[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]
ఈ వారం విశ్లేషిస్తున్న పాట చిత్రం ‘తుమ్సా నహి దేఖా’ (Tumsa Nahin Dekha, 1957) చిత్రం లోని ‘యూ తో హమ్నే లాఖ్ హసీన్ దేఖే హైఁ’. గానం మహమ్మద్ రఫీ. సంగీతం ఓ. పి. నయ్యర్.
~
సాహిర్ కొన్ని సినిమాలకు ఒప్పుకుని మధ్యలో వాటిని వదిలేసిన సందర్భాలు ఎన్నో. కాని ఆయన రాసిన ఒకటి అరా పాటలను కూడా ఆ సినిమా వదిలేసుకున్నాక కూడా నిర్మాతలు పెట్టుకునేవారు. సంగీత దర్శకులతోనే ఆ సినిమాకు సంబంధించిన మరెవరితోనే ఏదో ఘర్షణ జరిగి సాహిర్ సినిమాను మధ్యలో వదిలేసేవాడు. అలాంటి సమయాలలో మరో సంగీత దర్శకుడిని పెట్టుకున్నా సాహిర్ రాసి ఇచ్చిన ఆ ఒక పాటను వదిలేయడానికి దర్శకులకు మనసు ఒప్పేది కాదు. దాన్ని కూడా తమ సినిమాకు కలుపుకునేవాళ్లు. సాహిర్ మీద ఎంత కోపం ఉన్నా ఆయన పాటల మీద అదే స్థాయిలో సినీ వర్గాలలో ప్రేమ ఉండేది.
1957 లో ‘తుమ్సా నహీ దేఖా’ అనే సినిమాతో నాసిర్ హుసేన్ దర్శకుడిగా తన కేరీర్ ఆరంభించారు. అంతకుముందు ఆయన పేయింగ్ గెస్ట్, మునీమ్ జీ వంటి సినిమాలకు రచయితగా పనిచేశారు. ఈ సినిమాకు దేవ్ ఆనంద్ వైజయింతిమాల కావాలనుకున్నారు ఆయన. కాని దేవ్ ఆనంద్ ఈ సినిమా చేయనన్నాడు. దానితో అప్పటికే తొమ్మిది ఫ్లాప్ లతో కుదేలయిన కెరీర్‌తో ఉన్న షమ్మీ కపూర్‌ని ఈ సినిమా కోసం తీసుకున్నారు. ఇక వైజయింతిమాల కాదని ప్రొడ్యూసర్ల దృష్టిలో ఉన్న అమితని హీరోయిన్గా తీసుకోవలసి వచ్చింది. ఆ సమయంలో సాహిర్ ఒక్క పాట రాసి ఉన్నారు. కాని ఆయన కూడా ‘దేవానంద్ హీరో కాబట్టి పాటలు రాసేందుకు ఒప్పుకున్నాను, లేకపోతే కమర్షియల్ సినిమాలకు పాటలు రాయన’ని సినిమా నుండి తప్పించుకున్నారు. అప్పుడు మజ్రూహ్ ఈ సినిమా పాటలు రాసే బాధ్యత తీసుకున్నారు. గేయ రచయితగా తన పేరు మాత్రమే స్క్రీన్ పై ఉండాలనే షరతుతోనే ఏ సినిమాకయినా మజ్రూహ్ పాటలురాస్తాడు. ఈ సినిమాకూ అదే షరతు విధించారు. దానికి అందరూ ఒప్పుకున్నారు. సినిమాలో తెరపై ఆయన పేరు ఒక్కటే గేయరచయితగా కనిపిస్తుంది. ఈ సినిమాకు మజ్రూహ్ మంచి పాటలను ఇచ్చారు. ఓ.పి. నయ్యర్ వాటికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు.
