Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అన్నమయ్య ఆహార వర్ణనలు

[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘అన్నమయ్య ఆహార వర్ణనలు’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

“సిన్న శెంబుతో నీళ్ళు సీకయ ఉదకంబు/అల్లంబు బెల్లంబు అరటిపండు
తేనెతో మాపిన తియ్య మామిడిపండు/బంగారు పిడికెళ్ళు పనసతొన్లు
సొగసిన ఔగులు సొజ్జలు కజ్జలు/చక్కెర మండగ లుక్కెరాళ్ళు
అర్చిలు సిమ్మిలులు దోసలు కల్లొసులు/పాలకలేలకుల్లు.. పాలపొంగు
పేణీ బురడాలు గారిలు బూరె చుట్లు/అప్పాలు నా దప్పాలు పప్పు పాయాసాలు
అమ్మ పంపెను అన్ని ఆరగింపన్న బుజ్జీ/అన్నయ వరదాల్లుండు బుచ్చిన్న కేశాలు

అన్నమయ్య వ్రాసిన ‘బుజ్జి చెన్నకేశవ శతకం’ లోంచి ఎవరో పామరుడు రాసుకున్న ఈ పద్యాన్ని మైనంపాటి సుబ్రహ్మణ్యం గారు సేకరించి, అందులో భాషని సంస్కరించి, జనవరి 1984 సప్తగిరి మాసపత్రికలో ప్రచురించారు.

స్నానమాడేందుకు పిల్లలు మారాం చేస్తే, తల్లి బోళ్లెడన్ని అప్పచ్చులు వండిపెడతానని లాలించి నీళ్లు పోస్తుంది పిల్లల స్నానాన్ని ‘లాలపోయటం’ అంటారందుకే! లాలించి పోసేది లాల!

అల్లంబు బెల్ల౦బు=తలంటితే పిల్లలకు జలుబు రాకుండా అల్లంముద్దని తాటిబెల్లం పాకంపట్టి ఉండలు చేసి తినిపిస్తారు.

అరటిపండు=చక్కెరకేళీ పిల్లలు ఎక్కువ ఇష్టపడే పండు

తేనెతో మాపిన తియ్య మామిడిపండు=మామిడిపండు ముక్కలు మునిగేదాకా తేనెపోసి ఒక రాత్రంతా నిలవ ఉంచినవి

బంగారు పిడికెళ్ళు=చిన్నపిల్లల పిడికిట్లో ఇమిడేంత చిన్న భక్ష్యం. పంచదార పాకం పట్టి కొద్దిగా నిమ్మరసం కలిపి చేసిన బిళ్ళలు. దీన్ని పిల్లలు చేత్తో పుచ్చుకుని చీకుతూ తింటానికి వీలైనది;

పనసతొనలు= వీటినే పనసతొలలు అని కూడా అంటారు. గోదుమపిండిని పూరీలా వత్తి చాకుతో సెంటీమీటరు వెడల్పున బద్దలుగా కోసి, చాపలా చుట్టి అటు చివరా, ఇటు చివరా దగ్గరగా వత్తి, నూనెలో వేయించి బెల్లంపాకం పడ్తారు. ఇవి చూపులకు పనస తొనల ఆకారంలో ఉంటాయి.

సొగసైన ఔగులు= ఆంధ్ర శబ్దరత్నాకరం ఔగులు, సుకియలు రెండూ ఒకటేనంది. సుకియలు అంటే నిప్పులమీద కాల్చిన తీపిరొట్టెలు. తీపి బట్టర్‘నాన్’ కావచ్చు. బూరెలు వత్తి నూనెలో కాకుండా నిప్పులమీద గ్రిల్ చేస్తే అది ‘ఔగు’ కావచ్చు.

సొజ్జలు= సొజ్జ అంటే వేయించిన బియ్యాన్ని దంచిన పిండి. ఈ పిండితో చేసిన బూరెల్ని సొజ్జ బూరెలని, అప్పచ్చిని సొజ్జప్పాలనీ అంటారు. సొజ్జలు ఈ రెండిట్లో ఏదైనా కావచ్చు.

కజ్జలు=కజ్జికాయలు, చక్కెరమండెగలు= పంచదార పాకంపట్టిన తప్పాలచెక్కలు

ఉక్కెరాళ్ళు = ఉక్కెర అనేది తెలుగువారి హల్వా. అన్నవరం సత్యనారాయణస్వామివారి ప్రసాదంలా ఉంటుంది.

అర్చిలు = అరిసెలు, సిమ్మిలులు= చిమ్మిలి, దోసలు = దోసెలు

కల్లొసులు=పిండిని పులియబెట్టి చేసే పులిబొంగరాలు కావచ్చు.

