Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనల్ప కల్పనలు

[జంధ్యాల కుసుమ కుమారి గారు రచించిన ‘అనల్ప కల్పనలు’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

శ్రీకృష్ణ కథను యాదవ వంశ పురోహితుడైన గర్గ మహర్షి ‘గర్గ సంహిత’గా తొమ్మిది ఖండాలతో విరచించాడు. ఆ మహర్షి యే బలరామ కృష్ణులకు నామకరణమొనరించినది. ఇతరులెవరూ లేని ఏకాంత ప్రదేశానికి యశోద, నందులను వారి శిశువులతో సహా తీసుకొని వెళ్లి, అక్కడ వారికి సముచితమైన పేర్లు నిర్ణయిస్తాడు. యశోదానందనుడిని చూసి “ఇతడు సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలలో శుక్ల, రక్త, పీత, కృష్ణ వర్ణాలతో విరాజిల్లుతుంటాడు. ద్వాపరయుగం చివరలో, కలియుగం ఆదిలో ఈ బాలుడు కృష్ణ కాంతితో ఉన్నాడు కనుక ‘కృష్ణ’ అను పేరుతో ప్రఖ్యాతి చెందుతాడు. ఇంకా..

సద్యః ప్రాణి పవిత్రాణి జగతాం మంగలాని చ.
క కారః కమలా కాంత ర కారో రామ ఇత్యపి
స కారః సద్గుణపతిః శ్వేత ద్వీప నివాస కృత్.
ణ కారో నారసింహోయం అ కారో హి అక్షరో అగ్ని భుక్.
విసర్గౌ చ తథా హి ఏతౌ నరనారాయణౌర్షి
సంప్రలీనశ్చ షట్ పూర్ణ యస్మిన్ శుద్ధే మహాత్మని.

ప్రాణికోటినంతటినీ పావనమొనరించి, జగత్తుకు కల్యాణం కలిగించేది ఈ బాలుని నామం. కమలాకాంతుడు గనుక ‘క’ కారము, శ్రీరాముడు కనుక ‘ఋ’ కారము, షడ్గుణైశ్వర్య సంపన్నుడు గనుక ‘ష’ కారము, నారసింహుడు కనుక ‘ణ’ కారము, అగ్నిరూపంతో హవిష్యములు స్వీకరిస్తాడు కనుక ‘అ’ కారము, నరనారాయణ స్వరూపం కనుక విసర్గ. ఈ వర్ణములన్నీ సమీకృతమైన ‘కృష్ణ’ యను నామధేయము ఇతనికితగియున్నది.” అని విశ్లేషించాడు. అంతటి మహిమాన్వితుణ్ణి బాలకృష్ణుడిగా లాలించి, అతని చేష్టలకు పరవశించిన మహద్భాగ్యశాలిని యశోద .

శ్రీకృష్ణలీలల ఆధారంగా నాటి భక్తకవులెందరో ఉత్తమ గ్రంథ రచనలు చేశారు. తాము మనోనేత్రంతో దర్శించిన భగవల్లీలలను అనేక కీర్తనలుగా కావ్యాలుగా రూపొందించారు. భక్తి సుగంధాలు వెదజల్లే ఆ రచనలు అపురూప కల్పనాలతికలు. వాటిలో యశోదాదేవి మాతృవాత్సల్యాభివ్యక్తిని విభిన్న రీతుల్లో హృద్యంగమంగా చిత్రీకరించారు.

పశ్చిమ బెంగాలుకు చెందిన పరమ భాగవతోత్తముడు కృష్ణదాసకవిరాజగోస్వామి (క్రీస్తుశకం 1496-1588). ఈయన ‘గోవిందలీలామృతం’ అనే మహత్తర గ్రంథాన్ని రచించాడు. ఇందులో మూడవ అధ్యాయంలో యశోదాదేవి పుత్రప్రేమను మనోజ్ఞంగా వర్ణించాడు. మాతృహృదయాంతర్గతమైన సహజ ప్రేమను ప్రకటించడానికి కవి ఒక అందమైన సన్నివేశం సృష్టించాడు.

