Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆనందంగా జీవించడమెలాగో చెప్పే కథల సంపుటి ‘అందమైన జీవితం’

[శ్రీ సి.ఎన్. చంద్రశేఖర్ రచించిన ‘అందమైన జీవితం’ అనే కథాసంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

‘అందమైన జీవితం’ శ్రీ సి.ఎన్. చంద్రశేఖర్ గారి 10వ కథాసంపుటి. ఈయన తెలుగు సాహితీలోకంలో ‘మంచి మనుషుల మంచి కథలు’ రాసే కథకుడిగా ప్రసిద్ధికెక్కారు. వీరు రాసిన క్రైమ్ కథల్లో దుష్టులు, దుర్మార్గులు ఉంటారు, అయితే ఆ కథల్లో కూడా ‘మంచి గెలవాలి, చెడు ఓడిపోవాలి’ అన్న సూత్రాన్ని చాలావరకు పాటిస్తారు. మానవత్వపు విలువలు పెంపొందించడం కోసం, కుటుంబ వ్యవస్థ మెరుగుపరచడం కోసం, సామాజిక బాధ్యతల్ని తెలియజెప్పడం కోసం ఎక్కువగా రాస్తారు. కాబట్టి ఆ యా కథల్లోని పాత్రలు మంచివాళ్ళుగా ఉంటారు, ఒకరో ఇద్దరో క్రూరంగానో, కఠినంగానో ప్రవర్తించినా, అవకాశముంటే వారూ మారతారు. లేదా శిక్షని అనుభవిస్తారు. చంద్రశేఖర్ గారి కథల్లో పాత్రలు నిజజీవితంలో ఎలా ఆనందంగా గడపవచ్చో సూచిస్తాయి. ఈ కథలు చదువుతుంటే ఓ రకమైన హాయి భావన పాఠకులలో కలుగుతుంది.

~

ఈ సమీక్షలో కథలను ఎక్కువగా గురించి చెప్పను. ఒక్కో కథలోని హైలైట్ వాక్యాలని ప్రస్తావిస్తాను. దాంతో, ఆనందంగా జీవించడానికి ఆ వాక్యాలు చేసే సూచన ఏమిటో పాఠకులే గ్రహిస్తారు.

~

మావారి మంచితనం’ కథలో సుకుమార్ తన, మన అనే తేడా లేకుండా అవసరమైన వారందరికీ, తను చేయగలిగిన సాయం చేస్తుంటాడు. కొన్నాళ్ళు బానే జరిగినా, తరువాత తరువాత – అతనితో సాయం పొందిన స్నేహితులు/బంధువులు ఎవాయిడ్ చేస్తూంటారు. భర్తకి మనుషుల మీద నమ్మకం పోకూడదనుకున్న గీత ఓ పని చేస్తుంది.

‘వాళ్ళు తప్పు చేశారని మనం దూరంగా ఉంటే.. ఆ దూరం అలాగే ఉండిపోతుంది. క్షమించి చొరవ చూపి మనమే దగ్గరయితే, వాళ్ళలోనూ మార్పు వస్తుంది.’

నీ జతగా నడవాలని’ కథలో నాయకుడు బ్యాంకు ఉద్యోగి. అందరికీ వీలైనంత సాయపడతాడు. పని విషయంలో ఖచ్చితంగా ఉంటాడు. నాయిక లాస్య మనోబలానికి ఊతమవుతాడు.

“ఒకవేళ వాళ్ళు మనసు మారి మోసానికి పాల్పడితే?”; “అలా కూడా జరగవచ్చు. అయితే ఒకరో ఇద్దరో అలా చేస్తారని అందరిని అనుమానించలేం కదా!”

ఓ తెలివైన అమ్మాయి ఆత్మల మీద పరిశోదన చేస్తున్నట్టు ఓ వంచకుడిని నమ్మించి, అతడికి మరో రకంగా శిక్ష పడేలా చేస్తుంది ‘ఓ వర్షం కురిసిన రాత్రి’ కథలో. ఈ క్రైమ్ థ్రిల్లర్ ఆసక్తిగా చదివిస్తుంది.

