Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అంది వచ్చిన అదృష్టం..!!

[‘నన్ను ప్రభావితం చేసిన నా గురువు’ అనే శీర్షిక కోసం తమ గురువు గారి గురించి వివరిస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]

నా జీవితంలో నూతనాధ్యాయం 1975లో, నేను నా వృత్తి విద్యా కోర్సులో (బి.డి.ఎస్) చేరడంతో ప్రారంభం అయింది. అప్పటికి, గతం అంతా చేదు అనుభవాలతో, భవిష్యత్ జీవితంపై నిరాశతో గడిచిపోయింది. నా చదువు ఎనిమిదవ తరగతిలో అనారోగ్య కారణంతో ఆగిపోవడం నా నిరాశకు మొదటి కారణం. రెండవదిగా, నేను అనారోగ్యం నుండి బ్రతికి బయటపడతానా? అన్న ఆందోళన! అన్నయ్య మీనన్, అక్క మహనీయమ్మల ఆశీస్సులు నాకు మెండుగా ఉండడం మూలాన, నేను తిరిగి మెట్రిక్యులేషన్, ఇంటర్మీడియెట్ పరీక్షలు పాసై, బి.ఎస్.సి. మొదటి సంవత్సరంలో ఉండగా నాకు దంతవైద్యం కోర్సులో సీట్ రావడం, నా జీవితానికి పెద్ద మలుపు. సీరియస్‌గా సాహిత్యరంగంలో అడుగుపెట్టడం కూడా ఇప్పుడే!

నేను ఇలా చదువుకుంటున్న రోజుల్లో, సాహిత్యపరంగా నన్ను ప్రేమించింది, ప్రోత్సహించింది వారిది పెద్ద లిస్టే ఉంది. అందులో ప్రథములుగా చెప్పదగ్గ మహానుబావులు, సహృదయులు, మా గురువు గారు ప్రొ. రామచంద్రా రెడ్డి గారు. వీరు నెల్లూరు వాస్తవ్యులు. వీరి అత్తగారి వూరు మహబూబాబాద్ (అప్పటి వరంగల్ జిల్లాలో పెద్ద తాలూకా, ఇప్పటి జిల్లా). మాకు ఓరల్ మెడిసిన్ & రేడియాలజీ బోధించేవారు. ఆయన మనసులో నాకు మంచి స్థానం ఉండడం నా అదృష్టం.

మా గురువు గారు డా. పి. రామచంద్రా రెడ్డి, మాజీ ప్రిన్సిపాల్, ప్రభుత్వ దంతవైద్య కళాశాల, అఫ్జల్‌గంజ్, హైదరాబాద్.

1980లో నా బి.డి.ఎస్. కోర్సు పూర్తి చేసి, అదే ప్రభుత్వ దంత వైద్య కళాశాల (అఫ్జల్‌గంజ్, హైదరాబాద్) లో, హౌస్‍మెన్‌షిప్ చేస్తున్న నేపథ్యంలో, ఒకానొక జాతీయ పండుగ రోజున కళాశాల ఆవరణలో పతాకావిష్కరణ జరిగిన సందర్భంలో, నా అదృష్టం పండి, గురువుగారు నన్ను దగ్గరికి పిలిచి “మధ్యాహ్నం నుండి ఇంటి దగ్గర ఏమి చేస్తున్నావు?” అని అడిగారు. ఆయన అలా ఎందుకు అడిగారో నాకు అప్పుడు స్ఫురించలేదు.

అందుకని, మామూలుగా “ఖాళీగానే ఉంటున్నా సర్” అన్నాను.

అప్పుడు ఆయన “అలా ఎందుకు? సాయంత్రం క్లినిక్‌కు రా..!” అన్నారు. ఆశ్చర్యపోవడం నా వంతయింది.

ఎందుచేతనంటే, ఆయన క్లినిక్కులో పని చేయడానికి మార్గం దొరికేది అంత సులభమైన పని కాదు. అలాంటిది, ఆయనే నన్ను ఆహ్వానించడం కలలో కూడా ఊహించలేని పరమ సత్యం!

అప్పుడు నేను అన్నయ్యతో మాసాబ్ ట్యాంక్ దగ్గర ఉండేవాడిని. డా. రామచంద్రారెడ్డి గారి ఇల్లు/క్లినిక్ పంజాగుట్టలో, నిమ్స్ పక్క సందులో (తులసి మెడికల్ హాల్ ప్రక్క సందు) ఉండేది. నేను సాయంత్రం నాలుగున్నరకు ఆటోలో మాసాబ్ ట్యాంక్ నుండి సార్ క్లినిక్ కు వెళ్ళేవాడిని. రాత్రులు తొమ్మిది దాటితే నాకు డిన్నర్ సార్‌తో పాటు ఏర్పాటు చేసేవారు. స్వయంగా కారులో నన్ను మా ఇంటిదగ్గర డ్రాప్ చేసేవారు. ఆయన క్లినిక్‌లో నా భవిష్యత్ డెంటల్ ప్రాక్టీస్ సంబంధించిన అనేక మెళకువలు తెలుసుకునే అదృష్టం కలిగింది. నా కోసం ప్రత్యేకంగా ఒక డెంటల్ చైర్ గురువుగారు నాకు కేటాయించి స్వేచ్ఛగా పనిచేసే అనుకూల పరిస్థితులు కలిగించారు. సార్ నా నుండి ఉచిత సేవలు ఎప్పుడూ ఆశించలేదు. నేను ఊహించిన దానికంటే ఎక్కువ పారితోషికం ఆయన నాకు చెల్లించేవారు. ఆయన విదేశాలకు వెళ్లినా క్లినిక్ నాకు అప్పగించి వెళ్లేవారు. డా. పెరుగు శివారెడ్డి, డా. సి. ఎస్. రెడ్డి,

