“రాక్షసీ! ఇదంతా నీ పనే కదూ! నీకెందుకే నేనంటే ఇంత కక్ష? జరిగిన దానికి సారీ చెప్పాలనుకున్నాను. పోలీస్ కంప్లైట్ ఇస్తానని వెళ్లి ఇలా కొట్టిస్తావా? ఆ పోలీసులకన్నా వీడే ఎక్కువ కొట్టాడు కదే” అన్నాడు.
సహస్రను మరచిపోక పోతే పోయేదేం లేదు. ఇలాంటి వాళ్లను పెళ్లి చేసుకుని పక్కన పెట్టుకుంటే అన్నీ పోతాయి అని మనసులో అనుకున్నాడు. అతను చాలా ఆగ్రహంగా వున్నాడు.
“అలా అనకు బావా! ఇలా జరిగినందుకు నిజంగానే బాధ పడుతున్నాను. కానీ ఇదంతా నీకేదో గాలి సోకిందని, అందుకే నీ చేతుల్లో ఒక మనిషి చనిపోయాడని, నువ్వు హాస్పిటల్‌కి దూరమయ్యావని అత్తయ్య అనుమానం. ఇలాంటివి చేయిస్తే నువ్వు ఎప్పటిలా అవుతావని ఆమె ఆశ. ఆశ ఏమైనా చేయిస్తుంది బావా! ఇది ఎవరూ కావాలని చేసింది కాదు. నీ మీద నాకు కొంచెం కోపమున్న మాట నిజమే. ఇలా చేయించేంత కోపం లేదు. ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఎందుకొస్తాను? నేను మరీ అంత రాక్షసిని, సెటిమెంట్స్ లేని మనిషిని కాదు. సారీ బావా! ఉదయం నేను నీకు కాఫీ ఇవ్వకపోయినా బాగుండేది” అంది కళ్లనీళ్లు తుడుచుకుంటూ.
వినీల్ మాట్లాడకుండా ఆమె వైపు చూసాడు. అంతవరకు ఆమె బాగా ఏడ్చినట్లు కళ్ళు ఎర్రగా ఉబ్బి వున్నాయి. ఇప్పుడు కూడా ఏడుస్తోంది. ఆమెలో పశ్చాత్తాపం కన్నా ఇంకా ఏదో కనిపిస్తోంది.
“బావా ఇదంతా మామయ్యకు చెప్పకు. అత్తయ్యను క్షమించడు. బాధపెడతాడు. ఆయన బాధ పడతాడు. మనం ఎలాగూ బాధ పడుతున్నాం. వాళ్ళనెందుకు బాధ పెట్టటం. జరిగింది పూర్వజన్మ పీడ అనుకో. పోయింది అనుకో. లేకుంటే సర్జన్‌గా ఎంతో పేరుండే నువ్వు ఇలా ఎందుకు మారతావు? ఇక ముందు బాగుంటావులే బావా, ఇదంతా మరచిపో. మామయ్యకు చెప్పొద్దని పనిమనిషికి, అత్తయ్యకు కూడా చెబుతాను” అంది.
“సరే నువ్వు వెళ్ళు” అన్నాడు.
ఆమె తన గదిలోకి వెళ్లి తలుపు పెట్టుకుంది.
బెడ్ మీద వున్న ఆమె ఫోన్ రింగ్ అయింది.
స్క్రీన్ మీద ‘ఏ.ఎస్.పి గారు’ అని కనిపించింది.
చైర్లో కూర్చుని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసింది.
“ఎలా వున్నావు వేదా?” అడిగాడు మృదుగా, ప్రేమగా సూర్యదేవ్.