ఒకనాటి ప్రభాత సమయంలో బలరామకృష్ణులిద్దరూ తోటి గోపబాలురతో కలిసి ఆవులమందలవద్ద పాలు పితికేందుకు వెళతారు. అలసి సొలసి ఇల్లు చేరిన వారికి రుచికరమైన అల్పాహారం అందించాలని యశోదాదేవి భావన. ‘కృష్ణుడసలే అర్భకుడు; సవ్యంగా ఆరగించడు’ అనే దిగులు ఆవిడ ఎదలో కదలాడింది. పర్యవసానంగా అత్యంత రుచికరమైన పదార్థాలు తయారు చేయించడానికి సన్నద్ధురాలైంది.

కుందలత అనే గోపకాంతను పిలిచి రాధారాణి గృహానికి వెళ్లి ఆమెను నందభవనానికి ఆహ్వానించి వారింటివారి అనుమతితో ఆమెను తోడ్కొని రమ్మని పలికి దానికి గల కారణం ఇలా వివరిస్తుంది.

“అమృతమధురం ఆస్తామ్ సంస్కృతమ్ య త్త్వయాన్నమ్
భగవతు స తు చిరాయుర్యద్ తదన్నస్య భోక్త
ఇతి కలిత వరం దుర్వాస సా తామ్విదిత్వా
స్వసదనమ్ అను రాధామ్ రంధనాయాహ్వాయామి”. (41వ శ్లోకం)

రాధాదేవి స్వహస్తాలతో వండిన వంట అమృతతుల్యమవుతుందని,అది భుజించినవాడు చిరాయువుగా ఉంటాడని దుర్వాస మహాముని రాధాదేవికి ఒక అద్భుతమైన వరాన్ని ప్రసాదించాడు.

యశోదాదేవి కోరిక మేరకు రాధాదేవి అష్టసఖీసమేతంగా నందసదనానికి తరలి వస్తుంది. వినమ్రంగా ప్రణమిల్లిన రాధాదేవిని ప్రియమారా అక్కున జేర్చుకొని యశోద, ఆమెతో

స-రస-రసవతి సత్ప్రక్రియా పండితాసి..
రచయ సహ తయైవ వ్యంజనే ఉత్తమాని

రసవంతమైన భోజన పదార్ధాలు సిద్ధం చేయడంలో సిద్ధహస్తురాలవు. రోహిణితో కలిసి, శ్రీకృష్ణుని కిష్టమైన మధురపదార్ధాలు, ఉత్తమమైన వ్యంజనాలు సిద్ధపరచు. అత్యంత రుచికరమైన అమృతకేలి, కర్పూరకేలి లను తేనె కంటే కోటి రెట్లు మధురమైనవని కృష్ణుడు భావిస్తాడు. అవి నీవు తప్ప ముల్లోకాలలో ఎవరూ సవ్యంగా చెయ్యలేరు. అవి నీవు చెయ్యి. ఏలకులు, లవంగాలు మొదలైన సుగంధ ద్రవ్యాలతో పానకం చెయ్యి. పంచామృతం సైతం ఇంపుగా చెయ్యి అని యశోద నిర్దేశించింది.

రాధారాణి ఆనందంగా అంగీకరించి అమర్చబడిన వంటశాలకు దారి తీసింది. యశోద తన పరివారంలోని వ్రజవనితలకు, రాధారాణి అష్టసఖులకు కూడా కొన్ని పెరుగుతో చేసే శిఖరిణి (శ్రీఖండ్) వంటివి, మరియు ప్రత్యేకమైన ఫేణీ, చంద్రకాంతి, జిలేబి, క్షీరసార మొ॥ మధురపదార్ధాలు చేసే బాధ్యతను అప్పగించింది. గోవిందుడికి వెన్న, పాలు, మీగడ, పెరుగులే కాక, లడ్డూలు అత్యంత ప్రీతికరమైనవి. వాటిలో మూడు రకాలు ముగ్గుర్ని సిద్ధం చేయమంది –

“విధస్తభో కాంచనవల్లి వత్సే
గోదుమచూర్ణోద్భవ లడ్డుకాని
మనోహరాఖ్యాని మనోరమే త్వం
త్వం మౌక్తికాఖ్యాని చ రత్నమాలే.

