[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]
ఈ వారం విశ్లేషిస్తున్న పాట చిత్రం ‘వాసన’ (Vaasna, 1968) చిత్రం లోని ‘ఇత్నీ నాజుక్ నా బనో’. గానం రఫీ. సంగీతం చిత్రగుప్త్.
~
ఆడపిల్లలు నాజూగ్గా ఉండాలని అల్లుకుపోయే లతలవలే ఎదగాలని, అలాంటి ఆడపిల్లలనే మగవాళ్లు ప్రేమిస్తారని ఈ ప్రపంచంలో అందరూ నమ్ముతారు. ఆడవాళ్లని అలా నాజూగ్గా తయారు చేస్తారు. అలాంటి ఆడపిల్లలనే మగవాళ్లు కోరుకుంటారు. ఈ నాజూకు స్త్రీలకు తమ భుజాలనందించి వారి అహం చల్లార్చుకుని తృప్తి పడతారు. ఈ సంగతి తెలిసి వారి మీద ఆధారపడుతూ తమ జీవితాలను గడిపేసుకుంటారు ఎందరో స్త్రీలు. చాలా మంది తల్లి తండ్రులు తమ ఆడపిల్లలను అలా నాజూగ్గా చూసి మురిసిపోతారు. కాని మగవారి అహాన్ని సంతృప్తి పరిచే వస్తువులుగా తప్ప వ్యక్తులుగా తమ పిల్లలు ఎదగట్లేదనే ఆలోచన వారికి రాదు.
అందుకే స్త్రీలను బోన్సాయ్ మొక్కలుగానే చూసే సంస్కృతి ఆధునిక యుగంలో ఇంకా ఎక్కువ అవుతుంది. జీరో సైజులు, ఏ మాత్రం బరువైన పనులు చేయలేని ఆడవాళ్లకి మగవారి హృదయంలో త్వరగా స్థానం దొరుకుతుంది. స్త్రీలను అబలలుగా, బేలలుగా మార్చి, వారి పక్కన నిలిచి తమ మగతనాన్ని తృప్తి పరుచుకుంటున్నారు పురుషులు. ఇప్పటి కాలంలో చీపురు పట్టని, బిందె ఎత్తలేని ముద్దు గుమ్మలకు ఎంతో డిమాండ్ ఉంది. నాజూకైన చేతులు మెనీక్యూర్ పెడీక్యూర్లతో నిగనిగలాడే శరీరం, ఎండలో తిరిగితే కమిలిపోయే వర్చస్సు, అరవైలో ఇరవైలోలా కనిపించాలనే తాపత్రయం స్త్రీల మెదళ్లను ఆవహించింది. సగంపైగా జీవితం ఈ నాజూకుతనాన్ని కాపాడుకోవడంలోనే సరిపోతుంది. కాని తాము పరాధీనులుగానూ, జీవితాంతం ఒకరిపై ఆధారపడే వస్తువులుగానూ మిగిలిపోతూ తమ వ్యక్తిత్వాలను కుంచింప జేసుకుంటున్నాం అన్న విషయం పాపం స్త్రీలకు మాత్రం అర్థం కావట్లేదు. నాజూకుగా మారి పురుషులను రంజింపచేయడమే తమ ధ్యేయం అనే మానసిక జాడ్యం వారిలో నిండుకు పోయింది. మళ్ళీ వీరంతా స్త్రీ స్వాతంత్ర్యం గురించి సంభాషించే ప్రగతీశీల యువతులే.
