Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్’-29 – దునియా కరే సవాల్

[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

వారం విశ్లేషిస్తున్న పాట చిత్రం ‘బహు బేగం’ (Bahu Begum, 1967) చిత్రం లోని ‘దునియా కరే సవాల్’. గానం లతా మంగేష్కర్. సంగీతం రోషన్.

~

ప్రేమ మనిషిని నిస్సహయులుగా మారుస్తుంది. అప్పటిదాకా ఎవరికీ లొంగక, ఎవరి దగ్గర వంగక నిటారుగా నిలబడే మనుషులు ప్రేమ గాలి తాకగానే అసహాయులయిపోతారు. జీవితానికి ఈ రకమైన లొంగుబాటు అవసరమే కాని ఆ ప్రేమ దక్కకుండాపోతే ఆ మనిషి అసహాయితలోనూ, లొంగుబాటులోనూ అత్యంత విషాదం ఉంటుంది. ప్రేమ దక్కించుకున్న వ్యక్తుల నిస్సహాయత వారిని బలవంతులుగా మారిస్తే ప్రేమను పొందలేని వారి అసహాయత వారిని నిర్వీర్యులుగా మారుస్తుంది. స్త్రీల విషయంలో ఈ అసహాయత వారిని పూర్తిగా అశక్తులను చేస్తుంది. పైగా స్త్రీలపై ప్రపంచం వేసే ముద్ర వారి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. గమనిస్తే ప్రేమలో విఫలం అయిన మగవాడిని  సమాజం గౌరవాన్నిస్తుంది, సున్నిత మనస్కుడని కొనియాడుతుంది. కాని అదే స్త్రీ ప్రేమలో విఫలం అయిందంటే ఆమెను అనుమానిస్తుంది.  ఆమెను నిత్యం ఎన్నో పరీక్షలకు గురి చేస్తుంది. అందుకే స్త్రీ తన మనసులోని దుఖాన్ని ఎట్టి పరిస్థితులలోనూ బైటికి వ్యక్తీకరించదు. నేను ప్రేమించి విఫలమయ్యాను అని మగవాడు ఎంతో గొప్పగా చెప్పుకుంటాడు. తన కోపాన్ని బాధని బైటికి కక్కడానికి వెనుకాడడు. కాని స్త్రీ తన మనసుకు అయిన గాయాలను తనలోనే దాచుకుంటుంది. అవి బైటపడితే తాను ఇంకా చులకన అయిపోతానని బాధపడుతుంది. పైగా ఆమె భుజాలపై కుటుంబ పరువు మర్యాదలు నిలిచి ఉంటాయి. మనసుకయిన గాయాలను బైటకు చెప్పుకుని సాంత్వన పొందే అదృష్టం స్త్రీకి పురుషుడిలా ఉండదు.

అలాంటి ఓ స్త్రీ మనోవేదనను ‘బహు బేగం’ సినిమా గీతంగా మలిచారు సాహిర్. ప్రపంచాన్ని లెక్కచేయని తత్వం ఉన్న ఆయనే స్త్రీ విషయంలో అన్ని సందర్భాలలో అది కుదరదని అంగీకరిస్తూ ఓ స్త్రీ ఆవేదనను ఈ పాట రూపంలో రాసారు.

దునియా కరే సవాల్ తో హమ్ క్యా జవాబ్ దే

తుమ్కొ న హో ఖయాల్ తో హమ్ క్యా జవాబ్ దే

దునియా కరే సవాల్

(ప్రపంచం ప్రశ్నిస్తే నేను ఏం జవాబు చెప్పాలి. నీకు ఆ ఆలోచనే లేకపోతే ఇక నేనేం జవాబు చెప్పాలి, ఈ ప్రపంచం ప్రశ్నలను ఎలా ఎదుర్కోవాలి)

