(సోమరాజు సుశీలగారి ‘ఇల్లేరమ్మ కథలు’ ప్రేరణతో నంద్యాల సుధామణి గారు అందిస్తున్న కథలివి)
మా ఊళ్లో ఒక వార్త పెద్ద సంచలనం రేపింది. మా వూరి డాక్టరు వేరే వూరికి ట్రాన్స్ఫర్ అయ్యాడట. ఆయన స్థానంలో ఎవరో లేడీడాక్టరు వచ్చిందట! మేమెవ్వరమూ అంత వరకూ లేడీడాక్టర్ అంటే ఎట్లా వుంటుందో చూసి యెరుగము.
నేనూ, మా నేస్తురాళ్లూ తెగ ఆశ్చర్యపడి పోయినాము.
“ఆడవాళ్లు డాక్టరు చదువు చదువుతారా? టీచర్లు, నర్సులు, ఆయాలు అయితే చూసినాము గానీ, ఆడవాళ్లు డాక్టరు లాంటి అంతంత పెద్ద చదువు ఎట్లా చదువుతారు? అసలు అంతంత పెద్ద చదువులు మన దేశంలో వుంటాయా? లేదంటే ఆమె ఏ లండన్ లోనో చదువుకొని వొచ్చిందేమో!
లేడీ డాక్టరంటే ఎట్లా వుంటుంది? ఏ డ్రెస్ వేసుకుంటుందీ? ఇంగ్లీషు వాళ్లలా ఫ్రాకు వేసుకుంటుందా? సిస్టర్ల లాగా అదేదో తెల్ల గౌను (ఏప్రన్) వేసుకుంటుందా? బడ బడా ఇంగ్లీషులో మాట్లాడేస్తుందా? లేదా అసలు ఆవిడకు తెలుగు వొస్తుందా? మనం ఆమె దగ్గరికి పోతే ఏ భాషలో మాట్లాడాలో?” ఇట్లా చర్చోపచర్చలు జరిగినాయి.
చివరికి ఆమె గురించి కొన్ని వివరాలు తెలుసుకున్నాము.
“ఆవిడ పేరు ద్రాక్షాయని అంట. ఆపరేషన్లు ఎడమచేత్తో చేసి పడేస్తుందట. చాలా తెలివైనదట. మంచి మందులిస్తుందట.
అయితే పెండ్లి చేసుకోలేదట! వాళ్ల అమ్మా నాయనా ఆమె తోటే వుంటారట. రామన్నవంకలో ఇల్లు తీసుకుందట!” ఇలాంటి వార్తలతో మేము సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయినాము.
“ద్రాక్షపళ్లు ఎక్కువ తింటుందేమోనే! అందుకే ద్రాక్షాయని అని పేరు పెట్టివుంటారు, వాళ్లమ్మా నాయనా..” వ్యాఖ్యానించింది సావిత్రి.
అందరం ‘ద్రాక్షాయని.. ద్రాక్షాయని..’ అని అంటూ పకపకా నవ్వుకున్నాము.
ఏమైనాసరే, మరుసటిరోజు నేనూ, గాయత్రీ ఆస్పత్రికి పోయి ఆమెను కళ్లతో చూసి, ఆమె గురించిన వివరాలన్నీ తెలుసుకొని రావాలని తీర్మానించుకున్నాము.
ఒకరు దగ్గు అనీ, ఒకరు కడుపునొప్పి అనీ చెప్పాలని అనుకున్నాము.
అమ్మ అడిగితే గాయత్రి తోడు రమ్మన్నదనీ, అందుకే ఆస్పత్రికి పోయినాననీ చెప్పాలని నిశ్చయించుకున్నాను. గాయత్రేమో అమ్మణ్నికి తోడుగా ఆస్పత్రికి పోతున్నానని వాళ్లమ్మకు చెప్పివొచ్చింది.
పొద్దున తొమ్మిది దాటిన తర్వాత చెరొక ఖాళీ సీసా తీసుకొని బయలుదేరినాము. అమ్మకు చెబితే వద్దంటుందని చెప్పకుండానే బయలుదేరాము.
