Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్’-39 – ఆజ్ సోచా హై

[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

వారం విశ్లేషిస్తున్న పాట చిత్రం ‘చెహరే పే చెహరా’ (Chehre Pe Chehra, 1981) చిత్రం లోని ‘ఆజ్ సోచా హై’. గానం సులక్షణ పండిట్, రఫీ. సంగీతం ఎన్. దత్తా.

~

ప్రేమ అనే బంధంలో ఉన్నప్పుడు స్త్రీ పురుషులు దాన్ని వ్యక్తీకరించుకునే విధానంలో చాలా తేడా ఉంటుంది. ఈ లింగ భేధం వారి వ్యక్తిత్వంలో ఎంత కాదనుకున్నా వచ్చి చేరుతుంది. స్త్రీ పురుషుని సాంగత్యాన్ని అన్ని వేళలా కోరుకుంటుంది. దీన్ని పురుషుడు అంతగా గమనించడు. అందుకే ఏ బంధంలో నయినా స్త్రీ ఫిర్యాదుల చిట్టా పెద్దదిగానే ఉంటుంది. దీన్నే చాలా మంది ఎగతాళి చేస్తారు. ఫిర్యాదులు స్త్రీల వ్యక్తిత్వంలో భాగం అని గేలి చేస్తారు. కాని అందులో దాగి ఉన్న ప్రేమ, ప్రేమించిన వారి పట్ల స్త్రీలు కనపరిచే ఆదుర్దా, ఆందోళన అర్థం చేసుకునే పురుషులు చాలా తక్కువ. సాహిర్ తన గీతాలలో స్త్రీలు వ్యక్తీకరించే ఈ ప్రేమ, వారిలోని ఆదుర్దా పట్ల ఎంతో గౌరవం ప్రకటిస్తారు. దానికి ఉదాహరణగా ఈ గీతం చూద్దాం.

ఆజ్ సోచా హై ఖయాలోం మే బులాకర్ తుమ్‌కో
ప్యార్ కె నామ్ పె థోడీ సీ షికాయత్ కర్ లే

(ఈ రోజు నిన్ను నా ఆలోచనలలోకి పిలిచి ప్రేమగా కొన్ని ఫిర్యాదులు చేయాలని ఉంది)

సాహిర్ తన పాటలలో వాడే పదబంధాలు నాకు ఎప్పుడూ అద్భుతంగా అన్పిస్తాయి. ఈ పాటలో చూడండి. ప్రియుడు ఆమెను కలిసి చాలా రోజులు అయింది. అతన్ని చూడాలని ఆ ప్రియురాలు కోరుకుంటుంది. కాని అతని నుండి ఏ స్పందనా లేదు. అతను ఆమె మనసులో, నిండిపోయి ఉన్నాడు. అతని సాంగత్యం ఆమెకు కావాలి. ఆ దూరం భరించలేకపోతుంది. అతను తనని కలవట్లేదు కాబట్టి అతన్ని తన ఆలోచనలలోకి ఆమె పిలవాలనుకుంటుంది. అంతులేని, ప్రేమ, అంతం లెని ఫిర్యాదులను జత కలిపి సాహిర్ వాడిన ప్రయోగం ‘ఆజ్ సోచా హై ఖయాలోం మే బులాకర్ తుమ్‌కో’  అనే ఈ వాక్యం.

“నువ్వు నా దగ్గరకు రావట్లేదు. కాని నాకు నువ్వు కావాలి. రావడం రాకపోవడం నీ యిష్టం. కాని నా ఆలోచనలలోకి నిన్ను పిలిపించికోవడం నా నిర్ణయం, దానికి నీ అనుమతి అక్కర్లేదు. నువ్వు నా దగ్గరకు రాకుండా నిన్ను నీవు నియంత్రించుకోగలవు. కాని నా ఆలోచనలపై నీ నియంత్రణ పని చేయదు కదా.”

