక్కి తిప్పాడు. చల్లని గాలి మా మేనులను స్పృశిస్తూ, పరవశింప చేస్తూంది. ఒడ్డు చేరుకున్నాం. దిగడం ఈజీ అనిపించింది నాకు. భూమాతే లాగేస్తుంది మరి. రాజుబాబుకో రెండు వందలు అదనంగా ఇచ్చాము. బిడియపడుతూ తీసుకున్నాడు. వెరీ గుడ్ బాయ్ వాడు.
అక్కడనించి లక్ష్మీనరసింహస్వామి వారి గుడికి చేరుకున్నాం. చాలా పెద్ద దేవస్థానం. స్వామి వారు ఏదో కొండ మీద కాకుండా క్రిందనే వెలిశారు! అదీ విశేషం! చుట్టూ సమున్నతమైన ప్రాకారం. కారు పార్కింగ్‌లో పెట్టి, ఆలయంలో ప్రవేశించాము. భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. అక్కడున్న ఇ.ఓ. ఆఫీసుకు వెళ్లి నా శిష్యుడు, కడప జిల్లా ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమీషనర్, శంకర్ బాలాజీ పేరు చెప్పి, దర్శనం చేయించమని అడిగాను. ఒకతన్ని మాతో పంపారు. విఐపి క్యూలో దర్శనం కాంప్లెక్స్‌లో తీసుకొని వెళ్తాడు. పావుగంటలో మహామహిమాన్వితుడైన అంతర్వేది నారసింహుని దివ్యమంగళరూపాన్ని దర్శించుకున్నాము. అర్చకస్వామి మా గోత్రనామాలను అడిగాడు. అర్చన చేయలేదు. తీర్థం, ప్రసాదం ఇచ్చాడు. తులసి ఆకులు ఇచ్చాడు.
ప్రధాన దేవాలయం మధ్యలో ఉంది. చుట్టూ సుదీర్ఘ మంటపాలున్నాయి. కళాత్మకమైన స్తంభాలతో అలరారుతున్నాయి. మంటపాల అంచుల్లో, విఘ్నేశ్వరుడు, వెంకటేశ్వరుడు మొదలగు దేవతల ఉపాలయాలున్నాయి. ఒక వేదికపై స్వామివారి తిరుమంజన సేవ జరుగుతూ ఉంది. దాన్ని తిలకించాము. రాజ్యలక్ష్మీ తాయారును దర్శించుకొని, ఒక వితర్దికపై శాంతిగా కూర్చున్నాం.
‘నరసింహస్వామిపై నీవు రాసిన కావ్యం లోని కొన్ని పద్యాలు ఇక్కడ చదువుతానన్నావు కదా!” అని గుర్తు చేశాడు యోగా. కొన్నిపద్యాలు చదివాను.
“మిత్రమా! ‘నరసింహోద్భవం’ సమయంలో రాశావే. ఆ సీస పద్యం పాడు” అన్నాడు యల్లమంద. అతడు ఛందస్సుల్లో నిష్ణాతుడు. నా కావ్యంలోని ప్రతి పద్యమూ అతనికి పరిచితమే. ఆ కావ్యం రాయడానికి ముఖ్య ప్రేరణ అతడే.
సీ.:
పుటము వెట్టిన పైడి బోలి హారిద్రకాం
తుల వెదజల్లుచు జ్వలితు డగుచు
క్రూరదృష్టి దనరు క్రుద్ధనేత్ర యుగంబు
జడలు జూలును శిరము గూడి కదల
పెను కోరలవి గ్రాల పెను కత్తి వాదర
బోలు నాలుక పదును తళుకులీన
బొమముడి నుప్పొంగు ముఖరీతి దనరగ
పైకెనిక్కిన చెవులు శంఖములన
తే.గీ.:
కొండగుహను బోలి చండతర రీతిని
తెరువబడిన నోరు వెఱుపుగొలుప
బలసిన కంఠంబు, వక్షంబు దొడలును
సన్ననైన నడుము చలన మొంద
తే.గీ.:
చంద్రధవళ రోమ సంయుతమై, బాహు
శతములు, నఖములు భీతిగొల్ప
తేరి చూడరాని నరసింహ రూపము
హేమ కశిపు మ్రోల నిట్టెనిలిచె
“అద్భుతం అంకుల్!” అన్నాడు వంశీ! తండ్రి వల్ల, వాడికి తెలుగు సాహిత్యంలో కూడా ప్రవేశం ఉంది.