‘ఎలా వున్నాను? పగ, ప్రతీకారం అంటూ చెత్త పనులు చేస్తున్నా. నేనేం చేసానో తెలిస్తే నన్ను నువ్వు చంపేస్తావ్. జన్మలో నాకు ఫోన్ చెయ్యవు. నా ముఖం చూడవు. అందుకే నీకేం చెప్పను. నీకే కాదు అలేఖ్యతో కూడా చెప్పను. కానీ అతను నా గురించి అలా మాట్లాడటం కూడా తప్పే. ఆ మాటలు నువ్వు నమ్మి వుంటే ఇప్పుడు ఫోన్ చేసేవాడివా?’ అని మనసులో అనుకుంటూ ముక్కు తుడుచుకుంది.
“ముక్కుకు ఏమైంది. జలుబు చేసిందా?” అడిగాడు సూర్యేదేవ్.
‘ఈయనొకడు. ఎంత దూరంలో వున్నా అన్నీ కనిపెట్టేస్తాడు’ అనుకుంది.
“ఏంటి వేదా! మాట్లాడవు. ఓ.. నిన్ను మీ ఇంట్లో వదిలి వెళ్ళాక నేను ఫోన్ చెయ్యలేదనా? బాగా బిజీ అయ్యాను వేదా! అందుకే నీకు ఫోన్ చెయ్యలేదు. ఫీల్ అయ్యావా?” అన్నాడు.
“లేదు సర్ అలాంటిదేం లేదు. మీరు ఫ్రీగా ఉంటే నాకు కాల్ చేస్తారని నాకు తెలుసు”
“గుడ్..” అన్నాడు.
నివేద మాట్లాడలేదు.
“వేదా! నీతో కొంచెం మాట్లాడాలి. నన్ను చూసినప్పుడు నీ కళ్ళలో భయం తప్ప ఇంకే ఫీలింగ్స్ కనిపించవు. నాకేమో నువ్వు ఎప్పుడు కనిపిస్తావు ఎప్పుడు నీతో మాట్లాడొచ్చు అని ఉంటుంది. పొరపాటున నువ్వు రాంగ్ డయల్ అయినా చెయ్యకపోతావా అని చూస్తుంటాను. నీ గురించి కొంచెం ఎక్కువగా ఆశ పడుతుంటానేమో అని నీతో మాట్లాడిన ప్రతిసారి అనిపిస్తుంది.
ఇప్పుడు కూడా తొందరపడి ఇదంతా మాట్లాడేస్తున్నానా అనిపిస్తుంది. కానీ నువ్వు ఎప్పుడైతే మీ బావతో నీ పెళ్లి చేస్తారని అన్నావో అప్పటి నుండి నిన్ను మీ ఇంట్లో డ్రాప్ చేశానన్న మాటే కానీ నా మనసు మనసులో లేదు. అసలు ఇవన్నీ నిన్నొక కేఫ్‌లో కూర్చోబెట్టి మాట్లాడాలనుకున్నాను. నీ ఫీలింగ్స్ ఏమిటో చూడాలనుకున్నాను. కానీ నువ్వు నా ముందు కంఫర్ట్‌గా కూర్చోవు. అసలు నా ముఖం నువ్వు ఎప్పుడైనా కళ్ళెత్తి సరిగ్గా చూసావా?” అన్నాడు.
“నేను ఇంతకు ముందు అయితే పర్వాలేదు కానీ మీరు ఆ రోజు బాయిస్ హాస్టల్ వాళ్లతో మాట్లాడటం చూసినప్పటి నుండి నాకు మిమ్మల్ని చూస్తేనే షివరింగ్గా వుంది” అంది.
సూర్యదేవ్ గట్టిగా నవ్వాడు.
ఆ నవ్వు విని “రేపు నేనేమైనా తప్పు చేస్తే నాతో కూడా అలాగే వుంటారు కదా! అలాగే బెదిరిస్తారు కదా!” అంది చిన్నపిల్లలా.
