Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్’-43 – యే ఆంఖే దేఖ్ కర్

[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

వారం విశ్లేషిస్తున్న పాట చిత్రం ‘ధన్‍వాన్’ (Dhanwan, 1981) చిత్రం లోని ‘యే ఆంఖే దేఖ్ కర్’. గానం లతా మంగేష్కర్, సురేష్ వాడ్కర్. సంగీతం హృదయనాధ్ మంగేష్కర్.

~

సాహిర్ రాసిన ప్రేమ గీతాలలో డ్యూయేట్లలో గమనిస్తే స్త్రీ పురుషులిద్దరిలోనూ స్త్రీ తీసుకునే చొరవ నిండుగానూ హుందాగానూ ప్రతి పాటలో ధ్వనిస్తుంది. తాను అతనిపై మనసు పడిందని అతని స్నేహాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తున్నానని స్త్రీ చెప్పుకునే రోజులు కావవి. పైగా సాహిర్ పుట్టి పెరిగింది ముస్లిం వాతావరణంలో. అయినా ప్రేమను అందుకోవడంలోనూ, ఆస్వాదించడంలోనూ స్త్రీ చొరవ చూపడాన్ని ఆయన చాలా సహజంగా తన పాటల్లో చూపించేవారు. ఆయన స్త్రీ పాత్రలకు రాసిన లిరిక్స్‌లో సేచ్ఛా, తమపై తమకు అపారమైన నమ్మకం ఉండే స్త్రీ భావాలు కనిపిస్తాయి. ఆ ప్రేమను పురుషుడు గౌరవిస్తూ, దాన్ని స్వీకరించడం తనకెంతో ఆనందదాయకం అని బదులిస్తూ ఉంటాడు. సాహిర్ స్త్రీ పాత్రలకు రాసిన లిరిక్స్‌లో ఎక్కడా కూడా అనవసరమైన సిగ్గు, బిడియం, తల దించుకుని ఉండడం కనిపించవు. ఆయన కెరీర్ ప్రారంభం నుండి చివరి దాకా స్త్రీ పాత్రలలో ఇటువంటి బలమైన వ్యక్తిత్వాన్నే చూపించారు. ఆయన కెరీర్‌లో ఆఖరి రోజుల్లో అచ్చిన ఈ పాటను గమనించండి.

యే ఆంఖే దేఖ్ కర్ హమ్ సారీ దునియా భూల్ జాతే హై (2)
ఇన్హే పానే కి
ఇన్హే పానే కి ధున్ మె హర్ తమన్నా భూల్ జాతే హై

(ఈ కళ్ళను చూసి నేను ప్రపంచాన్ని మర్చిపోతాను. వీటిని పొందాలనే ఆలోచనతో నేను అన్ని కోరికలను మర్చిపోతున్నాను)

పురుషుడి బాహ్య సౌందర్యాన్ని ఆస్వాదించే స్త్రీలు సాహిర్ పాటల్లో కనిపించడం కొత్త కాదు. ‘ఉడే జబ్ జబ్ జుల్ఫే తేరి’ పాట గుర్తుంది కదా. ఇక్కడ ప్రియుడి కళ్ళను ప్రియురాలు వర్ణిస్తూ అవి తనను ఎలా కట్టిపడేస్తునాయి ఏ సంకోచం లేకుండా అతనితో చెప్పుకుంటుంది. ఆ కళ్ళను చూసి ఆమె ప్రపంచాన్నే మర్చిపోతుందట. వాటిని పొందాలనే కోరిక ఆమెలో ఎంత ఉందంటే జీవితంలో ఇంకే కోరిక కూడా తనకు గుర్తు రావట్లేదట.