ఓ చిన్న ప్రశ్న ఇది. కాని ఇందులో ఎంత లోతు ఉంది. అతనికి ప్రపంచం పట్టదు. దాని పట్ల ఆలోచన లేదు. కాని ఆమె ఆ ప్రపంచం నడుమ జీవిస్తుంది. ఆమెను లోకం అడుగడుగున ప్రశ్నలతో ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే ఆమె స్త్రీ కాబట్టి. తన స్థితికి ఏం సమాధానం చెప్పగలదు ఆమె? అతనికి ఆమె ఎటువంటి పరిస్థితుల నడుమ ఉంటుందో అన్న ఆలోచనే లేదు. అమె అతనిని ప్రేమించింది. నమ్మింది. అయినా అతనికే ఆమె గురించి ఆలోచన లేనప్పుడు ఇక ఎవరైనా ఆమె పట్ల సానుభూతితో ఎందుకు ప్రవర్తిస్తారు? మాటలతో తూట్లు పొడుస్తారు. ఆమె వేదనలో ఆ మాటల తూటాలను ఎలా ఎదుర్కోవాలి అనే భయం, దానితో పాటు తనను ప్రేమించిన వ్యక్తే తన గురించి పట్టనట్లు ఉంటే ఇక ఎవరైనా తనతో సున్నితంగా ఎలా ఎందుకు వ్యవహరిస్తారు అన్న ప్రశ్న వినిపిస్తుంది. ఎంత సహేతుకమైన వేదన ఇది. మనం ప్రేమించినవారు, మన అనుకున్న వారే మనలను పట్టించుకోకపోతే, మన దుఃఖాన్ని అర్థం చేసుకోలేకపోతే ఇక ఎవరైనా ఎందుకు మన పట్ల సహానుభూతితో వ్యవహరిస్తారు? అందుకే మన సమాజంలో ప్రేమను వ్యక్తీకరించేందుకు, స్వీకరించి అంగీకరించేందుకు స్త్రీ ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంది. ముందుకు దూకుతున్న పురుషుడి దూకుడుకు కళ్ళెం వేస్తుంది. అదుపులో పెట్టాలని ప్రయత్నిస్తుంది. ఈ నిజాన్ని సాహిర్ ‘తెరే ప్యార్ కా ఆసరా చాహ్తాహూ’ అనే పాటలో స్పష్టంగా అనిపిస్తాడు నాయికతో.

గలత్ సారి దావే, గలత్ సారి కస్మే

నిభేగీ యాహా కైసే ఉల్ఫత్ కె రస్మే

యహా జిందగీ హై రివాజోంకె బస్మే

రివాజోంకో తుమ్ తోడ్ నా చాహతెహో…

ఇక్కడి సమాజం సంప్రదాయం కట్టుబాట్ల ఆధారంగా నడుస్తుంది. ఆ నియమాలను నువ్వు కాదనాలనుకుంటున్నావు. ఇక్కడ ప్రేమ వాగ్దానాలు నిలుపుకోవటం కుదరదు అంటుంది నాయిక. కట్టుబాట్లను లక్ష్యపెట్టనని గొప్పగా ప్రకటిస్తాడు హీరో. కానీ, ఆమెని కాదని వేరే అమెని వివాహమాడతాడు. అదంతా వేరే కథ. కానీ, ఈ పాట ద్వారా సాహిత్ మగవాడి దూకుడు, దాన్ని అదుపులో పెట్టాలన్న స్థ్రీ జాగ్రత్తను అద్భుతంగా చూపిస్తాడు.

 

పూఛే కొయీ కె దిల్ కొ కహాన్ ఛోడ్ ఆయే హై

పూఛే కొయీ కె దిల్ కొ కహాన్ ఛోడ్ ఆయే హై

కిస్ కిస్ సె అప్నా రిష్తా-ఎ-జాన్ తోడ్ ఆయే హై

ముష్కిల్ హొ అర్జ్-ఎ-హాల్

ముష్కిల్ హొ అర్జ్-ఎ-హాల్ తో హమ్

క్యా జవాబ్ దే

తుమ్కొ నా హొ ఖయాల్ తో హుమ్ క్యా జవాబ్ దే

దునియా కరే సవాల్

(నీ మనసును ఎక్కడ వదిలి వచ్చావు అని ఎవరన్నా అడిగితే, నీవు ప్రాణంగా భావించిన ఏ సంబంధాలని వదులుకుని వచ్చావని నన్ను ప్రశ్నిస్తే నేనేం జవాబు ఇవ్వాలి? నా స్థితిని వెల్లడించుకోవడం అత్యంత కష్టంగా మారినప్పుడు ఇక నేనేం జవాబివ్వగలను? నీకు నా గురించి ఆలోచనే లేనప్పుడు ప్రపంచం వేసే ప్రశ్నలకు నేనేం జవాబివ్వగలను)

