Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్’-42 – కభీ ఖుద్ పే కభీ హాలాత్ పే రోనా

[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

వారం విశ్లేషిస్తున్న పాట చిత్రం ‘హమ్ దోనో’ (Hum Dono, 1961) చిత్రం లోని ‘కభీ ఖుద్ పే కభీ హాలాత్ పే రోనా’. గానం రఫీ. సంగీతం జయదేవ్.

~

విషాదం అన్ని రకాల మాయలను వదిలించి, జీవితాన్ని మనకు పరిచయం చేస్తుంది. మనిషి విషాదాన్ని అనుభవిస్తే తప్ప తాత్వికంగా ఎదగలేడు. సాహిర్ విషాదాన్ని గురువుగా భావించారు. మనసుని దుఃఖంలోకి నెట్టివేసే ప్రతి అనుభవాన్ని జీవిత పాఠంగానే ఆయన గుర్తించారనిపిస్తుంది. విషాద గీతాలు చాలా మంది రాసారు. కాని ఆ విషాదంలో జీవితసారాన్ని రంగరిస్తూ, అసలు జీవితం అంటే అర్థం ఏంటీ అనే ప్రశ్నకు సాహిర్ ప్రతి గీతంలోనూ జవాబు వెతుకుతూనే ఉన్నరనిపిస్తుంది. మానవ సంబంధాలు, వాటి ద్వారా మనం ఎదుర్కునే అనుభవాలన్నిటి వెనుక మానవ స్వార్థం పని చేస్తూ ఉంటుంది. అదే మన అనుభూతులతో మమేకమయి మనల్ని ఎన్నో భావోద్వేగాలకు గురి చేస్తుంది. ఈ మానవ స్వార్థాన్ని దర్శించి, ఒప్పుకుని జీవితంలోని అనుభవాల నుండి దాన్ని విడదీసి చూస్తే మనిషిని ఎక్కువగా ప్రభావితం చేసేది స్వార్థమే అని అర్థం అవుతుంది.

మన కోరికలు, ఊహలు, ఆశయ సాధన కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ మనకు విషాదాన్నే తీసుకొస్తాయి. అయినా మనిషి వాటిని అంటిపెట్టుకునే ఉండాలి. లేకపోతే మానవ జాతి ఎదుగుదల ఉండదు. అయితే వాటిని అంటుకుని ఉంటూ వాటికి అంకితం కాకుండా నిలబడగలగడం చాలా కష్టం. అది సాధించలేకే మనిషి విషాదానికి లోనవుతాడు. తాను కోరుకున్నది దక్కనప్పుడు, తన జీవితంలోని అసంతృప్తులను గుర్తు చేసుకున్నప్పుడు మనిషిలో దుఃఖం మొదలవుతుంది. ఆ అసంతృప్తుల వెనుక మనిషి కోరిక ఉంటుంది. ఎంత ప్రయత్నించినా ఈ కోరికలను మనిషి తన నుండి వేరు చేసుకోలేడు. అవి మనసులోనుండి బైటికి వస్తూ, ఆశలు రేపుతూ తీరితే ఆనందాన్ని తీరక పోతే దుఃఖాన్ని అందిస్తూ ఉంటాయి. మనిషి అనుభవించే విషాదానికి కోరికలతో నిండిన మనసే కారణం.