పాలకలు=పాలకాయలనే తీపిభక్ష్యం. విసిరిన బియ్యంపిండి, వెన్న, నువ్వుపప్పు, ఉప్పు, మిరియాలపొడి కలిపి వేలంత పొడవుగా చేసిన తీపి వంటకం.

ఏలకల్లు= ఏలకులపొడి వేసిన బెల్లపు పానకం

పాలపొంగు= పొంగుతున్న పాలలో బియ్యం వేసి వండిన పరమాన్నం

పేణీలు = దారపు పోగులంత సన్నగా వత్తిన నూడుల్స్

బురడాలు= పురోడాశం అనేది ఒక రకం రొట్టె. కావచ్చు. బార్లీ లేదా బియ్యప్పిండిని గుండ్రంగా చేత్తో వత్తి నిప్పులమీద గ్రిల్లింగ్ లేదా బార్బెకూ పద్ధతిలో కాలుస్తారు.

గారిలు= గారెలు, బూరె=బూరెలు

చుట్లు= తమిళంలో మురుక్కం అంటే తిప్పటం. కాగేనూనెలో జంతికల్ని గుండ్రంగా చుట్టినట్టు తిప్పుతూ వత్తుతారు కాబట్టి తమిళంలో మురుకులు, తెలుగులో చుట్లు అంటారు. మురుకులనే అలవాటు తెలుగు వారికీ ఉంది; మురుక్కులు అని కూడా పిలుస్తారు. మురుక్కులంటే ముక్కలు కాదు

అప్పాలు= తీపి అప్పచ్చులు. సజ్జప్పాలు వీటికి ఉదాహరణ.

నాదప్పాలు= దప్పము రకరకాల కూరగాయ ముక్కలు వేసి, చిక్కగా దప్పళం లాగా కాచి, అందులో అన్నం కూడా కలిపి వండిన అన్నం. తమిళులు కదంబం అంటారు.

పప్పు= కందిపప్పు, ఎర్రకందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, శనగపప్పు ఈ ఐదు రకాల పప్పుల్ని విడివిడిగా దోరగా వేయించి అన్నింటినీ కలిపి ముద్దగా వండిన పప్పు.

పాయసాలు= పాలలోబెల్లం, బియ్యం ఏలకుల వంటి సుగంధద్రవ్యాలూ కలిపి ఉడికించిన అన్నం.

ఇలా రకరకాలభక్ష్యాల్ని ఆ తల్లి పంపించింది. అవన్నీ తినాలంటే సీకాయతో జిడ్డుపోయేలా లాలపోసుకోవాలని భక్తుడు భగవంతుని కోరుతున్నాడీ పద్యంలో!

ఇందిర వడ్డన

“ఇందిర వడ్డించ నింపుగను/చిందక యిట్లే భుజించవో స్వామి॥
అక్కాళపాశాలు అప్పాలు వడలు/పెక్కైన సయిదంపు పేణులును
సక్కెర రాసులు సద్యోఘృతములు/కిక్కిరియ నారగించవో స్వామి॥
మీరిన కెళంగు మిరియపు దాళింపు/గూరలు కమ్మనికూరలును
సారంపుబచ్చళ్ళు చవులుగ నిట్టే/కూరిమితో జేకొనవో స్వామీ॥
పిండివంటలును పెరుగులు/మెండైన పాశాలు మెచ్చి మెచ్చి
కొండలపొడవు కోరి దివ్యాన్నాలు/వెండియు మెచ్చవే వేంకటస్వామీ॥”

వేంకటేశ్వరుడి దివ్యాన్నాల వివరాలతో అన్నమయ్య ఇచ్చిన మెనూకార్డ్ ఈ కీర్తన. ఈ పట్టికలో అన్నమయ్య పేర్కొన్న వంటకాలను లక్ష్మీదేవి ఇంపుగా వడ్డించి తినిపిస్తోందట. వాటిని ఒక్క మెతుక్కూడా వదలకుండా భుజించవో స్వామీ అంటున్నాడు