కాని సాహిర్ రాసిన ‘తుమ్సా నహీ దేఖా’ గీతం అన్ని మంచి పాటల మధ్య కూడా సూపర్ హిట్ అయింది. సినిమా పేరుకి సాహిర్ రాసిన పాట వాక్యాన్నే తీసుకోవడం కాక టైటిల్స్ అప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో ఇదే పాట రాగం వస్తుంది. సినిమాలో చక్కని పాటల మధ్య తాను రాసిన ఒకే ఒక పాట అలా మెరిసిపోవడం సాహిర్ గొప్పతనమే. టైటిల్స్‌లో ఆయన పేరు లేకపోయినా, ఆయన ప్రస్తావన గేయ రచయితగా ఎక్కడా లేకపోయినా ఇది సాహిర్ పాటగా జనంలోకి చేరింది. ఇప్పటికీ సాహిర్ మంచి పాటల్ లిస్ట్‌లో ఇది కనిపిస్తుంది. ఒక్క పాటతో తన సత్తా చాటగలిగారు సాహిర్. ఈ పాటను రఫీ గానం చేసారు. మళ్ళీ ఇదే పాటకు సంబంధించిన మొదటి చరణాన్ని మరో సందర్భంలో ఆశా గొంతులో రికార్డు చేసి హీరోయిన్ అమితపై చిత్రించారు. అంటే దీన్ని టైటిల్ పాటగానే కాక టాండం గీతంగా కూడా పరిగణించాలి.
షమ్మీ కపూర్ ఈ సినిమాలో తన స్టైల్ పూర్తిగా మార్చి మనకు తెలిసిన డాన్సింగ్ షమ్మీగా కనిపిస్తారు. ఇది సూపర్ హిట్ అవడంతో ప్రేక్షకులు ఆయన్ని అలాగే చూడాలని కోరడంతో ఆయన ఇతర సినిమాలన్నీ ఈ స్టైల్ లోనే సాగాయి. పైగా అతని ట్రెడిషినల్ డాన్స్ కదలికలు ఈ గీతంతో మొదలయ్యాయి. అంటే షమ్మీ కపూర్‌కు ఓ స్టైల్ స్థిరపడింది ఈ పాటతోనే.
యూ తో హమ్నే లాఖ్ హసీన్ దేఖే హైఁ తుమ్సా నహీ దేఖా హొ తుమ్సా నహీ దేఖా యూ తో హమ్నే లాఖ్ హసీన్ దేఖే హైఁ తుమ్సా నహీ దేఖా హొ తుమ్సా నహీ దేఖా
(నేను ఎందరో అందగత్తెలను చూసాను కాని నీలాంటి అమ్మాయిని ఎక్కడా చూడలేదు)
ఈ వాక్యం ఎంతగా పాపులర్ అయింది అంటే 2004లో కూడా ఇదే టైటిల్‌తో ఓ సినిమా వచ్చింది ప్రేమికుడు ప్రియురాలిని వర్ణించే ఎన్నో సందర్భాలలో ఈ వాక్యం ఓ కోట్గా నిలిచిపోయింది. అప్పటిదాకా ఎందరో అందగత్తెలను అతను చూసాడట. కాని ఆమెలాంటి అమ్మాయి అతనికి ఇప్పటిదాక కనపడలేదట.
సాహిర్ తన కవిత్వంలో పక్కా నిజాలను పలుకుతారు. ప్రేమికురాలు తనకు చాలా ప్రత్యేకం అని చెప్తూనే అలాంటి స్త్రీలు మరెందరో ఉన్నారని, ఆ అందం ఆమె ఒక్కదాని సొంతం కాదని కూడా చెప్తారు. సాధారణంగా ఇలా మరెవరయినా రాస్తే అందులో ప్రేమ పలకదు. ప్రేమ గీతాలలో అతిశయం కాస్త అతి తప్పకుండా ఉంటుంది. సాహిర్ ఎప్పుడూ ఈ శైలిని ఉపయోగించలేదు. అది ఆ జంట వ్యక్తిగత అభిప్రాయం కాని ప్రపంచంలో నలుమూలలా అందం ఉంది అని ప్రతి ప్రేమ గీతంలోనూ అతను తప్పకుండా చెప్తారు. ప్రేమికురాలి కన్నా ప్రేమ అనే భావానికి ఉన్నతమైన స్థానం ఇస్తారు సాహిర్. ఇది ఇతర కవుల ప్రేమ గీతాలతో పోల్చి చూస్తే అర్థం అవుతుంది.
