Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అమృతపు జల్లు

[ఎస్. ముంతాజ్ బేగం గారు రచించిన ‘అమృతపు జల్లు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

లకరింపుల పదనిసలతో
పులకరించు హృదయాలు
జతకూడు స్నేహాలు..
శృతి అందుకోను ఆనందాలు!

మూగబోయిన గుండెకు..
నేనున్నాను నీకోసము అన్న
ఓ తీయని పలుకరింపు
అమృతపు జల్లే అవుతుంది!

చీకటి నిండిన బతుకులో
భుజం తట్టి ఓదార్చి..
ధైర్యం చెప్పే ఓ చిన్నమాట
దారి చూపే చిరుదీపమే అవుతుంది!

యుగాల పగలో రగిలే
పగవాళ్ళ మనసులపై..
‘కుశలమా మిత్రమా’ అన్న
ఓ ఆత్మీయ పలకరింపును
చిలకరిస్తే..
మాయమైపోతాయ్ శత్రుత్వాలు!

మాట మనిషికి
అపురూపమైన వరం!
అది తూటాలా గుండెను –
గాయపరిచేదిగా కాక..,
మధురమైన సంగీతంలా
మనసును దోచేదిగా వున్నప్పుడే
ఆ.. మాటకు విలువ..
అదే మనిషి బ్రతుక్కు చలువ!!

Exit mobile version