[డిసెంబరు 31 కె. రామలక్ష్మి గారి జయంతి సందర్భంగా ‘శాశ్వతి’ పురస్కారం పొందిన వారి ‘అన్నల్లారా నా తప్పేమిటి?’ అనే నవలని పరిచయం చేస్తున్నారు రాజేశ్వరి దివాకర్ల.]
స్వాతంత్ర్యానంతర తొలి తరం రచయిత్రిగా ఒక విశిష్టమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నారు శ్రీమతి కె. రామలక్ష్మి గారు. తన భావాలను నిర్మొహమాటంగా నిర్ద్వందంగా చెప్పటం ఆమె ప్రత్యేకత. రామలక్ష్మిగారి కథలు, నవలలూ – స్త్రీల జీవితాలను, వారు యువతులుగా, గృహిణులుగా, వృద్ధులుగా ఎదుర్కుంటున్న సమస్యల్ని చిత్రిస్తాయి. అందుకు ఆమె కొన్ని సేవాసంస్థలలో పనిచేస్తూ బాధిత స్త్రీలను సన్నిహితంగా చూడడం, మానసిక రోగులను, వికలాంగుల పాఠశాలను సందర్శించడం కారణాలు కావచ్చు.
రామలక్ష్మి గారి ‘అన్నల్లారా నా తప్పేమిటి’ నవలకు 1996లో బెంగళూరులో నంజనగూడు తిరుమలాంబ గారి స్మారక ‘శాశ్వతి’ పురస్కారం లభించింది. నంజనగూడు తిరుమలాంబ గారు కన్నడ భాష లోని మొదటి పత్రికా రచయిత్రి, ప్రకాశకురాలు. నవలా కథా రచయిత్రి. ఈ పురస్కారాన్ని నెలకొల్పిన వారు దివంగత చి.న. మంగళ గారు. వారు స్థానిక ఎన్.ఎం.కె.ఆర్.వి స్త్రీల కళాశాల ప్రాచార్యులుగా, ప్రఖ్యాత రచయిత్రి, స్త్రీ సంక్షేమ అభ్యుదయాలకు కృషి చేసిన వారుగా ప్రసిద్ధులు. బెంగళూరులో స్త్రీ సాధనల విశేష సంగ్రహాలయాన్ని నెలకొల్పారు.
రామలక్ష్మి గారి పురస్కార సభ ఘనంగా జరిగింది. వారు రాసిన నవలను చదివాను.
వారి జన్మదినం డిసెంబరు 31 అని తెలిసినప్పుడు శాశ్వతి పురస్కారం పొందిన నవలను గూర్చి పునర్మననం చేసుకోవాలని అనిపించింది. అలాగే పఠితలకు ఆ పుస్తక పరిచయాన్ని చేయాలనిపించింది.
‘అన్నల్లారా నా తప్పేమిటి?’ మనో వైజ్ఞానిక నవల. మానసిక రోగుల దయనీయమైన స్థితినే కాక వైద్య సహాయంతో స్వస్థతను పొందిన వారికి వారి కుటుంబం లోనూ, సంఘం లోనూ దొరకవలసిన ఆదరణను గూర్చి ప్రస్తావిస్తుంది.
రామలక్ష్మి గారు తనకు స్నేహితురాలూ, సైకియాట్రిక్ విభాగంలో నిపుణులూ అయిన బులుసు సర్వ లక్ష్మి గారు తమకందించినవివరాలను ఆధారంగా గ్రహించారు. వాస్తవమైన అంశాలకు తమ కల్పనను జోడించారు. ఈ విధంగా ఈ నవల వైద్యశాస్త్ర పరిజ్ఞానాన్ని జోడించుకుని ఉండడం వల్ల విభిన్నమైనదని చెప్పవచ్చు. పాత్రల ప్రవర్తనను ఒక సామాజిక భూమిక నిర్వహిస్తుంది. ఒక వ్యక్తికి సంబంధించిన జీవితం, ఆ వ్యక్తికి మటుకే గాక అతనికి లేక ఆమెకు సంబంధించిన వ్యక్తుల స్వభావం, గుణ గణాలతో ముడివడి ఉంటుందని నిరూపిస్తుంది.
‘అన్నల్లారా నా తప్పేమిటి?’ నవలలో స్త్రీకి కలిగిన సమస్య మరొక ప్రధాన సమస్యతో ముడిపడింది.
మానసిక వ్యాధి నుండి కోలుకున్న స్త్రీతో పురుషుడు సర్దుకుని పోడు. ఏ మాత్రం చిహ్నాలు కనిపించినా ఆమెను పుట్టింట్లో వదిలేసి చేతులు దులుపుకుంటాడు అంటారు రచయిత్రి.
ఈ నవలలో మొదట కనుపించేది గంగ పాత్ర. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొంది గుడిసెకు తిరిగి వచ్చింది గంగ. అక్కడ అత్త ఆడబిడ్దల ప్రవర్తన గంగను క్షోభకు గురిచేసింది. అలాగే నీల, చిట్టిల వృత్తాంతాలు వారికి కావలసిన సాంఘిక పునరావాసాన్ని గురించి ప్రశ్నిస్తాయి.
ఈ నవలలో ప్రధాన ఇతివృత్తానికీ తదితర పాత్రలకూ ఆలంబనమైన పాత్ర డాక్టర్ శారదా మూర్తి. ఆవిడ మనో వైకల్యం పొందిన వాళ్ళ సేవకు తన జీవితాన్ని అంకితం చేసింది. వారికి తిరిగి సంఘంలో ధైర్యంగా తిరిగే ప్రోత్సాహాన్ని అందివ్వాలని ఆశిస్తుంది, ఈ డాక్టరు గారికి తోడు నీడగా ఉండి సహాయ సహకారలను అందిస్తారు సంతోషి, రమ్యలు.