ఈ సారాన్ని ఓ అద్భుతమైన గజల్ గా ‘హమ్ దోనో’  అనే సినిమాకు సాహిర్ రాసారు. జయదేవ్ సంగీతం అందిస్తే, రఫీ గానం ఆ పాటను సజీవం చేసింది. ‘హమ్ దోనో’ సినిమాలో పాటలన్నీఅద్భుతాలే. అప్పటి దాకా ఎస్.డి. బర్మన్ దగ్గర అసిస్టెంట్‌గా పని చేస్తున్న జయదేవ్‌కు సంగీత దర్శకుడిగా ఇది తొలి అవకాశం. ఆ తరువాత అయన అనుకున్న రీతిలో విజయం సాధించలేకపోయినా, ఈ సినిమా పాటలు చాలు ఆయన కీర్తిని సజీవంగా నిలపడానికి. ఇందులో ఉన్న పాటలన్నిటిలోంచి  ఒకటి ఎన్నుకోవడం కష్టం. నేనే దశాబ్దాల వారిగా నా జీవితంలో ఈ సినిమాలో ఒకో పాటతో రిలేట్ అవుతూ వస్తున్నాను.  కాలేజీ రోజుల్లో “మై  జిందగీ కా సాథ్ నిభాతా చలా గయా” నాకెంతో ఇష్టం అయిన పాట. తరువాత “అభీ నా జావో ఛోడ్‌కర్” పిచ్చి పట్టించేది. నలభైలలోకి  నేను చేరేసరికి జీవితం నెత్తి మీద వేసిన మొట్టికాయలు “కభీ ఖుద్ పే” అంటూ సాగే ఈ పాట వైపుకు నన్ను నెట్టాయి. ఇక అరవైలోకి వచ్చాక బహుశా “అల్లా తేరో నాం” పాట వైపుకు వెళ్తానేమో మరి. కాని ప్రస్తుతం మాత్రం ఏ ఒక్క రోజు కూడా “కభీ ఖుద్ పే” పాటలోని వాక్యాలను గుర్తు చేసుకోకుండా నాకు గడవట్లేదు. ఇందులో ప్రస్తావించే ప్రతి అనుభవం నా స్వీయానుభవం కూడా కాబట్టి ఈ పాట విశ్లేషణ వ్యక్తిగతం కాకుండా నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నాను.

కభీ ఖుద్ పే
కభీ ఖుద్ పే కభీ హాలాత్ పే రోనా ఆయా
కభీ ఖుద్ పే
కభీ ఖుద్ పే కభీ హాలాత్ పే రోనా ఆయా
బాత్ నికలీ తో హర్ ఎక్ బాత్ పే రోనా ఆయా
బాత్ నికలీ తో హర్ ఎక్ బాత్ పే రోనా..

(కొన్ని సార్లు నా గురించి మరి కొన్ని సార్లు పరిస్థితుల కారణంగా  ఏడుపు వస్తోంది.  ఏ విషయాన్ని పైకి తోడినా, ప్రతి విషయానికి నాలో దుఃఖం పెల్లుబుకుతుంది)

జీవితంలో గడిచిపోయిన కాలం నాలో నించి ఆ పాత నన్నుని కూడా తీసుకుని వెళ్లిపోయింది. నా గురించి నేను ఆలోచిస్తే నా మనసులో సమాధి చేయబడిన ఎన్నో సంగతులు ఆనాటి నేనులో కనిపించి దుఃఖం పెళ్ళుబుకుతుంది. ఆ నాటి అమాయకత్వం, మనుషులపై ఆశ, ప్రేమ స్నేహమ్ పై నమ్మకం ఇవన్నీ ఇప్పుడు నాలో మచ్చుకైనా కానరావు. అత్యంత సున్నితంగా ఆలోచించే ఆ మనసు ఇప్పుడు లేదు. అందుకే ఆ పాత నేనును నేను తలచుకోను. చాలాసార్లు ఇప్పటి నేను, నన్ను ఇలా మార్చిన పరిస్థితులు గుర్తుకు వస్తే కళ్లలో నీటి చెమ్మ ఊరుతూ ఉంటుంది. అందుకే సాహిర్ రాసిన ఈ రెండు వాక్యాలు అచ్చం నా మనసులోవి గానే అనిపిస్తాయి. ఏ సంగతి గుర్తుకు వచ్చినా ప్రతి దాంట్లోనూ గాయలు, కాలం చిదిమిన కోరికలు, ఆశలు కనిపించి కళ్లు చెమ్మగిల్లుతాయి. కవి ఈ నా అనుభవాన్ని రెండు వాక్యాలలో బంధించారనిపిస్తుంది. కొన్ని సార్లు నన్ను నేను చూసుకుంటూ, మరి కొన్నిసార్లు పరిస్థితులను విశ్లేషించుకుంటున్నప్పుడు గుర్తు కొచ్చిన ప్రతి గత కాలపు జ్ఞాపకనికి కళ్ళు చెమ్మగిల్లుతాయి అని కవి తన గురించి చెప్తున్నారా, పాటను వింటున్న నా గురించి చెప్తున్నారా అనిపించి మనసు భారంగా మారిపోతుంది.