సాహిర్ ప్రేమను ఆఖరి మజిలీగానో లేదా ఒకే ఒక్క జీవితపు కోరిక గానే చెప్పలేదు. ప్రేమ జీవితానికి అవసరం అయిన ఓ ముఖ్యమైన భావం. దీనితో పాటు జీవితం గడవడానికి ఇంకా చాలా కావాలి. ఇది సత్యం. దీన్ని కప్పిపుచ్చుకుంటూ నువ్వు తప్ప నాకింకేమీ అక్కర్లేదు అనే అందమైన అబద్ధాలతో సాహిర్ ప్రేమ ప్రస్తావన తీసుకురాడు. ఆమెకు ఇంకా కోరికలు ఉన్నాయి. జీవితాంతం ఉంటాయి. కాని ఇతని సాంగత్యాన్ని పొందాలనే కోరిక తీవ్రత ముందు వాటిని ఆమె మర్చిపోతుంది. ప్రస్తుతం ఈ కోరిక చాలా తీవ్రంగా ఉంది. ఆమె దాన్ని అంతే నిజాయితీగా చెప్పుకుంటుంది. నిన్ను పొందాలనే కోరిక నా ఇతర కోరికలను మర్చిపోయేలా చేస్తుంది అంటుంది ఆమె. నువ్వు తప్ప ఇంకేం నాకు వద్దు అనే అబద్ధాలతో ప్రేమ ప్రపంచాన్ని ఆమె నిర్మించుకోవట్లేదు. ఇది ముమ్మాటికీ సాహిర్ మాత్రమే వ్యక్తీకరించే శైలి.

తుమ్ అప్నీ మహకీ మహకీ జుల్ఫ్ కె పేచోంకొ కమ్ కర్ దో (2)
ముసాఫిర్ ఇన్మే ఘిర్ కర్ అప్నా రస్తా భూల్ జాతే, భూల్ జాతె హై
యే ఆంఖే దేఖ్ కర్ హం సారీ దునియా భూల్ జాతే హై

(దానికి జవాబుగా అతను నువ్వు నీ సువాసనలు వెదజల్లే చిక్కటి కురుల ముడులను తగ్గించు. బాటసారులు ఈ జడ మలుపులలో  చిక్కుకుని తమ దారి మర్చిపోతారు)

ఆమె చెప్పిన దానికి అతనిచ్చిన జవాబు ఇది. జడ వేసుకునేటప్పుడు జుట్టును పాయలుగా విడదీసి వాటిని మలుపులు తిప్పి ముడులువేస్తారు. రెండు పాములు అల్లుకున్నట్టుంటుంది. ఘాట్ రోడ్ లా వుంటుంది. ఈ కురుల సౌందర్యం చూసి ఆ ముడులలో చిక్కుకున్నవాడు సర్వం మరచి ఆ ముడులమలుపులలోనే తిరుగుతూంటాడు. రస్తా భూల్ జానా, అంటే, దారి మరచిపోవటం సామాన్యార్ధం. గమ్యం మరచిపోవటం సూచ్యార్ధం. ఆమె జడ ముడులలో చిక్కుకున్నవారు  వెళ్లవలసిన గమ్యాన్ని మర్చిపోతారట. ఇక్కడ కూడా సాహిర్ శైలి గమనించండి. ఆమెకు తానొక్కడే అన్న అహం, ఆమె సౌందర్యాన్ని బంధించాలనే అధికారం అతనిలో కనిపించవు. తాను ఆమె కురుల మాయలో చిక్కుకున్ననని చెప్పడంలో ఓ నిందారోపణ ఉంటుంది. సాహిర్ అది చేయట్లేదు. పైగా ఆమె అందానికి ఎందరో మోహితులవుతారని అది సాధారణం అని నమ్ముతూ దాన్నే ఇలా వ్యక్తీకరిస్తున్నాడు. నీ దరికి చేరే బాటసారులు నీ సౌందర్యానికి సమ్మోహితులై ఇక్కడే ఆగిపోతున్నారు. వారి గమ్యం వారికి గుర్తుకు రావట్లేదు. అందుకని ఆ కురుల ముడులను కాస్త విప్పి వారిని ఆ మాయ నుండి రక్షించమని అడుగుతున్నాడు అతను.