అదేంటోగానీ మన ఇష్టాయిష్టాలకు అమ్మావాళ్లు ఎప్పుడూ వ్యతిరేకమే! మనకు నచ్చినవి వాళ్లకు ఎందుకు నచ్చవో నాకైతే తలపగలగొట్టుకున్నా అర్థం కాదు. అమ్మ నాకు ఎప్పుడూ ఎదురుచుక్కే!
ఆస్పత్రిలో జనం డాక్టరు చుట్టూ గుంపు కట్టి వున్నారు. ఒక వైపు ఆడవాళ్లూ, మరో వైపు మొగవాళ్లూ గుంపుగా నిలుచుకొని వున్నారు.
జనంలో నించి తోసుకుంటూ ముందుకెళ్లి ఆ లేడీడాక్టరును చూశాను.
ఆవిడ తెల్లటి కాటన్ చీర, నీలం రంగు పువ్వులున్నది కట్టుకుంది. నీలం రంగు జాకెట్ వేసుకుంది. మెడలో చిన్న బంగారుగొలుసు వేసుకుంది. జడ పొడుగ్గా వేసుకొని, చేమంతిపువ్వు పెట్టుకొని, తిలకం బొట్టు పెట్టుకుని, తెల్లగా, కొంచెం పొట్టిగా వుంది.
“మామూలుగానే వుందే లేడీడాక్టరు.. మా అక్కావాళ్ల లాగానే వుందే..” అని ఆశ్చర్యపడిపోయినాము నేనూ, గాయత్రీ.
పేషెంట్లందరూ వెళ్లే దాకా ఆమెనే గమనిస్తూ వున్నాము. చివరికి మా వొంతు వొచ్చింది.
“నాకు దగ్గు తగ్గడం లేదండీ..” అని చెప్పినాను నేను.
“కడుపునొప్పి” చెప్పింది గాయత్రి. ఆమెను పరీక్ష చేసి లేనిపోని కడుపునొప్పికి మందులేవో ఇచ్చింది.
ఆమె నా నోరు తెరవమని పరీక్షించింది. మందులిచ్చింది. ఏదో ఆలోచిస్తున్నట్టుగా నా మొహం వైపు చూస్తూ వుండిపోయింది రెండు క్షణాలపాటు!
నన్ను నిశితంగా చూస్తూ, “నువ్వు శాంతమ్మ కూతురివి కదా?” అని అడిగింది. నాకు షాక్ తగిలినట్టయింది. (అంతకు ముందురోజే ప్లగ్‌లో వేలు పెడితే, షాక్ ఎట్లా కొడుతుందో చూద్దామని ఓసారి ప్రయత్నించి ఖంగుతిన్నాను లెండి! అందుకే షాక్ ఎట్లా వుంటుందో అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాను) ఇప్పుడు కరెంట్ షాక్‌ను మించిన షాక్ కొట్టింది. ఆశ్చర్యంలో మునిగిపోయినాను. అవునని చెప్పినాను.
“మా అమ్మ మీకు తెలుసా?” అని అడిగాను.
“ఆ.. బాగా తెలుసులే నా చిన్నప్పటి నించీ. అచ్చం మీ అమ్మ లాగానే వున్నావు. మీ అమ్మను అడిగినట్లు చెప్పు. నాయనకు నమస్కారాలు చెప్పు. నేను నాలుగు రోజులయినాక మీ ఇంటికి వొస్తానని చెప్పు మీ అమ్మకు..” అని నా తల మీద అభిమానంగా నిమిరి,
“నీ పేరేంటి? యేం చదువుతున్నావు? (గాయత్రిని చూస్తూ) ఈ అమ్మాయి ఎవరు? మీ అక్కావాళ్లు బాగున్నారా?” అనీ అన్ని వివరాలూ తెలుసుకుంది.
నేను అన్ని వివరాలూ ఉత్సాహం గానూ, కొంచెం సిగ్గుపడుతూనూ, అతి వినయంగానూ చెప్పి, మాత్రలూ, మందూ అన్నీ తీసుకుని, “పోయొస్తానండీ” అని, ఆనందంతో మెలికలు తిరిగిపోతూ ఆస్పత్రి బయటికొచ్చాను. నవ్వుతూ చూసింది ఆవిడ.
