Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అమూల్యమైన ఓటును అజాగ్రత్తగా వెయ్యొద్దు!!!

[శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి రచించిన ‘అమూల్యమైన ఓటును అజాగ్రత్తగా వెయ్యొద్దు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

బంధువులల్లే ఇంటికొచ్చి చేతులు కలుపుతారు
బావా! అంటూ ఫోన్లో పలకరించి ప్రేమలొలకబోస్తారు
రకరకాల గుర్తులు చూపి, ప్రణాళికచిట్టా పట్టుకొస్తారు
ఊరుమ్మడి పంచాయితీలా స్టేజి పైకెక్కి అడుగుతారు

పిట్టలదొరలా బతుకులు స్వర్గం చేస్తామంటూ
పిల్లలకుద్యోగాలు చదువైన తెల్లారే ఇస్తామంటూ
ఉత్తుత్తి వాగ్దానాలతో ఊరించి ఊదరగొడతారు
భరోసా పడ్డావంటే మన బతుకులగమ్యాలే

నాయకులంతా ఒక తానులో తెంపిన ముక్కలే
ఎవ్వరే పార్టీలో ఏ రోజుంటారో వారికే తెలీదు
గెలిచిన గుర్రాల్ని ఎవరుకొంటారో రామ్ జానే!
అందరూ ఒక్కటే అని నిరాశతో నష్టపోవద్దు

ప్రజాస్వామ్యపు స్ఫూర్తిని నీ వంతు గౌరవించు
యోచించి పరిశోధించు, ఓటు వేసే ముందు
నికార్సైన నాయకుడిని భూతద్దంతో వెతుక్కో
బాధ్యతనొదిలేసి నోరు విప్పే హక్కు కోల్పోకు

ఐదేళ్లకు ఒక్కసారొచ్చే అవకాశం వదులుకోకు
తాయిలాల తాత్కాలిక ప్రలోభాల్లో పడిపోవద్దు
అమూల్యమైన ఓటును అజాగ్రత్తగా వెయ్యొద్దు
సమాజ భవితవ్యంలో నీ కర్తవ్యం నిర్వహించు!

Exit mobile version