యే బాహే జబ్ హమే అప్నీ పనాహోం మే బులాతీ హై (2)
హమే అప్నీ కసం
హమే అప్నీ కసం హం హర్ సహారా భూల్ జాతే హై

(ఈ బాహువులు నన్ను తమ రక్షణ లోకి పిలుస్తుంటే నామీద ఒట్టు నేను అన్ని ఆసరాలను మర్చిపోతున్నాను)

ప్రేమ గీతాలలో ఈ వాక్యాలు నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టమయినవి. స్త్రీ మనసును, ప్రేమలో ఆమె కోరుకునే రక్షణను,  ఆశ్రయాన్ని సాహిర్ అందమైన పదాలతో చాలా సరళంగా వ్యక్తీకరించారని అనిపిస్తూ ఉంటుంది. ఈ పాటను ప్రతి సారి ఈ వాక్యం కోసం వినడానికి ఇష్టపడతాను. ‘ఏ బాహే జబ్ హమే అప్నీ పనాహోం  మే బులాతీ హై’ చాలా అందమైన వాక్యం ఇది. అతని బాహువులలో ఆమెకు దొరికే నీశ్చింత, ఆదరణ, భరోసాను చాలా అందంగా వ్యక్తీకరించిన వాక్యం ఇది. ఆ బాహువులు తమ ఆశ్రయంలోకి రా రమ్మని ఆమెను పిలుస్తుంటే ఆమె జీవితంలోని ఇతర ఆలంబనలను, సుఖాలను, ఆసరాలను ఆమె మర్చిపోతుందట. ఈ వాక్యంలో ప్రేమ కలిగించే మత్తు, అందించే నిశ్చింతను అత్యంత మధురంగా వ్యక్తీకరించారు సాహిర్.

పైగా ఆమె తనమనసులోని కోరిక బైట పెట్టుకుంటూ నా మీద ఒట్టు నేనన్నీ మర్చిపోతాను అని చెప్పడం గమనించండి. ఇతరులపై ఒట్టు పెట్టడంలో చాలా సందర్భాలలో ఓ బలవంతం లేదా అబద్ధం మోసం ఉంటుంది. ఆమె తన మీద ఒట్టు పెట్టుకుని నేను అన్ని మర్చిపోతాను అని చెప్పడంలో అమాయకత్వం నిజాయితీ ద్వనిస్తాయి. ఆ చెప్పే దానిలో ఏ మాత్రం తప్పు ఉన్నా ఆ నష్టం తానే పడాలనే అమాయకపు తపన ఉంటుంది. అలాగే తనకు జీవితంలో ఇంకా కొన్ని ఆసరాలు ఉన్నాయి కాని వాటన్నిటిని మరపించే ప్రేమ అతనిది అని చెప్పడంలో ఆమె ప్రేమరాహిత్యంతో కొట్టుకుపోవట్లేదని, కాని అతని ప్రేమ ఆమెకు ముఖ్యం అని ఆమె చెప్పడంలో నిజాయితీ ఉంది. పొరపాటున కూడా సాహిర్ అతివాదాన్ని అలంకారం కోసం కూడా ప్రేమ గీతాలలో ఉపయోగించలేదు. భయంకరమైన నిజాయితీతో ఆయన ప్రేమ గీతాలను రాసారు. చుక్కలను కోసుకొస్తాను, చంద్రుడిని నీ కోసం దింపుతాను లాంటి ఉదాహరణలు సాహిర్ ఎప్పుడు రాయలేదు. అయినా ఆయన పాటల్లోని ఆ ప్రేమ తత్వం మనసులని హత్తుకుంతుంది, మైమరపిస్తుంది కూడా.

