Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్’-36 – సుబహ్ కా ఇంతజార్ కౌన్ కరే

[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

వారం విశ్లేషిస్తున్న పాట చిత్రం ‘జోరూ కా భాయి’ (Joru Ka Bhai, 1955) చిత్రం లోని ‘సుబహ్ కా ఇంతజార్ కౌన్ కరే’. గానం 1. లత 2. తలత్. సంగీతం జయదేవ్.

~

టాండం గీతాలంటే ఒకే పాట, ఒకే ట్యూన్‌లో ఇద్దరు గాయకులు విడి విడిగా పాడేవి. గాయకులు వేరయినప్పుడు పాట ట్యూన్, పల్లవి ఒకటే ఉండి మధ్యలో సంధర్భాన్ని బట్టి లిరిక్స్ మారుతూ ఉంటాయి. సినిమాలలో ఈ పాట మొత్తం కథ లోని మూడ్‌ను పట్టుకుని ఉంటుంది. అందుకే టాండం గీతాలతో ఉన్న సినిమాలలో బలమైన కథ ఉంటుంది. చాలా సార్లు ఒక సందర్భంలో ఆనందం మరో సందర్భంలో విషాదం ఈ రెండు పాటల్లో ద్వనిస్తూ ఉంటాయి. ఒకటే ట్యూన్ ఉన్న పాట ఒక చోట మధురంగానూ ఒక చోట విషాదంగానూ ద్వనించాలి అంటే ఇది సంగీత దర్శకులకు పెద్ద పరీక్ష. అందుకే టాండం గీతాలను అప్పటి సంగీత దర్శకులు ఎంతో శ్రద్ధతో నిర్మించేవాళ్లు. పాటలో చిన్న చిన్న మార్పులు చేసి పాట మూడ్‌ను సందర్భాన్ని, మార్చడం గేయ రచయితలకు అంత తేలికైన పని కాదు. సాహిర్ చాలా సందర్భాలలో చక్కని టాండం గీతాలను రాసి తన ప్రతిభ నిరూపించుకున్నారు. దానికి ఉదాహరణగా ‘జోరూ కా భాయి’ సినిమాలో ఈ గీతం చూద్దాం.

మొదటి గీతాన్ని లతా మంగేష్కర్ పాడారు. ఇది సంగీత దర్శకుడు జయదేవ్‌కు సంగీత దర్శకుడిగా పూర్తి నిడివితో మొదటి సినిమా. ఈ పాట ఈ సినిమాలో రికార్డు అయిన మొదటి గీతం. అయితే దీనికి లత గొంతు కావాలన్నది జయదేవ్ పట్టుదల. సాహిర్ దీనికి అంగీకరించలేదు. ఇద్దరి మధ్య గొడవ అయింది. దర్శకులు చేతన్ ఆనంద్ ఈ విషయం విని సాహిర్‌ని తొలగించి ఈ సినిమాకు విశ్వామిత్ర ఆదిల్‌తో పాటలు రాయించుకున్నారు. అవి అన్నీ రికార్డ్ అయినా జయదేవ్‌కు తృప్తి కలగలేదు. చివరకు సాహిర్‌ని ఒప్పించి ఈ పాటను లతతో రికార్డు చేయించే అనుమతి పొంది దాన్ని రికార్డు చేసారు. లత అద్భుతంగా గానం చేసిన గీతాలలో ఇది ఒకటి. తలత్ మెహమూద్ గొంతులో విషాదాన్ని జోడిస్తూ మరో టాండం గీతాన్ని సాహిర్ రాయగా రికార్డు చేసారు. ఈ సినిమాలో ఈ పాట ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సాహిర్ ఈ సినిమా కోసం రాసిన ఒకే ఒక పాట ఇది. దాన్ని ఇతర పాటల మధ్య కూడా వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడలేదంటే సాహిర్ ప్రతిభ అర్ధం చేసుకోవచ్చు. సాహిర్‌ని ఇష్టపడని వారందరూ కూడా ఆయన పాటల ముందు తల వంచినవారే. ముందుగా మనం లత పాడిన గీతాన్ని తీసుకుందాం. ఇది పూర్తిగా రొమాంటిక్ గీతం. ప్రియుని పై కోరికతో అతని సాంగత్యాన్ని కోరుకుంటూ ప్రియురాలి పాడే గీతం ఇది.