‘వాసన’ సినిమా కోసం సాహిర్ ఓ పాట రాసారు. ‘ఇత్ని నాజుక్ నా బనో’ అని సాగే ఆ పాటలో ఆయన స్త్రీలలో రావలసిన మార్పును అత్యంత తార్కికంగా వివరిస్తారు. ఈ పాటలో స్త్రీ నాజుకుతనాన్ని ఆనందిస్తున్న సమాజం వారి వ్యక్తిత్వాలను ఎలా చిదిమేస్తుందో వివరిస్తూ, నాజుకుగా ఉండవద్దని తన ప్రియురాలిని కోరుతున్నాడు ఓ ప్రియుడు. సాహిర్ ఈ పాటను ఎంత గొప్పగా రాసారంటే ప్రతి స్త్రీ ఇది విని తీరవలసిందే. ఈ పాటలోని ప్రతి వాక్యం స్త్రీ ఎదుగుదలకు ఆమె మానసిక ఉన్నతికి ఉపయోగపడుతుంది. సాహిర్ స్త్రీలను పురుషులపై ఆధారపడే అబలలుగా ఎప్పుడూ చూడలేదు. ఆ సంస్కృతిని తిరస్కరించారు. స్త్రీలలో అపరిమితమైన మానసిక బలం ఉంటుందని పూర్తిగా నమ్మారు. దాన్ని సమాజం అందం, అణుకువ, నియమాల నడుమ బంధించిందని, పురుషుడు ఈ భావజాలంతో స్త్రీని సంపూర్ణంగా తన అధీనంలో ఉంచుకున్నాడని సాహిర్ నమ్మి ఎన్నో సందర్భాలలో స్త్రీల గొంతుకగా మారి వారి వ్యక్తిత్వాలకు బాసటగా నిలిచారు. ఈ పాటలోని ప్రతి పదాన్ని అర్థం చేసుకున్న ఏ స్త్రీ కూడా సాహిర్‌ని గౌరవించకుండా ఉండలేదు.
ఇత్నీ నాజుక్ నా బనో, హాయ్ ఇత్నీ నాజుక్ నా బనో
హద్ కే అందర్ హొ నజాకత్ తో అదా హోతీ హై
హద్ సే బడ్ జాయె తో ఆప్ అప్ని సజా హోతీ హై
ఇత్నీ నాజుక్ నా బనో, హాయ్ ఇత్నీ నాజుక్ నా బనో
(ఇంత నాజుకుగా తయారవ్వకు అయ్యో ఇంత నాజుకుగా మారకు, హద్దుల్లో ఉన్నంతవరకే సున్నితత్వం అందంగా ఉంటుంది. పరిధి దాటితే అదే నీకు శిక్షగా మారుతుంది. ఇంత నాజుకుగా ఉండకు, అయ్యో ఇలా నాజుగ్గా తయారవ్వకు)
కవి ఆ అమ్మాయి నాజుకుతనాన్ని చూసి ఆమెను వెక్కిరిస్తూనే అలా ఉండడం వల్ల ఆమె జీవితంలో ఎంతో వెనకపడిపోతుందని చెప్తున్నాడు. ఈ సినిమా సన్నివేశంలో ఆమె రెండు అడుగులు నడవలేకపోతుంది. తన వస్తువులు తానే మోయలేక అవస్థ పడుతుంది. మరి ఈ సందర్భంలో హీరో గారు ఆమెకు చేయూతనిచ్చి ఆమెను ప్రేమలో పడేయాలి. అది అందరికీ ఆనందానిచ్చే సన్నివేశం అవుతుంది. చాలా మంది అమ్మాయిలు అలాంటి హీరో తమ జీవితాలలోనూ వచ్చి వాళ్లు తమను చేతుల్లో ఎత్తుకుని పూవులా మోయాలని కోరుకుంటారు. అందుకని పూవులా తయారవడానికి ఎంతో కష్టపడతారు. కాని సాహిర్ స్త్రీలని అంత బలహీనులుగా చూడలేడు. అందుకే ఇక్కడ ఆ ప్రియుడి చేత ఆమెకు హితబోధ చేయిస్తున్నాడు.