తుమ్హారే నర్మ్-ఓ-నాజుక్ హోఠ్ జిస్ దమ్ ముస్కురాతే హై (2)
బహారె ఝేంప్ తీ హై ఫూల్ ఖిలానా భూల్ జాతే హై
యే ఆంఖే దేఖ్ కర్ హం సారీ దునియా భూల్ జాతే హై

(నీ మెత్తని నాజూకైన పెదాలు చిరునవ్వులు చిందిస్తే వసంతం సిగ్గుపడుతుంది, పూలు విచ్చుకోవడం మర్చిపోతాయి.)

ఆమె చిరునవ్వులతో వసంత ఋతువు పులకరించిపోతుందట, పూలు విచ్చుకోవడం మర్చి అమెను విస్మయంగా చూస్తాయట. ఆమె సౌందర్యం ప్రకృతికే వన్నే తెస్తుందనే అతని వ్యక్తీకరణలో అతిశయోక్తి అలంకారం కనిపిస్తుంది. సాహిర్ తన పాటలలో చాలా తక్కువగా ఈ శైలిని ప్రయోగిస్తారు. అయితే అది అతని భావన. ఆ ఒక్క ప్రేమోన్మాద క్షణంలో పకృతిని మించిన స్త్రీ అందంపై మోహంతో కొట్టుకుపోతున్న ఓ ప్రేమికుడి వ్యక్తీకరణ ఇది. ఒక స్త్రీ ప్రేమకు పురుషుని ప్రేమకు మధ్య తేడాను స్పష్టంగా చూపించే చరణం ఇది. ఆమె అతనిలోని ఆ ఆశ్రయం ఇచ్చే భావనని కోరుకుంటుంది. అతను ఆమె సౌందర్యానికి ముగ్దుడవుతున్నాడు. ఈ తేడా ప్రతి స్త్రీ పురుష జంటలో ప్రస్పుటంగా కనిపించేదే.

బహుత్ కుఛ్ తుమ్ సే కెహనే కి తమన్నా దిల్ మే రఖ్ తే హై (2)
మగర్ జబ్ సామ్నె ఆతే హై కహనా భూల్ జాతే హై

(నీకెన్నో చెప్పుకోవాలనే కోరిక నా మనసులో ఉంటుంది. కాని నువ్వు ఎదురుపడగానే చెప్పడం మర్చిపోతాను)

ఈ వాక్యంలో కూడా సాహిర్ శైలి గమనించండి. అతనికి ఎన్నో చెప్పుకోవాలని ఆమె అనుకుంటుంది. కాని అతను ఎదురు పడగానే చెప్పడం మర్చిపోతుంది. ఆ చెప్పవలసిన సంగతులు మనసులో ఉంటాయి. కాని వాటిని చెప్పడం ఆమెకి అతని సమక్ష్యంలో గుర్తుకు రాదు. ఇదే సందర్భంలో ఆ చెప్పాలనుకున్నవి మర్చిపోతున్నాను అని చాలా మంది కవులు రాసిన పాటలున్నాయి. కాని దాన్ని దాటి వాటిని మర్చిపోవడం కాదు అవి చెప్పాలనుకున్నది మర్చిపోతున్నాను అని ఆమె అనడంలో ఆ ప్రేమలో ఆమె మరీ మరీ ఎంతగా కూరుకుపోయిందో, అతని సాన్నిహిత్యంలో తాను చేయాలకునే వాటినెన్నిటిని మర్చిపోతుందో ఆమె చెప్పడం చాలా బావుంటుంది. చెప్పాలనుకున్నవి మర్చిపోవడం అంటే గుర్తు చేసుకునే ప్రయత్నం జరిగిందని. కాని ఆమె అతని సమక్షంలో తనను తాను ఎంతగా కోల్పోతుందంటే తానేం చేయాలనుకున్నదో మర్చిపోయి ఏదీ గుర్తు చెసుకోలేని స్థితిలోకి ఆమె వెళ్ళిపోయిందనమాట. ఓ చిన్న పదంతో ఆ వాక్యాలలో ప్రేమ లోతును సాహిర్ ఎంతగా వ్యక్తీకరించారో గమనించండి. ‘జబ్ సామ్నే ఆతే హో కెహనా భూల్ జాతే హై’ సూపర్ ఎక్స్‌ప్రెషన్ కదూ.