విచిత్ర బంధం’ కథ పేరు చదవగానే ఆ పేరుతో ఉన్న సినిమాలు గుర్తురావచ్చు. ఈ కథ ఇతివృత్తం కూడా కాస్త విచిత్రంగానే అనిపిస్తుంది పాఠకులకి ముందు. కారణం తెలిసాకా, ఆ అభిప్రాయం మారుతుంది. కాస్త సినిమాటిక్‌గానే ఉంటుందీ కథ.

మనల్ని అవమానించిన వారిని దెబ్బ తీయటం కంటే, వారిని దెబ్బల్నించి రక్షించడమే నిజమైన గెలుపని నేనా రోజు తెలుసుకున్నాను.”

వైవాహిక జీవితం సఫలమవ్వలాంటే భార్యాభర్తలు ఎలా నడుచుకోవాలో చక్కగా చెబుతుంది ‘అందమైన జీవితం’ కథ. నందూ లాంటి వాళ్ళు, రాజేష్ లాంటి వాళ్ళు ఎక్కువమంది ఉంటే, మానస లాంటి ఎంతో మంది జీవితాలు గాడి తప్పకుండా ఉంటాయి.

“పక్కవాళ్ళతో పోల్చుకోడం వల్లే చాలా సంసారాలు పాడవుతున్నాయి. పైకి అలా కనిపిస్తుంటారు గానీ,  వాళ్ళ మధ్య కూడా ఎన్ని సమస్యలున్నాయో మనకు తెలియదు కదా!”

కల కాదు సుమా!’ కథలోని సిద్ధార్థ లాంటి వారు సమాజంలో అరుదు, అసలు లేకపోయినా ఆశ్చర్యపడనక్కరలేదు. వినయ విధేయతలు, విచక్షణ, విలువల పట్ల మన్నన ఉన్న మనిషి. అతనితో పెళ్ళికి అనేక కండీషన్లు పెట్టి, కొన్ని రోజులకి వద్దనుకున్న అక్షర – తనకెదురైన విపత్కర పరిస్థితులలో అతను చేసిన సాయాన్ని గుర్తించి, ఆత్మపరిశీలన చేసుకుని తనంతట తానే వచ్చి తనని పెళ్ళి చేసుకోమని కోరుతుంది.

‘మంచి మనుషుల మధ్య ఉంటే అది అడవైనా అమెరికా అయినా ఒకటే’.

రిటర్న్ గిఫ్ట్’ చక్కని థ్రిల్లర్ స్టోరీ. ఒక క్రైమ్ రచయిత ఒక కిడ్నాప్ కేసుని ఎలా పరిష్కరించాడో, తనకి పరిచయస్థురాలైన ఓ యువతిని ఎలా రక్షించాడో, ఆసక్తిగా సాగే ఈ కథ చెబుతుంది.

సంఘటన’ కథలో ఓ యువతి తనకి జరిగిన ఓ అన్యాయం పట్ల పోలీసు అధికారిని ప్రశ్నిస్తుంది. ఆ ఆరోపణ తన కొడుకు పైనే అయ్యేసరికి, విచారణ జాగ్రత్తగా జరుపుతాడు. కొడుకుని ఆయన ప్రశ్నించిన తీరు, కొడుకు సమాధానాలు చెప్పిన విధానంలో, జరిగిన అసలు విషయం బయటపడుతుంది. నగరాలలో జరిగే పార్టీ కల్చర్‌పై నిశితమైన వ్యాఖ్య చేస్తుందీ కథ,

సుఖాలు సంతోషాలు లేకుండా జీవించాలని ఎవరూ కోరుకోరు. అన్నీ అనుభవిస్తూనే సందర్భానుసారంగా మన విజ్ఞతని ప్రదర్శించాలి. మన అతిధైర్యం వల్లో, మన అతితెలివితేటల వల్లో మనల్ని ప్రేమించేవారికి మనస్తాపం మిగల్చకూడదు!

