Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్’-28 – అష్కో నె జో పాయా హై

[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

ఈ వారం విశ్లేషిస్తున్న పాట చిత్రం ‘చాందీ కీ దీవార్’ (Chandi Ki Deewar, 1964) చిత్రం లోని ‘అష్కోం నె జో పాయా హై’. గానం తలత్ మెహమూద్. సంగీతం ఎన్. దత్త.

~

షేర్ అంటే రెండు వాక్యాలలో వచ్చే ఓ చిన్ని ఉర్దూ కవిత. ఈ రెండు వాక్యాలలో కవి ఎంత ఎక్కువ చెప్పగలిగితే వాటి సొగసు అంత గొప్పగా ఉంటుంది. అందుకే ఈ షేర్లలో ప్రతి పదాన్ని ఎంతో ఆలోచించి వాడతాడు కవి. ఈ షేర్లను కలిపేదే గజల్. సాహిర్ తన గజళ్ళలో పదాలను ఎంచుకుని ఉపయోగించుకునే విధానం నాకు ఎప్పటికప్పుడు విస్మయాన్ని కలిగిస్తుంది. ఈ షేర్లలో అతి చిన్న పదాలు కూడా ఎంతో కవితాత్మకంగా ఉండి మొత్తం గజల్‌ను మార్మికతతో నింపేస్తాయి.

మనిషి జీవితంలో అనుభవాలు వేదనను మిగిల్చినప్పుడు మనసు గాయపడినప్పుడు, కళ్ల నుండి కన్నీళ్ళు ప్రవహిస్తాయి. ప్రతి కన్నీటి బొట్టు కూడా అనుభవాన్ని, జీవితపు సారాన్ని మోసుకొస్తుంది. అంటే కన్నీళ్లకు కూడా ఓ ప్రయోజనం ఉంది. ఏ విషాదమూ నిష్ప్రయోజనము కాదు. సాధారణంగా విషాదాన్ని అనుభవించే వ్యక్తి పట్ల సానుభూతి చూపిస్తుంది లోకం. ఈ సానుభూతిలో కొంత లోకువ చేసే తత్వమూ ఉంటుంది. అందుకే భయంకరమైన విషాదాన్ని ప్రకటిస్తూ కూడా సాహిర్ తనను ఆ అతి విషాద స్థితిలో ఎవరూ లోకువ చేయలేని విధంగా ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కూడా ప్రకటిస్తారు. ఆయన విషాదంలో ప్రదర్శించే ఆత్మవిశ్వాసం ఎలా ఉంటుంది అంటే, తాను పోగొట్టుకున్నదానితో పాటు తాను ఆ విషాద స్థితిలో పొందినదాన్ని కూడా ఒకే రకమైన సంయమనంతోనూ గాంభీర్యంగాను వ్యక్తీకరిస్తాడు సాహిర్. సాహిర్ అన్నట్టు…

ఘమ్ ఔర్ ఖుషీ మే ఫర్క్ న మహసూస్ హో జహా

మై దిల్ కొ ఉస్ ముకామ్ పె లాతా చలాగయా….అన్నది అతని తత్త్వంలా తోస్తుంది.

 ఆ సాహిర్ తత్వానికి ఉదాహరణగా  ఈ పాటను చెప్పుకోవచ్చు ..

అష్కోం  నె జో పాయా హై,  వో గీతో మే దియా హై

ఇస్ పర్ భి సునా హై కి జమానే కో గిలా హై

అష్కోం  నె జో పాయా హై

(కన్నీళ్ళూ పొందినవాటిని పాటల రూపంలో తిరిగి ఇచ్చాను. ఇంత చేసినా ఇంకా ఈ ప్రపంచానికి నాపై ఫిర్యాదులు ఉన్నాయని వింటున్నాను.)

‘కన్నీళ్ళు పొందినవి’ అనే ప్రయోగం ఆలోచనలో పడేస్తుంది. ఎంతో బాధ, వేదన మనసును తాకితే కన్నీళ్లు బైటకు వస్తాయి. మరి కన్నీళ్ళు పొందినవి అంటాడేంటి సాహిర్? ‘అష్కోం  నె జొ పాయా హై’ అంటున్నాడు. ఒకసారి వింటే ఈ ప్రయోగం అర్థం కాదు మనకు. కాని ఆ ఒక్క ‘నే’ అన్న ప్రయోగంతోనే ఈ గజల్ మొత్తానికి ఓ గొప్ప తర్కాన్ని జోడించాడు సాహిర్.

