Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మధురానుభూతుల బాల్యానికి నడిపే ‘అమ్మణ్ని కథలు’

[నంద్యాల సుధామణి గారి ‘అమ్మణ్ని కథలు’ అనే కథాసంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

కొందరి బాల్యాలు మధురమైనవి. ఓ అరవై ఏళ్ళ క్రితం నాటి ఓ పెద్ద కుటుంబంలో 11మంది సంతానంలో ఒకరిగా పుట్టి, ఊహ తెలిసిన దగ్గర నుండి ఎన్నెన్నో అనుభూతులను, అనుభవాలను మూటకట్టుకుని, ఎన్నో విషయాలు నేర్చుకుని, వాటిని కథా రూపంలో పాఠకులకు అందించారు నంద్యాల సుధామణి గారు. ఈ కథలు నవ్విస్తూనే ఎన్నో మంచి సంగతులు చెబుతాయి.

ఓ అరవై ఏళ్ళ కిందటి నేపథ్యంలో, రాయలసీమలోని ఓ పల్లెటూళ్ళో, ఓ ఇంట్లో, ఓ అల్లరి పిల్ల చేసిన అల్లరిని రచయిత్రి నంద్యాల సుధామణి గారు ‘అమ్మణ్ని కథలు’ పేరిట కథలుగా వెలువరించారు.

అమ్మణ్ని తెలివైనది, గడుసుది. అల్లరిపిల్ల. ఆకతాయితనం, మొండిపట్టు ఉన్నాయి. వీటికి తోడు స్నేహాలన్నా, పెత్తనాలన్నా, ఆరాలన్నా మహా ఇష్టం! తెలియని విషయాన్ని ఎలా అయినా తెలుసుకోవాలన్న కుతూహలం!

నిరంతరం క్రమశిక్షణలో ఉంచాలని చూసే అమ్మ, ఆదరించే పెద్దమ్మ, అదిలించే అక్కలు, అన్నలు, ఆడుకునే చెల్లాయిలు, తమ్ముళ్ళ మధ్య, కల్మషం లేని కాలంలో పెరుగుతుంది అమ్మణ్ని. కొంటెతనమే తప్ప, దురుసుతనం లేదు అమ్మణ్నిలో.

అమ్మణ్ణి మూడో తరగతిలోకి ఎలా పడిందో తెలుసుకోడం బావుంటుంది. అమ్మణ్ని చేసే అల్లరిని, చెప్పే అబద్ధాలని అమ్మ సులువుగా కనిపెట్టేస్తుంది.. ఎలాగంటారా అమ్మది లాయరు బుర్రట!

మూడో తరగతిలో ఉండగా బలపాలు దాచుకోడం అలవాటయ్యింది అమ్మణ్నికి. దాచిన బలపాలతో ఏం చేసింది? యాపారం చేసింది? ఆ వయసులో చేసే వ్యాపారం ఏమిటో ‘అమ్మణ్ని బలపాల యాపారం’లో చదవండి.

నెహ్రూ అంత అన్యాయం చెయ్యడు లేవే అని అమ్మణ్ని, ఆమె చెల్లెలు జయ ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటారా రాత్రి. ఆ పిల్లలకి నెహ్రూతో వచ్చిన సమస్య ఏమిటో ‘అమ్మణ్ని నెహ్రూ భక్తి’ చెబుతుంది.

అమ్మణ్ణి తన జిజ్ఞాసతో చెలమలో నీళ్ళు తోడింది, చందమామకి అన్నం ఎవరో పెడతారో తెలుసుకుంది.

చిన్న ఊరిలో ఓ డాబా మీద రాత్రి వెన్నెల్లో ఇంటిల్లిపాదీ నిద్రపోతుంటే ఎలా ఉంటుంది?

“మా మిద్దెపైనా, చుట్టుపక్కల మిద్దెల మీదా అందరూ వెన్నెలలో నానుతూ, పొద్దున ఎండవేడిని మరచి నిద్రపోతూ వున్నారు.

మళ్లీ రేపు పొద్దున ఎండను ఎదుర్కోవడానికి శరీరాలను వెన్నెలలో ఊరబెట్టి సిద్ధం చేసుకుంటున్నారు.

చకోరాల్లా అందరి దేహాలూ వెన్నెలను ఆబగా తాగేస్తున్నట్లనిపించింది.

అందరి దేహాలలోకీ వెన్నెల బొట్టుబొట్టుగా ఇంకుతూ వుంది. ఎండవేడికి అలసిసొలసిన ఆ శరీరాలపై వెన్నెల మలాము పూస్తున్నాడు చంద్రుడు.”

ఏం వర్ణన? ఆ డాబా మీద మనమూ ఉండి వెన్నలలో తడిసి ముద్దవుతున్న భావన కలగడం లేదూ?

అమ్మణ్ని అపురూపంగా దాచుకునే వస్తువులు ఏంటి? వాటినెలా సేకరించిందో ‘అమ్మణ్ని నవనిధుల పెట్టె’ చెప్తుంది.