  1. అక్కాళ పాశాలు: అక్కుళ్లు లాంటి ఒకరకం బియ్యంతో చేసిన నేతి పాయసం
  2. అప్పాలు: బూరెలు,
  3. వడలు: గారెలు
  4. పెక్కైన సయిదంపు పేణులు: సయిదంపు పేణులంటే గోధుమపిండిలో పంచదార, కొబ్బరి ఏలకుల పొడి వగైరా కలిపి చిన్న వుండలు చేసి గుండ్రంగా వత్తి నేతిలో వేయించిన చిన్నచిన్నతీపి పూరీ లాంటిచి. వీటినే అంగరొల్లెలు అని కూడా పిలుస్తారు. ఇడ్లీలాగా ఆవిరిమీద ఉడికించి కూడా వండుతారు.
  5. చక్కెర రాసులు: ఆ రోజుల్లో తక్కువైతే కలుపుకుంటారని విస్తట్లో ఉప్పు వడ్డించినట్టే గుప్పెడు పంచదార కూడా వడ్డించేవాళ్లు.
  6. సద్యోఘృతములు: అప్పుడే వెన్నకాచిన నెయ్యి.
  7. మీరిన కెళంగు మిరియపు దాళింపు గూరలు: మీరిన కెళంగు అంటే బాగా ఊరిన కర్రపెండలం లాంటి దుంప కావచ్చు. కంద, చేమ, చిలకడ దుంప, కర్రపెండలం, పెండలం, తామరదుంప, అరటి దుంప వీటితో మిరియాల పొడి చల్లి తాలింపు పెట్టి కూర వండుకునే వాళ్లు. భోజనంలో దుంప కూర తప్పనిసరిగా ఉండేది. ఇప్పుడు మనం ఆలూదుంపలకు పరిమితం అవుతున్నాం. అవి మనకి 18వ శతాబ్దిలో పరిచయం అయ్యాయి.
  8. సారంపుబచ్చళ్ళు: కూరగాయని మగ్గబెట్టి, లేదా నిప్పులమీద కాల్చి ధనియాలు, మిరియాలు, జీలకర్ర అల్లం లాంటి సుగంధ ద్రవ్యాలు కలిపిన రససారం కలిగిన రోటిపచ్చడి.

అన్నమయ్య కాలానికి మిరపకాయలు మనకి పరిచయం కాలేదు. ఇప్పటి ఆవకాయ లాంటి ఊరగాయలు అప్పటి ప్రజలకు తెలీవు. వాళ్లకు తెలిసిన ఊరుగాయల్లో మిరపకారం ఉండదు. అల్లం, శొంఠి, మిరియాలనే కారపు రుచికి వాడుకునే వాళ్ళు. దేవుడి భోజనం అంటే ఆరోగ్యదాయకమైన వంటకాలు ఎలా ఉండాలో గుర్తు చేస్తుందీ సంకీర్తన.

ఆరగింపు కీర్తన

ఆరగింపవో మాయప్ప/యివే పేరిన నేతులు పెరుగులును ॥ఆర॥
తేనెలు జున్నులు తెంకాయపాలును ఆనవాలు వెన్నట్లును
నూనెబూరెలును నురుగులు వడలును పానకములు బహుఫలములును ॥ఆర॥
పరమాన్నంబులు పంచదారలును అరిసెలు గారెలు నవుగులును
కరజికాయలును ఖండమండెఁగలు పరిపరి విధముల భక్ష్యములు
కడుమధురంబగు కమ్మఁబూరణపుఁ గుడుములు నిడ్డెన కుడుములును
సుడిగొను నప్పాలు సుకినప్పాలును పొడిబెల్లముతోఁ బొరఁటుచును ॥ఆర॥

“ఆరగింపవయ్యా తండ్రీ! ఇవిగో పేరునెయ్యి, పెరుగులూ! తేనె జున్ను, తెంకాయపాలు(కొబ్బరిపాలు) ఆనవాలు (నీరంతా ఇగిరేలా కాచిన చిక్కని పాలు) వెన్నట్లును.. అంటూ పల్లవి, అనుపల్లవీ సాగుతాయి. ఈ సంకీర్తనలో చెప్పిన వెన్నట్లు ఇప్పటి బట్టర్‘నాన్’ లాంటివే. వీటిని నంజుకుంటూ తింటానికి తేనె, జున్ను, కొబ్బరిపాలు, చిక్కటి పాలు సిద్ధంగా ఉంచారట.

రెండో చరణంలో నూనెబూరెలు వడలు, పానకం, కొన్ని పండ్లు, పరమాన్నం, పంచదార, అరిసెలు, గారెలు, కరజికాయలు (కజ్జికాయలు), ఇంకా అనేక భక్ష్యాలు, తియ్యని పూరణపు కుడుములు(పూర్ణం బూరెలు), ఇడ్డెన కుడుము(ఇడ్లీ)లతో పాటు నురుగులు, ఔగులు, ఖండమండెగలు, సుడిగొను అప్పాలు, పొడిబెల్లంతో పొరటిన సుకినప్పాలను కూడా వండి నివేదనకు ఏర్పాటు చేశారట.