ఈ చరణం విన్న ప్రతి సారి నేను సాహిర్ పదాల సౌందర్యానికి మైమరిచిపోతాను. ఎలాంటి పదాలవి? ‘రిష్తా – ఎ -జాన్’. ఒక పక్క అతనిపై ఆమెకు ఫిర్యాదులున్నాయి. కాని అతనే ఆమె ప్రాణం. ఆ బంధమే ఆమె లోకంగా బతికింది. దాన్ని వదులుకుని మరో కొత్త జీవితంలోకి వెళ్తున్నప్పుడు ఆమెను గమనించిన ఎవరికైనా ఆమె తన ప్రాణప్రదమైన దేన్నో వదిలి అమితమైన వేదనను అనుభవిస్తుందని అర్థం అవుతుంది. ఆ దుఃఖాన్ని ఆమె దాచుకోలేక మథనపడుతుంది. అలాంటప్పుడు ఆమె వేదనను కనిపెట్టి ప్రపంచం నీ ప్రాణప్రదమైన దేన్ని నువ్వు వదిలి వచ్చావు అని ఆమెను ప్రశ్నిస్తే, ఆమె ఏం సమాధానం చెప్పగలదు? రిష్తె-ఎ-జాన్ అంటూ ఆమెకు అతనితో ఉన్న అనుబందం ఎంత గాఢమయిందో, అదే తన ప్రపంచంగా ఆమె ఎలా బతికిందో, ఇప్పుడు దాన్ని వదులుకోవల్సి వస్తున్న సమయంలో ఆమె ఏం కోల్పోతుందో ఎలాంటి అసహాయ స్థితిలో ఉందో ఆ ఒక్క పదంతో సాహిర్ చెప్పడం ఈ పాట సౌందర్యాన్ని, విషాదాన్నిఅందులోని గాఢతను ఎంతటి ఉన్నతమైన స్థితికి చేరుస్తుందంటే దాన్ని విని అనుభవిస్తేనే గాని అర్థం కాదు.

అర్జ్ – ఎ- హాల్ అన్న పదం కూడా అంతే అందమైనది. హాల్ అంటే స్థితి. అర్జ్ అంటే విన్నవించుకోవడం. తెలుగులో బంగారు గాజులు అనే సినిమాలో దాశరధి గారు రాసిన విన్నవించుకోనా చిన్న కోరిక అనే ఓ పాట ఉంది. ఎంతో మధురమైన, గౌరవమైన విషయాలను ప్రస్తావించేటప్పుడు విన్నవించుకోవడం అన్న పదాలను వాడతారు. విన్నపాలు వినవలే అనే అన్నమయ్య కీర్తన మనకు తెలుసు కదా. ఎంత భక్తిని గౌరవాన్ని ప్రస్తావిస్తూ ఆ పదాన్ని కవులు వాడారో గమనించండి. ఇక్కడ అర్జ్ – ఎ- హాల్ ను సాహిర్ అలాంటి గౌరవాన్ని ప్రస్తావిస్తూ ఉపయోగిస్తున్నారు. ఆమె ప్రేమలో ఓడిపోయింది. కాని తన ప్రేమపైనా తన ప్రియుడి పైనా ఆ అనుభవం పట్ల ఆమెకు ఎంతో గౌరవం ఉంది. మానవ సంబంధాలలో ఈ గౌరవం అతి ముఖ్యమైన విషయం. ఆమె గతాన్ని తెలుసుకోవాలని కుతూహలం చూపే ప్రపంచం స్త్రీ పురుష ప్రేమల పట్ల ఆ గౌరవాన్ని చూపదు. అలాంటి ప్రపంచం ముందు ఆమె తన మనసును ఎలా విన్నవించుకోగలదు? బైటికి తన గతం చెబితే ఆమెపట్ల ఆమె ప్రేమ పట్ల ఎవరికి గౌరవం ఉంటుందని?

పూఛే కొయీ కె దర్ద్-ఎ-వఫా కౌన్ దే గయా

పూఛే కొయీ కె దర్ద్-ఎ-వఫా కౌన్ దే గయా

రాతో కొ జాగ్నే కి సజా కౌన్ దే గయా

కెహ్నే సె హో మలాల్

కెహ్నే సె హో మలాల్ తో హమ్ క్యా జవాబ్ దే

తుమ్కో నా హొ ఖయాల్ తో హమ్ క్యా జవాబ్ దే

దునియా కరే సవాల్ తొ హమ్ క్యా జవాబ్ దే

(ఈ విషాదపు ప్రేమను ఎవరిచ్చారంటే నేనేం చెప్పగలను? రాత్రులు మేలుకోవల్సిన ఈ శిక్ష నీకెవరు విధించారంటే ఏం జవాబివ్వగలను? అలాంటి ప్రశ్నలు ఎదుర్కుంటూ జవాబివ్వవలసి రావడంలో ఎంత క్లేశం ఉంటుందో ఆ స్థితిని ఎలా భరించను? నీకు ఆ ఆలోచనే రాకపోతే నేను ప్రపంచాన్ని ఎలా ఎదుర్కోను? ప్రపంచం ప్రశ్నిస్తే ఏం జవాబివ్వగలను)