హమ్‌తో సంఝే థే కి హమ్ భూల్ గయే హై ఉన్ కో
హమ్‌తో సంఝే థే
హమ్‌తో సంఝే థే కి హమ్ భూల్ గయే హై ఉన్ కో
క్యా హుఆ ఆజ్ యే కిస్ బాత్ పే రోనా ఆయా (2)
కభీ ఖుద్ పే కభీ హాలాత్ పే రోనా..

(నేను తనను మర్చిపోయాననే అనుకున్నాను. కాని ఎందుకని ఇవాళ ఏ విషయం గురించో మరి ఇంతలా  ఏడుపు వస్తుంది)

సినిమాలో ఈ సందర్భం ప్రేమికుడు మర్చిపోయిన ప్రియురాలిని గుర్తు చేసుకుంటూ పాడినట్లు చిత్రీకరించారు. కాని ఈ రెండు వాక్యాలు నా జీవితానికి అన్వయించుకుంటే, జీవితంలో ముందుకు అడుగు వేసే క్రమంలో నాకు తోడు రాని వారిని, తోడుగా మారని విషయాలని వదిలించుకుని  నేను వేసిన ముందడుగు నాకు గుర్తుకు వస్తూ ఉంటుంది. నన్ను కాదని వెళ్లిపోయిన వారందరిని దాటుకుని జీవించడం అలవాటయింది. అదే నా జీవితంలో నేను సాధించిన విజయం కూడా. కాని, గతాన్ని, గతంలోని మనుషులను మర్చిపోయాననుకున్నా, ఏదో ఓ సందర్భంలో కొన్ని విషయాలు గుర్తుకు వచ్చి నాలో విషాదం కమ్ముకుంటుంది. అందుకే ఏదో ఓ సందర్భంలో ఏదో  అనుభవం మధ్య ఆ గత కాలపు జ్ఞాపకాలు ఎదురయి నేను మర్చిపోయాననుకున్న వ్యక్తులు పరిస్థితులు, కోరికలు గుర్తుకు వచ్చి ఒంటరిగా కన్నీరు కార్చిన సంఘటనలు అడపాతడపా జీవితంలో జరుగుతూనే ఉన్నాయి. కవి ఈ వాక్యాలలో నేను అనుభవిస్తున్న ఆ విషాదాన్నే ఇక్కడ వ్యక్తీకరిస్తున్నారు. పూర్తిగా మర్చిపోయాను అనుకున్న జ్ఞాపకాలు మళ్ళి మళ్ళీ ఏదో సందర్భంలో బాధపెట్టి కన్నీళ్ళు తెప్పించడం ఇంకా నాకు ఆశ్చర్యం కలిగిస్తూనే ఉంటుంది.  అందుకే ఈ వాక్యాలు నా గురించే అని ఈ పాట విన్న ప్రతి సారి నాకు అనిపిస్తూ ఉంటుంది.

కిస్ లియె జీతే హై హమ్
కిస్ లియె జీతే హై హమ్ కిస్ కే లియే జీతే హై
బారహా ఐసే సవాలాత్ పే రోనా ఆయా (2)
కభీ ఖుద్ పే

(ఎందుకు జీవిస్తున్నాను? ఎవరి కోసం జీవిస్తున్నాను?  తరుచుగా ఇలాంటి ప్రశ్నలకు ఏడుపు వస్తుంది)