“వేదా! వేదా అది నా డ్యూటీ. బయట నేను అలాగే స్ట్రిక్ట్‌గా, సీరియస్‌గా వుండాలి. లేకపోతే పనులు జరగవు. నువ్వు నా పర్సనల్. నీతో అలా ఎందుకుంటాను. అవునూ! నువ్వు అప్పుడు అక్కడే వున్నావా? అయినా నువ్వు అమాయకురాలివో, తెలివైనదానివో అర్థం కావటం లేదు. నీకు పోలీసులంటే ఎందుకంత భయం? మేము కూడా అందరిలాంటి వాళ్ళమే వేదా! మాకూ ప్రేమలుంటాయి. మనసుంటుంది. ఆ మనసును అర్థం చేసుకునేవాళ్ళు కూడా వుంటే బాగుంటుందనిపిస్తుంది” అన్నాడు.
“మీరు నాకు దగ్గర కావాలీ అంటే నేను మీగురించి ఆలోచించినప్పుడు మీరు నా పక్కనే ఉన్నట్లు అనిపించాలి. కానీ మీరు నాకెప్పుడూ అంత ఎత్తున ఉన్నట్లు అనిపిస్తారు. కొండ మీద వున్న మిమ్మల్ని కొండ కింద ఉన్ననేను చూడగలనా?” అంది ఏమాత్రం సందేహించకుండా.
“చూడాలని అనిపిస్తే తలఎత్తి చూడలేవా? కొండెక్కి నన్ను చేరుకోలేవా? అదంత కష్టమా నీకు?” అన్నాడు.
“కాదనుకోండి”
“మరింకేంటి వేదా నీ భయం? మీ బావ గురించా?”
“చచ అలాంటి భయం నాకు లేదు. మా బావను నేను పెళ్లి చేసుకోను” అంది.
సూర్యేదేవ్కి ఆమె మనసు అర్థమైంది.
“నీ గురించి అమ్మతో చెప్పనా వేదా?” అన్నాడు.
“అప్పుడే వద్దండి” అంది నివేద ఏదో ఆలోచిస్తూ.
“సరే రేపు కాలేజీకి వస్తావా?”
“వస్తాను”
“రేపు నిన్ను కలుస్తాను వేదా!”
“అలాగే” అంది నివేద.
సూర్యదేవ్ వెంటనే ఫోన్ పెట్టెయ్యకుండా చాలా సేపు మాట్లాడాడు.
***
ఆ రాత్రికే ముంబై నుండి హరనాధరావు వచ్చాడు.
స్నానం చేసి భోంచేసి ఏదో అర్జంట్ వర్క్ వుంటే సిస్టం ముందు కూర్చున్నాడు. ఆయన వర్క్ అయ్యాక “మీతో కొంచెం మాట్లాడాలి” అంది సత్యవతి.
“మాట్లాడు సత్యా!” అంటూ సిస్టం ముందునుండి లేచి బెడ్ దగ్గరకి వెళ్లాడు. ఆయన పడుకోగానే ఆయన పక్కన కూర్చుంది.
“వినీల్ మనతో చెప్పలేక నివేదతో చెప్పాడటండీ, తనకి డాక్టర్ని పెళ్లి చేసుకోవాలని వుందని. నివేద చెప్పింది. నేను వెంటనే మనకు తెలిసినవాళ్లందరికి ఫోన్లు చేశాను. కానీ వినీల్ జైలుకి వెళ్లి వచ్చాడని తెలిసి వాళ్ళెవరూ వినీల్‌కి అమ్మాయిలను ఇవ్వమన్నారు. పైగా ఏమన్నారో తెలుసా ‘మీ వినీల్ ఎప్పటి నుండో ఒక జూనియర్ డాక్టర్ని ప్రేమించి వున్నాడు’ అన్నారు. కానీ ఆ డాక్టర్ ఇప్పుడు లేదట. అంటే ఆ జూనియర్ డాక్టర్ చనిపోయి దెయ్యమై వీడిని ఆడిస్తుందేమోనని నా అనుమానం. మీరిలాంటివి నమ్మరని నాకు తెలుసు. కానీ ఈరోజు ఉదయం కాఫీ ఇవ్వాలని నివేద వెళితే కాఫీ కప్పు ముఖం మీదకు విసిరాడు” అంటూ ఆగింది.