నురుగులు= గోధుమపిండిని అప్పడం వత్తి చాపలా చుట్టి గుండ్రంగా చక్రంలా చుట్టి పైపైన వత్తి నూనెలో వేయించి, దట్టంగా పంచదార పొడి చల్లినవి నురుగులు.

ఔగులు (అవుగులు)= తమిళంళో అముణ్కు(DED p.17) కన్నడంలో అముచు లేదా అవుగు అంటే అణచు, వత్తు, పిండు అనే అర్ధాలున్నాయి. గోధుమపిండిని బాగా మర్దించి, చేతులతో వత్తి బిళ్ళలుగా అణచి, దాన్ని బలపంలా సాగదీసి ముక్కలుగా కోసి వేగించినవి ఔగులు. వీటిని పాకం పట్టితే మనోహరాలు అంటారు.

ఖండ మండెగలు= తీపి కలిపి మర్దించిన చలిమిడిని అనేక పొరల మీద వత్తి కాల్చిన మందపాటి రొట్టెలు ఖండమండెగలు.

సుడిగొనునప్పాలు: గుండ్రంగా వత్తిన అప్పాలు. సుకినప్పాలు అంటే సకినాలు లేదా చక్కిలాలు. వీటిని పొడిబెల్లంతో పొరటి అంటే వేగేలా చేసేవారట.

దేవుడి ఆహారం

“ఏ పొద్దు చూచిన దేవుఁ డిట్లానె యారగించు/రూపులతోఁ బదివేలు రుచులైనట్లుండెను॥
మేరుమందరాలవలె మెరయు నిడ్డెనలు/సూరియ చంద్రులవంటి చుట్టుఁబళ్ళేలు
ఆరనిరాజాన్నాలు అందుపై వడ్డించఁగాను/బోరన చుక్కలు రాసి పోసినట్లుండెను ॥ఏపొ॥
పలు జలధులవంటి పైఁడివెండిగిన్నెలు/వెలిఁగొండలంతలేసి వెన్నముద్దలు
బలసిన చిలుపాలు పంచదార గుప్పఁగాను/అలరు వెన్నెల రసమందించినట్లుండెను॥ఏపొ॥
పండిన పంటలవంటి పచ్చళ్ళుఁ గూరలునువండి యలమేలుమంగ వడ్డించఁగా
అండనే శ్రీవేంకటేశుఁ డారగించీ మిగులఁగ దండిగా దాసులకెల్లా దాఁచినట్లుండెను ॥ఏపొ॥

దేవుడికి రెండుపూటలా నైవేద్యం పెట్టే వంటకాల వివరాలు ఈ సంకీర్తనలో ఉన్నాయి. తాజాగా అప్పుడే తోటలోంచి కోసి తెచ్చిన కూరగాయలతో చేసిన పచ్చళ్లు, కూరలు వండి, అలమేలుమంగ పక్కనే కూర్చుని వడ్డిస్తుంటే, శ్రీ వెంకటేశుడు ఆరగించి, మిగిలింది తన భక్తులకు దాచిపెట్టాడన్నట్టు ఉన్నాయిట ఈ వంటకాలు. ఏ పొద్దు చూసినా దేవుడిట్లానె ఆరగిస్తాడు, అవి పదివేల రుచుల్లా అనిపిస్తాయి.

  1. మేరుమందరాలవలె మెరయు నిడ్డెనలు: మేరు లేదా మందర పర్వతంలా మెరిసే ఇడ్డెనలు
  2. సూరియ చంద్రులవంటి చుట్టుఁబళ్ళేలు: చుట్టుబళ్ళేలు అంటే గోళాకారంలో చేసిన పునుగులు. వీటిని చుట్టువడ లంటారు. జన వ్యవహారంలో ఇవి చుట్టుబడులు చుట్టుబళ్లు చుట్టుబళ్లేలుగా మారి ఉండవచ్చు.
  3. ఆరనిరాజాన్నాలు అందుపై వడ్డించఁగాను బోరన చుక్కలు రాసి పోసినట్లుండెను: ఇంక మంచి బియ్యంతో వండిన వేడివేడి అన్నాన్ని అందుపై వడ్డించారు. అది చూస్తే ఆకాశంలో చుక్కలన్నీ వచ్చి పోగుపడినట్టుంది.
  4. పలు జలధులవంటి పైఁడి, వెండిగిన్నెలు: బంగారం, వెండి గిన్నెల్లో పాయసాల్లాంటి వంటకాలు అనేక సముద్రాల్ని ఒకేచోట చేర్చినట్టున్నాయి.
  5. వెలిగొండలంతలేసి వెన్నముద్దలు= వెన్నముద్దలనే తీపి పదార్థాల పోగు వెలిగొండంత ఉంది.
  6. బలసిన చిలుపాలు: చిలుప+పాలు= నీరంతా మరిగే వరకూ కాచిన చిక్కని పాలగుజ్జు (బాసుంది)
  7. పంచదార గుప్పఁగాను అలరు వెన్నెల రసమందించినట్లుండెను: కుప్పగా వడ్డింపంచదార వెలుగువెన్నెల రసం అందించినట్లుంది.