ఫిర్యాదులు చేయడం తప్పని స్థితి ఆమెది. మరి అతను కలిసి ఎన్నో రోజులయింది. అతన్ని చూడాలని ఆమె ఎంతగానో కోరుకుంటుంది. కాని అతను ఎదురుపడట్లేదు. అందుకని తన ఆలోచనలలో అతన్ని నింపుకుంటుంది. కాని ఆ ఆలోచనలోకి వచ్చిన ఆ ప్రియుడిపై కూడా ఫిర్యాదుల వర్షమే కురిపించాలనుకుంటుంది. ఇది స్త్రీ ప్రేమ నైజం. తన కలలలోకి ఆలోచనలలోకి, స్మృతులలోకి వచ్చి చేరిన ప్రియుడిని కూడా ఆమె ఫిర్యాదులతోనే స్వాగతించగలదు. మరి అతను ఆమెను ఎంత బాధకు గురి చేస్తున్నాడో అతనికే చెప్పేదాకా ఆమె ఎలా ప్రశాంతంగా ఉండగలదు? స్త్రీ కలలో కలిసిని పురుషుడిని కూడా ఫిర్యాదులతోనే పలకరించాలని అనుకుంటుందని ఆమె ద్వారానే చెప్పించడం సాహిర్ చేసిన చమత్కారమే కదా.

ఐసే బిఛడే హో కి జైసే కభీ మిల్నా హీ నహీ
ఐసే భూలే హో కి జైసే కభీ జానా హీ న థా
అజ్నబీ బన్ కె అగర్ యూ హీ సితం ఢానా థా
పాస్ ఆనా హీ న థా, పాస్ బులానా హీ న థా
ఆవో టూటే హుయె ఖ్వాబో కీ జియారత్ కర్ లే
ఆజ్ సోచా హై

(ఇక ఎప్పటికీ కలవని వాడిలా  వీడి వెళ్లిపోయావు,  అసలు ఎప్పుడూ పరిచయం లేని వ్యక్తిలా నన్ను మర్చిపోయావు కదా.  అపరిచితుడిలా మారి ఇలా గాయాల పాలు చేయాలనే అనుకుంటే నాకు దగ్గరగా రాకుండా ఉండవలసింది,  నీ దగ్గరకు నన్ను పిలిపించుకోకుండా ఉండవలసింది. రా నా పగిలిన స్వప్నాల తీర్థయాత్ర చేద్దాం.)

ఆమెకున్న పిర్యాదులను అతని ముందు బైటపెడుతుంది. ఎప్పటికీ కలిసే ఉద్దేశం లేనటుగా అతను ఆమెను వదిలి ఏ మాత్రం సమాచారం లేకుండా వెళ్ళిపోయాడు. పూర్వ పరిచయాన్ని తుడిచేసి ఆమెను మర్చిపోయాడు. గతం గుర్తు ఉంటే ఆమెతో అతను గడిపిన క్షణాలు అతనికి ముఖ్యం అనుకుంటే అవి గుర్తు కొచ్చి అతన్ని ఇబ్బంది పెట్టేవేగా. అప్పుడు ఆమెను అతను కలవకుండా తనను తాను నివారించుకోలేకపోయేవాడు. కాని అతను ఆమెను కలిసే ప్రయత్నం చేయట్లేదు. అంటే గతాన్ని మర్చిపోయాడా? కాని ఆమె ప్రతి నిముషం అతని జ్ఞాపకాలతో బతుకుతుంది. అందుకే ఇలాంటి శిక్ష నాకు ఇచ్చే ఉద్దేశం ఉంటే అసలు నన్ను నీకు దగ్గర చేసుకోవడం ఎందుకు? నన్ను నీ దగ్గరకు రానిచ్చింది ఎందుకు ఇలాంటి బాధాకరమైన జ్ఞాపకాలు మిగిలించి వెళ్లిపోవడానికా అని ఆమె అతన్ని ప్రశ్నిస్తుంది.

ఇక తరువాతి వాక్యం ఒక్క సాహిర్ కలం మాత్రమే రాయగలదు. ఇన్ని ఫిర్యాదులు చేసి అతన్ని తన పగిలిన స్వప్నాల ప్రపంచంలోని ఆమె రమ్మంటుంది. ఇక్కడ సాహిర్ ఓ గొప్ప ఉర్దూ పదం వాడారు. “ఆవో టూటే హుయె ఖ్వాబో కీ జియారత్ కర్ లే” అంటారు సాహిర్. జియారత్ అంటే పవిత్రమైన స్థలానికి చేసే యాత్ర. ఆ కలల ప్రపంచం ఇప్పుడు చెదిరిపోయినా అది ఆమె మదిలో  నిక్షిప్తమై ఉన్న ఓ పవిత్రమైన స్థలం. అందులోకి అతనితో కలిసి విహరించాలని ఆమెకు ఉంది. అంటే తన విరిగిన మనసును అతని ముందు ప్రకటించుకోవాలని ఆమెకు ఉంది. అతను దాన్ని చూడాలి, ఆమె బాధను అనుభవించాలి అన్నది ఆమె కోరిక. అతనిపై అన్ని ఫిర్యాదులు చేసి కూడా అతని ప్రవర్తనతో మనసు గాయపడింది అని చెప్తూ కూడా ఆ విరిగిన కలల ప్రపంచం తనకు పవిత్రమైన జ్ఞాపకం అంటూ చెప్తూ స్త్రీ చేసే ఫిర్యాదులలో ఆమె వ్యక్తీకరించే ప్రేమను చాలా గొప్పగా ఇక్కడ రాస్తారు సాహిర్. ఈ వాక్యం ఆమె పైన చెసే ఫిర్యాదులన్నిటినీ నిండైన ప్రేమకు ప్రతీకలుగా చూపెడుతుందో గమనించండి.