సుర్మయీ రాత్ హై సితారే హై
ఆజ్ దోనో జహాన్  హమారే హై
సుబహ్ కా ఇంతజార్ కౌన్ కరే
సుబహ్ కా ఇంతజార్ కౌన్ కరే

(చీకటి రాత్రి ఉంది, నక్షత్రాలు ఉన్నై. నేడు రెండు ప్రపంచాలు మనవిగా ఉన్నాయి. పగలు కోసం ఎవరు ఎదురు చూస్తారు)

చీకటి రాత్రి ఏకాంతం ఉంది. ఆకాశంలో మెరిసే నక్షత్రాలు తోడుగా ఉన్నాయి. భూమి ఆకాశాలు రెండు కుడా వారి ప్రపంచాలుగా కన్పిస్తున్నాయి. అలాంటి సమయంలో వేకువ కోసం వేచి చూడడం మూర్ఖత్వం కదా. ఆ అందమైన వాతావరణాన్ని, తమ మనసుల్లో ఉన్న ప్రేమని కలబోసుకుని ప్రతి క్షణం ఆస్వాదించాలి కాని ఎప్పుడో వచ్చే వేకువ కోసం ఎదురు చూస్తానని అనడం మూర్ఖత్వం కాదా. ఆమె ఇంక దేనికి ఎదురు చూడకుండా అతనితో గడపాలనే కోరికను బైటపెడుతుంది. ఇక్కడ ఈ గడపడం అన్నది శారీరికమే అనుకోనక్కర్లేదు. అదే అయితే వేకువ కోసం ఎదురు చూడడం అనే ప్రసక్తి రాదు. ఇద్దరు ప్రేమికులు కలుసుకోవడానికి వేకువ కోసం వేచి చూడడం ఏంటీ. అందమైన ప్రకృతి తమను పిలుస్తుంటే, ఆ ఏకాంతాన్ని ఆస్వాదించాలి కాని వేకువ కోసం వేచి చూసి అప్పుడు కలుసుకోవడం అనేది మూర్ఖత్వమే కదా. ఈ అందమైన వాతావరణం, ఈ క్షణాలు అప్పటి దాకా మిగిలి ఉంటాయా అన్నది కవి వాదన.

ఫిర్ యె రుత్ యె సమా మిలే నా మిలే
ఫిర్ యె రుత్ యె సమా మిలే నా మిలే
ఆర్జూ కా చమన్ ఖిలే నా ఖిలే
వక్త్ కా ఐత్బార్ కౌన్ కరే
సుబహ్ కా ఇంతజార్ కౌన్ కరే

(మళ్ళీ ఈ ఋతువు, ఈ వాతావరణం దొరకకపోవచ్చు, మన కోరికల తోట వికసించవచ్చు వికసించకపోవచ్చు, సమయాన్ని ఎవరు నమ్ముకోగలరు? వేకువ కోసం ఎవరు ఎదురు చూడగలరు)

ఈ అందమైన ఋతువు, ఈ అందమైన వాతావరణం శాశ్వతాలు కావు. ఇది రేపు మనం కలుసుకోవాలనుకున్నప్పుడు ఇలాగే ఉంటాయనే నమ్మకం లేదు. మనలో వికసించే కోరికలు ఇవే పరిమళాలను అప్పటి దాకా నిలుపుకుంటాయని చెప్పలేం. ఇప్పుడు మనం అనుభవిస్తున్న స్థితి శాశ్వతం కాదు. అందుకే ఆ ఆనందానుభూతి మదిలో కలిగినప్పుడే దాన్ని అనుభవంగా మార్చుకోవాలి కాని సమయం కోసం వేచి చూడడం ఎంత తెలివి లేని ఆలోచన. ఇంత అందమైన రాత్రి వదిలి వేకువ కోసం ఎదురు చూస్తూ ఉంటే మనం పోగొట్టుకునే అనుభూతులను తిరిగి పొందగలమా? అప్పుడు ఇంత అందమైన ప్రకృతి మన మధ్య ఉంటుందని నమ్మకం ఏంటి అని అడుగుతుంది ఆమె.