ఆయన వెంటనే “అలా ఎలా విసిరాడు సత్యా! నివేదకు దెబ్బ తగిలిందా?” అన్నాడు.
“తగిలింది. హాస్పిటల్‌కి వెళ్లివచ్చింది. కానీ వాడిని ఒక్క మాట కూడా అనలేదు నివేద. ఇంకొకరైతే వూరుకుంటారా?” అంది సత్యవతి.
“ఊరుకోరు. నివేద నా చెల్లెలు కూతురు. అందుకే వినీల్ ప్రేమించాడా లేదా అన్నది వదిలేద్దాం. ఇలాంటివి జరుగుతూనే వుంటాయి. గట్టిగా పట్టుకుంటే జీవితాలే పోతాయి. మనం అనుకున్నట్లే వినీల్‌కి నివేదను చేద్దాం. అప్పుడు వినీల్ బాగుంటాడు. మనమూ బాగుంటాము. పడుకో. రేపు నివేదతో మాట్లాడతాను” అన్నాడు.
ఆమె పడుకుంది.
తెల్లవారింది…
సూర్యదేవ్ రాత్రి కాల్ చేసినప్పుడు ‘రేపు కాలేజీకి వస్తావా? కలుస్తాను’ అన్నాడు. అదే ఆలోచనతో నివేద రాత్రంతా హాయిగా నిద్రపోయింది. ఈరోజు కలుస్తాడు. అందుకే ఎప్పుడూ లేనంత ఉత్సాహంగా, ఉల్లాసంగా నిద్ర లేచింది. బాగా నచ్చిన డ్రెస్ వేసుకుంది. నుదుటి మీద గాయం కనిపించకుండా హెయిర్ స్టైల్ కొంచెం మార్చింది. ఇప్పుడింకా స్టైల్‌గా, బ్యూటీగా వుంది.
‘ఎంతైనా నువ్వు బాగుంటావు వేదా! ఈరోజు చూడు ఎంత బాగున్నావో. ఇదంతా సూర్యదేవ్ కోసమే కదూ! మరి అతనెలా వస్తాడో? సివిల్ డ్రెస్‌లో వస్తాడా? పోలీస్ డ్రెస్‌లో వస్తాడా? ఏమో చూడాలి. అతను చూడగానే సంతోషపడేలా కనిపించాలి. కళ్ళలోకి చూస్తూ మాట్లాడాలి’ అనుకుంది.
లంచ్ బాక్స్ బ్యాగ్‌లో పెట్టుకుని “అత్తయ్యా కాలేజీకి వెళుతున్నాను” అంది నివేద.
“ఒక్క నిముషం నివేదా! మామయ్య నీతో మాట్లాడతారట” అంది సత్యవతి.
“అలాగే అత్తయ్యా వస్తున్నాను” అంటూ వెళ్ళింది.
నివేదను చూడగానే “కూర్చో నివేదా! ఇప్పుడెలా వుంది? నొప్పి తగ్గిందా?” అడిగాడు హరనాధరావు.
“తగ్గింది మామయ్యా” అంది నివేద.
“ఈరోజు మీ అమ్మా, నాన్నతో మాట్లాడాలనుకుంటున్నాను”
“దేని గురించి మామయ్యా?”
“నీ పెళ్లి గురించి”
“నీతో మాట్లాడాక వాళ్లతో మాట్లాడితే బాగుంటుందని. ఈ వారంలో నీకు, వినీల్‌కి పెళ్లి చేయాలనుకుంటున్నాను. టైం తక్కువే అయినా నేను మేనేజ్ చేసుకోగలను. పెళ్లి ఘనంగానే చేస్తాను” అన్నాడు.
నివేద షాక్ తినలేదు.
“బావ ఒప్పుకుంటాడో లేదో ఒకసారి అడగండి మామయ్యా!” అంది.
“వినీల్‌ని నేను ఒప్పిస్తాను” అన్నాడు హరనాధరావు.
“ఒప్పించి పెళ్లి చెయ్యటం దేనికి మామయ్యా? దానివల్ల ఏమొస్తుంది?”