ఉఫ్ యే నజర్ ఉఫ్ యే అదా (2) కౌన్ న అబ్ హోగా ఫిదా జుల్ఫె హై యా బద్లియా ఆంఖే హై యా బిజలియా జానె కిస్ కిస్కీ ఆయెగీ కజా యూ తో హమ్నే లాఖ్ హసీన్ దేఖే హైఁ తుమ్సా నహీ దేఖా ఆహాహా
(ఆహా ఏం చూపులు, ఏం వయ్యారం, ఎవరి మనసు పారేసుకోకుండా ఉండగలరు? అవి కురులా మేఘాలా, ఇవి కళ్లా మెరుపులా? ఎంతమందికి ఇవి భాగ్యాలవుతాయో, నేను ఎందరో అందగత్తెలను చూసాను కాని నీలాంటి అమ్మాయిని ఎక్కడా చూడలేదు)
ఈ చరణంలో సాహిర్ ఆమె అందాన్ని వర్ణిస్తున్నారు. ఆమె కురుల అందానికి, ఆమె చూపులకు పడిపోనివారుండరని, అవి వాళ్ళని వెంటాడి వేధించి శిక్షిస్తాయిని చెప్తున్నారు. సాధారణంగా ఇలాంటి వర్ణన పురుషుడు తన హక్కుగా చేస్తాడు. కాని స్త్రీ విషయానికి వచ్చేసరికి ఆమె అతని నీడలో ఉంటాను లాంటి మాటలు మాట్లాడుతుంది కాని అతని సౌందర్యాన్ని వర్ణించే పని చేయదు. స్త్రీ అలా ప్రేమను ప్రకటించకూడదన్నది చాలా మంది సాంప్రదాయవాదుల వాదన. కాని దీనికి భిన్నంగా సాహిర్ స్త్రీలు ప్రేమికుడు సౌందర్యాన్ని అది వారిని ఎంతగా అలరిస్తుందో చెప్పుకోవడానికి వెనుకాడరు. ఇదే చరణాన్ని టాండం గీతంగా ఆశా పాడారు. అక్కడ ప్రియురాలు ప్రియుడిని తలచుకుంటూ అతని అందమైన కురులను, అతని చూపులను అవి తనను ఎలా కట్టిపడేస్తున్నాయో చెప్తుంది. శారీరిక సౌందర్యాన్ని ఆస్వాదించే హక్కు పురుషుని ఒక్కనికి సొంతం కాదని స్త్రీకి కూడా ఆ హక్కు ఉందని, అది అసభ్యం కాదని ప్రేమలో సహజమైన మోహం అని సాహిర్ నమ్మేవారు. స్త్రీకు సంబంధించిన ప్రేమ గీతాలలో అవే భావాలను తూచ తప్పకుండా ఉపయోగించేవారు. ప్రేమ విషయంలో పురుషుడి ఆనందంలోనూ స్త్రీ పొందే ఆనందంలోనూ తేడా ఉండదని ఆయన స్పష్టంగా తన ప్రేమగీతాలలో రాసి వినిపించేవారు. అన్నిటికన్నా ఆశ్చర్యం ఆ పాటలని ఆనాటి సాంప్రదాయవాదులు కూడా స్వీకరించేవాళ్లు. ఆ పదాల కూర్పులో ఎక్కడా అసభ్యత ఉండకపోవడం ఓ హుందాతనం మేళవించి ఉండడం సాహిర్ గీతాల పట్ల శ్రోతల ఆదరణకు కారణం.
