Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్’-27 – ముహబ్బత్ తర్క్ కీ

[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

వారం విశ్లేషిస్తున్న పాట చిత్రం ‘దో రాహ’ (Do Raha, 1952) చిత్రం లోని ‘ముహబ్బత్ తర్క్ కీ’. గానం తలత్ మెహమూద్. సంగీతం అనీల్ బిస్వాస్.

~

సాహిర్ రాసిన విషాద గీతాలని గమనిస్తే అందులో కేవలం దుఃఖం, అసహాయత మాత్రమే కాదు, మనిషిలో అంతర్లీనంగా ఉండే సహనశక్తి, ఆలోచన, విశ్లేషణ కలగలసి కనిపిస్తాయి. తన జీవితం లోని పరాజయాలు, అందుకోలేని ఆనందాలు, కోల్పోయిన మధురానుభూతులు, జీవితం పట్ల అసంతృప్తి ఇవన్నీ ఆ కవిత్వంలో ఉంటూనే ఆ అత్యంత విషాద స్థితి నుండి కూడా వ్యక్తిగా ఎదగాలనే తపన, ఆ స్థితిని స్థితప్రజ్ఞతతో స్వీకరించే విధానంలో ఓ గౌరవం (dignity) ఉంటుంది. ఆ విషాదం తనకేమి నేర్పించిందో దాన్ని పాఠంగా తీసుకుంటూ జీవితంలో ఎలా తాను ముందుకు అడుగు వేయబోతాడో ఒక స్పష్టతతో వివరిస్తారు సాహిర్. అంటే సాహిర్ కవిత్వంలోని విషాదం మనిషిని ఎటువంటి పరిస్థితులలో కూడా క్రుంగదీయదు. ముందుకు సాగకుండా ఆపదు. ఏ విషాదమూ జీవితానికి అంతం అని సాహిర్ చెప్పరు. దాన్ని ఎదురీదగలిగే స్థితి లాగే ఆయన ఎప్పుడూ ప్రస్తావిస్తారు. అందుకే ఆయన విషాద గీతాలు కూడా పోరాటతత్వంతోనే నిండి ఉంటాయి.

ఉదాహరణకు ‘దో రాహా’ సినిమాలోని ఈ గజల్‌ని చూడండి..

ముహబ్బత్ తర్క్ కీ మైనే గరెబా సీ లియా మై నే

గరెబా సీ లియా మై నే

జమానే అబ్ తొ ఖుష్ హొ జహర్ యే భీ పీ లియా మైనే

యే భీ పీ లియా మైనే

(ప్రేమను త్యాగం చేసాను నేను. నా కుర్తా కాలర్ ను కుట్టేసుకున్నాను. ప్రపంచమా ఇప్పుడు సంతోషించు ఈ విషాన్ని కూడా మింగేసాను నేను)

ఇది విఫల ప్రేమ పాట.

సాహిర్ ఉపయోగించే ఉర్దూ పదాలు సరళంగా ఉంటూనే ఎన్నో సార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.  తర్క్ కి త్యాగం అనే అర్థం  వస్తుంది. అలాగే గిరేబా అన్న పదం ఉర్దూ లేదా హిందీ వారికే సొంతమైన పదం. దీనికి అర్థం మగవారి కుర్తా లేదా కమీజు కున్నకాలర్. ఇది ఒక పురుషుడు పాడే విషాద గీతం. అందుకే ఈ పల్లవిలో వచ్చే ఉపమానం పురుషుని జీవినశైలికి సంబంధించినది. కాలర్ కుట్టేసుకోవటమంటే, గొంతు నొక్కేసుకోవటం… తన ఇష్టాన్ని అణచివేసుకోవటం. మనం నోరు నొక్కేసుకోవటం అంటాం. అలా, గొంతు బిగించటం అంటే, తనని తాను సంపూర్ణంగా అణచివేసుకోవటం అన్నమాట.