రంజిషే భీ వహీ పల్తే హై జహా ప్యార్ పలే
ప్యార్ హీ జిస్సే నహి, ఉస్ సే గిలా క్యా హోగా
మేరీ ఉమ్మీద్ హై తూ, తేరీ తమన్నా మై హూ
ఔర్ చాహత్ కీ దువావో కా సిలా క్యా హోగా
రంజిషే భూల్ కర్ ఖ్వాబో కో హకీకత్ కర్ లే
ఆజ్ సోచా హై..

(ప్రేమ ఉన్న చోటే కదా అసంతృప్తులు ఉండేది, ప్రేమ లేకపోతే ఫిర్యాదులు చేయడమే ఉండదుగా. నువ్వు నా ఆశవి, నీ కోరిక నేను. అనురాగం కోసం చేసే ప్రార్థనలకు ఈ ఫిర్యాదులే పురస్కారాలు కదా. అసంతృప్తులన్నీ మరిచి మన కలలనుని నిజం చెసుకుందాం)

ఆ ఫిర్యాదులను విన్న అతను ఆమెకు ఇలా ఇచ్చే జవాబు ఈ చరణం. ఆమె చేసిన ఫిర్యాదుల ద్వారా ఆమెకు తనపై ఉన్న ప్రేమను అతను అర్థం చేసుకుంటున్నాడు. అందుకే ఆ ఫిర్యాదులను లోకువ చేయట్లేదు, ఆమె వ్యక్తిత్వాన్ని  కించపరచట్లేదు. ప్రేమలో ఇలాంటి అసంతృప్తులు లేకపోతే అందులో లోతు లేనట్లే అని అతను అంగీకరిస్తున్నాడు. ప్రేమించిన వానిపై ఫిర్యాదులే లేవంటే అక్కడ ప్రేమ లేదనే అర్థం. అతని ఆశ ఆమె, ఆమె కోరిక అతను అయినప్పుడు ఈ అసంతృప్తులే వారి ప్రేమకు బలం. ఇలాంటి అనురాగం కోసమే కదా మనసు ప్రార్థనలు చేసేది. ఈ ఫిర్యాదులు ఆ అనురాగపు పురస్కారాలు. వాటిని అతను సంతోషంగా స్వీకరిస్తూ, ఆమెను అర్థం చేసుకుంటూ, అన్నిఅసంతృప్తులను పారదోలి మన కలలను నిజం చేసుకుందాం అని ఆమె ప్రేమకు తల వంచి ఆమెను స్వీకరించడానికి ముందడుగు వేస్తున్నాడు.

సాధారణంగా స్త్రీ ప్రేమను తృణీకరిస్తూ, ఆమె ఫిర్యాదులు తమ స్వేచ్చాజీవనానికి ఆటంకాలు అని భావించే పురుష స్వభావానికి జవాబుగా ఈ పాటను స్త్రీల పక్షాన సాహిర్ లోని ప్రేమికుడు రాసాడనిపిస్తుంది. స్త్రీ మనసును ఇంత సున్నితంగా వ్యక్తీకరించడం అందరికీ సాధ్యం కాదు. ఈ పాట రాసినందుకు అందుకే సాహిర్ అంటే నాకు మరీ మరీ ఇష్టం. స్త్రీల ప్రేమను అర్థం చేసుకోలేక వారు చేసే ఫిర్యాదులను ఎత్తి చూపిస్తూ వారిని తేలిక చేసే మగవారికి ఈ రెండు వాక్యాలు మళ్లీ మళ్ళీ వినిపించాలి..

రంజిషే భీ వహీ పల్తే హై జహా ప్యార్ పలే
ప్యార్ హీ జిస్సే నహి, ఉస్ సే గిలా క్యా హోగా

Images Source: Internet

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version