తీపి పిందుల కజ్జాయం

“కన్నుల పండుగ సేసెఁ గాంత నిన్నుఁ గనుగొని
సన్నపు నునుఁజెమట జలకాలతో
విన్ననైన తరి తీపు పిందుల కజ్జ్ఞాయముతో
కన్నెలెల్ల నీ నవ్వు కప్పురాలతోను..”

నాయకుడు వచ్చిన సంగతి తెలిసి తీపుపిందుల కజ్జాయం తిన్నంత సంబరం అయ్యింది నాయికకి. ఆయన్ని చూడగానే కన్నెలందరికీ కన్నుల పండువయ్యింది, సన్నపు నునుచెమటలు పట్టి ఆయన నవ్వనే కర్పూర పరిమళంతో స్నానం చేసినట్టయ్యిందిట. కన్నుల పండుగ కాబట్టి పండగనాడు తలంటుకుని, తీపి తినటంతో దీన్ని పోల్చాడు అన్నమయ్య. నాయిక నోటిని తీపి చేసిన ఆ ‘తీపుపిందుల కజ్జాయం’ అంటే ఏది? పిందులు అంటే లేతగా చిన్నవిగా ఉండే కాయలు. ఆ ఆకారంలో చేసిన గుండ్రటి తీపిభక్ష్యం తీపుపిందుల కజ్జాయం. ఇప్పుడు తిరుమలలో లడ్డూ ప్రసాదం ఇస్తున్నారు. అన్నమయ్య కాలంలో మనోహరాలనే తీపి కజ్జాయాన్ని ప్రసాదంగా ఇచ్చేవారు. జంతికల్ని ముక్కలుగ అవిరిస్తే మురుకులంటారు. వీటిని పాకం పట్టినవి మనోహరాలు. పాకం పట్టి లడ్డూ కడితే పూసమిఠాయి అంటాం. పూస అంటే ముక్కలని! ముక్కలుగా విరిచే కారప్పూసని తింటాం కదా! తీపుపిందుల కజ్జాయం అంటే పూసమిఠాయి కావచ్చు.

కజ్జాయం అంటే?
కజ్జాయం, కజ్జ, కర్జము ఇవన్నీ కజ్జికాయలనే తీపివంటకం పేర్లు! ఖాద్యం అనే సంస్కృత పదానికి ఇది తెలుగు రూపం.

కన్నడ భక్తకవి కనకదాసు అప్పాలు, అతిరసాలు, ఏలకులు, శొంఠి, మిరియాలతో చేసిన ప్రసాదాల్లో నేతికజ్జాయాన్ని కూడా పేర్కొంటూ, దేవుణ్ణి “కజ్జాయ రాశులను చప్పన్నదేశాలకు అమ్మే సెట్టి” అని నిందాస్తుతి చేస్తాడు.

అన్నమయ్య చింతకాయ కజ్జాయం పేరుతో ఒక తినుబండారాన్ని కూడా పేర్కొన్నాడు:

“చింతకాయ కజ్జాయము చేరి ఇసుమంత వుంటే
అంతటనే నోరూరు నందరికిని
పొంతనే నాలుకలకు పులుపై యుండుటే లేదు
కొంత భావించి మింగేటి గుటుకలే కాని..”

రవ్వంత చింతకాయకజ్జాయాన్ని చూస్తే చాలు నాలుకకు దాని పులుపు అంటకుండానే నోట్లో నీళ్లూరుతాయి. లోకులు దాన్ని ఆస్వాదించినట్లు భ్రమపడి లొట్టలేస్తున్నారు ఇదే విష్ణుమాయ” అంటాడు, తినకుండానే నోరు తడిచేయగలది చింతకాయ కజ్జాయం.. అని!

చింత చేస్తే చాలు అంటే తలచుకుంటే చాలు నోట్లో నీళ్ళూరుతాయి కాబట్టి దీన్ని చింతకాయ అన్నారు. చింతకాయ కజ్జాయం చింతపులుసు, ఉప్పు, కారం, బెల్లం వేసి చేసే ఒక చిరుదిండి కావచ్చు. “యథా కస్యాపి పిండఖర్జూరైరుద్వేజితన్య తింత్రిణ్యా మభిలాషో భవేత్..” తీపితో మొగం మొత్తినప్పుడు చింతకాయ పచ్చడి నాలుకకి రాసుకోవాలని పించటం సహజం అంటాడు మహాకవి కాళిదాసు.