ముహబ్బత్ మే జుబాన్ చుప్ హో తో ఆంఖే బాత్ కర్ తీ హై (2)
వో కెహ్ దేతీ హై సబ్ బాతే జో కెహనా భూల్ జాతే హై
యే ఆంఖే దేఖ్ కర్ హమ్ సారి దునియా భూల్ జాతే హై (2)

(ప్రేమలో పెదాలు మాట్లాడకపోయినా కళ్ళు మాట్లాడతాయి. నువ్వు చెప్పడం మర్చిపోయిన సంగతులన్నీ అవి చెప్పేస్తాయి.)

ఆమెకు జవాబుగా అతను ఇలా అంటున్నాడు. ప్రేమలో ఉన్నప్పుడు నోటితో మాట్లాడక్కర్లేదు. నోరు దాటలేని, చెప్పలేని, చెప్పాలనుకుని మర్చిపోయినవన్నిటినీ కళ్ళు చెప్పేస్తాయి. అంటే ఆమె ఏం చెప్పకపోయినా ఆమె మనసులోని విషయాలన్నిటిని ఆమె కళ్ల ద్వారా అతను అర్థం చేసుకోగలుగుతున్నాడు. ఆమెను అతను అంత ప్రేమిస్తున్నాడన్న మాట. నోరు తెరవకుండా అవతలి వాళ్లు మన మనసును చదవగలిగారంటే ఆ వ్యక్తితో గొప్ప బంధం ఏర్పడినట్లే.

ఈ పాటలో ఆమె అతని కళ్ళతో మొదలుపెట్టి తన ప్రేమను వ్యక్తీకరిస్తుంది. అతను చివరకు ఆమె కళ్ళ దగ్గరకు వచ్చి ఆగుతాడు. సినిమా కథకు ఈ కళ్ళే ముఖ్యం. ఆ పాయింట్‌ని ఎస్టాబ్లిష్ చేస్తూ కథకు అనుకూలంగా రాసిన ప్రేమ గీతం ఇది. అయినా సినిమా చూడకపోయినా ఈ పాట విన్న వారిని అలరిస్తుంది. ప్రేమ సంభాషణకు కళ్ళే ప్రధానం. చెప్పలేని ఎన్నో భావాలు వినిపిస్తాయి మనిషి నేత్రాలు. ఆ నేత్ర సౌందర్యాన్ని స్మరిస్తూ, కళ్ళ చుట్టూ నడిచే ఈ సినీ కథకు ఓ గొప్ప ప్రేమ గీతాన్ని అందించారు సాహిర్.

హృడయనాథ్ మంగేష్కర్ సంగీతంలో లత, సురేష్ వాడ్కర్ పాడిన ఈ గీతం ఆ రోజుల్లో ఓ పెద్ద హిట్. హిందీ ప్రేమ గీతాలలో ఒకటిగా ఈ రోజుకీ వినిపిస్తూ ఉంటుంది. సాహిర్ మరణించిన తరువాత రిలీజ్ అయిన ఈ సినిమా చివరి దాకా ఆయన కలం చేసిన మాయకు ప్రతీకగా నిలిచిపోయింది. ఈ రోజుకీ నాకు ఈ వాక్యాల దగ్గర ఆగి మళ్ళీ మళ్ళీ ఈ పాటను వినాలనిపిస్తుంది.

యే బాహే జబ్ హమే అప్నీ పనాహో మే బులాతీ హై (2)
హమే అప్నీ కసం
హమే అప్నీ కసం హం హర్ సహారా భూల్ జాతే హై..

Images Source: Internet

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version