“అదంతా నీకెందుకు నివేదా! అది మేం చూసుకుంటాము. నిన్నైతే ఒప్పించాల్సిన అవసరం లేదుగా. నీ గురించి చెప్పు?” అన్నాడు.
“ఒకరు ఒప్పిస్తే జరిగే పెళ్లి నాకొద్దు మామయ్యా! దీనికి నేను ఒప్పుకోను” అంది ఖచ్చితంగా.
సత్యవతి కంగారు పడింది. “ఆలోచించే నువ్వా మాట అంటున్నావా వేదా?” అంది.
“అవును అత్తయ్యా ఆలోచించే అంటున్నాను”
“లేదు నువ్వు ఆలోచించలేదు. ఆలోచిస్తే మీ మామయ్యతో అలా మాట్లాడవు. నీకు చెడు చెయ్యాలని వుంటుందా ఆయనకు? ఎందుకంత ఖచ్చితంగా ఒప్పుకోను అన్నావ్? బావ ఏమైనా మాములు మనిషా? ఒక పేరున్న సర్జన్. నీకు తెలియదా? చిన్నచిన్న ఒడిదుడుకులు అందరికీ వస్తాయి. అవి ఎప్పుడూ వుంటాయా? బావను పెళ్లి చేసుకుంటానని మామయ్యతో చెప్పు. లేకుంటే ఆయన బాధ పడతారు” అంది సత్యవతి.
“చేసుకుంటే నేను బాధ పడతాను అత్తయ్యా! ఈ విషయంలో నన్ను బలవంత పెట్టకండి!”
“ఇది బలవంతం కాదు ఆర్డర్. నువ్వు వినీల్‌ని పెళ్లి చేసుకోవాలి. అలా చేసే హక్కు మాకు వుంది”
“హక్కా?”
“అవును హక్కే. నిన్ను మేం చదివించాం. మా ఇంట్లో వుంచుకున్నాం. నీ మీద నీకన్నా మాకే ఎక్కువ అధికారం, హక్కు వున్నాయి” అన్నాడు హరనాధరావు.
“మీరనేది కరక్టే. నేను ఒప్పుకుంటున్నాను. కానీ మీకు నన్ను చదివించాల్సిన అవసరం ఎందుకొచ్చింది మామయ్యా?”
“ఎందుకొచ్చిందో మీ నాన్నను అడుగు” అన్నాడు.
“నాన్నకేం తెలుసు మామయ్యా! మేము పేదవాళ్లం కావటం వల్లనే మీరు నన్ను చదివించారని ఆయన అనుకుంటున్నాడు. కానీ అసలు నిజం అది కాదు. మీరు చెప్పండి. మేము పేదవాళ్లం ఎందుకయ్యాము?” సూటిగా చూస్తూ అడిగింది.
హరనాధరావు, సత్యవతి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.
“చెప్పండి మామయ్యా? సునీత ఆంటీ ఒకసారి మన ఇంటికి వచ్చినప్పుడు నన్ను పేదపిల్ల అన్నది. అత్తయ్య విని మౌనంగా వున్నదే కానీ నివేద పేదపిల్ల కాదు. నా కాబోయే కోడలు. మా ఆస్తులన్నిటికీ తనే అధికారిని అనలేదు. కనీసం బయటవాళ్ళు అలా అంటున్నప్పుడైనా సపోర్ట్ ఇవ్వని ఈ ఇంటికి నేను కోడలు కావటం ఏమిటి? ఇంతకీ మీరా హాస్పిటల్ ఎలా కట్టించారు మామయ్యా? ఆ డబ్బంతా ఎవరిది ? ఎలా వచ్చింది మీకు? మీదేనా?” అంది.
నివేద మాటలు మాములుగా లేవు. ఈటెల్లా గుచ్చుకుంటున్నాయి. అలా ఎందుకు మాట్లాడుతుందో అర్థం కాలేదు. హరనాధరావు కోపంగా లేచి నిలబడ్డాడు.
