[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]
ఈ వారం విశ్లేషిస్తున్న పాట చిత్రం ‘నౌజవాన్’ (Naujawan, 1951) చిత్రం లోని ‘ఠండీ హవాయే లహరాకే ఆయె’. గానం లతా మంగేష్కర్. సంగీతం ఎస్ డి బర్మన్.
~
సాహిర్ సినీ సంగీత ప్రపంచంలోకి ప్రవేశించింది ‘ఆజాదీ కీ రాహ్ పర్’ అనే సినిమాతో. ఇందులో నాలుగు పాటలు సాహిర్ రాసారు. అయితే దాని తరువాత వచ్చిన ‘నౌజవాన్’ సినిమా లో ‘ఠండీ హవాయే’ అనే పాట ఆయనకి ఎంతో పేరు తీసుకొచ్చింది. దీని తరువాత ఆయన వెనక్కు తిరిగి చూడలేదు. అప్పటికప్పుడు ఒక ఐదు నిముషాలలో సాహిర్ ఈ పాట రాసి ఇస్తే ఆయన ప్రతిభను చూసి అందరూ ఆశ్చర్యపోయారంటారు. ఎందుకంటే సినిమా లలోకి ప్రవేశించక ముందే రాడికల్ కవిగా అయనకు పేరు ఉంది. ప్రేమ సన్నివేశానికి కన్విన్సింగ్‌గా అయన పాట రాయగలరని, సినీ ప్రేక్షకులను మెప్పించగలరని ఎవరూ అనుకోలేదట. కాని కాసేపట్లోనే ఆయన రాసిచ్చిన కవిత అందులోని పదాల కూర్పు ఆ పాటకు ఆయన ఇచ్చిన హుందాతనం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసాయి. దీన్ని ఆయన ఆశువుగా రాసిచ్చిన విధానానికి చాలా మంది అబ్బురపడ్డారు. ఈ పాటకు ఎస్.డి. బర్మన్ అందించిన సంగీతానికి ఓ విశిష్టత ఉంది. ఈ పాట ఎంత మంది సంగీత దర్శకులను అలరించిందంటే ఓ డజన్ పైగా పాటలు ఈ ట్యూన్ ఆధారంగానే ఆ తరువాత కట్టబడ్డాయి. ఇప్పటికీ ‘ఠండీ హవాయే’ అంటూ సాగే ఈ పాట ఎందరికో చాలా ఇష్టమైన గీతం. లతా మంగేష్కర్ హిట్ పాటల్లో ఇది తప్పకుండా ఉంటుంది. దీన్ని అలనాటి ప్రఖ్యాత నటి నళినీ జయవంత్ పై చిత్రీకరించారు.
ఠండీ హవాయే లహరాకే ఆయె
రుత్ హై జవా ఉన్కొ యహా కైసే బులాయే
ఠండీ హవాయే
(చల్లటి గాలులు తేలుతూ వస్తున్నాయి. రుతువు యవ్వనంతో పరిమళిస్తుంటే ఆయన్ని ఎలా పిలచేది)
చల్లటి వాతావరణంలో ప్రియురాలు ప్రియుడిని కలవాలని కోరుకుంటుంది. యవ్వనంతో నిండి ఉన్న రుతువు బాధపెడుతుంటే అతని సాంగత్యం కావాలని ఆమె మనసు కోరుకుంటుంది. అతన్ని ఎలా పిలవాలో ఆమెకు అర్థం కావట్లేదు. స్త్రీ ప్రియుని సాంగత్యాన్ని కోరుకుంటున్నానని తనకు తానుగా చెప్పడం సాహిర్ తన మొదటి గీతం నుండి సహజంగా రాసేసేవారు. పైగా ఈ పాటలో ఆమె వ్యక్తీకరించే కోరికలో ఎక్కడా ఆ నాటి కవులవలే పరోక్ష విధానం కనిపించదు. అలాగే ఈ వ్యక్తీకరణం స్త్రీ వ్యక్తిత్వానికి వన్నె తెచ్చే విధంగానూ ఉంటుంది.
చాంద్ ఔర్ తారే హస్తే నజారే
మిల్కె సభీ, దిల్ మె సఖీ, జాదూ జగాయే
ఠండీ హవాయే
(ఈ చంద్రుడు, ఈ తారలు, నవ్వులు వెదజల్లే పరిసరాలు, ఇవన్నీ కలిసి సఖీ ఓ మాయను మేల్కొలుపుతున్నాయి. ఈ చల్లటి గాలులు..)