ఇంత నాజూగ్గా ఉండకు. దేనికయినా ఓ పరిధి ఉంటుంది. పరిధిలో ఉన్నంతవరకు సున్నితత్వం అందంగా ఉంటుంది. కాని పరిధి మించి ప్రదర్శించే ఆ సున్నితత్వంలోని అతి నీకు మంచిది కాదు. ఆ అతి ఏదో రోజు నీకు శిక్షగా మారుతుంది. నిన్ను నీకే శత్రువుగా మిగులుస్తుంది. ఆలోచించండి ఎంత గొప్ప జీవిత సత్యం ఇది. అతిగా శరీరాన్ని కృశింపజేసుకుంటున్న స్త్రీలు, మగవాడి చేతిలో చిక్కే నడుము తమది కావాలని శరీరాన్ని కష్టపెట్టుకునే అతివలు, కొన్ని తరాలుగా తమ శరీరంలోని బొద్దుతనాన్ని కప్పెట్టుకోవడానికి శరీరాన్ని, అరికాళ్లను కట్టేసుకుని కృశించి జీవించిన స్త్రీలు మన చరిత్రలో కోకొల్లలు. ఈ నాజుకుతనం వారి శరీరాలనే కాదు మనసులనూ పరాధీనం చేస్తుంది. దీన్ని సాహిర్ ఎలా చెప్తున్నాడొ చూడండి..
జిస్మ్ కా బోఝ్ ఉఠాయె నహీ ఉఠ్ తా తుమ్ సే
జిందగానీ కా కడా బోఝ్ సహోగీ కైసే
తుమ్ జొ హల్కీ సీ హవావో మె లచక్ జాతీ హో
తేజ్ ఝోంకో కే థపేడో మె రహోగీ కైసె
ఇత్నీ నాజుక్ నా బనో, హాయ్ ఇత్నీ నాజుక్ నా బనో
(నీ శరీరపు బరువునే నువ్వు మోయలేక పోతున్నావు, కష్టసాధ్యమైన జీవితపు బరువును ఎలా భరిస్తావు? కాస్త గాలి వీస్తేనే తూలి పోతున్నావు, బలంగా వీచే ఈదురు గాలుల నడుమ ఎలా ఉండగలుగుతావు? ఇంత నాజుకుగా ఉండిపోకు, అయ్యో ఇంతటి నాజూకుతనం పనికిరాదు)
ఆమె తన శరీరాన్నే తాను మోయలేకపోతుంది. రాబోయే జీవితంలో ఆమె ఎన్నో బరువు బాధ్యతలు మోయాలి. జీవితాన్ని ఎన్నో బాధ్యతల నడుమ గడపాలి. అది ఆమెకు సాధ్యపడుతుందా? ఇక్కడ గమనించండి నాతో జీవితం నీకు ఆనందంగా ఉంటుంది. నిన్ను పువ్వులలో పెట్టి చూసుకుంటాను, నీకు ఏదీ తక్కువ కాదు లాంటి అబద్దపు మాటలు అతను మాట్లాడట్లేదు. జీవితం పూల పానుపు కాదు అన్న సత్యాన్ని అతను ఆమెకు పరోక్షంగా చెప్తున్నాడు. ఎంత ప్రేమ ఉన్నా, ఎన్ని సౌకర్యాలు ఉన్నా, జీవితంలో కఠిన పరిస్థితులు రాక మానవు, మనిషి వాటిని ఎదుర్కోక తప్పదు. ఇది నిజం. జీవితాన్ని ఎదుర్కునే విధంగా మనిషి పెరగాలి, తనను తాను బలపర్చుకోవాలి. జీవితపు సవాళ్లకు తనను తయారు చేసుకోవాలి. ఏటికి ఎదురీదగల శక్తిని సమకూర్చుకోగలగాలి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవాలి. మరి ఈ నాజూకు సుందరాంగుల వల్ల అది ఎలా సాధ్యం?
ఆమె పట్ల అతనికి ప్రేమ ఉంది కాబట్టి జీవితంలోని సవాళ్లకు ఆమెను సిద్దం చేస్తున్నాడు. బరువు బాధ్యతలు తప్పవని దానికి సిద్ధపడమని, నాజుకుతనాన్ని వీడి అన్ని రకాల సవాళ్లను స్వీకరించగల అభిమానవతిగా మారమని ఆమెకు బోధిస్తున్నాడు. కాస్త గాలి వీతకే తూలి పడిపోయి దిగాలు పడిన ఆమె జీవితపు ఈదురు గాలులను ఎలా ఎదుర్కోగలదు? ఇంత నాజూకుతనంతో ఆమె జీవితాన్ని సాగించడం సాధ్యమా అని ఆమెను ప్రశ్నిస్తున్నాడు సాహిర్.
