Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనర్ఘరత్నాలు-2

[పద్య ప్రేమికుల కోసం, శ్లోకగతాభిమానుల కోసం శ్రీ పాణ్యం దత్తశర్మ నిర్వహిస్తున్న కాలమ్ ‘అనర్ఘరత్నాలు’.]

శా.:
శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్, దానవో
ద్రేకస్తంభకుఁ, గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు, మహానందాంగనాడింభకున్

~

ఈ పద్యం  బమ్మెర పోతన్నగారి శ్రీమద్భాగవతము లోని నాందీ పద్యం. నాందీ పద్యాలు శ్రీ అన్న మంగళాక్షరముతో ప్రారంభించబడడం కావ్య సాంప్రదాయం. ఇది సుప్రసిద్ధమైన పద్యం. పరమాత్మయైన నారాయణుని స్తుతించడానికి సహజ పాండిత్యుడు ఎంచుకున్న ఛందస్సు, శార్దూల విక్రీడితము.

ఖండాన్వయము:

శ్రీ = శుభకరమైన, కైవల్య= మోక్ష, పదంబు = స్థితిని, చేరుటకు నై= చేరుకోవడానికి, చింతించెదన్ = భావిస్తాను; లోక= సమస్తలోకములను, రక్ష= రక్షించడం అన్నటువంటి, ఏక= ఒకే ఒక, ఆరంభకున్ = తొలి గమ్యము గలవానిని, భక్త = భక్తులను, పాలన = పరిపాలించుటయనే, కళా= క్రియయందు, సంరంభకున్ = వ్యగ్రత గలవానిని, దానవ = రాక్షసుల యొక్క, ఉద్రేక = ఔద్ధత్వమును, స్తంభ=చేసేవాడిని, కేళిలోల = క్రీడాభిరామంగా, విలసత= ప్రకాశించే, దృక్= తన చూపులు అనే, జాల= వల నుండి, సంభృత = కలిగిన, నానా = అనేకమైన, కంజాత = నీటిలో పుట్టిన (పద్మము), భా = బ్రహ్మ యొక్క, కుంభకున్ = తేజోరాశి కల్గిన వానిని, మహానంద= గొప్పవాడైన నంద మహారాజు యొక్క, అంగనా = భార్యయైన దేవకీ దేవి యొక్క, డింభకున్ = కొడుకును.

దండాన్వయము:

సర్వలోకములను రక్షించడములో నిరంతర తత్పరుడైనవానిని, తను భక్తులను రక్షించడంలో గొప్ప వ్యగ్రత గలవానిని, ఘోర రాక్షసుల ఔద్ధత్యాన్ని స్తంభింపచేసే వాడిని, తన విలాసవంతమైన చూపులతోనే, అనేక లోకాలను అలవోకగా సృష్టించివాడిని, పద్మభవుడు ఐన బ్రహ్మ సృజనాత్మకతకు కారణభూతుడైన వానిని, మహానుభావుడైన నందమహారాజు ధర్మపతి దేవకీ దేవి కుమారుని, మోక్షపదమును చేరుట కొరకు సదా ధ్యానిస్తూ ఉంటాను.

~

పోతన, తన భాగవతమును ఎందుకు వ్రాశాడు? మంగళకరమైన ముక్తిపదాన్ని చేరడానికని.. దానినే ఆయన మొదటగా చెప్పుకున్నాడు. ఆయన ముక్తి పొందడమే కాదు, మనకు కూడా ఆ మోక్షపదం లభించాలని ఆయన కోరిక. దాన్ని ప్రసాదించే వాడెవరు? సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. ఆయన యొక్క లక్షణాలను అత్యంత మనోహరంగా వివరించాడు ఆ పోతన కవి.