తన విరహానికి తన చుట్టూ ఉన్న ప్రకృతి కూడా కారణం. ఆకాశంలో మెరిసే తారలు, వాటి నడుమ చంద్రుడు, చూట్టు నవ్వుతూ ప్రేమకు ఆహ్వానం పలికే పరిసరాలు అతన్ని మరీ మరీ గుర్తుకు తెస్తున్నాయి. ఓ మాయలోకి తనను పడేస్తున్నాయని దాని నుండి తాను తప్పించుకోలేకపోతున్నానని ఆమె చెప్తుంది.
కహా భీ నా జాయే, రహా భీ నా జాయే
తుమ్సె అగర్, బిలే భీ నజర్, హం ఝేంప్ జాయె
ఠండీ హవాయే
(మనసులో కోరిక చెప్పలేను, చెప్పకుండా ఉండలేను. నువ్వు ఎదురుపడినా నీకేమీ చెప్పలేక మౌనంలోకి వెళ్ళిపోతాను. ఈ చల్లని గాలులు)
అతని విరహంలో రగిలిపోతున్న ఆమె తన మనసులోని కోరికను బైట పెట్టలేకపోతుంది. పెట్టకుండానూ ఉండలేకపోతుంది. అంటే తనపై తనకే నియంత్రణ తగ్గిపోతున్న స్థితిలోకి ఆమె చేరింది. ఒకవేళ అతనికి అతనే ఆమెకు ఎదురుపడి కళ్ళు కలిపినా అతనికి తన మనసును వివరించలేని స్థితిలో ఆమె ఉంది. ఆ ప్రకృతి, అతనిపై ఆమెకున్న ప్రేమ, ఆమె యవ్వనం ఆమెను నిస్సహాయురాలిగా మార్చేస్తున్నాయి.
ప్రేమలోని ఈ అసహాయతను సాహిర్ చాల గీతాలలో వెన్నల రాత్రుల ఉదాహరణలతో చెప్పడం చూస్తాం. సాహిర్ పాటల్లో చంద్రుడికి వెన్నెలకు చాలా ముఖ్యమైన స్థానం ఉంటుంది. చాంద్ మద్దం హై ఆస్మాన్ చుప్ హై (రైల్వే ప్లాట్ ఫారం), మైనే చాంద్ ఔర్ సితారో కీ తమన్నా కీ థీ (చంద్రకాంతా), చాంద్ తక్తా హై ఇధర్ (దూజ్ కా చాంద్), చుప్ హై థర్తీ చుప్ హై చాంద్ సితారే (హౌస్ నెం 44), యే రాత్ యే చాందనీ ఫిర్ కహా (జాల్) ఇలా ఎన్నో పాటల్లో ప్రకృతి ఆయన ప్రేమ గీతాలలో ముఖ్య వస్తువుగా అవుతుంది. ప్రజా కవిగా విప్లవ కవిగా ఆయన చూపించే ఆ ఆదర్శవాదానికి ఆయన ప్రేమ గీతలలో లోతుకు ఆశ్చర్యపోతూ, విప్లవకారుడిలోనే నిండైన ప్రేమ భావన ఉంటుందనే వాదాన్ని గుర్తు చేసుకుంటూ ఈ ప్రేమ గీతాలను వింటూ ఆనందిస్తారు సాహిర్ అభిమానులు. సమాజంలోని అసమానతలను ప్రశ్నించి, కోపంతో రగిలిపోయే సాహిర్ ప్రకృతిలోని అందాన్ని, పరిమళాలను ఆస్వాదించగల ఓ ప్రేమికుడు కూడా.
దిల్ కే ఫసానే, దిల్ హీ న జానే
తుమ్కో సజన్, దిల్ కీ లగన్, కైసే బతాయే
ఠండీ హవాయే
(మనసు కథలు మనసుకే తెలియవు. నీకు ప్రియతమా నా మనసు కోరికను ఎలా చెప్పగలను ఈ చల్లని గాలులు..)