కాంచనవల్లీ! నీవు గోధుమపిండి లడ్డూలు చెయ్యి. మనోరమా! నీవు మనోహర అనబడే లడ్డూలు చెయ్యి. రత్నమాలా! నీవు మౌక్తిక అనే పేరుగల లడ్డూలు (మోతీచూర్ లడ్డు అయి ఉండవచ్చు) చెయ్యి అని ఆదేశించింది.

ఆనాటి ఉదయాన తాను మధించిన వెన్నను కాచి నెయ్యిని, నందుడు స్వయంగా పితికిన పాలను మందంగా కాచి నందనందనుడికి అందించే పని కిలింబ, అంబిక అను వారికి కేటాయించింది. వివిధరకాల ఫలరసములకు కొదవ లేదు.

కృష్ణుడు ఇల్లు చేరడమాలస్యమౌతోందని కొందరు పరిచారకులను పిలవనంపి, రాధాదేవి, రోహిణి కలిసి చేసిన పదార్థాల పర్యవేక్షణకై హడావిడిగా వంటశాలలో ప్రవేశిస్తుంది యశోద. విశాలమైన పాత్రలలో ఘుమఘుమలాడే రకరకాలైన శాకపాకాలతో, మధురపదార్ధాలతో నిండియున్న వంటశాల ఆమెకు కనువిందు చేస్తుంది. రాధారాణి వండిన పీయూష గ్రంధి, కర్పూరకేళి, అమృతకేళి లాంటివి తాను కూడా అంత రసభరితంగా చేయలేనని రోహిణి వివరిస్తుంది.

కృష్ణుణ్ణి నందసదనం దగ్గర దిగవిడిచి తమ ఇండ్లకు బయలుదేరుతున్న గోపాలబాలురతో యశోద- ‘మీరంతా వెళ్లిపోతే కన్నయ్య మీ వెనుకనే పరుగులెత్తుతూ వస్తాడు. అందుకని మీరు త్వరగా స్నానాదులు ముగించుకొని ఇక్కడికే వచ్చి మీ స్నేహితునితో కలిసి భుజించండి’ అని అంటుంది. బలరామ కృష్ణులకు పరిమళభరితజల స్నానానంతరం శుభ్రవస్త్రాలు ధరింపచేసి, బంగారు పళ్లెములలో ఆరగింపు సిద్ధపరుస్తుంది. కృష్ణసఖులందరికీ ఆప్యాయంగా వడ్డన జరుగుతుంది. స్నేహితుడెవరైనా ఒక పదార్థం కోరుకుంటే వెంటనే కృష్ణుడు తన పళ్లెంలోంచి ఇచ్చి ఆనందం పంచేవాడు. యశోదమ్మ ఒక్కొక్క పదార్థపు విశిష్టతనూ వివరిస్తూ కొసరికొసరి వడ్డిస్తుంది. కొద్దిగా తిని ఇక చాలంటున్న కృష్ణుణ్ణి మరీ మరీ బ్రతిమాలి తినిపిస్తుంటే అప్పుడతను పెద్దగా త్రేన్చి ‘చూశావుగా.. కడుపు నిండింది. ఇక ఖాళీ లేదు’ అంటూ ఆవిడను తృప్తి పరిచాడు. అనంతరం రాధాదేవికి అష్ట సఖీ యుతంగా ఆత్మీయంగా వడ్డించి ఆశీర్వదించి వీడ్కొల్పుతుంది.

శైశవ దశ నుంచే బలాఢ్యులైన అసురులనెదుర్కొని తనయుడర్భకుడయిపోయాడని తలపోసి వగచిన యశోద ఈ మార్గమవలంబించింది. క్షుత్పిపాసారహితుడు, సకల బ్రహ్మాండ భువనాలను తన కుక్షిలో నిక్షిప్తం చేసుకొన్న విరాణ్మూర్తిని ఆకలి గొన్న చిన్ని బాలునిగా యెంచి తన మాతృవాత్సల్యం కురిపించింది నందరాణి.