తన స్థితిని గుర్తించి నీకిలాంటి విషాదాన్ని ఈ ఫలించని ప్రేమను ప్రసాదించింది ఎవరు అని ప్రపంచం అడగవచ్చు అప్పుడు తానేం జవాబిస్తుంది. అతని పేరు ఆమె బైట పెట్టలేదే. రాత్రులు నిద్రపట్టక ఒంటరిగా మథనపడుతున్న ఆమెను చూసి నీకీ శిక్ష ఎవరేసారు అంటే ఆమె పెదవులపై అతని పేరు రాక తప్పదు. అది బైటకి ఉచ్చరించలేదే. ఆ స్థితిని ఆమె ఎలా ఎదుర్కోవాలి? జవాబివ్వడానికే కష్టపడవలసిన స్థితిలోకి ఆమెను నెట్టి ఆమె ఎలా ప్రపంచాన్ని ఎదుర్కుంటుందన్న ఆలోచన లేకుండా ఆమెను వదిలి వెళ్లిన అతన్ని ఆమె నీకే నా గురించి పట్టనప్పుడు నేను ఎవరికి ఏం చెప్పగలను అని అత్యంత విషాదంగా ప్రశ్నిస్తుంది?

ఈ పాటలో ఓ స్త్రీ అసహాయతతో పాటు ప్రపంచాన్ని మోసం చేయలేక, ప్రేమను మర్చిపోలేక, జీవితాన్ని మామూలుగా గడపలేక ఓ స్త్రి గతాన్ని మోసుకుంటూ ఏ ఆశ లేని భవిష్యత్తు వైపుకు ప్రయాణిస్తున్న తరుణంలో ఎంత మధన పడుతుందో అత్యంత సున్నితంగా వ్యక్తీకరిస్తున్నాడు సాహిర్. ప్రేమించి ఆమె మానాన ఆమెను వదిలేసి వెళ్లిపోయిన అతను ఆమె అనుభవించే నరకాన్ని కనీసం ఊహించగలడా? ఎంతో నమ్మి అతనికి తన మనసును ఇచ్చిన ఆమెను ఒంటరిని చెసి నలుగురి మధ్య ఏకాకికి చేసి ప్రపంచ ప్రశ్నలను ఎదుర్కోమని ఎరగా వేసి అతను నిష్క్రమిస్తే ఆమె పరిస్థితి ఏంటీ?

ఈ ప్రశ్నలను లత గొంతు ఎంత విషాదంగా అడుగుతుందంటే, వినే వారందిరికీ ఆమె లోని అసహాయత అర్థం అయి మనసు బాధతో మూలుగుతుంది. ఈ పాటను ఒంటరిగా వినాలి. లత గొంతులోని ఆ అసహాయత మనసును కరిగిస్తుంది. సాహిర్ పదాలు ఎంత సరళంగా ఉంటాయో పాటలోని విషాదం అంత గంభీరంగా ఉంటుంది. పరిత్యజించ బడిన ఆ స్త్రీ పట్ల ఎంతో గౌరవం కలుగుతుంది. ఆమె ప్రేమలోని నిజాయితీ, ఆ అనుభవం తరువాత అంతే నిజాయితీగా వ్యవ్యహరింహలేననే ఆమె భయం ఆమె వ్యక్తిత్వాన్ని మనకు చూపుతాయి. ఒకరిని ప్రేమించి ఆ గతాన్ని మరచి మరొకరితో జీవించవల్సిన స్త్రీని పతితగా చూసే ప్రపంచాన్ని ఆమెను ఆ స్థితిలోకి నెట్టిన పురుషుని వైపు చూడమని అతన్ని ప్రశ్నించమని చెప్పకనే చెబుతాడు సాహిర్. ఇలాంటి పాటలు వింటున్నప్పుడు స్త్రీలను సాహిర్ తన పదాలను కవచంగా మార్చి లోకం చూపుల నుండి నిత్యం కాపాడుతూ ఉన్నట్లు అనిపిస్తుంది.

లేకపోతే ఇంత గొప్పగా ఎవరు స్త్రీ తరుపున ప్రశ్నించగలరండి?????

కెహ్నే సె హో మలాల్ తో హమ్ క్యా జవాబ్ దే

తుమ్కో నా హొ ఖయాల్ తో హమ్ క్యా జవాబ్ దే..

Images Source: Internet

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version