ఒక వయసుకు వచ్చాక, మనుషుల తత్వం అర్దం అయ్యాక మనలను పదే పదే వేధించే ప్రశ్న ఒకటే “ఎవరి కోసం జీవిస్తున్నాం, ఎందుకు జీవిస్తున్నాం. నిజానికి జీవించడానికి ఓ కారణం ఉండడం చాలా అవసరం. కాని ఆ కారణం అర్థం కానప్పుడు, అసలు కారణమే లేకపోతే ఆ జీవితం ఎంత కష్టంగా ఉంటుంది? జీవితంలో అన్నీ ఉంటాయి. కాని వేటికీ మనం అర్ధాన్ని ఆపాదించుకోలేం. మనం అనుకున్నది ఒకటి అయితే మరోలా జీవిస్తాం. ఎన్నో అందీ అందక దాటిపోతాయి. మన జీవితం పైకి ఎంతో అందంగానూ గొప్పగానూ కనిపించినా మనవరకు అది పేలవంగా మిగిలిపోతుంది. ఇదంతా ఎవరి కోసం ఎందుకు అన్న భావం మనసులో చేరి ఎంతో కలవరానికి గురి చేస్తుంది. అది ఎంతటి విషాద స్థితి అంటే దాని నుండి తప్పించుకోవడానికే మనుషులు అర్థం లేని విషయాలతో జీవితాన్ని నింపేసుకుంటారు. ఏ ప్రశ్నలు మదిలో రేగనంత బిజీగా జీవితాలను మార్చుకుంటారు. ఈ ప్రశ్న మనసులో చేరిందంటే అది మనిషిని తినేస్తుంది. అది ఎంత విషాద స్థితో అనుభవించిన వారికే అర్థం అవుతుంది.

కౌన్ రోతా హై కిసీ ఔర్ కీ ఖాతిర్ ఐ దోస్త్ (2)
సబ్ కో అప్నీ హీ కిసీ బాత్ పే రోనా ఆయా (2)
కభీ ఖుద్ పే
కభీ ఖుద్ పే కభీ హాలాత్ పే రోనా ఆయా
బాత్ నికలీ తో హర్ ఎక్ బాత్ పే రోనా ఆయా
కభీ ఖుద్ పే

(ఎవరు మరొకరి కోసం  ఏడుస్తారు మిత్రమా? అందరికీ తమకు సంబంధించిన ఏదో ఒక విషయానికే దుఃఖాన్ని అనుభవిస్తారు)

ఈ రెండు వాక్యాలను రాసిన సాహిర్ నాలాంటి వారిని ఎన్నో భ్రమల నుండి దూరం చేసాడు. మొదట్లో ఇవి విన్నప్పుడు చాలా కఠినంగా రాసిన మాటలుగా అనిపించాయి. కొంత ఉక్రోషం కూడా వచ్చింది. ఎవరికో ఏదో జరిగితే కన్నీళ్ళు కార్చే నా అలవాటుని సాహిర్ గేలి చేస్తున్నట్లు అనిపించేది.  అన్ని స్పందనలూ మన అనుభవాల ఆధారంగానే ఉంటాయని జీవితం నేర్పించినప్పుడు వీటిని ఒప్పుకోవడం కష్టం అయింది. కొన్నిటికి విపరీతంగా స్పందించి కొన్నిటిని చూసి చూడనట్లు ఉండే మానవ నైజం వెనుక తమకు అనుభవం అయిన విషయం పట్ల మనిషి చూపించే స్పందనే ముఖ్య కారణం అని జీవితానుభవం చెప్పిన తరువాత పరీక్షించి చూస్తే ప్రతి ఒక్కరూ తమ  మనసుకు దగ్గరయిన అనుభవాలకే నిజాయితీగా స్పందిస్తారని, ప్రతి వారి ఏడుపు వారి స్వంత అనుభవాల ఆధారంగానే ఉంటుందని ఒప్పుకోక తప్పలేదు.

ప్రతి మానవ స్పందనా స్వీయ కేంద్రీకృతమే. ప్రతి దుఃఖానికి కారణం ఆ వ్యక్తి గడిచిన జీవితానుభవంలోనే ఉంటుంది. శ్రీరాముడంతటి వాడు కూడా రావణునిపై యుద్దానికి వెళ్ళడం వెనుక కారణం ఆయన భార్యను రావణుడు అపహరించినందుకే కదా. తనకు అనుభవం కాని ఏ విషయం పట్ల కూడా మనిషి విషాదాన్ని అనుభవించడు. ప్రతిస్పందన చూపడు. అందరూ అన్ని రకాల విషాదాలకు కనెక్ట్ కారు. అయ్యారంటే దాని వెనుక వారి జీవితానికి, అనుభవానికి సంబంధించిన ఓ కారణం తప్పకుండా ఉంటుంది.