సాహిర్ స్త్రీల నోట ఇలాంటి కోరికలను చాలా సులువుగా చెప్పిస్తారు. శ్రోతలని అవి చాలా సహజమైన భావాలుగా ఒప్పిస్తారు కూడా. ఈ వాక్యాలలో ప్రేమతత్వం తప్ప ఇప్పటి పాటలలో కనిపించే విచ్చలివిడితనం ఉండదు. ప్రియుడిని కలవాలనే కోరికే ఆమెలో కాని దాన్ని వ్యక్తీకరించే తీరులో ఎంతో హుందాతనం ఉంటుంది. శరీరాల వేడి, తోడు కోసం ఆతృత అందరిలోనూ నిద్రారణంగా ఉండే లక్షణాలే, కాని వాటిని వ్యక్తీకరించుకునే తీరులో మనుషులు ఆ సంబంధాలపై చూపించే గౌరవం కనిపిస్తుంది. ఆ గౌరవమే ప్రేమను, కామాన్ని వేరు చేస్తుంది. ఆ పరిధిని సాహిర్ తన గీతాలలో చాలా గొప్పగా ప్రదర్శిస్తాడు.

లే భీ లో హమ్ కో అప్నీ బాహో మే
లే భీ లో హమ్ కో అప్నీ బాహో మే
రూహ్ బేచైన్ హై నిగాహో మే
హాయ్
ఇల్తెజా బార్ బార్ కౌన్ కరే
ఇల్తెజా బార్ బార్ కౌన్ కరే
సుబహ్ కా ఇంతజార్ కౌన్ కరే
సుబహ్ కా ఇంతజార్ కౌన్ కరే

(నన్ను నీ బాహువుల్లో తీసుకో. నా ఆత్మ లోని అశాంతి కళ్ళలో కనిపిస్తుంది. హాయ్.. ప్రతి సారి ఏం మనవి చేసుకోగలను.. వేకువ కోసం ఎవరు వేచి ఉండగలరు)

ఇప్పుడు ఆమె అతన్ని తనను దగ్గరకు తీసుకొమ్మని, అతని కౌగిలి వెచ్చదనం తనకు కావాలని అడుగుతుంది. పైగా ఇది ఆమె శరీరపు కోరిక కాదు. ఆమె ఆత్మ అతన్ని కోరుకుంటుంది అని చెబుతుంది. అతనికి దూరంగా ఉండలేక అశాంతితో ఆమె అలమటిస్తోంది. ఆతన్ని కలవడానికి వేకువ దాకా ఆగలేనని, ఇంత బాధ తనలో ఉంటే వేకువ కోసం ఆగమనడం తనను శిక్షించడం అని ఆమె భావన.

ఈ పాటను లత చాలా గొప్పగా గానం చేసారు. పాటను గమనిస్తే ఇందులో పల్లవి ఇతర పాటలకు భిన్నంగా ఉందని అర్థం అవుతుంది. మొదట పల్లవిగా ద్వనించే పాట ప్రథమ భాగంలో ఐదవ వాక్యం ఆ చరణాల తరువాత పల్లవిగా ద్వనిస్తుంది. ఒకే వాక్యం రెండు సార్లు వస్తూ అదే పల్లవి స్థానాన్ని ఆక్రమిస్తుంది. ప్రతి సారి ‘సుబహ్ కా ఇంతజార్ కౌన్ కరే’ ను ఒకో రకంగా లత గొంతు పలుకుతుంది. ‘సుబహ్ కా ఇంతజార్’ తరువాత కొంత ఆగి ‘కౌన్ కరే’ అని అందుకోవడం ప్రేయసి మనసులోని నిస్సహాయతను అద్భుతంగా ద్వనింపజేస్తుంది. దీనికి జయదేవ్ సంగీతం లత గానం ఒక నిండుతనాన్ని తీసుకొచ్చాయ్. పాట సహజ శైలికి భిన్నంగా సాహిర్ ఈ గీతాన్ని రాయడం వల్ల ఈ పాటకు గాంభీర్యం చేకూరింది. సినీ గీతాల శైలికి భిన్నంగా ఉంటూ గజల్‌గా ధ్వనిస్తూ, పూర్తి గజల్ నిర్మాణ శైలికి భిన్నంగా  తయారయిన ఈ పాట హిందీ సినీ గీతలలో ఓ చక్కని భావగీతం.