సాధారణంగా ఇక్కడ ‘అష్కో మే’ అనవచ్చు. దాని అర్థం ‘కన్నీళ్లలో పొందింది’ కన్నీళ్లలో పొందింది పాటగా ఇచ్చాను అని ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవచ్చు. లేదా ‘అష్కోం సె’ అన్నా అనొచ్చు. అంటే కన్నీళ్ళతో పొందింది పాటగా ఇచ్చాను అని అర్థం. కాని సాహిర్ ఆ వాక్యంలో ‘అష్కోం  నే’ అన్నాడు అంటే కన్నీళ్లు పొందినవి పాటగా ఇచ్చాను అని అర్థం. ఈ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?.

పైన చెప్పిన రెండు ప్రయోగాలలో ప్రస్తావనకు వచ్చేది ఓ మనిషి తన జీవితంలో పొందిన విషాదానుభవం. సాహిర్ దీన్నే కన్నీళ్లు పొందిన అనుభవం అంటున్నాడు. అది నా అనుభవం అనట్లేదు. అంటే అతని కళ్ల నుండి కన్నీటిగా బైట పడుతున్న విషాదం అతను అనుభవిస్తున్న సంపూర్ణమైన విషాదం కాదు. ఇప్పుడు బైటపడుతుంది చాలా చిన్న మోతాదు. అతని మనసు లోతుల్లో ఉన్న విషాదం కొంచెం కన్నీటికి కరిగి బైటకు దొర్లింది. దానికి మించిన విషాదం అతని మనసులో గూడు కట్టుకుని ఉంది. మనసునిండా ఉన్న విషాదం కన్నీటికి చిక్కి ఓ పిసరంత బైటకు వచ్చింది. అలా బైటపడలేని గడ్డ కట్టిన విషాదం అతని లోలోపల దాగుంది. కవి ఆ చిందిన కన్నీటినే పాట రూపంలోకి మార్చాడు. ఆ కొంచెం విషాదాన్నేఅతని గేయాలు చిత్రీకరించాయి.

కాని ఆ పాటలలో చేర్చలేని విషాదం, ఏ భాషకూ అందని అనుభవాలు అతని మనసు పొరల్లో నిక్షిప్తమై ఉన్నాయి. అసలు ఆ సంగతే ఎవరికీ పట్టట్లేదు. కేవలం అతను వ్యక్తీకరించిన ఆ కాస్త విషాదానికే సమాజం అల్లకల్లోలమయి, దాన్ని భరించలేక అతని కవిత్వంపై ఫిర్యాదులు చేస్తుంది. ఇక అతని మనసు లోపలకు తొంగి చూసే శక్తి, ఈ ప్రపంచానికి ఉందా? ఈ కాస్తకే తట్టుకోలేని సమాజం అతని లోపలి వేదనను ఏం అర్థం చేసుకోగలదు?

ఈ పాటలో విషాదంతో పాటు సాహిర్ చమత్కారం కూడా కనిపిస్తుంది. ఆ కాస్తకే అన్ని ఫిర్యాదులయితే మరి నాలోని ఆ అంతర్విషాదాన్ని తట్టుకోగలరా అని అడగడంలో తన విషాదాన్ని కూడా ఓ ప్రశ్నలా చమత్కారంగా ప్రస్తావించే సాహిర్ కవితా శైలి కనిపిస్తుంది.