“నేనైతే నా పిల్లలను చచ్చినా ఇట్లా తేలిక చెయ్యను. మర్యాదగా, ప్రేమగా, గౌరవంగా చూస్తాను. వాళ్ల మనసుకు బాధ కలగకుండా పెంచుతాను..” అని మనసులో నిశ్చయించుకుంది అమ్మణ్ని. ఏమయింది? ఏ సందర్భంలో ఇలా అనుకుందో తెలియాలంటే, ‘యాడ జూసినా అమ్మణ్నే!!’ చదవాలి.

“నా విలువ అమాంతం ఇప్పటి అదానీ షేరులా, అప్పటి బిర్లా కంపెనీ షేరులా పెరిగిపోయి నట్టనిపించింది. ఏదో అందరాని ఆకాశాన్ని అందుకున్నట్టు అనిపించింది. నాకేదో కొత్త హోదా వొచ్చినట్టనిపించింది” – అమ్మణ్నిలో ఎందుకింత ఉత్సాహం? పగ్గాల్లేని ఈ ఆనందం ఎందుకో తెలియాలంటే, ‘అమ్మణ్ని ఊళ్లో లేడీ డాక్టరు..!!’ చదివెయ్యండి.

మజ్జిగ సముద్రంలో అమ్మ గురించిన వాక్యాలు చదివితే.. అప్రయత్నంగా మన అమ్మ గుర్తొస్తుంది.

“కానీ, అమ్మకు తెలీకుండా యేమీ వుండదు లెండి.

‘పోనీలే.. పిల్లలు మీగడ తిన్నారు.. తిననీలే.. పెద్దయినాక ఎవరు ఎక్కడ ఏ పరిస్థితుల్లో వుంటారో ఎవరికి తెలుసు? నా దగ్గర ఉన్నప్పుడు తృప్తిగా వాళ్లకు కావలసినవన్నీ తిననీలే!’ అనుకుని అమ్మ క్షమించేస్తుందన్నమాట!

అట్లా అమ్మలు మనల్ని ఎన్నిసార్లు క్షమించకపోతే మన బాల్యం అంతంత ఆనందమయంగా గడిచివుంటుంది చెప్పండి!”

ఈ పుస్తకంలోని ‘అమ్మణ్ని అసూయ’ కథని చిన్నపిల్లలకి పాఠంలా చేరిస్తే.. తోటివారి పట్ల వాళ్ళల్లో అవగాహన కలుగుతుంది. స్వీయలోపాలని ఎలా అధిగమించాలో తెలుస్తుంది. నా వరకు నాకు ఈ పుస్తకానికే హైలైట్ ఈ కథ!

~

ఇంకా హాయిగొలిపే ఎన్నో కథలున్న ఈ పుస్తకం చదవడం ఓ చక్కని అనుభవం! కాలంలో వెనక్కి ప్రయాణం చేసి కొన్ని అనుభూతులను అనుభవాలను ప్రోది చేసుకుని రావచ్చు. ఒక గంట – గంటన్నర ఫోన్ పక్కకి పెట్టో, టీవీలో సీరియల్స్ చూడ్డం ఆపేసో – ఈ పుస్తకం పట్టుకున్నామంటే, ప్రభుత్వాసుపత్రిలో కొత్తగా వచ్చిన లేడీ డాక్టర్‌ని చూసి రావచ్చు, జంతుజాలంతో సహజీవనం చేయచ్చు, శుక్రవారం ఊర్లో సంతలో కూరగాయలు కొనచ్చు, వజ్రకరూరులో వజ్రాలను అన్వేషించవచ్చు, పీర్ల పండగ చూడచ్చు, ఆవుకి జరిగిన సీమంతం వేడుకలో పాల్గొనవచ్చు, సంస్కృతం అధ్యయనం చేయవచ్చు! ఇంకా ఎన్నో చేయచ్చు.

~

ఈ కథలు బాల్యానికి రజతోత్సవం అన్న మాథ్స్ టీచర్ కె. సుబ్బలక్ష్మి గారి అభిప్రాయంతో పాఠకులు తప్పక ఏకీభవిస్తారు.

***

అమ్మణ్ని కథలు
రచన: నంద్యాల సుధామణి
పేజీలు: 196
వెల: ₹ 200/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్.
ఫోన్:  9000413413
~
నంద్యాల సుధామణి,
ఫ్లాట్ నెం.1906,  సి-బ్లాక్,
పిబిఎల్ సిటీ,
పీరంచెరువు, రాజేంద్రనగర్ (మండలం)
హైదరాబాద్. 500091
ఫోన్:  9440683750, 6302318191
~
ఆన్‌లైన్‌లో
https://www.telugubooks.in/products/ammanni-kathalu?

~
నంద్యాల సుధామణి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ
https://sanchika.com/special-interview-with-mrs-nandyala-sudhamani/

Exit mobile version