యె నా సంఝో కె హర్ ఇక్ రాహ్ మె కలియా హోంగీ
యె నా సంఝో కె హర్ ఇక్ రాహ్ మె కలియా హోంగీ
రాహ్ చల్నీ హై తొ కాంటో పె భీ చల్ నా హోగా
యె నయా దౌర్ హై ఇస్ దౌర్ మే జీనే కె లియె
హుస్న్ కో హుస్న్ కా అందాజ్ బదల్నా హొగా
ఇత్నీ నాజుక్ నా బనో, హాయ్ ఇత్నీ నాజుక్ నా బనో
(జీవితపు దారిలో ఎల్లప్పుడూ పూలే ఉంటాయనుకోవద్దు, ముందుకు సాగాలంటే ముళ్ళబాటలో కూడా ప్రయాణించగలగాలి. ఇది కొత్త యుగం, ఈ యుగంలో బ్రతకాలంటే అందం, అందం పట్ల ఆలోచనలను మార్చుకోవాలి. ఇంత నాజూకుతనం ఇప్పుడు పనికిరాదు మరి)
ఆమెకు జీవితం ఎల్లప్పుడూ పూలబాట కాదని ముళ్ళు దాటుకుంటూ ముందుకు సాగవలసి ఉంటుందని చెప్తున్నాడు అతను. ఆ ముళ్ళబాటలో నిన్ను ఎత్తుకు తిప్పుతాను అంటూ ఆమెను మాయ చేయట్లేదు. ఎందుకంటే ఎంతమంది పక్కన ఉన్నా ఎవరి సమస్యలకు వారే పరిష్కారం వెతుక్కోవాలి. మనల్ని ప్రేమించే వాళ్ళు మనకు బాసటగా నిలబడగలరు కాని మన బరువు మోయరు. ఇది అందరూ అర్థం చేసుకోవలసిన విషయం. ప్రేమ అంటే పరస్పర సహకారం అందించుకోవడం తప్ప మరొకరికి భారం అవడం కాదు. దీన్ని అర్థం చేసుకోగలిగే జీవితాలు ఎంత బావుంటాయో.
ఇది నవీన యుగం. స్త్రీలు స్వేచ్ఛ కోసం, తమ అస్తిత్వాలను వెతుక్కుంటూ ప్రపంచంలోకి ప్రయాణిస్తున్న యుగం. అలనాటి ప్రబంధాలలో అందం గురించి రాసి ఉన్న వ్యాఖ్యలను మార్చి రాసుకోవలసిన సమయం ఇది అని స్పష్టంగా చెప్తున్నాడు సాహిర్. కాని ఆశ్చర్యంగా ఇప్పుడు స్త్రీ స్వేచ్ఛ అంటూ నినదిస్తూనే స్త్రీలు మరింత నాజూకుగా మారడానికి మొగ్గు చూపిస్తున్నారు. ఇది ఎలాంటి విరోధాభాస, స్త్రీల ఎదుగుదలకు ఎంత పెద్ద దెబ్బ అన్నది స్త్రీలకే అర్థం కాని విషయం.