తుం భీ హసీన్ రుత్ భీ హసీన్ ఆజ్ యే దిల్ బస్ మే నహీ తుం భీ హసీన్ రుత్ భీ హసీన్ ఆజ్ యే దిల్ బస్ మే నహీ రాస్తే ఖామోష్ హై థడకనే మధ్హోష్ హై పియె బిన్ ఆజ్ హమే చఢా హై నషా యూ తో హమ్నే లాఖ్ హసీన్ దేఖే హైఁ తుమ్సా నహీ దేఖా హొ తుమ్సా నహీ దేఖా
(నువ్వూ అందంగా ఉన్నావు. వాతావరణం కూడా అందంగా ఉంది. ఇవాళ మనసు నా మాట విననంటుంది. ఈ దారి నిశబ్దంగా ఉంది, గుండే మత్తుగా కొట్టుకుంటుంది. తాగకుండానే నాకు మత్తు ఎక్కిపోయింది. నేను ఎందరో అందగత్తెలను చూసాను కాని నీలాంటి అమ్మాయిని ఎక్కడా చూడలేదు)
ఈ పాటను టాంగా గీతంగా పిలిచేవారు. గుర్రపు బండిపై ప్రయాణిస్తూ పాడే పాటలకు హిందీ సినిమాలలో ఓ క్లాసికల్ టచ్ ఉంది. మన సమయానికి అంతరించిపోయిన ఓ ఆనందం అది. టాంగా మెల్లిగా అందమైన చెట్ల మధ్య వెళుతూ ఉంటే ఆ గుర్రపు డెక్కల చప్పుడుతో అందమైన గానం కలగలసి ఒక వింత అనుభూతి అనుభవానికి వచ్చేది. ఇలాంటి ఎన్నో టాంగా పాటలు మనకు ఆనాటి ఓపీ నయ్యర్ సినిమాలలో కనిపిస్తాయి. టాంగా లయ అనగానే ఓపీ నయ్యర్ మాత్రమే గుర్తుకువస్తాడు. ఆమె సౌందర్యం అతన్ని పిచ్చివాడిని చేస్తుంది. చుట్టు ప్రకృతి అందంగా ఉంది. దారి నిశబ్దంగా ఉంది. ఆ వాతావరణంలో ఆమె సాంగత్యం అతనికి మత్తు ఎక్కిస్తుందట. తాగకుండా కూడా అతనికి మత్తు ఎక్కిపోతుందట.
తుమ్ న అగర్ బొలోగే సనం (2) మర్ తో నహీ జాయేంగే హమ్ క్యా పరీ యా హూర్ హో ఇతనే క్యో మగరూర్ హో మాన్ కె తొ దెఖో కభీ కిసీకీ కహా యూ తో హమ్నే లాఖ్ హసీన్ దేఖే హైఁ తుమ్సా నహీ దెఖా హొ తుమ్సా నహీ దేఖా యూ తో హమ్నే లాఖ్ హసీన్ దేఖే హైఁ తుమ్సా నహీ దేఖా హొ తుమ్సా నహీ దేఖా
(నువ్వు నాతో మాట్లాడకపోయినంత మాత్రానా చచ్చిపోనుగా. నువ్వు దేవకన్యవా, అప్సరసవా, ఇంత గర్వం నీకెందుకు, అవతలి వారు చెప్పిన మాట ఎప్పుడో ఒక సారి విని చూడు మరి. ఎందరో అందగత్తెలను చూసాను కాని నీలాంటి అమ్మాయిని ఎక్కడా చూడలేదు)
నువ్వు నాతో మాట్లాడకపోతే నేను చచ్చిపోను కాని నీకంత గర్వం ఎందుకు, నువ్వు దేవకన్యవా అప్సరసవా, మనిషివే కదా, అవతలి వాళ్ళు చెప్పే మాటలు వినడం నేర్చుకోవచ్చు కదా ఇంత అహం అవసరమా అని బెట్టు చేస్తున్న ఆమెను బనాయిస్తూనే ఆమె అందగత్తే కాని అంతగా గర్వ పడాల్సిన అవసరం లేదని చలోక్తి విసురుతున్నాడు.