ఇదే పాటను విషాదంతో మరో సందర్భం కోసం గానం చేసారు తలత్ మెహమూద్. సినీ ప్రపంచంలో గజల్ రారాజు అని పేరు పడిన తలత్ ఈ పాటలో పలికించిన విషాదం అద్భుతం.

సుర్మయీ రాత్ ఢల్తీ జాతీ హై
రూహ్ గమ్ సే పిగల్తీ జాతీ హై
తేరి జుల్ఫోం సె ప్యార్ కౌన్ కరే
అబ్ తేరా ఇంతెజార్ కౌన్ కరే

(చీకటి రాత్రి అస్తమిస్తూ ఉంది. ఆత్మ దుఖంతో కరిగిపోతూ ఉంది. నీ కురులను ఎవరు ప్రేమిస్తారు? నీ కోసం ఎవరు ఇక ఎదురు చూస్తారు)

వారు ఒకరికి ఒకరు దూరం అయ్యారు. ఆమె ఒకప్పుడు ఎంతో ప్రేమించిన ఆ ఏకాంత నిశి రాత్రి అస్తమిస్తుంది. అతని ఆత్మ దుఖంతో నిండి పోయింది. ఆ ఏకాంతంలో ఆమె అతనికి గుర్తుకు వస్తూ ఉంది. ఆమెను అతను ఎంతగానో ప్రేమించాడు. ఇప్పుడు ఆమె అతనికి దూరం అయింది. నీ కురులను ఇక ఎందుకు ప్రేమించాలి నేను అని అతను అడుగుతున్నాడు. ఇక్కడ కురుల ప్రస్తక్తి ఎందుకు వచ్చించనే ఆలోచన వస్తుంది. సాధారణంగా చీకటి రాత్రిని ప్రేయసి కురులతో పోలుస్తారు కవులు. ఆ చిక్కటి రాత్రి పలుచన అయిపోతూ ఉంటే ఆ కురులు తనను వీడి వెళ్ళిపోయాయనే విషయం అతనికి గుర్తుకు వస్తూ ఉంది. తనను వదిలి వెళ్లిపోయిన ప్రేయసిని అతనెందుకు ప్రేమించాలనే ఉక్రోషం ఆ పై వాక్యంలో కనిపిస్తూ ఉంది. ఇక నీ కై ఎందుకు ఎదురు చూడాలి అని ఆమెను అడుగుతున్నాడు అతను. ఆ నల్లని కురులు ఇప్పుడు అస్తమిస్తున్న రేయి లాగే తనను వీడి వెళ్లిపోయాక ఆమె కోసం అతను ఎందుకు ఎదురు చూడాలి అని అడగడంలో ఆమె తన జీవితంలో లేకపోవడం వల్ల అతనిలోని అసంతృప్తి, బాధ కోపంగా బైటపడుతూ ఉన్నాయి.

తుమ్కో అప్నా బనాకే దేఖ్ లియా
తుమ్కో అప్నా బనాకే దేఖ్ లియా
ఏక్ బార్ ఆజ్మా కే దేఖ్ లియా
బార్ బార్ ఐత్బార్ కౌన్ కరే
బార్ బార్ ఐత్బార్ కౌన్ కరే
అబ్ తేరా ఇంతజార్ కౌన్ కరే

(నిన్ను నా దానిగా చేసుకుని చూసాను. ఒక్క సారి నీకు దగ్గరయి చూసాను. మళ్లీ మళ్ళీ నిన్ను ఇక ఎందుకు నమ్మాలి? ఇక నీ కోసం ఎందుకు ఎదురు చూడాలి?)

ఆమెను తనదిగా చేసుకుని అతను చూసాడు. ఆ అనుభవం అతనికి దుఖాన్నే మిగిలించింది. ఆమెకు దగ్గరయినందుకు వేదన తప్ప అతనికి దొరికింది ఏమీ లేదు. ఇక మరోసారి ఆమెను నమ్మే స్థితిలో అతని మనసు లేదు. ఆమె కోసం ఎదురు చూడడంలో ప్రయోజనం లేదని తెలిసి ఆమెను అతను ఎలా కోరుకుంటాడు. ఈ చరణంలో దెబ్బ తిన్న ఓ హృదయం కనిపిస్తుంది. ఆమె ప్రేమను అతను అంగీకరించి ఆమెతో కొంత సేపు ప్రయాణించాడు. కాని దానికి అతనికి దొరికింది ఒంటరితనమే అయితే మరోసారి ఆ బాధను అతను అనుభవించే స్థితిలో లేడు. ఆమె కోసం ఎదురు చూడాలని అతనికి లేదు.