జగన్నాథ క్షేత్రమైన పూరీ ధామంలో గల శ్రీ గౌర విహార ఆశ్రమంలో వ్యంజన ద్వాదశి పేరిట మార్గశిర శుక్ల ద్వాదశితిథిన కనీసం అయిదు వందలకు పైగా వ్యంజనములు నివేదించే ఆచారం నేటికీ అమలు జరుగుతూనే ఉన్నదని ప్రతీతి.

***

పదకవితా పితామహుడు అన్నమాచార్యులవారి కల్పనలో.. ఒకనాడు కృష్ణుడు కవ్వముతో కాగెడు పెరుగులో పొడిచి అమ్మ మందలించిందని అలిగి, లేగలను తోలుకొని పోయి రాత్రికి మరలి వచ్చి ఆరగించలేదట. తెల్లవారి తనను అన్నమడిగి పారిపోయిన తనయుణ్ణి వెంటనంటి పట్టుకొమ్మని గోపెమ్మలను బ్రతిమాలే యశోద ఆరాటం..

అంటబారి పట్టుకోరే అమ్మలాల
వెంట బారనీదు నన్ను వెడ మాయ తురుము
చ.
కాగెడు పెరుగుచాడె కవ్వముతో పొడిచి
లేగల దోలుకొని అలిగి పోయీని.॥.
రా కతనమున వాడె రాతిరి నారగించడు
ఆగి నన్ను కూడడిగె నయ్యో ఇందాకను.

ఆకలితో పసివాడు అలమటించి పోతాడని మాతృ సహజమైన ఆవేదన.

అటువంటి సందర్భమే మరొకటి..

పిలువరే కృష్ణుని పేరుకొని ఇంతటాను
పొలసి ఆరగించే పొద్దాయెనిపుడు
చ.
వెన్నలారగించబోయి వీధులలో తిరిగేనో
ఎన్నరాని యమునలో ఈదులాడబోయేనో
సన్నల సాందీపనితో చదువగ బోయినాడో
చిన్నవాడాకలిగొనె చెలులాల యిపుడు
ఎగువను ఉట్లకెక్కి ఇంతులకు చిక్కినాడో
సగమువేడి కూరలు చల్లనాయెనిపుడు. ॥ పిలువరే॥

తానూహించిన పలుతావులు సూచిస్తూ కృష్ణుని జాడ కనుగొని తోడ్కొని రమ్మని గోపసతులను ఆత్రుతతో కోరింది యశోద. చిన్నికృష్ణుడు ఆకలికి తాళలేడని, వండిన కూరలు చల్లారిపోతున్నాయని ఆవిడ పడే ఆరాటం అంతింతనరానిది. తనయునిపై పొంగిపొరలే వాత్సల్యానికి ప్రతిరూపం.

భక్తి అనే సున్నితమైన సూత్రంతో భగవంతుని పాదారవిందాలకు తమను తాము బంధించుకొంటారు భక్తులు. అది వాత్సల్యభావనలతో ద్విగుణీకృతమౌతుంది. చిరునవ్వులు చిందించే చిన్న బాలుడిగా భగవంతుని ప్రేమిస్తూ ఆతని సంరక్షణ భారమంతా తమదిగా భావిస్తారు. నవనీతతుల్యమైన నిర్మలప్రేమాంతరంగాలలో ఆ పాదముద్రలు నిండియుంటాయనడం సత్యదూరం కాదు.