ఈ వాక్యాలు నాకు ఇతరుల దుఃఖాన్ని అర్థం చేసుకోవడానికి ఎంత సహాయపడ్డాయో, ఇతరుల విషాదపు మాయలోకి నేను పడకుండానూ చాలా సార్లు రక్షించాయి. ఇతరుల స్పందనల వెనుక కారణాలను ఆగి ఆలోచించే పరిపక్వతను నా వ్యక్తిత్వంలో జోడించాయి. నా అనుభవం కూడా ఇదే చెప్పింది. ఎవరూ ఇతరుల కోసం ఏడవరు. ప్రతి ఒక్కరూ తమ కోసం తమలోని భయాలు, తమలోని ఇష్టాల ఆధారంగానే విషాదాన్ని అనుభవిస్తారు. ఈ పాట నాకు ఇంతగా విపరీతంగా నచ్చిందంటే ఇది విన్న చాలా సందర్భాలలో కళ్ళు తడి అవుతాయి  అంటే ఇది నా జీవితానుభవం అయినందువల్ల తప్ప, ఎవరో దుఃఖాన్ని నాదిగా చేసుకుని నేను విషాదాన్ని అనుభవిస్తున్నానని కాదు. తాను పొందిన జాత్యాహంకార అనుభవమే గాంధీలో తన దేశం పట్ల ఆలోచన కలిగించింది. ఎంతటి గొప్ప వ్యక్తి జీవితాన్ని తీసుకున్నా గాని, వారు కార్చిన కన్నీరు, వారి స్వీయానుభవాలే వారి జీవితాన్ని నిర్దేశించాయి అన్నది స్పష్టం అవుతుంది..

మనుషులు నిజానికి తమలో తాము నిమగ్నులయి ఉంటారు. ఏ బంధంలోనయినా వారి స్పందన స్వీయ కేంద్రీకృతమే.  ఇది ఒప్పుకోవడం కష్టం. కాని ఇది నిజంగా నిజం. ఇది ఒప్పుకుంటే విషాదాన్ని అర్థం చేసుకోవడం సులువు అవుతుంది. మనకు మనం అర్థం అవడం మొదలెడతాము. కళ్ల నుండి చాలా పొరలు వదిలిపోతాయి.

ఈ గీతంలో విషాదంతో ద్వనించే తాత్వికత ఒక ఎత్తైతే, దీన్ని రఫీ గానం చేసిన విధానం అజరామరం. ఒక మనిషి నిర్వేదాన్ని అనుభవిస్తూ ఏ స్థితికి చేరగలడో రఫీ మనల్ని అక్కడకు తీసికెళతాడు. ఒక్కో షేర్ లోని ఆ రెండు వాక్యాలనే ఆయన విరిచి, పలికిన విధానం గమనించండి. కభీ ఖుద్ పే అంటూ మొదట ఆపి ఆ తరువాత మళ్ళీ ఆ పూర్తి వాక్యాన్ని పలకడం. రోనా.. అంటూ మొదటి రెండు చరణాలలో ఆ వాక్యాన్ని అసంపూర్తిగా వదిలేసి తనలోని నిస్సహాయతను ప్రకటించడం, తనతో తాను సంభాషించుకునే పద్ధతిలో సాగుతుంది ఈ గానం. అందుకే ఈ పాట వింటున్న ప్రతిసారి పాడేది మగ గొంతుకయినా అందులో లీనమయిన వారందరికీ తమ మనసు తమతో సంభాషిస్తున్నట్లు అనిపిస్తుంది. పది మంది మధ్య ఈ పాట ఎప్పుడయినా వినవలసి వస్తే ఏదో తెర నా ముఖం నుండి తొలగిపోయి, నా నిజ రూపం నలుగురికి కనిపించబోతుందనె భయం నాలో కలుగుతుంది. ఈ పాట పది మంది మధ్యలో వినవల్సి వస్తే ఎంత ఉత్సాహంగా   ఉన్నా ఒక రకమైన స్థబ్దతలోకి వెళ్లిపోతాను. అప్పటిదాకా నేను ప్రదర్శిస్తుంది అంతా నటన అని, ఈ పాట నా నిజాన్ని బట్టబయలు చేస్తుందని అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇది నలుగురిలో వినే సందర్భం రాకుండా జాగ్రత్తపడతాను.

