[డా. అమృతలత – అపురూప అవార్డ్స్ 2025 ప్రదానోత్సవ సభ నివేదిక అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.]
ఆ అవార్డు లభించడం ‘అపురూప వరం’ అని తెలుగు రాష్ట్రాలలోని వివిధ రంగాలలో పేరొందిన మహిళలు భావించడం అతిశయోక్తి కాదు. అదే (AAA) అమృతలత – అపురూప అవార్డు.
గత 13 సంవత్సరాల నుండి ఈ అవార్డులను తెలుగు యూనివర్శిటీలోని నందమూరి తారక రామారావు కళామందిరంలో అందజేస్తున్నారు నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, పత్రికా సంపాదకురాలు, శ్రీఅపురూప వేంకటేశ్వర దేవాలయ నిర్మాత, వీటన్నింటికీ మించిన సరస్వతీ సామ్రాజ్య అధినేత్రి డా॥ అమృతలత.
2025 సంవత్సరంలో వివిధ రంగాలకి చెందిన మహిళలను ప్రతిభ, సీనియారిటీ, వయస్సు ప్రాతిపదికగా ఎంపిక చేసి ముగ్గురికి అమృతలత జీవన సాఫల్య పురస్కారాలను, పన్నెండు మందికి అపురూప అవార్డులను అందజేశారామె.
కళామందిరంలోకి ప్రవేశించగానే స్వర్ణయుగపు తెలుగు సినిమా పాటలు వీనుల విందు చేస్తాయి. నిర్వాహకుల ఆత్మీయ పలకరింపులు మదిని దోస్తాయి. ప్రాంగణమంతా సింహభాగం అతివలతో కళకళలాడు తుంటుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ సినీనటులు, రచయిత శ్రీ తనికెళ్ళ భరణి, విశిష్ఠ అతిథిగా ప్రొఫెసర్ సూర్యాధనంజయ్ (వీరనారి చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయ ఉపకులపతి), ఆత్మీయ అతిథిగా ప్రముఖ సినీనటి, రచయిత్రి, స్క్రీన్‌ప్లే రచయిత్రి శ్రీమతి రోహిణి పాల్గొన్నారు.
డా॥ అమృతలత ఆత్మకథ ‘నా ఏకాంత బృందగానం’ పుస్తక సమీక్షలతో ముద్రించిన ‘బృందగానం’ గ్రంథాన్ని శ్రీమతి రోహిణి, అవార్డు గ్రహీతల పరిచయాలతో కూడిన సావనీర్‌ను శ్రీ తనికెళ్ళ భరణి గారు ఆవిష్కరించారు.
అనువాదం, వ్యాసరచన విభాగంలో డా॥ అరుణావ్యాస్, నవలా రచనలో గంటి సుజల, శాస్త్రీయ నృత్యంలో కోసూరి ఉమాభారతిలు అమృతలత జీవన సాఫల్య పురస్కారాలను అందుకున్నారు.
అపురూప అవార్డులను వైజ్ఞానిక రచనల విభాగంలో డా॥ చాగంటి కృష్ణకుమారి, సాహితీ సంస్థ నిర్వహణలో మాడభూషి లలితాదేవి, గజల్ ప్రక్రియలో డా॥ గడ్డం శ్యామల, జీవిత చరిత్రల విభాగంలో శ్రీదేవి మురళీధర్, కథారచన విభాగంలో అల్లూరి గౌరీలక్ష్మి, సంపాదకత్వంలో భండారు విజయ, కవిత్వంలో హిమజ, నాటక రంగ పరిశోధనలో డా॥ సమ్మెట విజయ, వైద్యరంగం, సామాజిక సేవా విభాగంలో డా॥ సామవేదం వెంకట కామేశ్వరి, సోషల్ అంట్రపెన్యూర్ విభాగంలో రుబీనా పర్వీన్, జర్నలిజంలో డా॥ సలీమాలు అందుకున్నారు.
శ్రీమతి నెల్లుట్ల రమాదేవి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా సభని ఆసాంతం ఆహ్లాదకరంగా నడిపించారు.
ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో కనుల పండువగా జరుగుతుంది. కాబట్టి లబ్ధప్రతిష్ఠులెంతోమంది ఈ కార్యక్రమానికి హాజరయి ఆనందంతో వీక్షించారు.
అతిథులను, అవార్డు గ్రహీతలను వేదికపైకి ఆహ్వానించే సమయంలో వారి వారి పేర్లతో కూడిన పాటలను వినిపిస్తూ ఆహ్వానించడం ఈ కార్యక్రమ ప్రత్యేకత. ఇది వీక్షకులందరినీ అలరిస్తుంది.
అతిథులు, అవార్డు గ్రహీతలను, గురించిన బయోడేటాని కొంతమంది రచయితలు, రచయిత్రులు వ్రాస్తారు. మరికొంతమంది రచయిత్రులు పరిచయం చదువుతారు.
ప్రతి అవార్డు గ్రహీతకి సత్కారం అందించేటప్పుడు ప్రముఖ రచయిత్రులు, బయోడేటా రాసినవారు, పరిచయకర్తలతో పాటు అవార్డు గ్రహీత బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు వేదికపైకి వచ్చి వారిని అభినందిస్తారు. హాజరయిన ప్రతి రచయిత్రిని వేదికమీదకి ఆహ్వానించడం ఒక విశేషం.
సభకు హాజరయిన ప్రతి ఒక్కరు అక్కడ ఉంచిన మినిట్స్ బుక్‌లో సీరియల్ నెంబర్ వేసి సంతకాలు పెడతారు. సభా వేదిక మీది పెద్దలను నెంబర్ అడిగి, ఆ నెంబర్ గల వ్యక్తికి సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లు అందించడం ఈ సభానిర్వాహకుల ఆనవాయితీ.
ఇన్ని ప్రత్యేకతలతో అందరినీ అలరించే ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహీతలు ఎంత సంతోషిస్తారో, వీక్షకులు అంతే ఆనందిస్తారు. ఆనందోత్సాహాల మధ్య అందరినీ నవ్వుతూ పలకరించి, చక్కని ఉపాహారం, హైటీ, చల్లని మంచినీరు అందించే ఏర్పాట్లు అభినందనీయం.
అమృతలత – అపురూప అవార్డుల కమిటీ కన్వీనర్‌గా ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, కార్టూనిస్ట్ శ్రీమతి నెల్లుట్ల రమాదేవి, సావనీర్ ఎడిటర్‌గా ప్రముఖ రచయిత్రి, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు శ్రీమతి కిరణ్‌బాల వ్యవహరిస్తున్నారు. వీరిరువురికీ అభినందనలు.
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో మాతృదినోత్సవం రోజున ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి, ‘అమృతలత – అపురూప అవార్డుల ప్రదానోత్సవ సభ’ దిగ్విజయంగా నిర్వహించిన అవార్డుల వ్యవస్థాపకురాలు డా॥ అమృతలత గారికి, వారి టీమ్‌కి అభినందనలు, శుభాకాంక్షలతో పాటు ధన్యవాదాలను అందచేద్దాం.