ఐ దిల్-ఎ- జార్ సౌగ్వార్ నా హో
ఐ దిల్-ఎ- జార్ సౌగ్వార్ నా హో
ఉన్కి చాహత్ మె బెకరార్ నా హో
హాయె..
బద్నసీబోం సె ప్యార్ కౌన్ కరే
బద్నసీబోం సె ప్యార్ కౌన్ కరే
అబ్ తెరా ఇంతజార్ కౌన్ అరే

(ఓ గాయపడిన హృదయమా బాధ పడకు ఆమె ప్రేమ కోసం ఆరాటపడకు. హాయ్.. దురదృష్టవంతులను ఎవరు ఎందుకు ప్రేమిస్తారు, ఇక నీ కోసం ఎవరు ఎదురు చూస్తారు)

ఆమె కోసం తపిస్తూ అతని హృదయం నరకం అనుభవిస్తుంది. ఆ హృదయాన్ని సంబోధిస్తూ ఆమె కోసం ఆరాటపడడం మానుకొమ్మని కవి చెబుతున్నాడు. ఇది తనతో తాను ఓ ప్రేమికుడు జరుపుకున్న సంభాషణ. దురదృష్టవంతులను ఎవరు మాత్రం ప్రేమిస్తారు. ఇక్కడ సాహిర్ శైలిలో ఓ చమత్కారం ఉంది. దురదృష్టవంతులు ఎవరు? పై చరణంలో అతని కోపాన్ని గమనిస్తే ఆమెను దురదృష్టవంతురాలు అంటున్నాడని అనిపిస్తుంది. కాని పాటలో విషాదాన్ని గమనిస్తే తనను తాను దురదృష్టవంతుడిగా సంబోధించుకుంటున్నాడనీ అనిపిస్తుంది. దీని కోసం ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఈ వాక్యం ఒకోసారి ప్రేయసిని ఉద్దేశించి రాసిందని, ఒకోసారి ప్రేమికుడు తన గురించి రాసుకున్నదని అనిపిస్తుంటుంది నాకు. పైగా ఈ వాక్యమే ఈ పాట విషాదంలో తీవ్రతను తెలుపుతుంది. ఎవరు దురదృష్టవంతులయినా భగ్న ప్రేమ బాధాకరమే. అందుకే ఆమె కోసం అతను ఎందుకు ఎదురు చూడాలి అని మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు.

ఇది స్వచ్ఛమైన కవిత. ఇందులో పల్లవి చరణాలు లేవు. కేవలం “అబ్ తేరా ఇంతజార్ కౌన్ కరే” అన్న వాక్యం ప్రతిసారి చరణం ఆఖరున వస్తూ ఉంటుంది. ఇది కవిత్వ శైలి. దీని యథాతథంగా గానం చేసారు తలత్ మెహమూద్. ఇది గజల్‌గా అనిపిస్తూనే పాట శైలికి దగ్గరగా ఉంది. కాని పూర్తి పాట కాదు. ఇలాంటి ప్రయోగం నిజంగా కవి కవితా శక్తికి తార్కాణం. తలత్ గొంతు సుతిమెత్తగా వినిపిస్తూ ఆ హాయ్ అన్నదగ్గర లోతైన విషాదాన్ని వ్యక్తీకరిస్తూ శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తుంది. విషాదంలో కూడా ఓ మాధుర్యం ఉందని ఇలాంటి పాటలు వింటున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే విషాదంలో పూర్తి నిజాయితీ ఉంటుంది. అందులో మానుపులేషన్‌కు ఆస్కారం తక్కువ.

బద్నసీబోం సె ప్యార్ కౌన్ కరే
అబ్ తెరా ఇంతజార్ కౌన్ అరే

ఈ వాక్యాల దగ్గర తలత్ గొంతు పలికించే విషాదాన్ని గమనించండి..

Images Source: Internet

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version