Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్’-44 – ఆగే భీ జానే నా తూ

[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

వారం విశ్లేషిస్తున్న పాట చిత్రం ‘వక్త్’ (Waqt, 1965) చిత్రం లోని ‘ఆగే భీ జానే నా తూ’. గానం ఆశా భోస్లే. సంగీతం రవి.

~

కాలం ఎవరి కోసమూ ఆగదు. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. ఇప్పుడు మనవి అనుకున్న క్షణాలు కాసేపటిలో గతంగా మారిపోతాయి. ఆ గడిచిన క్షణాలలోకి తిరిగి భౌతికంగా వెళ్లడం సాధ్యం కాదు. గతాన్ని మార్చలేం, భవిష్యత్తుని ఊహించలేం. ఇక మనం చేయగలిగినది ఒకటే ఇప్పటి క్షణాలను సద్వినియోగం చేసుకోవడం. ఇది వినడానికి చాలా చిన్న సంగతిలా అనిపిస్తుంది. కాని జీవితంలో ఆ చిన్న విషయాన్ని ఆచరణలో పెట్టడం చాలా కష్టం అయిపోతుంది. నిన్నటి మీద చింతతో రేపటి మీద భయంతో మనుషులు నిరంతరం రగిలిపోతూ ఉంటారు. నేటి గురించి తలంపు చాలా మందికి తక్కువే. అసలు జరుగుతున్న నేటి కన్నా గతంపై పశ్చాత్తాపం, భవిష్యత్తుపై కోరికతో కాలం గడిపేసే వారికి, వారిలోని ఆ అభద్రతా భావానికి కారణం మన నేటిని మనం పట్టించుకోకపోవడమే. నేడు నిన్నలోకి జారిపోతూ ఉంటే అవగాహన లేమితో, తెలివిలేనితనంతో గతాన్ని తలచుకుని సిగ్గుపడుతూ, భవిష్యత్తుకు భయపడుతూ జీవితంలో అత్యంత శక్తివంతమైన కాలాన్ని వదులుకుంతారు మనుషులు. సమయం గడిచిపోయాక మన తప్పు అర్థం అవుతుంది. కాని అప్పటికే జీవితాన్ని తిరిగి రాసుకుని, తిరిగి నిర్మించుకోగలిగే సమయం చేజారిపోతుంది.

మన ఎదుట ఉన్న క్షణం ముఖ్యం అని దాన్నిఆలోచనతో అవగానతో గడపమనే సందేశంతో సాహిర్ ‘వక్త్’ సినిమాకు ఓ చక్కని గీతాన్ని రాసారు. ఇది ఆ సినిమాలో ఓ పార్టీ సన్నివేశంలో వస్తుంది. పాటను యష్ చోప్రా చిత్రించిన విధానం కూడా వైవిధ్యంగా ఉంటుంది. కథ నడుస్తూ పాత్రల నడుమ సంభాషణలు జరుగుతూ ఉండగా బాక్‌గ్రౌండ్‌లో మంద్రంగా సంగీతం వినిపిస్తూ ఉండగా ఈ పాట వస్తుంది. జంటలన్నీ పార్టీలో డాన్స్ చేస్తూ ఉండగా ఓ స్త్రీ ఈ గీతాన్ని ఆలపిస్తూ ఉంటుంది. ఆ పాత్రలో కనిపించిన నటి ఎరికా. ఈమె అమెరికన్. భారతీయుడిని పెళ్లి చేసుకుని ఎరికా లాల్‌గా మారింది.

పాట వస్తున్నప్పుడు ప్రేక్షకుల దృష్టి తెరపై నర్తించే ఆ హీరో హీరోయన్ల మీద నిలిచి ఉంటుంది. మెదడు జరిగే కథను తెలుసుకుంటూ ఉంటుంది. ఆ ముగ్గురి హీరోల జీవితంలో జరిగే సంఘటనలు తెరపై నడుస్తూ ఉన్నప్పుడు ఎవరికీ తెలియన ఓ ఇంగ్లీషు యువతి పాడే ఈ పాటను శ్రోతల మనసులలోకి ఎక్కించగలగడం సాహిర్ రచనా శక్తికి నిదర్శనం. ఈ పాటలోని పదాలు బాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తూ ఉంటే అక్కడ హీరో రాజ్ కుమార్, సునీల్ దత్, శశికపూర్లు శశికళ, సాధన, షర్మీలా టాగోర్‌లు తెరపై కనిపిస్తూ ఉన్నా వాళ్లను వదిలి మెదడు ఈ పాటలోని పదాలలో ఇరుక్కుని పోతుంది. అంత మంది స్టార్లపై ఉన్న ఫోకస్‌ను కథలో నడిచే సంఘటనలను పక్కకు నెట్టి శ్రోతలు ఈ పాట మైకంలో పడిపోతారు. అది ఉత్తమ సాహిత్యానికున్న గొప్పతనం. గొప్ప కవి లక్షణం. ఏ అందాలు, ఏ సన్నివేశాలు, ఏ హీరోయిజమూ ఈ పాటను ఓడించలేవూ. ఈ సీన్‌లో భాష తెలిసిన ప్రతి ఒక్కరు ఈ పాటలోని చొచ్చుకుపోతారు. ఆ భావాన్ని, అర్థాన్ని మనసుకు ఎక్కించుకుని అన్నీ మర్చిపోయి ఆలోచనలలోకి వెళ్లిపోతారు. అంత మంది స్టార్లను మరపించి ప్రజల మనసుల్లో నిలబడిపోయిన ఆ పాట ఇది..