సెల్ సంస్కారం’ చక్కని కథ. శీర్షికలోనే ఇతివృత్తం అర్థమయ్యే కథ! కమర్షియల్ కాల్స్ కాకుండా, ఇతర కాల్స్.. మళ్ళీ మళ్ళీ వస్తున్నాయంటే, కచ్చితంగా ఏదో అవసరం ఉండే చేస్తారని, టైం పాస్‌కో, సోది కబుర్లు చెప్పడానికో కాదని ఆలోచించాలని ఈ కథ చెబుతుంది.

మనం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే, మనకు సంతోషాన్నిచ్చిన సంఘటనలను సదా నెమరు వేసుకోవాలి. బాధపెట్టిన సంఘటనలని మనసులోంచి డిలీట్ చేసెయ్యాలి.

సస్పెన్స్, కొసమెరుపుతో సాగిన కథ ‘మాస్క్’. ఒక బ్యాంక్ ఉద్యోగిని హత్యకు గురవగా, పోలీసు అధికారి విశాల్ తెలివిగా మర్డరర్‍ని పట్టుకుంటాడు.

కొంతమంది మనుషులు తమలో ఉన్న అసూయ, ద్వేషం దాచేసి ముఖంపై నవ్వు, అమాయకత్వం, కన్నీళ్ళు అన్న మాస్క్ వేసుకుని తిరుగుతుంటారు. ఆ మాస్క్ తీస్తే వారి అసలు స్వరూపం బయటపడుతుంది.

ఈ సంపుటిలో అనుబంధంగా కొన్ని చిన్న కథలను చేర్చారు. సమయం వృథా చేసుకుంటున్న ముగ్గురు యువకులను మందలించి, వారిలో మార్పు తీసుకొచ్చిన సాయిప్రసాద్ అనే వ్యక్తి కథ ‘మూడు చేపలు. ముసలి తండ్రిని వృద్ధాశ్రమం నుంచి ఇంటికి తీసుకొచ్చి, అతని ‘చివరి కోరిక’ తీరేలా చేస్తాడో కొడుకు.. కాదు కాదు, అలా తీర్చేలా చేసుకుంటాడా వృద్ధుడు.

నీవు నేర్పిన విద్యే!, అనుభూతిఇదీ ప్రేమే!, మహానుభావుడు, వ్యసనం.. సింగిల్ పేజీ కథలైనా, చక్కని ఇతివృత్తాలలో హృద్యంగా సాగుతాయి.

~

రచయిత విశ్రాంత బ్యాంకు ఉద్యోగి కాబట్టి చాలా కథలలో బ్యాంకులు, అక్కడి కార్యకలాపాలు, కస్టమర్లే నేపథ్యంగా అమరాయి! “మొదలుపెడితే, చివరిదాకా చదివిస్తుంది ఆయన శైలి” అని వెనుక అట్ట మీద ప్రచురణకర్త అభిప్రాయంతో ఈ కథలు చదివినవారు తప్పక ఏకీభవిస్తారు.

***

అందమైన జీవితం (కథలు)
రచన: సి. ఎన్. చంద్రశేఖర్
ప్రచురణ: జయంతి పబ్లికేషన్స్, హైదరాబాద్.
పేజీలు: 120
వెల: ₹ 200/-
ప్రతులకు:
సి. రాధిక
4-1042/4,
గాయత్రి నగర్, గ్రీమ్స్‌పేట,
చిత్తూరు 517002
ఫోన్: 9492378422

 

~
జయంతి పబ్లికేషన్స్,
19-90, పి అండ్ టి కాలనీ,
దిల్‍సుఖ్‌నగర్,
హైదరాబాద్ 500060
ఫోన్: 9247302882

~
శ్రీ సి.ఎన్. చంద్రశేఖర్ ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-c-n-chandrasekhar-2/

Exit mobile version