ఉత్తర భారతంలో ‘గిరేబా సీ లేనా’ అనే నానుడి ఉంది. సాధారణంగా కుర్తాను వేసుకోవడానికి, తలను దూర్చడానికి కుర్తా పై భాగంలో ఖాళీ ఉంటుంది. వేసుకున్నాక ఆ ఖాళీని గుండీలతో కప్పేస్తారు. అది కాస్త వదిలి ఉంచితే గొంతు క్రింద నుండి లోపలి శరీరం కొద్దిగా కనిపించీ కనిపించనట్లు దర్శనమిస్తూ ఉంటుంది. గాలి ఆడడానికి ఈ భాగాన్ని అలా వదిలేస్తారు కూడా. ‘గరేబా సీ లేనా” అంటే పూర్తిగా ఏ గాలి చొరబడకుండా శరీరాన్ని కట్టేయడం. గొంతు క్రింద ప్రాంతంలోనే గుండే ఉంటుంది కదా. మనసును ఎవరి ముందూ వ్యక్తీకరించకుండా ఉండడం అనే అర్థాన్ని సూచించడం కోసం ‘గిరేబా సీ లేనా’ అని సామెతను వాడతారు. గిరెబా అన్న పదంతో ఎన్నో సామెతలు ఉర్దూలో ఉన్నాయి. ‘గిరేబా ఖీంచనా’ అంటే బలవంతంగా ఇతరుల హక్కు లాక్కోవడం, ‘గిరెబా పుర్జే హోనా’ అంటే గౌరవం మంట కలవడం, ‘గిరెబా మే సర్ ఝుఖానా’ అంటే సిగ్గుతో తల దించుకోవడం. అలాంటి ఓ ప్రాంతీయ ఉర్దూ సామెతతో ఈ గజల్ మొదలవుతుంది. ఆ ప్రయోగం అర్థం అయినప్పుడే ఈ పల్లవి ప్రామాణికత అర్థం చేసుకోగలం.

ఇప్పుడు ఆ పై వాక్యాలలోని సాంస్కృతిక పదాలతో పాటు కలిపి ఆ పల్లవి అర్థాన్ని చూద్దాం.

అతనికి ఒకటి ఇష్టం. కానీ, ప్రపంచం అతని ఇష్టాన్ని అతను పొందటంలో అడ్డుపడుతోంది. చివరికి ప్రపంచమే గెలిచింది. ఆ భావాన్ని, ఓటమిని ఆమోదిస్తూ, విఫల ప్రేమ  నిరాశ వల్ల కలిగిన నిర్లిప్తతను ప్రదర్శిస్తూ పాడుతున్న పాట ఇది. అందుకే, ప్రేమను త్యజించాను. నా గొంతు నేనే నొక్కేసుకున్నాను.  ఆమెకు దూరమయ్యే విషాన్ని స్వీకరించాను నేను. ఇకనైనా సంతోషించు ప్రపంచమా అని పాడుతున్నాడు.

 కవి తాను ప్రేమను త్యాగం చేస్తున్నానని, మనసును కప్పేసుకుంటున్నానని, చెప్తూ ఓ ప్రపంచమా నీకు ఇప్పుడు ఆనందంగా ఉందా, ఈ విషాన్ని కూడా తాగేసాను అంటున్నాడు. అంటే అతని ప్రేమకు ప్రపంచం ఆమోదం ఎప్పుడూ లేదు. అందుకే అతని త్యాగం ప్రపంచానికి ఎంతో ఆనందాన్నిచ్చే విషయం. ఈ త్యాగంతో ప్రపంచాన్ని తృప్తిపరిచాడు అతను. అదే చెప్తూ ఇప్పుడు మీకు ఆనందంగా ఉంది కదా, సరే పొండి ఈ విషాన్ని కూడా తాగేస్తాను అంటున్నాడు. ఇక్కడ కవిలో తిరుగుబాటు ధోరణి ఉంది, అతను ఇక్కడ బాధితుడిగా కనిపించడు. సరే ఈ ఆనందాన్ని నా నుండి దూరం చేయండి. ఈ గరళాన్ని కూడా తాగేస్తాను. ఇంకేం చేయగలరు మీరు అదీ చూస్తాను అన్న ధోరణితో ఈ విషాదాన్ని అతను ఎదుర్కుంటున్నాడు.