ఆగే భీ జానే నా తూ, పీఛే భీ జానే న తూ
జో భీ హై బస్ యహీ ఎక్ పల్ హై
ఆగే భీ జానే నా తూ, పీఛే భీ జానీ న తూ
జో భీ హై బస్ యహీ ఎక్ పల్ హై
ఆగే భీ జానే న తూ

(రాబోయే కాలంలో ఏం జరగనున్నదో నీకు తెలియదు, వెనక ఏం జరిగిందో నీకు తెలియదు. నీ దగ్గర ఉన్నది కేవలం ఈ ప్రస్తుత క్షణమే)

హిందీలో ‘జానా’ రెండు అర్ధాలతో ఉపయోగించే పదం. దీన్ని తెలియడం, తెలుసుకోవడం అనే సందర్భంలో వాడతారు. లేదా వెళ్లడం అనే సందర్భంలో కూడా వాడవచ్చు. రెండు అర్థాలను విడి విడిగా చూసినా ఈ సందర్భాలలో ఈ పల్లవిలో ఒకే అర్థం వస్తుంది. గతం భవిష్యత్తులు ఎవరికీ తెలియవు అనీ అర్థం చేసుకోవచ్చు. లేదా గతంలోక అంటే వెనక్కూ వెళ్లలేవు. ముందుకూ అంటే భవిష్యత్తులోకీ వెళ్ళలేవు. నీకున్నది ఈ ప్రస్తుత క్షణం మాత్రమే అన్న అర్థంలో విన్నా కవి చెప్పే విషయంలో తేడా ఉండదు. కాని వ్యాకరణం, వాక్య రచనాపరంగా ఇక్కడ తెలుసుకోవడం అనే అర్థాన్నే తీసుకుందాం. ఎందుకంటే తరువాత రాబోయే చరణాలకు ఈ అర్థం సహేతుకంగా సరిపోతుంది.

అన్జానే సాయోం కా రాహోం మే డేరా హై
అన్దేఖీ బాహో నే హం సబ్ కో ఘేరా హై
యే పల్ ఉజాలా హై, బాకీ అంధేరా హై
యె పల్ గవానా నా, యే పల్ హీ తేరా హై
జీనే వాలే సోచ్ లే
యహీ వక్త్ హై కర్ లే పూరీ ఆర్జూ
ఆగే భీ జానే నా తూ, పీఛే భీ జానే న తూ
జో భీ హై బస్ యహీ ఎక్ పల్ హై

(తెలియని నీడలు నీ దారిలో డేరాలేసుకుని ఉన్నాయి, మనం చూడలేని బాహువులు మనల్ని చుట్టుముట్టి ఉన్నాయి. ఈ క్షణంలో వెలుగుంది, మితగాదంతా చీకటే, ఈ క్షణాన్ని పోగొట్టుకోకు ఆ క్షణమే నీది, జీవిస్తున్న ఓ మనిషి ఆలోచించు ఇదే సమయం నీ కోరికలన్నీ తీర్చుకో. నీ ముందున్న భవిష్యత్తు నీకు తెలీదు, నీ గడిచినపోయిన గతంలోకి నువ్వు వెళ్లలేవు)