అష్కోం నే’ అంటూ ప్రపంచం కంటికి కనిపించని, ఎవరూ ఊహించలేని తన లోలోపలి విషాదాన్ని ఆయన శ్రోతలకు సూచిస్తున్నారు. ఆయన కవితలలో మనకు కనిపించే విషాదం కన్నీళ్ళుగా బైటికి వచ్చిన ఓ చిన్న భాగం. తనలోనుండి బైటికి రాలేని ఆ గాఢమైన విషాదం గురించి చెప్పకనే చెప్పడానికి, ఇక్కడ ‘అష్కోం నె’ అనే పద ప్రయోగం చేసారు సాహిర్. ప్రపంచం చూసే విషాదం కేవలం బైటపడిన ఆ కన్నీటి అనుభవం మాత్రమే. కాని కన్నీరు కూడా చిందించలేని అత్యంత గాఢమైన వ్యక్తిగత విషాదం అతనిలో నిండి ఉంది, ఆ కనిపించే కాస్త విషాదానికి ప్రపంచం అల్లకల్లలం అయిపోతుందే. మరి అతని లోపలి విషాదం సంగతెంటి? విని తట్టుకోగల శక్తి ఎవరికుందని?

జో తార్ సె నికలీ హై వో ధున్ సబ్ నె సునీ హై

జో తార్ సె నికలీ హై వో ధున్ సబ్ నె సునీ హై

జో సాజ్ పె గుజరి హై వో కిస్ దిల్ కో పతా హై

అష్కోం  నె జో పాయా హై వో గీతో మే దియా హై

ఇస్ పర్ భి సునా హై కి జమానే కో గిలా హై

అష్కోం నె జో పాయా హై

(తీగ నుండి వెలువడిన  రాగాన్ని అందరూ వింటారు. కాని వాయిద్యం ఏం అనుభవించిందో ఏ మనసుకు తెలుస్తుందని? కన్నీళ్లకు చిక్కిందే పాటల రూపంలో తిరిగి ఇచ్చాను. దానికే ఈ ప్రపంచానికి నాపై ఫిర్యాదులు ఉన్నాయని అంటున్నారు.)

సంగీత వాయిద్యాలలో తీగనుండి సంగీతకారులు పలికించే రాగాన్ని అందరూ వింటున్నారు. కాని ఆ తీగనుండి రాగం రావడానికి వాయిద్యంలో జరిగే మథనం ఎంత మందికి తెలుస్తుంది. అసలు లోన జరిగే అంతర్మథనం ఎవరన్నా ఊహించగలరా? కనీసం ఆలోచించగలరా? ఆ పై పై రాగాలాపన తప్ప ప్రపంచం లోన జరిగే సంఘర్షణను కనీసం గుర్తించగలదా?

జీవితంలో మనం చూసేవన్నీ పై పై అనుభవాలే. ఆ అనుభవాల లోతుల్ని స్పృశించడం అందరికీ సాధ్యం కాదు. కొందరికి అంత లోతుగా తరచి చూసే సమయం ఉండదు. కొందరికి హృదయం ఉండదు. అందుకే ఇతరులకు సంబంధించిన ఏ దుఃఖాన్ని కూడా ఎవరూ గాఢంగా అనుభవించలేరు. చాలా సందర్భాలలో అది అసాధ్యం కూడా. అసలు కనపడని విషాదం గురించి ఎరుకే ఎవరికీ ఉండదు. కనిపించే వాటి పట్ల తప్ప కనపడని వాటి పై ఆసక్తి ఎవరిలోనూ కనిపించదు. అందుకే విషాదాన్ని అనుభవిస్తున్న వాళ్లు అదే స్థాయిలో దాన్ని ఇతరులకు చేర్చలేరు. ఆ లోతు వారికే పరిమితం, వారికే సొంతం. మరొకరెవ్వరూ అంత గాఢంగా దాన్ని అనుభవించలేరు.

అందుకే కన్నీళ్ళు పొందిన దాన్నే పాట రూపంలో మలచాను. ఆ మలచిన పాటల గురించే ప్రపంచానికి బోలెడన్ని ఫిర్యాదులున్నాయి. కన్నీళ్ళు తీగనుండి వెలువడిన స్వరం.  కంటినుండి కారిన నీరు, ఆ నీటిని ప్రతిబింబించే గీతాన్ని మాత్రమే ప్రపంచం అనుభవిస్తుంది. కానీ, ఆ కన్నీరు బయటకు వచ్చే కన్నా ముందు హృద్యం అనుభవించిన వేదన స్వరూపం ఎవ్వరూ గమనించలేరు. ఆ వేదన లోతును ఎవరూ ఊహించలేరు.