అభీ జిందా హూ లేకిన్ సోచ్తా రహ్తతా హూ యె దిల్ మె

అభీ జిందా హూ లేకిన్ సోచ్తా రహ్తతా హూ యె దిల్ మె

కి అబ్ తక్ కిస్ తమన్నా కే సహారే జీ లియా మై నే

సహారే జీ లియా మై నే

ముహబ్బత్ తర్క్ కీ మైనే

(ఇప్పుడు జీవించే ఉన్నాను కాని మనసులో ఆలోచిస్తూ ఉన్నాను, ఇప్పటి దాకా మరి ఏ కోరిక ఆసరాతో బతికాను నేను? ఇప్పుడే కదా ప్రేమను త్యాగం చేసాను)

నేను ఇంకా చావలేదు. బతికే ఉన్నాను కాని ఆలోచిస్తున్నాను. ఇన్నేళ్ళూ ఏ కోరిక నన్ను నడిపించింది? దేని అసరాతో జీవించాను నేను? నిజంగా ఇది చాలా గొప్ప ప్రశ్న. సరైన సమయంలో కవి మనసులో వచ్చిన ఆలోచన. ఇప్పుడు ప్రేయసి లేదు. ప్రేమ లేదు, జీవితంలో ఎంతో కోరుకున్న దాన్ని ఇప్పుడు అతను వదిలేసుకోవల్సి వచ్చింది. కాని అప్పటిదాకా అతను జీవించాడు కదా, ఏ కోరిక అతన్ని ఇంత వరకు నడిపించింది మరి. అంటే అతని గతంలోని జీవితం, అనుభూతులు, అనుభవాలు, అన్నిటిని ఏ కోరిక నడిపించిందని అతని రోజులు గడిచాయి. ఇప్పుడు వచ్చిన ఈ ప్రేమ కన్నా ముందు కూడా అతనికో జీవితం ఉండేది కదా. ప్రస్తుతం చాలా నిరాశాపూరిత స్థితిలో అతను ఉన్నాడు, ప్రేమను పోగొట్టుకున్నాడు. అయినా జీవించే ఉన్నాడు. ఇన్నాళ్లు ఎలా అప్పటిదాకా జీవించాడో అలాగే జీవిస్తాడు. విషాదాన్ని స్వీకరిస్తూనే దాన్ని అధిగమించి జీవితంలో ప్రయాణించడానికి అతని విజ్ఞత అతన్ని వేసే ప్రశ్నలలో ఉన్నదీ గొప్ప స్థితప్రజ్ఞత. సాహిర్ కవిత్వం నిండా కనిపించేది అదే.

ఆ ప్రేమను పొందే దాకా అతను అందరిలాగే జీవించాడు. ప్రేమను కొన్నాళ్లు అనుభవించాక అతను దాన్ని త్యాగం చేయవలసి వచ్చింది. కాని ఇక ముందు ఎలా అన్న ఆలోచనతో పాటు ఆ ప్రేమ లేక ముందు కూడా జీవించాను కదా ఇప్పుడు అది పోయిన తరువాత కూడా రోజులు నెట్టలేనా అన్న ఆలోచన కనిపిస్తుంది పై చరణంలో.

తుఝే అప్నా నహీ సకతా మగర్ ఇతనా భీ క్యా కమ్ హై

తుఝే అప్నా నహీ సకతా మగర్ ఇతనా భీ క్యా కమ్ హై

కి కుఛ్ ఘడియా తెరే ఖ్వాబో మే ఖోకర్ జీ లియా మై నే

ఖోకర్ జీ లియా మై నే

ముహబ్బత్ తర్క్ కీ మైనే

(నిన్ను నాదానిగా చేసుకోలేకపోయాను కాని ఇది మాత్రం తక్కువా? కొన్ని ఘడియలు నీ కలలతో అన్నీ మరచి జీవించాను నేను, ప్రేమను ఇప్పుడేగా త్యాగం చేసాను నేను)