అందం పట్ల సమాజంలో ఉన్న నిబంధనల చట్రం నుండి స్త్రీ సమాజం ఇప్పటికీ విముక్తి కాలేకపోతుంది. పురుషుని అధీనంలో ఉండడంలోనే తన భద్రత అని ఇంకా నమ్ముతుంది. ప్రపంచంలోకి ప్రయాణిస్తూనే, అందం విషయంలో తనను తాను ఆధారితగానే మార్చుకుంటుంది. అంటే నవీన మార్గంలో ముందుకు వెళ్లాలని అడుగులు వేస్తూ, ఎన్నో బాధ్యతలను స్వీకరించాలని కోరుకుంటూ మరో పక్క నాజుకుతనంలో ఆ వెనుకటి భావజాలంలోనే కూరుకుపోతూ ఓ తోలుబొమ్మగా అటు ఇటు ఊగుతూ ముందుకు సాగలేక ఒకే చోట ఉండిపోతుంది. ఇది కూడా ఆమె అర్థం చేసుకోలేని విషయం. ట్రెడ్ మిల్ పై నడక లాగా ఉంది ఆమె నడత. కాలరీలు కరుగుతున్నా ఆమె నిలుచున్న చోటనే ఉంది. నడుస్తున్నానని అనుకుంటుంది, కాని అది గమ్యం లేని నడక. దీన్ని సాహిర్ 1968 లోనే ఎంత గొప్పగా ఊహించి చెప్పారో చూడండి.
కోయీ రుక్తా నహీ ఠహరే హుయె రాహీ కే లియే
జో భీ దేఖేగా వో కతరాకే గుజర్ జాయేగా
హమ్ అగర్ వక్త్ కే హమ్రాహ్ నా చల్నే పాయే
వక్త్ హమ్ దోనో కో ఠుకరాకె గుజర్ జాయేగా
(ఎవరు నిలిచిపోయిన వ్యక్తి కోసం ఆగరు. అందరూ ఆమెను చూసినా తప్పించుకుని ముందుకు సాగిపోతారు. కాలానికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకుని ముందుకు నడవకపోతే, కాలం మన ఇద్దరిని కాదని దాటిపోతుంది)
ఈ కొత్త ప్రపంచంలో ఎవరూ ఆగిపోయిన వ్యక్తి కోసం నిలిచిపోరు. అందరికీ చేరవల్సిన గమ్యాలు ఉంటాయి. వాటి కోసం వారు నిరంత్రం ప్రయాణిస్తూనే ఉంటారు. ఈ నాజూకు రాణులకు ఎల్లకాలం ఎవరూ చేయూతనివ్వరు. అలా నిలిచి ఉన్న ఆమెను చేయి పట్టి నడిపించరు. ఆమెను చూడనట్లుగా వదిలి వెళ్లిపోతారు. అందుకే కాలానికి అనుగుణంగా తమను తాము మార్చుకుని మనుషులు ముందుకు సాగాలి లేదా కాలం వారిని వదిలి వెళ్లిపోతుంది. జీవితంలో వాళ్ళు వెనుకే మిగిలిపోతారు.
ఇక్కడ గమనిస్తే ఆ ప్రియుడు కాలం మన ఇద్దరినీ దాటి వెళ్ళిపోతుంది అంటున్నాడు. అంటే ఆమెను నాజుకుతనం వీడి జీవితాని ఎదుర్కునే శక్తిని సంపాదించుకొమ్మని చెబుతూనే ఆ ప్రయాణంలో తానూ భాగం అని కూడా చెప్తున్నాడు. ఆమెను అతను ఒంటరిని చేయట్లేదు. ఆమె పక్కన అతనూ ప్రయాణిస్తున్నాడు. కాని ఈ నాజుకుతనం ఆమెను ముందుకు సాగనివ్వదని, తనను తాను ఆమె మార్చుకోకపోతే ఇద్దరి జీవిత ప్రయాణం కూడా వెనుకబడిపోతుందని చెప్తున్నాడు.
