అతివలంతా సౌందర్యానికి సంతకాలుగా ఉంటారు
వనిత లెందరో చైతన్యానికి చిరునామాగా ఉంటారు
ప్రమదలు పూలకి ప్రతీకలుగా నిలుస్తుంటారు
కొందరు గుత్తుల గులాబీల్లా గుబాళిస్తారు
మరి కొందరు చేమంతుల్లా చురుగ్గా ఉంటారు
కొంతమంది ముద్ద బంతుల్లా ముద్దుగా ఉంటారు
చాలా మంది బొండు మల్లెల్లా బొద్దుగా ఉంటారు
ఇంకొందరు సన్నజాజుల్లా సుకుమారంగా ఉంటారు
ఎందుకో కొందరు మందారంలా మెరిసిపోతుంటారు
కొందరైతే చక్కగా పారిజాతంలా పరిమళిస్తుంటారు
కొందరు మాత్రం విరజాజుల్లా విరిసీవిరియనట్టుంటారు
మరీ కొందరేమో నిత్యమల్లిలా నిత్య సంతోషంగా ఉంటారు
కొందరించక్కా కనకాంబరంలా కళకళ్లాడుతుంటారు
కొద్దిమంది తామర పువ్వులా తళ తళ లాడుతుంటారు
మరీ కొద్దిమంది సంపెంగల్లా సౌరభంతో అలరారుతుంటారు
ఎంతోమంది నంది వర్ధనాల్లా నవ్వుతూనే ఉంటారు
పూచే రంగుల పూలకోసమే ఉదయాలు ఎదురుచూస్తాయి
ఎక్కడైనా స్త్రీ సమూహాలే పూలవనాల్ని తలపిస్తాయి
పూల చెట్ల లాంటిపడతులవల్లే ఇంటికి కళాకాంతీ
వారి ప్రేమ మనసులవల్లే కుటుంబానికి సుఖమూ, సంతోషమూ
ఈ చక్కనమ్మల్ని, పుత్తడి బొమ్మల్ని పదిలంగా చూసుకుందాం
పురుషులతో సమానంగా సాకి స్వేచ్ఛగా, ధీరలుగా ఎదగనిద్దాం
మన్నన జేసి మన కుటుంబపు పూదోట గౌరవం కాపాడదాం
గృహ సామ్రాజ్యపు మూల స్థంభాలని పటిష్టపరుద్దాం
అప్పుడు నిజంగా అందమంతా ఆనందమే !
అల్లూరి గౌరీలక్ష్మి కథా, నవలా రచయిత్రిగా చక్కని పేరు సంపాదించారు. ఈమె మంచి కవయిత్రి, ఫెయిర్ కాలమిస్ట్ కూడా. నాలుగు కథా సంపుటాలూ, 4 నవలలూ, 3 కవిత్వ సంకలనాలూ, ఒక కాలమ్స్ బుక్ వెలువరించారు.
APIIC Ltd. లో General Manager గా పనిచేసి పదవీ విరమణ పొందారు.