“నా కళ్ళ ముందు పుట్టి, నా ఉపకారం పొంది నన్నే ఎదిరిస్తావా? హాస్పిటల్ గురించి నిన్నెవరు మాట్లాడమన్నారిప్పుడు? ఆ డబ్బు సంగతి నీకెందుకు? ఆ డబ్బేమైనా నీ తాతదా?” అన్నాడు. అంత కోపం నివేద మీద ఎప్పుడూ రాలేదు హరనాధరావుకు.
“నా తాతదే మామయ్యా! మీరు హాస్పిటల్ కట్టటానికి అమ్ముకున్న ఆ పొలం తాతయ్య చనిపోతూ మా అమ్మకు ఇమ్మని చెప్పిన పొలం. కానీ తాతయ్య అలా చెప్పాడన్న నిజాన్ని రహస్యంగా వుంచారు. దాన్ని అమ్మి హాస్పిటల్ కట్టించారు. మాకిప్పుడు సెంటు పొలం లేదు. కౌలుకి తీసుకుని పండించుకుంటున్నాం. పేదవాళ్ళగా బ్రతుకుతున్నాం. మీరు చేసింది కరెక్టేనా మామయ్యా?”
“నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావ్. ఇదంతా మాట్లాడమని ఎవరు చెప్పారు నీకు?” అంటూ చెయ్యెత్తి నివేదను కొట్టబోయాడు హరనాథరావు.
సత్యవతి వెంటనే నివేదను పక్కకి లాగింది.
“మామయ్య కోపంగా వున్నారు. మాటకు మాట పెరిగితే పెద్ద గొడవే అవుతుంది. నువ్వు పద” అంటూ గదిలోకి నెట్టి డోర్ పెట్టింది సత్యవతి.
గదిలోకి వెళ్లి ఓ చోట కూర్చుంది నివేద.
‘అడగవలసినవన్నీ అడిగేసాను. ఇప్పుడు బాగుంది నాకు’ అని మనసులో అనుకుంది నివేద. ఇప్పుడామె మనసు కుదుట పడింది.
‘నివేదకు ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయి?’ అని ఆలోచనలో పడ్డాడు హరనాధరావు. ఆయన పక్కనే దిగాలుగా కూర్చుంది సత్యవతి.
నివేద గదిలోంచి బయటకొచ్చింది.
‘ఇంత జరిగాక వీళ్ళ ముఖాలు చూసుకుంటూ ఈ ఇంట్లో నేను వుండలేను’ అని ఊరు వెళ్లాలనుకుంది.
బస్టాండ్‌కి వెళ్ళింది. బస్‌లో కూర్చున్నాక ‘ఊరు వెళుతున్నాను’ అని సత్యవతికి ఫోన్ చేసింది. కాలేజీకి ఫోన్ చేసింది.
పది నిమిషాలు గడిచాక సూర్యదేవ్‌కి ఫోన్ చేసింది.
సూర్యదేవ్ నివేద ఫోన్ లిఫ్ట్ చేసి “చెప్పు వేదా! ఎక్కడున్నావ్?” అన్నాడు.
“నేను బస్‌లో వున్నాను. మా ఊరు వెళుతున్నాను” అంది.
“ఏంటంత సడెన్‌గా. కాలేజీకి వస్తానన్నావుగా?”
“వస్తానన్నాను. కానీ అమ్మను చూడాలి. అమ్మతో మాట్లాడాలి. అందుకే వెళుతున్నాను”
“ఓకే.. మళ్ళీ ఎప్పుడొస్తావ్? రేపు వస్తావా?”
“మరి రాత్రికి కాల్ చేస్తావా?”
“చేస్తాను”
“బస్ దిగగానే మెసేజ్ పెడతావా?”
“తప్పకుండా పెడతాను “
“మీది ఏ ఊరు?” ఆసక్తిగా అడిగాడు సూర్యదేవ్.
ఏ ఊరో చెప్పింది.