“కానీ మరి!” అన్నాడు యోగా.
“ఏమిటా కానీయడం?” అన్నా.
“ఈ క్షేత్రం గురించి చెప్పాలి కదా!” అన్నాడు వాడు నవ్వుతూ.
నేను చెప్పసాగాను.
“అంతర్వేది నవ నరసింహ క్షేత్రం. కృతయుగంలో వశిష్ఠ మహర్షి, రాజమండ్రి గౌతమీ నది నుండి ఒక పాయను తీసుకువచ్చి, సముద్రములో కలిపి తపస్సు చేస్తుండగా, రక్తవిలోచనుడు అనే రాక్షసుడు వశిష్ఠుని సంతానాన్ని నాశనం చేయసాగాడు. ఆ బాధ భరించలేక ఆ ఋషి నరసింహుని ప్రార్థించాడు. అప్పుడు స్వామి అవతరించి రాక్షససంహారం చేశాడని ఐతిహ్యం. వశిష్ఠుడు నిత్యం అర్చన చేసుకోనే విధంగా తూర్పు ముఖంగా ప్రార్థించగా, స్వామివారు పద్మాసనస్థుడై, వామాంకస్థిత లక్ష్మీదేవి, అభయహస్తము, శంఖ చక్రములను ధరించి, వశిష్ఠునికి అభిముఖంగా శిలా రూపములో, స్వయంభువుగా అవతరించినాడు.
కాబట్టి అంతర్వేది నరసింహ ప్రభువు పశ్చిమముఖుడుగా ఉన్నాడు. త్రేతాయుగంలో రావణ వధానంతరము, రామలక్ష్మణులు, ఆంజనేయస్వామి వారు వచ్చి స్వామిని దర్శించుకొన్నారని బ్రహ్మపురాణంలో చెప్పబడింది. ద్వాపరయుగంలో, అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ స్వామిని దర్శించి ధన్యుడైనాడని కూడా బ్రహ్మపురాణ ప్రోక్తం. కలియుగంలో మందపాటి కేశవదాసు అనే గొల్లవాడు, పశువులను మేపుకుంటూ, స్వామి వారిని చూచినాడు. తర్వాత రెడ్డిరాజులు చెక్కతో స్వామికి ఆలయం నిర్మించినారు; అని నానుడి. అది శిధిలమైతే, శాతవాహన శకం 1745లో (క్రి.శ 1823) కొపనాతి కృష్ణమ్మ అనే అగ్నికుల క్షత్రియ పాలకుడు, రాతిలో ఆలయ మంటపములు ప్రాకారములు నిర్మించినాడు అని తెలిపే శిలాశాసనం ఉంది. ఈ గుడిలో, గరుత్మాన్, హనుమాన్‌ల పంచలోహ విగ్రహాలు ముఖమంటపంలో ఉన్నాయి.
‘అంతర్వేది’ అంటే లోపల ఉన్న తత్త్వాన్ని తెలిసిన వాడు అని అర్థం. నవదళోత్పల మాలిక శ్రీయుతుడైన శ్రీ కొప్పనాతి ఆదినారాయణ, తన కుమారులు కొప్పనాతి కృష్ణమ్మను, స్వామివారికి ఆలయం, మంటపాదులు కట్టించమని ఆదేశించగా.. ఆయన కట్టించినట్లు. ఆలయ దక్షిణ కుడ్యము పైగల శిలా శాసనం చెబుతూంది. ‘స్వభాను సం’ భాను (ఆది) వారం, చైత్ర కృష్ణ దశమి తిథి నాడు నిర్మాణం పూర్తయిందని శిలాశాసనం తెలుపుతూ ఉంది. కొప్పనాతి కృష్ణమ్మపాలుడు పల్లవ వంశానికి చెందిన రాజు. ఆయన లక్ష్మీనృసింహునికి పరమభక్తుడు.”