స్త్రీలు దేన్ని సొంతంగా చేసుకోలేక తమపై ఆధారపడడాన్ని ప్రేమగా అంగీకరించి వారికి సహాయం చేస్తూ వాళ్లని జీవితంలో ఎదగనివ్వని పురుషులు తాము ఆ స్త్రీకి ఎంత నష్టం చేస్తున్నామో అర్థం చేసుకోరు. వయసులో తమపై ఆధారపడే ప్రేయసికి చిన్న చిన్న పనులలో సహాయం చేస్తూ జీవితంలోని పెద్ద మజిలీలకు ఇద్దరూ దూరం అవుతున్నారన్నది వారికి ఆ క్షణంలో అర్థం కాదు. ఇలాంటి పురుషులు కొంత సమయం తరువాత ఆ స్త్రీ వ్యక్తిత్వం పూర్తిగా కుచించుకుపోయాక వారిని జీవితానికి బందీలను చేసి వాళ్లు మాత్రం ముందుకు వెళ్లిపోతారు. లేదా వారితో పాటు వెనుకబడిపోతారు. నిండైన వ్యక్తిత్వంతో, అమితమైన ఆత్మవిశ్వాసంతో నిండి ఉన్న స్త్రీని పురుషుడి భరించలేడు. ఆమె తనకు పోటీ అవుతుందని కలవరపడతాడు. అసలు అందుకే ఆమెను ఆధారితగా మార్చుకుంటాడు. కాని అలాంటి పరిపూర్ణమైన స్త్రీతో జీవితంలో ఉండే నిండుదనం అహాన్ని పక్కకు పెట్టి ఆస్వాదించగల మగాడికే అర్థం అవుతుంది.
ఇక్కడ కవి స్త్రీలో అలాంటి పరిపూర్ణతను ఆశిస్తున్నాడు. ఆమెను అలా మారమని చెప్తూ దానికి ఈ నాజుకుతనం అనే సంకెళ్ళను వదిలించుకుని నిండైన మనిషిగా మారమని ఆమెకు జీవిత సత్యాలను బోధిస్తూ జీవితపు సవాళ్లను ఎదుర్కునే ధీరగా మార్చడానికి తనవంతుగా తాను ప్రయత్నిస్తున్నాడు. అందం అనే మోసపూరిత భావజాలం నుండి ఆమెను విముక్తిరాలిని చేస్తున్నాడు. ఎందుకంటే పరిధి దాటిన ఏ విషయం అయినా మనిషిని ఎదగనివ్వదు.
ఇత్నీ నాజుక్ నా బనో, హాయ్ ఇత్నీ నాజుక్ నా బనో
హద్ కే అందర్ హొ నజాకత్ తో అదా హోతీ హై
హద్ సే బడ్ జాయె తో ఆప్ అప్ని సజా హోతీ హై
ఇత్నీ నాజుక్ నా బనో, హాయ్ ఇత్నీ నాజుక్ నా బనో
(ఇంత నాజుకుగా తయారవ్వకు అయ్యో ఇంత నాజుకుగా మారకు, ఓ పరిధిలో ఉన్నంతవరకే సున్నితత్వం అందంగా ఉంటుంది. పరిధి దాటితే అదే నీకు శిక్షగా మారుతుంది. ఇంత నాజుకుగా ఉండకు, అయ్యో ఇలా నాజుగ్గా తయారవ్వకు)
ఈ పాటను ఇప్పటి ఫ్యాషన్ ప్రపంచంలో తేలాడే నాజూకు ముద్దుగుమ్మలు విని అర్థం చేసుకుంటే స్త్రీ సమాజంలో ఎంతో మార్పు రాగలదు. అందంగా ఉంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, అద్దంలో మనం నాజుగ్గా కనిపిస్తే ప్రపంచాన్ని గెలిచినట్లే అని నమ్మే ప్రస్తుత ఆధునిక స్త్రీ, అందం శరీరానికి సంబంధించింది కాదని అది మానసికమైన స్థితి అని అర్థం చేసుకోగలిగితే ఈ ప్రపంచం అంతా అద్భుతమైన స్త్రీ శక్తితో నిండిపోతుంది కదా..
యె నయా దౌర్ హై ఇస్ దౌర్ మే జీనే కె లియె
హుస్న్ కో హుస్న్ కా అందాజ్ బదల్నా హొగా
ఇత్నీ నాజుక్ నా బనో, హాయ్ ఇత్నీ నాజుక్ నా బనో..
Images Source: Internet
(మళ్ళీ కలుద్దాం)