“కడుమోవి తీవు చింతకాయ కజ్జ్ఞము/బడినల మేలు మంగపతి శ్రీ వేంకటేశ్వరుఁ/డడరించిన మాయలు అద్దములో నీడలు” అధరాలు మధురమయినవే! కాని, కొంతకాలానికి మొగం మొత్తించి, చివరికి చింతకాయ కజ్జాయాలు అవుతాయంటాడు అన్నమయ్య. ఇది కూడా అద్దంలో నీడల్లా ఆ దేవుడి మాయే నన్నాడు. మరో కీర్తనలో “ఇందువల్లనేమి గద్దు యినుప గుగ్గిళ్లే..” అంటూ, ఇనుప గుగ్గిళ్లు, చందమామ గుటకలు, ఎండమావుల నీళ్లు, వడగండ్ల గుండ్లు, చింతకాయ కజ్జములు”.. ఇవన్నీ నిజాలు కావు భ్రమలే నన్నాడు. కుందేటికొమ్ము, గగన కుసుమం ఇలా వ్యర్థమైనదనే అర్థంలో అన్నమయ్య చేసిన ప్రయోగం ఈ చింతకాయ కజ్జాయం.

“బడిబడి చెప్పఁగానే పండ్లు పులిసీననే/కడు నీ సుద్దులు చింతకాయవంటివి” అని చింతకాయకీ ఈ గుణాలున్నాయన్నా డాయన. చింతకాయ కజ్జాయాన్ని తొలిసారిగా అన్నమయ్యే విస్తృతంగా తన పదసంకీర్తనల్లో ప్రయోగించాడు.

అన్నమయ్య తరువాత ఈ పదాన్ని గట్టిగా పట్టుకున్నవాడు తెనాలి రామకృష్ణుడు. పాండురంగ మహాత్మ్యంలో “కలలో వార్తలు విప్పి చెప్పెడు క్రియన్ గాథా పురాణార్థముల్/దెలుపన్నేర్తురు గాని నేరరు సుమీ తీవ్ర వ్రతాచార శ/ష్కులై యుండెడు ముండధారులు సుముక్తుల్ డాయఁగా జింతకా/యల కజ్జాయము తోయ మింత చదరంబా తత్పరిషంగముల్” అనే పద్యం చాలా ప్రసిద్ధిచెందింది. కలలో చూసిన విషయాల్నే నిజాలుగా నమ్మించే ప్రవచనకారులు చింతకాయ కజ్జాల్లాంటి మాటలు చెప్తారంటూ, వాళ్లని ముండధారులన్నాడు.

“అరసెలు నూనెబూరియలు నౌఁగులుఁ జక్కెరమండెగల్ వడల్/బురుడలు పాలమండెఁగ లపూపము లయ్యలమేలుమంగ నీ కరుదుగ విందువెట్టుఁ బరమాన్నశతంబుల సూపకోట్లతో/నిరత వినిర్మలాన్నముల నేతులసోనల వేంకటేశ్వరా!”అంటూ స్వామికి దివ్యాన్నాల విందు గురించి అన్నమయ్య ఓ సంకీర్తనలో ప్రస్తావిస్తారు. వీటిలో అరిసెలు, నూనెబూరెలు, ఔగులు, చక్కెరమండెగలు, వడలు, బురుడలు(పురోడాశం అనే అన్నం పాయసం కావచ్చు), పాలమండెగలు, అపూపాలు (అప్పాలు) ఉన్నాయి.

సైదంపు పిండివంట

పంకజాక్షులు సొలసి పలికి నగఁగా-నింకా నారగించు మిట్లనే అయ్యా! ॥పంక॥
పెక్కువగు సైఁదంపు పిండివంటల మీఁద పిక్కటిలు మెఱుఁగు బొడిబెల్లములును
వొక్కటిగఁ గలపుకొని వొలుపుఁబప్పులతోడ కిక్కిరియు నిటు లారగించవయ్యా ॥పంక॥
నెయ్యి, పొడిబెల్లం, ఒలుపుపప్పు కలిపిన సైదంపు పిండివంటని అరగించమంటున్నాడు అన్నమయ్య ఈ కీర్తనలో స్వామిని.