అంతగా నాలో చొచ్చుకుపోయిన ఈ గీతంలో

కౌన్ రోతా హై కిసీ ఔర్ కీ ఖాతిర్ ఐ దోస్త్
సబ్ కో అప్నీ హీ కిసీ బాత్ పే రోనా ఆయా..

అంటూ సాగే వాక్యాలు జీవితాన్ని, విషాదాన్ని, మనుషుల్ని ఎదుర్కునే విషయంలో నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. నాలోని బలహీనమైన పార్శ్వాన్ని కూడా నేను నిష్పక్షపాతంగా చూసి, ఒప్పుకునే శక్తిని ఇచ్చాయి. ఈ పాట సాహిర్ గీతాలలోనే నాకు అమూల్యమైనది, నాలోకి ఇంకిన జీవన సారం కూడా.

ఈ పాటకు సంబంధించి నాకు తెలిసిన మరో విషయాన్ని పంచుకోవాలి. పాకిస్తాన్ దేశానికి చెందిన సైఫుద్ధీన్ సైఫ్ అనే కవి సాహిర్ సమకాలీనుడే. ఈయన లాగే సినీ కవి, నిర్మాత కూడా. ఈయన సినిమాలో మాటలు కూడా రాసేవారు. ఇద్దరూ లెఫ్టిస్టులే. ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోషియేషన్‌తో సంబంధం ఉన్నవారే. దేశ విభజన తరువాత సాహిర్ భారతదేశం వచ్చేస్తే సైఫుద్దీన్ లాహోర్ వెళ్లిపోయారు. వీరిద్దరి కవితా శైలిలో చాలా పోలికలు ఉన్నాయి. “కభీ ఖుద్ పే” గజల్‌ను పోలి సైఫుద్దీన్ రాసిన మరో గజల్ కూడా ఉంది. ఎవరి గజల్ ముందు వచ్చిందో తెలీదు. కాని సైఫుద్దీన్ గజల్ సాహిర్ రాసిన “కభీ ఖుద్ పే” టోన్ లోనే ఇలా సాగుతుంది.

హమ్ కో తో గర్ధిష్-ఎ-హాలాత్ పె రోనా ఆయా
రోనే వాలే తుఝే కిస్ బాత్ పె రోనా ఆయా
కైసే జీతె హై యె కిస్ తర్హ జియె జాతే హై
అహ్-ఎ-దిల్ కీ బసర్ ఔకాత్ పె రోనా ఆయా
జీ నహీ ఆప్ సే క్యా ముఝ్కో షికాయత్ హోగీ
హా ముఝే తల్ఖీ-ఎ-హాలాత్ పే రోనా ఆయా

సైఫ్ యే దిన్ తో ఖయామత్ కీ తర్హా గుజ్రా హై

జానె క్యా బాత్ థీ హర్ బాత్ పె రోనా ఆయా

 

ఇలా సాగే ఈ గజల్‌లో భగ్న హృదయ వేదన ఉంటే సాహిర్ రాసిన గజల్ పూర్తి తాత్విక విషాదంతో నిండి ఉంటుంది. సాహిర్ పై ప్రేమ ఉన్న వారికి ఆయన గజల్ లోని ఆ మార్మికత ఆకర్షిస్తుంది కాని సాహిర్‌ను పక్కన పెట్టి సైఫుద్దీన్ గజల్ వింటే ఈ ఇద్దరు కవులలో కనిపించే ఈ పోలిక మాత్రం ఆశ్చర్యం కలిగిస్తుంది. సాహిర్ 1921లో పుట్టి 1980లో తన 59 ఏళ్ళ వయసులో మరణిస్తే, సైఫుద్దీన్ సైఫ్ 1922 లో పుట్టి 1993 లో డెబ్బై ఏళ్ళ వయసులో మరణించారు. సైఫుద్దిన్ కవితలో సాహిర్ శైలి అచ్చు గుద్దినట్లు కనిపిస్తుంది.  ఇందులోని రెండో షేర్ పూర్తిగా సాహిర్ గజల్ లోని వాక్యాల అర్థాన్నే సూచిస్తుంది. (పైన ఇచ్చింది పూర్తి గజల్ కాదు. సాహిర్ శైలిని అందులో చూడడానికి గజల్‌లో సగ భాగానే ఇక్కడ ఇచ్చాను.)

Images Source: Internet

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version