ఆమెను అతను పొందలేకపోయాడు. ఈ యుద్ధంలో ప్రపంచం అతని పై గెలిచింది. అతను ఓడిపోయాడు. కాని ఈ అనుభవమూ అతనికి తక్కువ ఆనందాన్ని ఇవ్వలేదు. ఆమె కలల్లో అన్నీ మరచి, అందరినీ మరచిపోయి అతను విహరించాడు. ఆనందించాడు. అద్భుతమైన తృప్తిని పొందాడు. ప్రపంచం అతనికి ప్రేయసిని దూరం చేసింది. కాని ఈ అనుభూతులు అతని సొంతం. వాటిని దూరం చేసే శక్తి, అతను పొందిన ఆనందాన్ని, ఆ అనుభూతిని తక్కువ చేసే శక్తి ఎవరికీ లేదు. అంటె ఈ ప్రేమలో అతను ఎంత పోగొట్టుకున్నాడో అంత కన్నా ఎక్కువ  ఆనందాన్ని స్వంతం చేసుకున్నాడు. తనదైన అనుభవాలను పొందాడు. అవి పూర్తిగా అతని సొంతం. వాటికి ధ్వంసం చేసే శక్తి ఈ ప్రపంచానికి ఉందా మరి. విషాదంలోనూ ఎంత పెద్ద సవాలు విసురుతున్నాడు ఈ భగ్న ప్రేమికుడు.

ప్రపంచం అతనికి ప్రాణప్రదమైన ప్రేయసిని అతనికి దూరం చేసింది. అది సత్యం. సత్యం నుంచి పారిపోయేవాడు పిరికివాడు. సత్యాన్ని స్వీకరించలేనివాడు మూర్ఖుడు. కాబట్టి ఆమెని తనదానిగా ఎల్లప్పటికీ చేసుకోలేడు. కానీ, ఆమెతో అతనికి అద్భుతమైన అనుభవాలున్నాయి. అవి చాలు. అవి తలచుకుంటూ , ఆమె తనదెన్నటికీ కాలేదన్న విషాదాన్ని అనుభవిస్తూ, ఆమెతో గడపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ, కన్న కలలను నెమరువేసుకుంటూ జీవించేస్తాడు. చీకటి కొట్టంలో బంధించినా సరే, ఆ చీకటిలోనూ వెలుతురు చూడగలడన్నమాట. శరీరం చీకటి గదిలో వున్నా, మనసు వెలుగురేకలపై నాట్యమాడుతోంది.

సాహిర్ లోని ఈ లెక్కచేయని తనం, ఏ స్థితిలోనూ ఎవరికీ తలవంచని ఆత్మాభిమానం నాకు చాలా చాలా ఇష్టం. ఎక్కడా మర్యాద అతిక్రమణ చేయకుండా ఎంత గౌరవమైన పదజాలంతో తన చుట్టు ఉన్న సమాజానికి, ప్రపంచానికి, తన ప్రేమను దోచుకున్న పరిస్థితులకు సవాలు విసురుతున్నారో చూడండి. ఇలాంటి మనిషిని సర్వం దోచి కూడా ఎవరూ ఓడించలేరు కదా..

బస్ అబ్ తో మేరా దామన్ ఛోడ్ దో బేకార్ ఉమ్మీదో

బస్ అబ్ తో మేరా దామన్ ఛోడ్ దో బేకార్ ఉమ్మీదో

బహుత్ దుఖ్ సహ్ లియే మైనే బహుత్ దిన్ జీ లియా మైనే

బహుత్ దిన్ జీ లియా మైనే

ముహబ్బత్ తర్క్ కీ మైనే

(ఇక ఇప్పుడు నన్ను వదిలేయండి.   ఓ పనికిరాని కోరికలారా, చాలా దుఃఖాన్ని సహించాను, నేను చాలా రోజులు జీవించేసాను, ప్రేమనే త్యాగం చేసాను)