హం ఫూల్ హై ఔరో కే లియె లాయె హై ఖూష్బూ

హం ఫూల్ హై ఔరో కే లియె లాయె హై ఖూష్బూ

అప్నె లియే లే దేకె బస్ ఇక్ దాగ్ మిలా హై

అష్కోం నె జో పాయా హై వో గీతో మే దియా హై

ఇస్ పర్ భి సునా హై కి జమానే కో గిలా హై

అష్కోం నె జో పాయా హై

(నేను ఇతరులకు సువాసనలను అందించే పువ్వును. నాకు మాత్రం ఈ ఇచ్చి పుచ్చుకున్న ఆటలో మరక/గాయం మాత్రమే మిగిలింది. నా కన్నీళ్లు పొందిన అనుభవాలనే మీకు పాటలుగా తిరిగి ఇచ్చాను. ఈ ప్రపంచానికి అందుకే నాపై ఫిర్యాదులా?)

కవి ఇతరులందరికీ అనుభూతుల సువాసనలను పంచే సుమం. అందరికీ అతను మధురానుభవాలనే పంచాడు. కాని తన వరకు వచ్చే సరికి కేవలం ఓ మచ్చగా మిగిలిపోయాడు. అందరికీ పంచిన సువాసనల మధ్య అతను తనకు తానే ఓ ప్రశ్నగా, సవాలుగా మిగిలిపోయాడు. పువ్వు ఇతరులకు సువాసనలను పంచుతుంది. ఆ పువ్వు వాసనల అందం, ఆనందం ఇతరుల సొంతం. అంత సువాసనలు వెదజల్లిన ఆ పువ్వు వడలి ఎండి రాలిపోయేటప్పుడు తనకు తాను ఓ మరక మాత్రమే. గళంలో గరళాన్ని నిలుపుకుని ప్రపంచానికి అమృతం ఇచ్చేవాడు కవి. తన వేదనను ప్రపంచం వేదనగా మలచి, ప్రపంచం వేదనను తన వేదనగా ప్రకటించి వేదనాభరిత హృదయాలకు సాంత్వననిచ్చేవాడు కవి. కానీ, ప్రపంచం కవితను చూస్తుంది. ఆ కవిత సృజన వెనుక ఉన్న ఆవేశాన్నీ, మథనాన్నీ గ్రహించలేదు ప్రపంచం.

మనసున్న మనిషి జీవితంలోని అన్ని మధురానుభూతులు పరాధీనమే. మన వరకు వచ్చేసరికి మిగిలేవి మన ఒంటరితనం, తీరని కోరికలు, ఆరని వేదనే. ఎవరు ఎంత కష్టాన్ని భరించి ప్రపంచం ముందుకు వచ్చారో, ఏ మనసులో ఎన్ని గాయాలున్నాయో తెలుసుకునే అవసరం, శక్తీ ఈ ప్రపంచానికి లేదు. తెలుసుకునే ఆసక్తి ఎవరికీ లేదు. అదే ప్రపంచ నైజం. ప్రపంచానికి మన విజయాలు కావాలి, సంఘర్షణ అక్కర్లేదు. మన గెలుపు కావాలి, శ్రమ అనవసరం. మన ద్వారా లభించే ఆనందాలు కావాలి, లోలోన పడే మథనం అక్కర్లేదు. పపంచానికి నీ ద్వారా ఆనందం కావాలి నువ్వు అక్కర్లేదు. ఇదే నిజం.

జో తార్ సె నికలీ హై వో ధున్ సబ్ నె సునీ హై

జో సాజ్ పె గుజరి హై వో కిస్ దిల్ కొ పతా హై..

అందరికీ మనం అందించే రసానుభూతులే కావాలి మన విషాదం అక్కర్లేదు. దాని ఉనికి కూడా ఎవరూ భరించలేరు. అందుకే మన బాధలు మనవరికే, మన ఘర్షణా మన వరకే. ఇతరులకు సుఖాలు పంచగలగినంతకాలం, వాళ్ల అవసరాలకు నువ్వు పనికి వచ్చినంత కాలమే నీకు మనుగడ. ఇది అందరం తెలుసుకోవలసిన వాస్తవం..

Images Source: Internet

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version