జీవితంలో మనం ఎదుర్కోవలసిన విషయాలు చాలా ఉంటాయి. జీవితాన్ని దాటాలంటే ఎన్నో ప్రతికూలతలను దాటుకుంటూ ప్రయాణించాలి. మనకు తెలియని నీడలెన్నిటినో ఎదుర్కోవాలి. అవి ఏంటో ఎలా మనల్ని చుట్టుముడతాయో ఎవరికీ తెలియదు. మనం చూడని ఓ శక్తి తన బాహువులను చాచి మనలను చుట్టుకుని ఉంది. దానిని విధి అనుకుందాం. విధి చేతిలో అందరం ఆటబొమ్మలమే కదా. అది మనల్ని ఎలా అడిస్తుందో అలా ఆడక తప్పదు. ఇక మనదంటూ మనకున్నది మన చేతిలోని ఈ క్షణం మాత్రమే. దీన్ని గతం భవిష్యత్తు ఆలోచనలలో పడి వదులుకోవడం మూర్ఖతం, అదీ శాశ్వతంగా మనతో ఉండిపోవట్లేదు. మన చేతిలోనుండి జారిపోతూనే ఉంది. అది మన చేతిలో ఉన్నప్పుడే మనకున్న కోరికలను, సాధ్యమయిన విషయాలను తీర్చుకోగలగాలి. అది ఒక్కటే మనం చేయగలిగింది. ఎందుకంటే గతం మళ్ళీ రాదు. భవిష్యత్తుపై మనకు నియంత్రణ లేదు.

ఇస్ పల్ కే జల్వో నే మెహఫిల్ సవారీ హై
ఇస్ పల్ కీ గర్మీ నే ధడ్కన్ ఉభారీ హై
ఇస్ పల్ కే హోనే సే దునియా హమారీ హై
యే పల్ జో దేఖో తో సదియోం పే భారీ హై
జీనే వాలే సోచ్ లే
యహీ వక్త్ హై కర్ లే పూరి ఆర్జూ
ఆగే భీ జానే నా తూ, పీఛే భీ జానీ న తూ
జో భీ హై బస్ యహీ ఎక్ పల్ హై
ఆగే భీ జానే న తూ

(ఈ క్షణంలో నీ ముందు సౌందర్యాలు వైభవంగా సవారీ చేస్తున్నాయి. ఈ క్షణాల వెచ్చదనాలు గుండె చప్పుళ్ళుగా ఉద్బవించాయి. ఈ క్షణాలు దొరకడంతోనే ఈ ప్రపంచం మనదైనది. ఈ క్షణాన్ని గమనిస్తే చాలా మంది జీవితంలోనో అది అంతులేని భారాన్ని కూడా మోసుకు వచ్చింది జీవించి ఉన్న ఓ మనిషి ఆలోచించు. ఇదే సమయం నీ కోరికలన్నీ తీర్చుకునే ప్రయత్నం చేయడానికి. ఎందుకంటే నీ ముందున్న కాలం అస్పష్టమైనది, నీ గతం నీ చేతిలో లేనిది)

ఆ క్షణం అక్కడ అందరూ ఆనందంగా ఉత్సాహంగా ఉన్నారు. ఆ వైభవం శాశ్వతం కాబోదు. కాని ప్రస్తుతం అది వారికి చిక్కింది. ఆ క్షణాల ఆనందపు ఉత్సాహం గుండె చప్పుళ్ళుగా మారి మనుషుల్ని దగ్గర చేస్తుంది. ఆ దగ్గరితనాన్ని సంపూర్ణంగా అనుభవించాలి. కొంత మందికి ఇదే క్షణం భారమైన విషాదాన్ని మోసుకు వచ్చింది కూడా. మనకు అది ఆనందాన్ని అందిస్తే దాన్ని అనుభవించడం తెలియాలి. ఇది చాలామందికి దక్కని అదృష్టం అన్న అవగాహనతో దాన్ని అనుభవించాలి. అదీ జీవించడం అంటే, మనసులోని కోరికలను తీర్చుకునే ప్రయత్నం చేయాలి. ఆ క్షణం చేజారిపోతే దానితో పాటు ఆ వైభవం, ఆ వైభోగం అన్నీగతంలోకి జారిపోతాయి. మళ్ళీ అలాంటి క్షణాలు జీవితంలో వస్తాయన్నది చెప్పలేము. అలాంటప్పుడు మన మనసులోని అనుమానాలను పక్కకు నెట్టి జీవితంలో ఆ క్షణాలను అనుభవించడమే మనిషి చేయవల్సిన పని. లేదా జీవితం చేజారిపోయాక కనీసం జ్ఞాపకాలు కూడా మిగలవు. ఇలాంటి అందమైన జ్ఞాపకాలను అదృష్టం ఉండి కూడా మనకు మనం మిగుల్చుకోలేకపోవడం చేతకానితనం. జీవితాన్ని జీవించడం కూడా ఓ కళే. అది తెలియని మనిషి ఎప్పుడు ఏ ఆనందాన్ని అందుకోలేడు. ఆనందాలన్నీ క్షణికమైనవే. అయినా అవి అందినప్పుడు అందుకోవడమే విజ్ఞత. అదే జీవించడం అంటే.