నా ఆనందానికి పట్టపగ్గాలు లేవు. నేను లేడీడాక్టరు దగ్గరికి ఆమెను చూడ్డానికి పోతే, ఆమే నన్ను మా అమ్మ కూతురినని గుర్తుపట్టింది. నా విలువ అమాంతం ఇప్పటి అదానీ షేరులా, అప్పటి బిర్లా కంపెనీ షేరులా పెరిగిపోయి నట్టనిపించింది. ఏదో అందరాని ఆకాశాన్ని అందుకున్నట్టు అనిపించింది. నాకేదో కొత్త హోదా వొచ్చినట్టనిపించింది.
గాయత్రి కూడా నా అదృష్టాన్ని మెచ్చుకుంది.
ఎప్పుడూ లేనిది ఆస్పత్రి ప్రాంగణంలో కొంచెం వెనుకగా వున్న చెట్ల కింద తెల్లని ముసుగులు వేసుకున్న బూబమ్మలు, పిల్లా పీచూతో వొచ్చి జంబుఖానాలు పరచుకుని అన్నం డేగిసాలు పెట్టుకొని, విస్తరాకుల్లో అన్నాలు తింటున్నారు. ‘వీళ్లు ఇంతమంది ఆస్పత్రికొచ్చి అన్నాలు తింటున్నారేమిటా..’ అని ఆశ్చర్యపోయాను.
ఆ తరువాతొకసారి డాక్టర్ దాక్షాయని మా యింటికొచ్చి నప్పుడు అసలు విషయం చెప్పింది..
లేడీడాక్టర్ అంటే ఎట్లుంటుందో చూడడానికి చుట్టుపక్కల వూళ్ల నుంచి జనాలు తండోపతండాలుగా బండ్లు కట్టుకొని వొస్తున్నారట!
తానొచ్చిన తర్వాత ముస్లిమ్ ఆడవాళ్లు యేదో కారణం చెప్పి చుట్టుపక్కల వాళ్లను పోగేసుకొని బండ్లు కట్టించుకొని, అన్నాలు వొండి తెచ్చుకొని పిక్నిక్కు వొచ్చినట్టుగా వొస్తున్నారట! ఎవరినడిగినా “పేట్ మే దర్ద్ , కమర్ మే దర్ద్” అని వుట్టుట్టి నొప్పులు చెబుతున్నారట! అయితే మగడాక్టరుతో చెప్పుకోలేని స్త్రీల సమస్యలను కొందరు చెప్పుకోగలుగుతున్నారట! దాంతో తనకు పని విపరీతంగా పెరిగిపోయిందని చెప్పింది ఆవిడ. అప్పుడు నాకు ముస్లిమ్ ఆడవాళ్లంతా గుంపులు గుంపులుగా ఆస్పత్రికి ఎందుకొస్తున్నారా అన్న సందేహం తీరిపోయింది.
సరే.. ఆస్పత్రి నుంచి ఇంటికి మేఘాల మీద తేలుకుంటూ చేరుకున్నాను.
విప్పారిన కళ్లతో, చేతులు తిప్పుతూ.. అమ్మకూ, పెద్దమ్మకూ విషయమంతా చెప్పేసినాను.
మా అమ్మ వేసే క్రాస్ ప్రశ్నలను ఎదుర్కోవడానికి సిద్ధంగా వధ్యశిల ముందు మేకపిల్లలాగా నిలుచుకున్నాను.
“ఆస్పత్రికి ఎందుకు పోయినావు? నాకు చెప్పకుండా పోవచ్చా? అంత అవసరమేమొచ్చింది? పెద్దవాళ్ల మీద గౌరవం ఉండనక్కర లేదా? అంతా నీ ఇష్టమేనా? చిన్నాపెద్దా యేమీ అవసరం లేదా?”
ఇలా ప్రశ్నల వర్షం కురిపిస్తుందనుకున్నా.
కానీ, మా అమ్మ తన ఆనందంలో పడిపోయి యేమీ అడగలేదు. పుట్టింట్లో తనకు తెలిసిన అమ్మాయి తమ ఊరికి డాక్టరుగా వొచ్చిందని కాస్త గర్వంగా వుందనుకుంటా అమ్మకు.