ఆమె ప్రేమలో ఎలాంటి స్థితిని వెళ్ళిందంటే, ఆమె మనసులోని కథలు మనసుకే తెలియని పరిస్థితి ఆమెది. ఈ ఒక్క వాక్యాన్ని ఒకోసారి ఒకో అర్థాన్ని ఇస్తుంది. అతనికి ఆమె మనసిచ్చింది. అతను ఆమెగా మారాడు. కాని ఆమె మనసు స్థితి అతనికి తెలియదు, ఆమె కథ అతనికి అర్థం కాదు. రెండు మనసులు ఒకటిగా మారనా మనసు కథ మనసుకే తెలియదు. ఇక్కడ ఆ తెలియని మనసు అతనిది అనే చమత్కారమూ ఉంది. తన స్థితి తనకే తెలియని అయోమయంలోకి ప్రేమ నెట్టేసిన నిస్సహాయత కూడా అమెలో ధ్వనిస్తుంది. సాహిర్ ఇలాంటి వాక్యాలను రాసి శ్రోతల విశ్లేషణకు వదిలేసిన సందర్భాలు ఆయన గీతాలలో ఎన్నో కనిపిస్తాయి. ఈ మార్మికత ఆయన కవిత్వానికి వింత సోగసును ఒక రహస్యాత్మకతను ఇస్తుంది. అందుకని విన్న ప్రతిసారి ఈయన గీతాలు శ్రోతలకు ఒకే రకమైన అనుభూతిని అందిస్తూ వారి పరిస్థితులను బట్టి వారికి అర్థం అవుతూ అన్ని వేళలా వారికి చేరువ అవుతూ ఉంటాయి. ఈ ఒక్క వాక్యంలో ప్రియుని స్థితి ప్రియురాలి స్థితిని కూడా కలుపుకుని అర్థం చేసుకోవచ్చు, లేదా విడిగానూ ఆమె విరహాన్ని అర్థం చేసుకోవచ్చు. మూల భావన ప్రేమ, స్థాయి భావన విరహం అయితే పదాల అర్థం మన పరిస్థితిని బట్టి మనకు తడుతూ ఓ రహస్యమైన స్థితిని కలిగిస్తుది. అందుకే సాహిర్ గీతాలతో వ్యక్తిగతంగా కనెక్ట్ అవుతారు శ్రోతలు. విషాదంలోనూ, ప్రేమలోను, ఒంటరితనంలోనూ సమూహంలోను ఒకే అనుభూతినిస్తూ రకరకాలుగా అర్థం అవుతూ ఉంటాయి సాహిర్ గీతాలు.
ఈ పాటకు ట్యూన్ ఎస్.డి. బర్మన్ కట్టారు అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ ట్యూన్ మీద ఎన్ని పాటలు ఆ తరువాత వచ్చాయో చూడండి..
- తేరా దిల్ కహా హై (చాందినీ చౌక్) 1954 – సంగీతం రోషన్
- కొంజుం పురవే (థై ఉల్లం తమిళ చిత్రం) – 1952 సంగీతం వీ నగయ్య
- థింగల్ కెనంగన్ ( మళయ ) రాజా అజ్మీ – 50s
- ప్యార్ కా జహా హో (జాల్ సాజ్) 1959 ఎన్ దత్తా
- యహీ హై తమన్నా తేరే దర్ కే సామ్నే (ఆప్ కీ పర్చాయియా) 1964 మదన్ మోహన్
- రహే న రహే హమ్ (మమతా) 1966 రోషన్
- నగమా హమారా గాయేగా యే జమానా (బండల్ బాజ్) 1976 ఆర్. డీ బర్మన్
- హమే రాస్తో కీ జరూరత్ హై (నరం గరం) 1981 ఆర్ డీ బర్మన్
- హమే ఔర్ జీనే కీ చాహత్ నా హోతీ (అగర్ తుం నా హోతే) 1983 ఆర్ డీ బర్మన్
- సాగర్ కినారే (సాగర్) 1985 ఆర్ డీ బర్మన్
- దోనో కే దిల్ హై (నర్గిస్) 80s ఆర్ డీ బర్మన్ – ఈ చిత్రం విడుదల కాలేదు
- కహా థా జో తుమ్నే (ప్యార్ కా తరానా) 1993 – రాం లక్ష్మణ్
అలా ఎన్ని పాటలు ఈ ట్యూన్‌పై వచ్చినా ఒరిజినల్ పాటకు సాహిర్ ఇచ్చిన స్థాయి దాన్ని అమరం చేసింది. సంగీతం సాహిత్యం రెండు కలిస్తే తప్ప పాటకు మరణం ఉండదనే విషయాన్ని నిరూపించే అందమైన ప్రేమ గీతం ఇది.
Images Source: Internet
(మళ్ళీ కలుద్దాం)