ఈ పాటకు రవి సంగీతం ప్రాణం పోస్తే చాలా గొప్పగా పాడారు ఆశా భోస్లే. ఆమె మంచి సోలో పాటల్లో ఇది తప్పకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈ చరణం తరువాత వచ్చే రాగాలాపన దీనికి ఓ పాశ్చాత్య టోన్‌ను భారతీయత సంపూర్ణంగా జోడించి అందిస్తుంది. ఇలాంటి ఫిలాసఫీని ఓ డాన్స్ ట్యూన్‌తో పార్టీ గీతంగా రాయగలాడం సాహిర్ గొప్పతనం అయితే దానికి సిట్యూయేషన్‌కు తగ్గ సంగీతాన్ని అందించి పాట సాహిత్యపు గాంభీర్యం తగ్గకుండా రాగం కట్టడం రవి సంగీత దర్శకత్వానికి నిదర్శనం.

ఇస్ పల్ కే సాయే మే అప్నా ఠికానా హై
ఇస్ పల్ కే ఆగే కీ హర్ షయ్ ఫసానా హై
కల్ కిస్నే దేఖా హై, కల్ కిస్నే జానా హై
ఇస్ పల్ సే పాయేగా, జో తుఝకో పానా హై
జీనే వాలే సోచ్ లే
యహీ వక్త్ హై కర్ లే పూరీ ఆర్జూ
ఆగే భీ జానే నా తూ, పీఛే భీ జానే న తూ
జో భీ హై బస్ యహీ ఎక్ పల్ హై
ఆగే భీ జానే నా తూ, పీఛే భీ జానీ న తూ
జో భీ హై బస్ యహీ ఎక్ పల్ హై
ఆగే భీ జానే న తూ

(ఈ క్షణాల నీడలలోనే మన మనుగడ ఉంది. ఈ క్షణాల తరువాతి ప్రతి సంగతీ ఓ కథగా మారిపోతుంది. రేపు ఎవరు చూడొచ్చారు, రేపు గురించి ఎవరికి తెలుసు నీకేది కావాలో ఈ క్షణం లోనే అందుకో. జీవించే ఓ మనిషి ఆలోచించు ఇదే సమయం నీ కోరికలను తీర్చుకో. గతంలోకి ప్రయణించలేవు భవిష్యత్తు నీకు తెలియదు ఓ మనిషి నీకున్నదేదన్నా ఉంటే అది ఈ క్షణం మాత్రమే దానిలో జీవించు)

మన జీవితం అంతా ఈ చేజారిపోయే క్షణాలలో ఉంది. వాటిని మనవిగా చేసుకోగలగడమే జీవించడం అంటే. ఆ తరువాత జరిగేది, జరగబోయేదీ అంతా కథగా మిగిలిపోయేది. నువ్వు అనుభవించగలిగేది ఈ క్షణాలను మాత్రమే. అందుకే వాటిని అందుకో. ఆ అనుభవాలను సోంతం చేసుకో. ఇందులో జీవించు, వీటిని ఆస్వాదించు జీవించడం అంటే అర్థం అదే.

అత్యంత గొప్ప జీవిత సత్యాన్ని చెప్పే ఈ పాట ఇష్టపడని వారు ఉండరేమో. ఆ రోజుల్లో పార్టీ గీతంగా పాపులర్ అయి నేటికీ డాన్స్ పాటలకు ఇది స్పూర్తిదాయక గీతంగా నిలిచింది. వక్త్ సినిమాలో అన్నీ గొప్ప పాటలే. కాని ఈ పాటే ఇక్కడ తీసుకోవడానికి కారణం. సినిమాలోని ఆ పాపులర్ హీరో హీరోయిన్ల స్టార్‌డమ్, దర్శకుడి కథనం, జరుగుతున్న సన్నివేశాలను దాటుకుని ఈ పాట ప్రేక్షకుల మనసుల్ని కట్టిపడేసింది. సాహిర్ పవర్ ఏంటో చూపించిన గీతం ఇది. ఈ సన్నివేశంలో, ఆకట్టుకునే కథ, రొమాంటిజం, హీరోల స్క్రీన్ ప్రెజన్స్ అన్నిటినీ సాహిర్ డామినేట్ చేయడం గమనిస్తే హిందీ సినీగీతాలలో ఆయన రారాజుగా ఎందుకు మా లాంటి అభిమానుల మనసుల్లో నిలిచి ఉండిపోయారో అర్థం అవుతుంది. సాహిర్ కవితా శక్తికి నిదర్శనంగా నిలిచిన అద్బుతమైన సినిమా పాట.

ఇస్ పల్ కే హోనే సే దునియా హమారీ హై
యే పల్ జో దేఖో తో సదియో పే భారీ హై
జీనే వాలే సోచ్ లే
యహీ వక్త్ హై కర్ లే పూరి ఆర్జూ

జీవించడం నేర్పే ఈ వాక్యాలను ఎవరు మాత్రం ఇష్టపడరు..

Images Source: Internet

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version