అసలు ఆవిడ పేరు దాక్షాయని అట. అంటే పార్వతీ దేవి పేరంట. అమ్మ చెప్పింది. దాక్షాయని వాళ్ల తండ్రి, అమ్మా వాళ్ల పుట్టిల్లు గుత్తిలో తహసీల్దారుగా పనిచేసేవారు. మా అమ్మమ్మా వాళ్ల ఇంట్లో బాడుగకు వుండేవారు. దాక్షాయనికి పెళ్లి సంబంధాలు చూస్తుంటే అందరూ కట్నాలు ఎక్కువ అడుగుతున్నారట. అందుకు తహసీల్దారుగారు బాధపడి, కట్నం ఇవ్వడం ఇష్టం లేక, ఎంతో తెలివైన తన కూతురును డాక్టరును చేస్తానని పట్టుబట్టి చదివించినాడు.
ఆమె డాక్టరయింది కానీ, తర్వాత ఆమెకు తగిన వరుడు దొరకలేదు.
దాంతో ఆమె తల్లిదండ్రులతోనే వుండిపోయింది. కానీ, డాక్టరుగా మంచిపేరు సంపాదించుకుంది. ఆమే మన ఊరి డాక్టరు కావాలని కోరి వేయించినారట మా ఊరి పెద్దవాళ్లు.
నిజానికి గవర్నమెంటు ఉద్యోగులను పనిష్మెంటు కోసం మావూరికి ట్రాన్స్ఫర్ చేస్తారు.. ఫాక్షన్ వూరని! అయితే పనిష్మెంట్ మీద వొచ్చి, ఆ వూరివాళ్ల మంచితనాన్ని చూసి, అక్కడే స్థిరపడి పోయినవాళ్లు కూడా లేకపోలేదు. అది వేరే కోణం అనుకోండి.
అమ్మ నాలుగురోజులయ్యాక నాయనను ఆమె ఇంటికి పంపి, ఆమెను ఆహ్వానించాలని అనుకుందట! ఇంతలో నేను పుసుక్కున పోయి పరిచయం చేసుకున్నానట!
ఎంతైనా పుట్టింటి వైభవం తన తోడికోడలితో ఘనంగా చెప్పుకోవడంలో ఆనందపడి పోయింది మా అమ్మ.
నాకు క్రాస్ ప్రశ్నలు తప్పాయి. నా తప్పు అప్పటికి క్షమింపబడింది. కానీ, మళ్లీ తలంటు వేళ గుర్తొచ్చినా వొస్తుంది. మా అమ్మ జ్ఞాపకశక్తి పైన నాకు అంతులేని విశ్వాసం! అమ్మను ఈ విషయంలో నమ్మడానికే లేదు!
‘మీ తప్పులు క్షమింపబడును’ అని మా ఊరి చర్చి గోడ పైన రాసిన వాక్యం కళ్ల ముందు కనిపించింది. గుర్తొచ్చిన దేవుళ్లందరికీ కోటి దండాలు పెట్టుకున్నాను. ‘ఏ దేవుడి దయో కదా ఇది! అంత కరుణ చూపడానికి తగిన పుణ్యకార్యం నేనేం చేసినానా’ అని ఆశ్చర్యపోయాను. ఆలోచించుకోసాగాను.
తరువాత డాక్టర్ దాక్షాయని, వాళ్ల అమ్మానాన్నలతో మా ఇంటికి తరచుగా వస్తూ పోతూ వుండేది. పండగలకు ప్రత్యేకంగా చేసే వంటలు అమ్మ నాతో ఆమెకు పంపేది.
ఆమె కూడా పండగలకు పండ్లు, స్వీట్లు పంపేది.
తరువాత మా అక్కా వాళ్ల ప్రసవాలు ఆమె మా ఇంటి దగ్గరే జాగ్రత్తగా జరిపించేది. పేరంటాలకు తల్లితో కలిసి వొచ్చేది. తరువాత చాలాయేళ్లు వున్నాక వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయి వెళ్లిపోయిందావిడ. అంతటితో మా వుళ్లో లేడీడాక్టర్ ఘట్టం ముగిసింది.