దామన్ అంటే ఉర్దూలోనూ, హిందీ లోనూ కొంగు అని అర్థం. చిన్న పిల్లలు ఆసరా కోసం భద్రత కోసం తల్లి కొంగును పట్టుకోవడంలా అన్నమాట. కాని ఈ పదాన్ని స్త్రీల సందర్భంలోనే కాకుండా పురుషులు కూడా వాడతారు. మనసును అంటిపెట్టుకున్నఆశలు, కోరికల గురించి చెప్పే సందర్భంలోనూ ‘దామన్ పకడ్ లేనా’ అని ప్రస్తావిస్తారు. మాతృ భావన, బాల్యంలోని ఆ స్వచ్చమైన కోరికల స్థితిని అనుభూతిని భిన్న సందర్భాలలోనూ వ్యక్తీకరించడానికి కవులు విరివిగా ఉపయోగించే పదం ఇది.

కవి మనసును అంటిపెట్టుకుని ఉన్న ఆశలు పనికిరానివి. ఉపయోగం లేనివి. ఓ బిడ్డ తల్లి కొంగును పట్టుకున్నట్లు ఆ ఆశలను ఆర్తితో పట్టుకుని ఉన్నది కవి మనసు. వాటితో బాధ తప్ప మరేమీ అతనికి దొరకదు. ఆ ఆశలకు భవిష్యత్తు లేదు. అందుకే వాటిని తన మనసుని వదిలివెళ్లమని కవి వేడుకుంటున్నాడు. వదిలించుకునే శక్తి అతనికి లేదు. ప్రేమ మనిషిని అశక్తుడిగా కూడా మారుస్తుంది. కవి తన జీవితం నుండి తన గతాన్నివేరు చేయాలనుకుంటున్నాడు. ఆ తీరని ఆశలు, ఫలించని ప్రేమ నుండి అతను దూరం జరగాలని కోరుకుంటున్నాడు కాని తానుగా అతను వాటి నుండి దూరం అవలేకపోతున్నాడు. అందుకే తనను వదిలి వెళ్లమని వాటినే అర్థిస్తున్నాడు. నన్ను వదిలేయండి బాబూ అంటున్నాడు.  తాను చాలా బాధను అనుభవించానని, చాలా రోజులు జీవించేసానని, ఇక జీవితం పట్ల ఆశలూ కోరికలు లేవని అత్యంత విషాదంగా తన స్థితిని వివరిస్తున్నాడు.

విషాదం జీవితంలో తప్పని స్థితి. కాని దాన్ని ఎదుర్కునేవాళ్లు బాధితులుగా కాక జీవితాన్ని అర్థం చేసుకునే తాత్వికులుగా మారి విషాదాన్ని స్వీకరించడంలో చాలా తేడా ఉంది. సాహిర్ విషాద గీతాలలో విషాదమూ ఉంటుంది, ఆలోచనా ఉంటుంది, జీవితం పట్ల అవగాహానతో పాటు మనిషి పట్ల గౌరవమూ ఉంటుంది. తన విషాదాన్ని ప్రస్తావిస్తూ ఎప్పుడూ సమాజం నుండి జాలి, సానుభూతి కాక సహ అనుభూతిని మాత్రమే స్వీకరించే సాహిర్ నిక్కచ్చితనం, ఆత్మాభిమనం విషాదమూ, అభిమానమూ మధ్య ఆయన వ్యక్తీకరించే సంయమనం నాకు చాలా ఇష్టం. సాహిర్ ఎప్పుడూ నిజాన్నుంచి పారిపోడు. నిజాన్ని స్వీకరిస్తాడు. ఎవరిపై నేరారోపణచేయడు. ఎలా జీవితాన్ని వీలయినంత ఆనందంగా జీవించాలో వెతుకుతాడు. అందుకే’ లబ్ పె షిక్వా న లా, అష్క్ పీలే, జిస్ తర్హే భీ హో కుఛ్ దేర్ జీలే’ అంటాడు రాత్ భర్ కా మెహెమా అంధేరా పాటలో. అదే ఆలోచనను మరింత విపులంగా ప్రదర్శిస్తున్నాడీ పాటలో.