సైదము అంటే గోదుమపిండి. మర్దిస్తే అది ‘పెక్కువ’గా ఉందట. పెక్కువ అంటే వర్ధనంగా అంటే లాగితే సాగే విధంగా ఉన్నదని! మెరుగు అంటే నెయ్యి దానిపైన పిక్కటిల్లుతోందట. అంటే వ్యాపించి ఉందని! ‘మెఱుఁగు వేయకగాని మృదువుగాదన్నంబు’ లాంటి ఇతర కవి ప్రయోగా లున్నాయి. గోధుమపిండిని ఉడికించి, నెయ్యి, పొడిబెల్లం కలిపి, దాన్నిండా ఒలుపు పప్పు అంటే బహుశా పుట్నాల పప్పు కలిపి తయారుచేసిన హల్వా లాంటిది కావచ్చు. అన్నమయ్య అనంతరం 50 యేళ్ళ తరువాత పోర్చుగీసుల ద్వారా జీడిపప్పు, వేరుశనగ పప్పు, బాదాం మనకు పరిచయం అయ్యాయి. కాబట్టి, హల్వాలో కలిపేందుకు వలుపుపప్పు అంటే పుట్నాల శనగపప్పు అనువుగా ఉండేది ఆ రోజుల్లో! అన్నమయ్య ఈ హల్వా వంటకానికి పేరుని ఈ కీర్తనలో ప్రస్తావించలేదు. అది సైదంపు పిండివంట అంతే!

తారిబియ్యం

నా రమణునిపైఁ జాడి నాతోనెమీ చెప్పేరే /తేరకొన నా చే నేల తిట్టించేరే
గోరుమేన నుండిదంటా గురుతులేమి చూపేరే /తారి బియ్యము దంచితే తవుడు వెల్లకుండునా!
నాయకుడి పైన చాడీలు చెప్పే చెలికత్తెల్ని నాయిక మందలిస్తోంది. “ఇతర స్త్రీలతో కలిసినప్పుడు నఖక్షతాలు చేసినందువలన అతని గోళ్లు అరిగిపోయాయంటూ లేనిపోనివన్నీ కల్పించి చెప్పి, నాచేత అతన్ని తిట్టిస్తే మీకు ఆనందమా? తారిబియ్యాన్ని దంచితే తవుడు రాదా మరి?” అంటూ నాయకుడి పైన తన స్థిరమైన నమ్మకాన్ని చాటుతోంది నాయిక.

ఇతకీ, ఈ తారిబియ్యం ఏమిటీ? ఆటవిక ప్రజలు, జానపదులు తినే ఒక రకం బియ్యం అని వ్యాఖ్యాతలు దీనికి అర్థాన్ని వ్రాశారు. కానీ, ఇంకొంచెం లోతుగా పరిశీలిస్తే, ఇవి నాగరికులు నాగరికంగా తినేవేనని తెలుస్తుంది. తారి, తహ్రి, తెహ్రి, తెహరి, తయరి అని అన్నంతో తయారయ్యే కొన్ని వంటకాలను ఉత్తరాది వారు పిలుస్తారు. బిరియానీ లేదా ‘ఫ్రైడ్ రైస్’ని కొన్ని ప్రాంతాల్లో ‘తారి’ అంటారు. పులిహోర లేదా పోహా(అటుకుల ఉప్మా)ని ‘తారి’ అని కొందరు, ఉప్పిండి ( బియ్యపు రవ్వ ఉప్మా)ని తారి అని కొందరూ పిలుస్తారు. ఆలూ దుంపలతో గానీ, సోయాబీను, కూరగాయలు, ఉల్లి, టమోటా కలిపి గానీ తారిని చేస్తుంటారు. తారి వంటకం అంటే ‘వెజిటబుల్ బిరియానీ’ లాంటిది. ఉత్తరాది వారు తారి లేదా తహరీ అని ఈ వంటకాన్ని పిలిచేవారు.

ఇప్పటి బాసుమతి బియ్యంలాగా సుగంధం కలిగి పెద్దవిగా, పొడవుగా సన్నగా ఉండే బియ్యంతో వండితే ఈ తారి వంటకాలు కమ్మగా ఉంటాయి. ఇలా తారిని వండే బియ్యం కాబట్టి, వీటిని ‘తారిబియ్యం’ అన్నారు. పులిహోర, బిరియాని, కిచిడీ లాంటి వంటకాలకు ఆరోజుల్లో ‘తారిబియ్యం’ వాడేవారని అర్థం అవుతుంది!

తవుడు పోయేలా దంచిన తెల్ల బియ్యాన్ని దంగు/దంగుడు బియ్యం అని పిలిచినట్టే, తవుడు తీయకుండా పైపైన దంచిన దంపుడుబియ్యాన్ని ‘తారిబియ్యం’ అనే వారేమో పరిశీలించాలి.