***

ఒకానొక శుభ దినాన నందుడు బలరామకృష్ణులను పిలిచి తమ వంశాచారమైన గోపాలనావిధిని నిర్వర్తించమని సూచిస్తాడు. బాలకులిద్దరూ సంతోషంగా అంగీకరిస్తారు. కాని శ్రీకృష్ణుడు ఆవులమందలను అరణ్యప్రాంతాలకు తోలుకొని పోవడం యశోదాదేవికి సుతరాము ఇష్టం లేదు. ఆవిడ అనుమతి తీసుకొని గోచారణార్ధం బయలుదేరే ఘట్టాన్ని ‘కాననగమనానుమోదక లీల’ అనే పేరుతో సుప్రసిద్ధ కవి విశ్వనాథచక్రవర్తి ‘శ్రీకృష్ణ భావనామృతం’ సప్తమ సర్గలో వర్ణించారు.

కృష్ణుడితో కలిసి ఆలమందలను మేపుకొని రావడానికి గోవర్ధన పర్వతప్రాంతంలో గల అరణ్యాలకు వెళ్లాలని వసుదామ, సుదామ, సుబల, కింకిణీ మున్నగుస్నేహితులంతా తమ బృందంతో సహా నంద భవనం చేరుకొన్నారు. తన సుతుడు అడవికి వెళతాడనే వార్త వినగానే యశోద హృదయం తల్లడిల్లింది. సహింపరాని వేదనతో ఆమె కృష్ణుడితో ‘నీతోనే మేమంతా వస్తాము. మమ్మల్ని వదిలి వెళ్లకు. తొమ్మిది గంటలపాటు నిన్ను చూడకుండా ఉండలేము’. ఇంకా..

అరుణాబ్జ దళశ్రేణీ క్వతే
సుకుమార విమల పదస్తలే
తృణకంటక కర్కశాంకిత
క్వ న సా కాననభూమిరేషియాం. (42)

మృగనాభి రసోక్షిత క్వ తే
నవనీత ప్రతిమేవ హా తనుః
క్వను సూర్య కణ ఇమే ప్రతి
క్షణా వర్ధిష్ణు తమా విషోల్వణాః. (43)

స్తిమితాంగ!సుమంగలామృతై
రజనిష్టాఃకిము వల్లవాన్వయే
తృణచారి గణానుగామితా
పరిభూతిం మృదులో!యదన్వభూః. (46)

…….
విధురావపి హా క్షుధా న తాం
న పిపాసామపి కంఠశోషిణీం
స్వతనూమపి నావగఛ్ఛతః
ఖలు ఖేలార్పిత మానసావిమౌ. (56)

అరవిందదళ సమములైన నీ మృదు పదములెక్కడ? అడవిలో కఠినమైన ముళ్లు, రాళ్లు ఎక్కడ? నవనీత సదృశమైన నీ సుందర సుకుమార శరీరమెక్కడ? అనుక్షణం తీవ్రంగా బాధించే తీక్షణ రవి కిరణాలెక్కడ? ఆ గోపాలకులు లేదా స్వయంగా నందుడే గోవులను కాచుకోనీ గాక- నీవు మాత్రం వెళ్లవద్దు. నా ప్రియ తనయా! ఎందుకయా ఈ యదు వంశంలో గోవులు కాచేందుకై జన్మించావు. నీవంటి అతి సుకుమారుడు ఏ రాజవంశం లోనో జన్మించి ఉండవచ్చు కదా’ అని పరిపరి విధాల వాపోయింది.