అందరి మనస్సులు భక్తిభావంతో తొణికిసలాడుతూ ఉండగా, గుడి వెలుపలికి వచ్చాము. మధ్యలో ఒక ఊర్లో ‘టీ టైమ్’ అనే చోట స్పెషల్ టీలు చేయించి తాగాము. 12 గంటలకు సఖినేటిపల్లి చేరుకొన్నాము. సరోజనమ్మ మాకోసం బహు పసందైన విందుచేసింది. గోంగూర, కొబ్బరి కలిపి చేసిన పచ్చడి హైలైట్. పూర్ణం బూరెలు, పెసర పుణుగులు, చిక్కుడుకాయ కూర, అరటి కాయ ముద్దకూర, ప్లమ్ కేక్, అబ్బో! అన్నీ తినడానికి పొట్టలో స్థలం చాలలేదు. అన్నీ రుచి చూసి ‘భుక్తాయాసేన భూయతే!’ అనుకుంటూ పడుకున్నాం.
సాయంత్రం నాలుగు గంటలకు కొబ్బరిబోండాలు తెప్పించారు. ఆ నీరు అమృతమే. సఖినేటిపల్లి రేవులో పంటులో మా కారు ఎక్కించాడు వంశీ. గోదావరిని దాటి, నర్సాపురం రేవు చేరాము. అక్కడి నుంచి పాలకొల్లు వెళ్లి క్షీరారామ లింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నాము. అది పంచారామాల్లో ఒకటి. మిగతావి 1) సోమారామం, భీమవరం 2) ద్రాక్షారామం 3) కుమారారామం, సామర్లకోట 4) అమరారామం, అమరావతి,
దేవాలయ గాలిగోపురం సమున్నతం. 120 అడుగుల ఎత్తు. 9 అంతస్తులతో అలరారుతూంటుంది. చాళుక్య భీముని (9వ శతాబ్దం) కాలంలో ఆలయనిర్మాణం జరిగింది. శివలింగం పాలరంగులో మెరుస్తూంది. నల్లరాతి శిలతో నిర్మించిన 72 స్తంభాల మండపం ఒక శిల్పనిర్మాణాద్భుతం. గోస్తనీ నది పాలకొల్లు వద్ద ప్రవహించి నరసాపురం వద్ద గోదావరిలో కలుస్తుంది. గర్భాలయానికి నాలుగు కిటికీలు. అన్నింటి నుండి శివలింగం స్పష్టంగా కనపడుతుంది. ఆలయప్రాకారం 10వ శతాబ్దంలో శ్రీ వేలుపతిరాజుచే నిర్మించబడింది. 14వ శతాబ్దంలో శ్రీ అల్లాడు రెడ్డిగారి పర్యవేక్షణలో గోపురాన్ని నిర్మించారు. మాకు ట్రయిన్ టైమ్ అవుతూ ఉండటం వల్ల పాలకొల్లులో ఎక్కువ సేపు గడపలేదు.
సా. 6.50కి నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్. మమ్మల్ని స్టేషన్ దగ్గర దింపి వెళ్లిపొమ్మని ఎంత చెప్పినా తండ్రీ కొడుకులు వినరే! ట్రైయిన్‍లో తినడానికి (డిన్నర్) డజనున్నర (చిన్నవి) చిట్టి గారెలు, అల్లం పచ్చడి పార్శెల్ చేయించారు. మమ్మల్ని మా బెర్తుల్లో కూర్చోబెట్టి గాని వెళ్లలేదు. వాళ్ళు వెళ్లిపోతుంటే మా కళ్ళు చెమర్చాయి. మర్నాడు ఉదయం నాలుగు గంటలకి సికింద్రాబాద్‌లో దిగాం. బయట ఆల్ఫాలో టీ తాగాం. యోగా ఎం.జి.బి.ఎస్.కి వెళ్లి ‘యాద్గిర్’ వెళ్లిపోయాడు. నేను ఊబర్ ఆటోలో మా వనస్థలిపురం చేరాను.
గొప్ప అనుభూతులతో మా ఈ యాత్ర ముగిసింది.
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.