చల్లలమ్ము పాట

మూలమూల నమ్ముడుఁ జల్ల రేయిఁ బగలు గొనరే చల్ల
పిక్కటిల్లు చన్నుల గుబ్బెత వొకతి కడుఁజక్క ఇది చిలికిన చల్ల
అక్కున చెమటగార నమ్మీని యిది యెక్కడఁ బుట్టదుగొనరే చల్ల
వడచల్లుమేని జవ్వని వొకతి కడు జడియుచుఁ జిలికిన చల్ల
తడబడు కమ్మని తావులది మీ రెడయ కిపుడు గొనరేచల్ల
అంకుల కరముల వొయ్యా రొకతి కడు జంకెనలఁ జిలికిన చల్ల
వేంకటగిరిపతి వేడుకది యింకానమ్మేఁగొనరే చల్ల

గ్రామాలనుంచి పాలు, పెరుగు, చల్లలు తీసుకుని పట్నంలో మూలమూలలకి వెళ్లి ప్రొద్దున్నించీ రాత్రిదాకా పాలూ, పెరుగు, వెన్న, నెయ్యితోపాటు వెన్నతీసిన చల్లని కూడా నగరాల్లో అమ్మేవారు.

“పిక్కటిల్లు చన్నుల గుబ్బెత వొకతి” చాలా చక్కగా చిలికిన చల్ల తెచ్చింది. పై ఎద మీంచి చెమటలు కారే ఆ చల్లలమ్మి ఎక్కడా దొరకని చల్ల అమ్ముతోంది. వేడి చల్లుతున్న యవ్వనవతి ఒకతి జడియుచుఁ జిలికిన చల్ల తెచ్చింది. చక్కని గాజుల చేతుల్తో వొయ్యారొకతి కడు బెదరు చూపులతో చిలికిన చల్ల ఇది. వెంకటగిరిపతికి వేడుక ఇదంతా! నాణ్యమైన పాలు, పెరుగు, చల్లలమ్మే వారి సోయగాలతో సహా అమృత తుల్యమైన ఈ ద్రవ్యాలు కొనమంటున్నాడు అన్నమయ్య. ‘చల్లకుండ’ని వైకుంఠంగానూ, చల్లని సాక్షాత్తు ఆ శ్రీనివాసుడి నామరసంగానూ, చల్లలమ్మే గోపికల్ని పరమ వైష్ణవ భక్తశిరోమణులుగానూ ఆయన సంభావించి ఈ కీర్తన వ్రాశాడు. సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి ‘పిబరే రామరసం’ అనటం వెనుక ఈ అన్నమయ్య ప్రభావం ఉండి ఉండవచ్చు.

బతుకు పాకాలు

జీవితం ఓ వంట లాంటిది అంటాడు అన్నమయ్య. “ఇంతయు నీ మాయయు మేగతిఁ దెలియగవచ్చును/ దొంతిఁబెట్టిన కుండలు తొడరిజన్నములు” అనే సంకీర్తనలో జన్మలన్నీ దొంతిగా పేర్చిన కుండల్లాంటివని, ఈ గనమైన సంపదలన్నీ కలలోపలి సంభోగం లాంటి దని, వలలో చిక్కిన చేప పరుగులు పెట్టటం లాంటివే ఈ వన్నెల విభవాలని, ఈ దేహాలన్నీ అద్దంలో ప్రతిబింబాలేనని, మన వెంటే వచ్చే కర్మలన్నీ చద్దికి వండిన వంటలనీ, మనసులో దాగిన పాలు మదిలోని కోరికలని, కాలే పెనం మీదపడి ఇగిరిన నీళ్ల లాంటివి ఈ భూమ్మీద ఆహారాలన్నీ అనీ వివరిస్తాడు.

“కరము జీడిపులుసు గలిగిన మామిడి కరముసోకిన యంతనే సరవిఁజక్కెరవలెఁ జవిగలిగించువాని చనవరిసుతుఁడితఁడే” అంటాడు అన్నమయ్య!

అన్నమయ్య అధ్యాత్మ సంకీర్తనల్లో దివ్యాన్నాల్ని ప్రస్తావించగా, శృంగార కీర్త్నల్లొ ప్రసంగవశాత్తూ చింతకాయ కజ్జాయం తారిబియ్యం లాంటి ఆహార ద్రవ్యాల్ని ప్రస్తావించాడు. దీక్షగా వెదికితే ఇంకా చాలా దొరుకుతాయి. వ్యాసవిస్తరభీతితో ఇంతకు పరిమితం కాక తప్పటంలేదు.

Exit mobile version