రమ్య సోషల్ వర్క్‌లో డిగ్రీని పొందింది. సంతోషి అమెరికాలో కౌన్సిలింగ్‌లో తర్ఫీదును పొంది భర్తతో కలసి ఇండియాకు తిరిగి వస్తుంది. సంతోషి రమ్యలు సమాజ సేవికలుగానే కాక తమ వైద్య వృత్తిలో శాస్త్ర పరిజ్ఞానం కలిగిన వారవడం రచయిత్రి వివరించిన సమస్యకు తగిన సాంకేతికమైన పరిశీలనను కూడా జోడించి ప్రయోగశీలతను కలిగించింది.
సంతోషి, రమ్యలు మనో స్వాస్థ్యం కలిగి కోలుకున్న వారికి, కొంత వ్యవధి నిచ్చి, వారు కుదుటబడి ఆత్మవిశ్వాస ధైర్యాలను పుంజుకునే వరకూ సహకరించే నవ జీవన కేంద్రాన్ని స్థాపించేటందుకు శారదా మూర్తికి చేయూత నిస్తారు. క్రియాశీల చైతన్యం కలిగిన పాత్రలను కల్పించి, తాము ఎన్నుకున్న ఇతివృత్తానికి దృఢమైన ఆలంబనమును కల్పించుకున్నారు రచయిత్రి.
ఈ నవలా శీర్షికకు కారణమైన పాత్ర సరస్వతి. సరస్వతి పిచ్చిది కాదు. డబ్బు మీద గల వ్యామోహంతో ఆస్తి కోసం తనను హింసిస్తున్న అన్నల క్రూరత్వాన్ని మౌనంగా భరిస్తుంది. తన పట్ల ఏమి జరుగుతోందో తెలిసి కూడా శరీరానికి, మనసుకు తగిలిన గాయాలను సహిస్తుంది. అన్నలు ఆమెను పిచ్చిదానిగా నిరూపించడానికి ప్రభుత్వాస్పత్రిలో చేరుస్తారు. సరస్వతి అక్కడ శారదా మూర్తిని చూసి తనకొక ఆధారం దొరికిందని అనుకుంటుంది. కాని డాక్టరుకు బదిలీ కావడంతో ఆమె ఆసుపత్రి వార్డెన్ చేతికి చిక్కుతుంది. ఆ వార్డెన్ అన్నల దగ్గర డబ్బు గుంజుతూ సరస్వతిని పీడిస్తుంది. డాక్టరు శారదా మూర్తి స్థానంలో వచ్చిన రాం కుమార్ ఆమెకు సహాయం చేయాలనుకుని షెల్టెర్ హోమ్‌కు చేరుస్తాడు. అక్కడ సరస్వతి అత్యాచారానికి లోనయి నిజంగా పిచ్చిదవుతుంది. సరస్వతి శూన్యం లోకి చూస్తూ ఉండగా నవల పూర్తి అవుతుంది.
సరస్వతి కథ కుటుంబ దౌష్ట్యానికి చిక్కుకున్న స్త్రీ కథ. అటువంటి స్త్రీకి సామాజికపరమైన రక్షణ, భద్రతలు లేకుంటే ఎంత నిగ్రహం కలిగినదైనా విషమ స్థితిలో పిచ్చిదవుతుందన్న సత్యాన్ని వెల్లడిస్తుంది.
సర్వతి కథ, ఆమె ఒక్కతిదే కాదు, అటువంటి వేదనను అనుభవిస్తున్న అనేక మంది దీనంగా అన్నలను ప్రశ్నిస్తున్న కథ. “ప్రభుత్వం పని చేస్తే ఎందుకు చేసావని శిక్షిస్తుంది. చేయకపోతే కమిటీలు వేసి ఎందుకు చేయ లేదని పరీక్ష చేస్తుంది. నాలా పని చేస్తూ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా లేని వాళ్ళను ట్రాన్సఫర్ అస్త్రం ఉపయోగించి, స్థలం మార్చడం మంచిదని సూచిస్తుంది” వంటి వాక్యాలు కొన్ని నిజాలను చెప్తాయి.
‘అన్నల్లారా నా తప్పేమిటి?’ నవల కవులూ మేధావులూ, కళాకారులూ కావలసిన వాళ్ళు, పిచ్చివారిలా మారడానికి గల కారణాన్ని చర్చిస్తుంది. వాళ్ళు అతి సున్నితమైన మనస్సులను కలిగి, అతి కఠినమైన వాతావరణంలో ఇమడలేక మనోస్వాస్థ్యం కోల్పోతున్నందుకు విచారం వ్యక్తం చేస్తుంది.
మనోవ్యాధికి గల మరో ముఖ్యమైన అంశాన్ని పఠితల దృష్టికి తెస్తుంది. ‘వంశంలో గనుక పిచ్చి ఉంటే అది సంతానానికి సంక్రమించే అవకాశం ఉంది కనుక విద్యావంతులైన దంపతులు అలాంటి జననాలను అరికట్టాల’ని హెచ్చరిస్తుంది. అందుకు తార్కాణంగా డాక్టరు శారద తనకు పిల్లలు పుట్టే వయసు దాటాక గాని వివాహం చేసుకోకపోడానికి గల కారణాన్ని సమన్వయిస్తుంది.
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణాన్ని కోరుకునే ఈ నవల భారతీయ భాషల స్థాయిలో ‘శాశ్వతి’ పురస్కారాన్ని పొందడం స్మరించదగిన అంశం.