“ఆ ఊరిలో మీ ఇల్లు ఎక్కడ ఉంటుంది?” ఇంకా ఆసక్తిగా అడిగాడు.
అతను అడుగుతున్న విధానం చూసి ఆమె కూడా చాలా ఉత్సాహంగా చెప్పింది. వాళ్ళ ఇల్లు ఎక్కడ వుంటుందో, ఆ ఇంటి చుట్టూ ఎలాంటి గుర్తులు ఉన్నాయో చెప్పింది.
“ఓకే..” అంటూ ఆమె బస్ దిగే వరకూ మాట్లాడుతూనే వున్నాడు సూర్యదేవ్.
ఆమె బస్ దిగి ఇంటికెళ్లింది.
నివేదను చూడగానే “ఏంటే ఇంత ఎండలో వచ్చావ్? వస్తున్నట్లు ఫోన్ చెయ్యలేదు” అంది నాగేశ్వరి.
“ఎండలో రాలేదు బస్‌లో వచ్చాను” అంది.
“ఇంకా నయం నడిచి వచ్చాను అనలేదు” అన్నాడు అక్కడే వున్న చైత్రన్.
“నువ్వెప్పుడొచ్చావ్ అన్నయ్యా?” అంది చైత్రన్ వైపు చూసి నివేద.
“ఎప్పుడో వచ్చానులే. నా సంగతి ఎందుకు? నువ్వెందుకొచ్చావో చెప్పు?” అన్నాడు చైత్రన్.
(సశేషం)
హలో అండీ! అందరికి నమస్కారం. నేను కందుకూరు టి ఆర్ ఆర్ గవర్నమెంట్ కాలేజిలో బి.యే తెలుగు చదివాను. ఇంటర్ చదువుతున్నప్పుడే మూడు కథలు, ఒక నవల రాసాను. ఆ నవల పేరు మధురిమ. అది ప్రగతి వారపత్రిక లో అచ్చయింది. అమ్మ నాకు అన్నం పెడితే నాన్న అక్షరం పెట్టారు. మా నాన్న గారు మామిడేల రాఘవయ్య గారు, అమ్మ వెంకట సుబ్బమ్మగారు. మా వారు బ్యాంక్ ఎంప్లాయ్. నాకు ముగ్గురు అబ్బాయిలు.
‘గుండెలోంచి అరుణోదయం’ కవితాసంపుటి, ‘జీవితం అంటే కధకాదు’ కథల సంపుటి తోపాటు 20 నవలలు వ్రాసాను. నా నవలల్లో కొన్ని నవ్య, స్వాతి, తెలుగు తేజం, విశాలాక్షి ప్రత్రికల్లో నే కాక ఆన్ లైన్ మేగజైన్ లలో కూడా సీరియల్స్ గా వచ్చాయి. వస్తున్నాయి.
నేను అందుకున్న పురస్కారాలలో కొన్ని 1) యద్దనపూడి గారి మాతృమూర్తి పురస్కారం. 2) ఉమ్మెత్త ల సాహితీ పురస్కారం. 3) భారత మహిళా శిరోమణి పురస్కారం. 4)హెల్త్ కేర్ ఇంటర్నేషనల్ పురస్కారం. 5) జాతీయ పురస్కారం. ఇకపోతే ఇప్పుడు సంచిక.కాం లో వస్తున్న నా ‘అందమైన మనసు’ నవలను మీరంతా చదివి ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
-అంగులూరి అంజనీదేవి.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహిస్తున్న 2024 దీపావళి కథల పోటీ – అప్డేట్ 3
జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-67
యూరప్ పర్యటనలో అందాలూ అనుభవాలూ ఆనందాలూ-7
రాతిలో నాతి
జోనరాజ విరచిత ద్వితీయ రాజతరంగిణి – కొత్త ధారావాహిక ప్రకటన
తగ్గడమే నెగ్గడం
ప్రతుష్టి
అడవికాచిన వెన్నెల
మరుగునపడ్డ మాణిక్యాలు – 35: నాయాట్టు (వేట)
ద్వైతం
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®