శ్రీ సుబ్బిరామిరెడ్డి వంటి ప్రముఖులను నేను అక్కడే చూసాను. ఒక గమ్మత్తు విషయం ఏమిటంటే, రామచంద్రా రెడ్డి గారి దగ్గరకు ఒకరోజు ఒక అందమైన అమ్మాయి క్లిప్పుల చికిత్స (ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్) కోసం వచ్చింది. ఆమె ఎంత అందంగా ఉందో, ఆమె పేరు కూడా షార్ట్ అండ్ స్వీట్‌గా వుంది. ఆ పేరు ఒక కాగితం మీద రాసుకుని పర్స్‌లో పెట్టుకుని, నాకు పెళ్ళై ఆడపిల్ల పుడితే.. ఆ పేరే పెట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. అనుకున్నట్టుగానే మా అమ్మాయి పేరు ‘నిహార కానేటి’ అయింది. నేను గురువుగారి దగ్గర పనిచేసే నాటికి వారు, అప్పటి మన దేశ అధ్యక్షులు శ్రీ నీలం సంజీవరెడ్డి గారికి ‘హానరరీ డెంటల్ సర్జన్’ గా ఉండేవారు.

సార్, క్లినిక్‌లో పని చేస్తున్న సమయంలోనే, సింగరేణీ కాలరీస్ ఆస్పత్రుల్లో దంతవైద్యుల నియామకం కోసం ఒక ప్రకటన వచ్చింది. ఖాళీలు తక్కువ.

అయినా గురువుగారు నన్ను ఉద్యోగానికి దరఖాస్తు చేయమన్నారు. ఆ సెలెక్షన్ బోర్డులో సార్ టెక్నికల్ మెంబర్. ఆయన చెప్పినట్టే ఉద్యోగం కోసం అప్లై చేసాను. దేశవ్యాప్తంగా వందలమంది అప్లై చేసుకున్నారు. వారిని చూడగానే నాకు నమ్మకం సడలిపోయింది. ఇంటర్వ్యూ రోజు రానే వచ్చింది.

ఇంటర్వ్యూ బోర్డులో, రామచంద్రా రెడ్డి గారితో పాటు, సింగరేణి హాస్పిటల్స్ ముఖ్య అధికారిణి డా. రామలక్ష్మి గారు, మరి కొందరు అధికారులు వున్నారు.

ఇంటర్వ్యూ అయింది. సార్ ఏమీ చెప్పడం లేదు, ఆయనను అడిగే ధైర్యం అప్పట్లో నాకు లేదు. నేనైతే ఆశలు వదులుకున్నాను. అయితే ఒక నెల రోజుల తర్వాత నేను సెలెక్ట్ అయినట్టు, బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్‍లో రిపోర్ట్ చేయమని నాకు లెటర్ వచ్చింది. సార్‌కు అది చూపించాను. ఏమీ తెలియనట్టుగా ఒక పొడి నవ్వు నవ్వి “ప్రసాద్.. నీకు శుభాకాంక్షలు.. త్వరగా జాయిన్ అయి, మంచిగా పని చేసుకో..!” అని ఆశీర్వదించారు. గురువుగారి దయవల్ల ఉద్యోగంలో చేరి, ఆరు నెలల పాటు (జనవరి 1982-జూన్ వరకు) పనిచేసి, ప్రభుత్వ సర్వీసులో ఉద్యోగం రావడం వల్ల, సింగరేణి ఉద్యోగానికి రాజీనామా చేసాను.

నేను ప్రభుత్వ సర్వీసు నుండి 2011 లో పదవీ విరమణ చేసాను. గురువుగారు మాత్రం నన్ను ఇప్పటికీ మరచిపోలేదు. అప్పుడప్పుడు ఫోన్ చేసి నా క్షేమ సమాచారం కనుక్కుంటుంటారు. ఇది నాకే కాదు, నా సహాధ్యాయులను, ఇతర మిత్రులను ఆశ్చర్యపరుస్తుంది. గురువు గారి ప్రేమ, అభిమానం, సహృదయత ఎన్నటికీ మరువరానివి. వారికి నేను ఎప్పుడూ ఋణపడి వుంటాను.

ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే, నా మొదటి ప్రభుత్వ ఉద్యోగం గురువుగారి అత్తగారి ఊరైన మహాహబూబాబాద్‍లో రావడం.

గురువు గారికి పాదాభివందనం.

Exit mobile version