ప్రేమాశ్రువులు అవిరళంగా స్రవిస్తుండగా కుమారుని అక్కున జేర్చుకొని, గోపబాలకులతో ‘కృష్ణుడు మీకు సోదరుడు, సఖుడు, ప్రాణము అని నాకు తెలియదా? కాని అతను సుకుమారుడైనా అల్లరి పిల్లల నాయకుడు-తెలివైనవాడైనా హద్దులు తెలియవు-బలహీనుడైనా దూసుకుపోయే తత్త్వం గలవాడు. అందుకే అతని చుట్టూ వుండి కాపాడండి. కంసుని పరివారం కనిపిస్తే మాకు తెలియజేయండి. ఇతడు తండ్రి మాట, తల్లి మాట వినడు, కాని, మీమాట కాదనడు. మీ హృదయేశ్వరునితో మరీ మొరటు ఆటలు ఆడకండి. ఆటల్లో నిమగ్నులయితే బలరామకృష్ణులకు ఆకలిదప్పులు కూడా తెలియవు. జాగ్రత్త సుమా!’ అని హెచ్చరించింది. అవధులు లేని ఆమె పుత్ర వాత్సల్యానికి బద్ధుడైన కృష్ణుడు, తన చల్లని స్పర్శతోను, తియ్యని మాటలతోను అనునయించాడు. ఆమెను ఊరడిస్తూ, “జననీ! నీవెప్పుడూ అరణ్యమార్గం చూడలేదు. గోవులు కాచే పనిలో నాకు ఏ మాత్రం బాధ లేదు. అది నాకు మహదానందదాయకం. యమునాతీరంలో సుగంధ శీతల వృక్షాల నీడలో మేమంతా ఆడుకుంటూనే ఆవులను కాచుకుంటాము. గోగణాలు చెదరి అటూ ఇటూ వెళ్ల కుండా చూడటం మాకు కష్టమేమీకాదు. ఎందుకంటే నా చేతిలోని మురళిని మ్రోయించగానే అవన్నీ పరుగున వచ్చి చేరుతాయి. ఇక అడవి బాటమెత్తగా ఉంటుంది. చమరీ మృగాలు తమ తోకతో దాన్ని శుభ్రపరుస్తాయి. కస్తూరి మృగాలు పరిమళభరితం చేస్తాయి. వృక్షాలు తేనెలందిస్తాయి. కోకిలారావాలతో, మయూర నృత్యాలతో, కనువిందు చేసే జలపాతాలతో, గండుతుమ్మదల ఝంకారాలతో గోవర్ధనగిరి మా ప్రతి అడుగునూ ఆకర్షిస్తుంది. అక్కడి గుహల ముందు ఈ మణిమయ భవనాల కాంతి నాకు మందంగా గోచరిస్తుంది. నా సమవయస్కులతో కలిసి శయనించే సుఖం నాకు ఎక్కడ లభిస్తుంది?నీవు దుఃఖించనవసరం లేదు.” అని పలికాడు.

మణిమందిరవృంద శందతా
మనయద్యచ్ఛవిరేవ మందతా
సవయశ్వయభూషితః శయే
సుఖమత్రాప్యతి ఖిద్యతే కుతః

అతని అమృతవాక్కులను బలపరుస్తూ మరొక చెలికాడు యశోదతో ‘అమ్మా! ఎందుకంత కలత నీకు? నిజం చెప్పాలంటే మాకు ఆ అడవిలో కలిగే పరమానందంలో అణుమాత్రమైనా ఈ పురంలో లభించదు. మేమంతా అక్కడ చెట్ల నుంచి పక్వమై రాలిపడే కదళీ, మామిడి, పనస, దానిమ్మ మొదలైన పండ్లు యథేచ్ఛగా తింటాము. మా సఖుడు కృష్ణుడు అడవిలో దొరికే రకరకాల ఆకులు, పూలు, పళ్లు సేకరించడం కోసం అక్కడికి వస్తాడు. ఆ కోరిక ఈ నగరవీధులలో తీరదు కదా’ అన్నాడు. జగన్నియంతయైన మురళీమోహనుని కేవలం సాధారణ బాలుడిగా యెంచి, అతని యోగక్షేమాలకోసం తల్లడిల్లిన యశోద అనల్ప ప్రేమరాశి. వాత్సల్య వారాశి.

ఆకలితో అంబారావాలు చేసే ఆలమందల స్థితి గమనించిన కృష్ణుడు తనను అనుసరిస్తున్న తల్లితండ్రులను నిరోధించి ముందుకు సాగాడు; శంఖ చక్ర పద్మాది రేఖాంకితమైన సుందర పాదముద్రలు కాననసీమను అలంకరించగా.