తుఝే అప్నా నహీ సకతా మగర్ ఇతనా భీ క్యా కమ్ హై

కి కుఛ్ ఘడియా తెరే ఖ్వాబో మే ఖోకర్ జీ లియా మై నే

ఇదే సాహిర్ అనే ఓ అభిమానవంతుని జీవన శైలి. దీన్ని అర్థం చేసుకున్నాక సాహిర్‌ని గౌరవించలేకుండా ఉండగలరా ఎవరైనా..

ఈ పాటను సినిమాకు కాకుండా కవిత్వంగా సాహిర్ రాసుకున్నారు. సినిమాకి రాస్తున్నప్పుడు మూడు చోట్ల మాత్రమే ఆయన మార్పులు చేసి అందించారు. రెండవ చరణంలో

అభీ జిందా హూ లేకిన్ సోచ్తా రహ్తతా హూ యె దిల్ మె అని వస్తుంది కాని సాహిర్ రాసిన గజల్‌లో

అభీ జిందా హూ లేకిన్ సోచ్తా రహ్తతా హూ ఖల్వత్ మె

అని ఉంటుంది. ఖల్వత్ అంటే ఒంటరితనం.ఇది స్వచ్ఛమైన ఉర్దూ పదం. దీన్ని దిల్ మె అని మార్చి పాటను హిందీ ప్రేక్షకులకు దగ్గర చేసారు సాహిర్. అలాగే

తుఝే అప్నా నహీ సకతా మగర్ ఇతనా భీ క్యా కమ్ హై

అని పాటలో వస్తే సాహిర్ రాసిన గజల్‌లో

ఉన్హె అప్నా నహీ సకతా మగర్ ఇతనా భీ క్యా కమ్ హై

అని ఉంటుంది. గజల్ ఆయన తన కోసం రాసుకుంది. ఉన్హే అని ఎవరినో ఉద్దేశించి మనకు చెప్తున్నట్లు ఉంటుంది. కాని సినిమాలో కథ నడుస్తున్నప్పుడు నాయకుడు నాయికను గుర్తు చేసుకుని పాడే సందర్భం కోసం ఆ ఉన్హె ను తుఝే గా మార్చారు సాహిర్.

కి కుఛ్ ఘడియా తెరే ఖ్వాబో మే ఖోకర్ జీ లియా మై నే అనే వాక్యం ఒరిజినల్‌లో ఇలా ఉంటుంది..

కి కుఛ్ ముద్దత్ హసిన్ ఖ్వాబో మే ఖోకర్ జీ లియా మై నే

ఇక్కడా ఉర్దూ పదాలను సరళీకరణ చేసి హిందీ చిత్రానికి ఈ గజల్‌ను అందించారు ఆయన. నిజం చెప్పాలంటే ఈ మూడవ వాక్యంలో మార్పు చేయకపోయినా పాట హిందీ ప్రజలకు చేరేదే. హిందీలో ముద్దత్ అనే పదంతో ఎన్నో పాటలున్నాయి. ఇప్పటికీ గజల్ గాయకులు సాహిర్ ఒరిజినల్ పాటను అంటే ఈ మూడు మార్పులు లేకుండా రాసిన ఉర్దూ గీతాన్ని పాడతారు. ఈ మార్పులతో ఈ వచ్చిన ఈ పాట. సాహిర్ కవిత్వంగా రాసుకున్న తన స్వీయ గీతాలను సందర్భానుసారంగా సినీ గీతాలుగా మార్చి ఇచ్చారని, ఆయన చాలా పాటలు ముందే రాసుకున్న స్వీయ కవితలనేదాన్ని మరో సారి స్పష్టం చేస్తుంది. సాహిర్ కేవలం సినిమాల కోసం కవిత్వం రాయలేదు. ఆయన కవిత్వాన్ని సినిమాలు తీసుకున్నాయి. ఇది నిజం.

Images Source: Internet

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version