పరాత్పరుడైన మహావిష్ణువు అన్ని లోకాలను కాపాడడంలో నిమగ్నుడై ఉంటాడు. ఇక భక్తుల రక్షణను ఆయన ఒక వ్యగ్రతతో స్వీకరిస్తాడు. ఈ చరాచర సృష్టినంతా ఆయన లీలా మాత్రంగా సృష్టించినవాడు. పద్మభవుడైన, బ్రహ్మకు సాక్షాత్ తాతపాదుడు. సృష్టికర్త సృజనాత్మక తేజస్సుకు కారణభూతుడు – మహనీయుడైన నందుని భార్య దేవకీ దేవి ముద్దుల తనయుడు. ఆయన గాక మనకు కైవల్యపదాన్నివ్వగల వారెవ్వరు?

అలంకారశోభ:

ఈ పద్యములో వృత్త్యనుప్రాసాలంకారమున్నది.

లక్షణం:

“ఏకద్విప్రభృతీనాంతు వ్యంజనానాం యథాభవేత్ పునరుక్తి రసౌనామ్నా వృత్త్యనుప్రాస ఇష్యతే”

ఒకటి లేదా రెండు హల్లులను పెక్కుసార్లు ఆవృత్తి చేయుట ‘వృత్త్యనుప్రాస’. ఇక్కడ హల్లు ప్రధానం, అచ్చు కాదు. ముందు అక్షరంలో పూర్ణబిందువు (సున్న) ఉంటే, అది అన్ని చోట్లా ఉండవలెను. ఈ పద్యములో, ఆరంభకున్, సంరంభకున్, స్తంభకున్, కుంభకున్, డింభకున్ ఉన్న పదబంధాలు, అర్థపరిమళాలతో గుబాళించాయి.

చివరి పాదంలో, ‘మహానందాంగనాడింభకున్’ అన్న ప్రయోగాన్ని మా గురువుగారు శ్రీమాన్ తాటిచెర్ల కృష్ణశర్మ గారు, విఘ్నేశ్వరునికి కూడ వర్తిస్తుందని ఒకసారి చెప్పారు. పార్వతీ దేవికి ‘మహానంద’ అన్న పేరు ఉన్నది.

ఇందులో పోతన, కావ్యార్థ సూచన కూడ చేసినాడని అనిపిస్తుంది. భక్తులను రక్షించడం అంటే గజేంద్రమోక్షం, ప్రహ్లాదుని కాపాడటం, దానవోద్రేక స్తంభనం అంటే హిరణ్యకశిపాది రాక్షస హననం, పరమాత్మ దేవకీసుతునిగా జన్మించడం సూచించబడినవి.

శార్దూల వృత్తము నడక పెద్దపులి నడకను పోలి ఉంటుంది. గంభీరంగా ఉంటుంది. ‘Symmetry’ ని కలిగి ఉంటుంది. జగన్నాథుడైన హృషీకేశుని వర్ణించడానికి అద్భుతంగా కుదురుతుంది. కవితకు ఎంచుకొన్న ఛందస్సును బట్టి, భావం పండుతుంది. మా నాన్నగారు కీ.శే. బ్రహ్మశ్రీ పాణ్యం లక్ష్మీనృసింహశాస్త్రిగారు, శతావధాని, పౌరాణికరత్న బిరుదాంకితులు నాతో ఒకసారి చెప్పారు – “ఛందస్సు బాహ్య శరీరమైతే భావం దానిని నిలిపి ఉంచే ఆత్మ” అని.

భగవంతుని లక్షణాలు, సర్వేశ్వరత్వం, ధర్మ సంస్థాపన, దుష్టశిక్షణ, విశ్వసృష్టి, మహానందమయత్వం, శ్రీకైవల్యపదంబు చేరడానికి.. అనడంలో పరీక్షిన్మహారాజు వృత్తాంతము కూడా ధ్వనిస్తున్నది.

ఇలా తొలి పద్యమే హృద్యమై, ఆగామి భాగవత సుధలను ముందే చవి చూపించింది మనకు.

నా విశ్లేషణలో తప్పులుంటే, పండితులు మన్నించగలరని మనవి!

Exit mobile version