ఆమెను ప్రేమిస్తూనే మోహిస్తూనే, ఆమె కేవలం మానవ కన్య అని ఆమె పరిధి కూడా చూపించి ఆమె గర్వాన్ని అణిచే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రేమని ఒప్పుకోని స్త్రీ గర్విష్టి అని కాదు కాని ప్రేమిస్తున్న స్త్రీలో కదలిక తీసుకురావడానికి కవి ఉపయోగిస్తున్న పద్ధతి ఇది. స్త్రీని ప్రేమిస్తూ ఆమె అస్తిత్వాని గుర్తిస్తూ, ఆమెను మోహిస్తూ కూడా మనం మనుషులమే, అంత అహం అక్కర్లేదు. సౌందర్యం సాధారణమే, నాకు నీ పై ఆకర్షణ కలిగిన మాట నిజం కాని అందం చుట్టుతా ఉంది అని చెప్పడంలో ఓ భిన్నత్వం ఉంది. ఆమెను స్తుతిస్తున్నాడు. ఆమె ప్రేమిస్తున్నాడు కాని ఆమె మానవాతీత వ్యక్తి కాదంటూ ప్రేమను ఆస్వాదిస్తూనే ఎక్కడా నియంత్రణ కోల్పోకుండా ఆలోచిస్తున్నాడు. సాహిర్ ప్రేమ గీతాలలో ఈ వైరుధ్యం కనిపిస్తూనే ఉంటుంది. ఈ పాటలో వెక్కిరింత ఉంది, ప్రేమ ఉంది, కోరిక ఉంది, కాని అంతర్లీనంగా ఒక మర్యాద కూడా ఉంది. హద్దులలో ఉంటూ స్త్రీతో పరాచకాలాడడం ఆ రోజుల్లోని పాటలలోని అందం.
దీన్ని రఫీ ఎంతో చక్కగా గానం చేసారు. ఉఫ్, అంటూ హాయ్ అంటూ అతను మధ్యలో ఇచ్చే ఆ ఎక్స్ప్రెషన్లు ఈ పాటకు జీవం పోసాయి. అంత అమాయకంగా కనిపించే రఫీ ఇలాంటి అల్లరి పాటలలో ఆ జీవం ఎలా తీసుకొస్తాడో తెలియదు. కాని ఈ పాటతో ఆయన షమ్మీ కపూర్ గొంతుకగా శాశ్వతంగా మిగిలిపోయారు. షమ్మీ నటన రఫీ గానం హిందీ చిత్ర పరిశ్రమలో శాశ్వతంగా నిలిచిపోయిన ఓ అద్వితీయమైన అందం. అన్నట్లు ఈ పాటకు ముందు షమ్మీ యాహో అని అరుస్తాడు. అది ఆ తరువాత ఓ ప్రఖ్యాత గీతం గాను షమ్మీ ట్రేడ్ మార్క్ నైజంగానూ నిలిచిపోయింది. యాహూ పుట్టింది ఈ పాట షూటింగ్ లోనే.. నెట్ లోకి ఎక్కే దాకా అది షమ్మీ ఒక్కడికే సొంతం అయిన మాట.
తుమ్ న అగర్ బొలోగే సనం మర్ తో నహీ జాయేంగే హమ్
ఈ వాక్యాలలో రఫీ పలికించే చిలిపితనం గమనించండి.. తేనె గొంతు నిండా నింపుకుని ఈ భూమిపైకి వచ్చిన గాన గంధర్వుడు రఫీ..
Images Source: Internet
(మళ్ళీ కలుద్దాం)
You must be logged in to post a comment.
పెరటి గోడ
మంచి మనుషుల మంచి కథలు – గాండ్లమిట్ట
The Butterfly Effect: Aadya and the Gift of Flight
జ్ఞాపకాల పందిరి-43
అమెరికా సహోద్యోగుల కథలు-14: తెలుగు తేజోమూర్తులు
నిదానస్థుడు
నా జీవిత యానం-6
అన్నింట అంతరాత్మ-5: ప్రేమ గురుతును నేను,, ఉంగరాన్ని!
నాలుగు ద్వారాలు
జరుగుతున్న కథ
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®