శ్రీ వైష్ణవ సంప్రదాయంలో వేదాంత దేశికులవారిది విశిష్టమైన స్ధానం. ఆయన తమిళ, సంస్కృ త భాషలలో అజరామరమైన భక్తిసాహిత్యం అందించారు. వారు రచించిన ‘యాదవాభ్యుదయం’ అనే మహాకావ్యంలో శ్రీ కృష్ణుని అవతార విశేషాలు, ఘట్టాలు హృద్యంగా వర్ణించారు. సకలచరాచర సృష్టిని నియంత్రించే పరమాత్మ సామాన్యమైన గోవులకాపరిగా కర్తవ్యాన్ని నిర్వర్తించడం అబ్బురపరిచే విషయం. దానినే ఆయన అందమైన శ్లోకంగా మలిచారు:

అనన్యతంత్రఃస్వయమేవ దేవాన్
పద్మాసనాదీన్ ప్రజనయ్య రక్షన్
స రక్షకః సీరభృతసహాసీత్
నేతా గవాం నంద నియోగవర్తీ.

స్వయంభగవానుడు-బ్రహ్మాది దేవతలకు రక్షకుడైనటువంటి మహితాత్ముడు నందుని ఆజ్ఞ మేరకు సామాన్యమైన గోపాల వేషధారిగా బలరామ సమేతుడై బృందాటవీ సీమలలో సంచరించాడు..

గోపాయమానే పురుషే పరస్మిన్
గోరూపతాం వేదగిరో భజంత్యః.
భవ్యై రసేవంత పదం తదీయం
స్తోభ ప్రతిఛ్చంద నిభైః స్వశబ్దైః

తమ సంరక్షకుడు గోపాలరూపధారియై నిలిచినపుడు వేదములన్నీ గోరూపం ధరించినవట. గోవులు శ్రీ కృష్ణుని చరణ యుగళిని నాలుకతో స్పృశించినప్పుడు వెలువడే ధ్వనులు సామగానాన్ని ప్రతిధ్వనించేవని వర్ణించారు.

గోపాల కృష్ణుడు గోవత్స బృందాలపై అనన్య సామాన్యమైన ప్రేమ కురిపించాడు.తన కంటే అధికంగా,వాటిని ప్రేమిస్తూ ,ఆకలి తీర్చే తల్లి వలె పాలించడం చూసిన ఆవులు తమ దూడలను వాత్సల్యంతో చూసేవి. వాసుదేవుని వద్ద గోవులు వాత్సల్య శిక్షణ పొందినట్లు రమ్యమైన భావన చేశారు యీ క్రింది శ్లోకంలో..

ఆత్మోపమద్దేప్యమనుమోదమానాత్
ఆత్మాధికం పాలయతశ్చ వత్సాన్
గవాస్తదానీమనఘామవిందన్
వాత్సల్య శిక్షామివ వాసుదేవాత్.

ఈ సందర్భంలో పోతన భాగవతం దశమ స్కంధంలో కృష్ణుడు అడవిలో దూరంగా పచ్చిక మేస్తున్న గో మాతలను తన వద్దకు రమ్మని ఆప్యాయంగా పిలిచిన తీరు ఈ క్రింది పద్యంలో గోచరిస్తుంది.

10.1-604-సీ.

రా పూర్ణచంద్రిక! రా గౌతమీగంగ!;
రమ్ము భగీరథరాజతనయ!
రా సుధాజలరాశి! రా మేఘబాలిక!;
రమ్ము చింతామణి! రమ్ము సురభి!
రా మనోహారిణి! రా సర్వమంగళ!;
రా భారతీదేవి! రా ధరిత్రి!
రా శ్రీమహాలక్ష్మి! రా మందమారుతి!;
రమ్ము మందాకిని! రా శుభాంగి!

యనుచు మఱియుఁ గలుగు నాఖ్యలు గల గోవు
లడవిలోన దూరమందు మేయ
ఘనగభీరభాషఁ గడునొప్పఁ జీరు నా
భీరజనులు బొగడఁ బెంపు నెగడ.

అలా బృందాటవీ సీమలలో సోదర సహితుడై స్నేహ బృందంతోను, ఆలమందలతోను విహరించాడు ఆ నందనందనుడు – ఆనందవర్ధనుడు.

Exit mobile version