మా ఊళ్లో మల్లికార్జునరావు అనే మరో ప్రైవేటు డాక్టరు వుండేవారని ఇంతకుముందు చెప్పాను కదా! ఆయనంటే మా వూళ్లో అందరికీ అభిమానం, గౌరవం!
ఆ కాలంలో ఎండకాలంలో వేడికి చాలామందికి వడగడ్డలు లేచేవి. అలాంటప్పుడు ఆయన దగ్గరికి పోతే, “గడ్డ ఇంకా కొంచెం మాగనీలేమ్మా!” అనేవారు ఆయన. ఇంటికొచ్చి తెగ నవ్వుకునేవాళ్లం. ‘అదేమైనా కాయనా.. మాగడానికి?’ అని. అట్లా ఎవరినైనా ఎగతాళి చెయ్యడంలో నేను ఫస్టు!
ఆ గడ్డలు పెద్దవయ్యాక.. అదే ‘మాగిన తర్వాత’ వాటిని ఓపన్ చేసి, శుభ్రం చేసి మందు వేసి కట్టుకట్టేవారు.
నేను ఎంత పెత్తనాల పేరమ్మనంటే, ఎంత అధికప్రసంగినంటే.. తెలిసిన అన్ని చోట్లకూ పోయి, సమాచార సేకరణ చేసేదాన్ని. అన్ని ప్రదేశాలకూ పోయి, అన్ని విషయాలూ తెలుసు కోవాలి. అదీ నా మనస్తత్వం.. అప్పటి రోజుల్లో.
ఒకరోజు డా. మల్లికార్జునరావుగారి క్లినిక్ మీది నించి పోతున్నాం నేనూ, భాగ్య. ఆయనేం చేస్తున్నాడో చూడాలని క్లినిక్ లోకి దూరాము. ఆయనేం చేస్తే మాకెందుకు చెప్పండి..?
“ఏమి వచ్చినారు?” అని కళ్లతోనే ప్రశ్నించినాడు ఆయన. ఊరికేనే వచ్చినామని ఎట్లా చెబుతాం?
నాకు కడుపునొప్పనీ, భాగ్యకు కాళ్లనొప్పులనీ లేనిపోనివి కల్పించి చెప్పినాము. ఆయన గవర్నమెంటాసుపత్రిలో లాగా మాకు యేవో రెండు టాబ్లెట్లు ఇచ్చి పంపలేదు. ఆయనకు మావి ఉట్టుట్టి నొప్పులని తెలిసి పోయినట్టుంది. మాకు గట్టిగా బుద్ధిచెప్పాలనుకున్నాడు.
“కూర్చోండమ్మా! సూది మందు తీసుకొస్తా” అని గది లోపలికి పోయినాడు.
మేమిద్దరం సూదిమందు మాట వినగానే భయపడిపోయి, ఒక్క అంగలో రోడ్డుమీది కొచ్చి పరుగో.. పరుగు!
ఆ తర్వాత ఇద్దరం తెగ ఆశ్చర్యపడిపోయినాము..
“ఈ పెద్దవాళ్లు.. పిల్లలు చెప్పే అబద్ధాలను ఇంత సులభంగా ఎట్లా కనుక్కుంటారో కదా!” అని.
మళ్లీ కొన్ని రోజులవరకూ ఆయన కళ్ల పడలేదు మేము.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం-లత-18
తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర-31
చెట్టు మాట్లాడుతోంది
అక్షరాంజలి – పుస్తక పరిచయం
వైద్యో నారాయణో హరిః
మోక్షం
రాజమహేంద్రవరంలో ‘సాహితీ వేదిక’ – నివేదిక
జీవన రమణీయం-179
ట్విన్ సిటీస్ సింగర్స్-13: ‘అలనాటి పాటకైనా, ఈనాటి పాటకైనా..సాధన తప్పని సరి’ – మనూష కృష్ణ
‘19వ శతాబ్దిలో తెలుగు కవిత్వంలో నవ్యత’ – సిద్ధాంత గ్రంథం-6
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®