Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అమ్మకు అక్షర నీరాజనం

[కానాల సుమంగళి గారు రచించిన ‘అమ్మకు అక్షర నీరాజనం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

మ్మ చల్లని ఒడిలో మొదలైంది ఈ మానవజన్మ
పలుకే తెలియని పెదవులు పలికే అమృత వాక్కు అమ్మ

బిడ్డ పుట్టిన క్షణంలో బిడ్డ ఏడుపు విని సంతోషించేది అమ్మ
బిడ్డ భవిష్యత్తు ఊహలతో కమ్మని కలలు కనేది అమ్మ

అమ్మ పేరులోనే మాధుర్యం నింపుకున్నది మాతృమూర్తి
అమ్మ పిలుపుతోనే ఆప్యాయత ప్రేమ పంచేది అమృతమూర్తి

కనులు తెరిచిన క్షణం నుండి కంటిపాపలా కాపాడేది అమ్మ
ఆత్మీయతను పంచి అహర్నిశలు బాధ్యత వహించేది అమ్మ

కనిపించని దేవుడు జన్మనిస్తే కనిపించే దేవత అమ్మే కదా
ప్రాణం పోసేది దైవమైనా కడుపున మోసి కనేది అమ్మే కదా

గోరుముద్దల్లో ప్రేమను నింపి కడుపు నింపి ఆనందించేది అమ్మ
నిస్వార్ధంగా కొవ్వొత్తిలా కరుగుతూ వెలుగులు పంచేది అమ్మ

కొత్త పదాలు పలికించి అర్ధాలు తెలిపి భాషను నేర్పేది అమ్మ
కథలు పద్యాలు సూక్తులు చెప్పి నైతిక విలువలు తెలిపేది అమ్మ

అనురాగం ఓర్పు నేర్పు స్నేహామృతం పంచి పెంచేది అమ్మ
అమ్మ అన్న పదమే అద్భుతం – అపురూపమైన రూపమే అమ్మ

అమ్మ అంటే అంతులేని సొమ్ము – అమ్మ మనసే అమృతం కదా
అమ్మ గూర్చి తెలుపుటకు భాష చాలదు, చెప్పాలన్న ఆశ చావదు కదా

బిడ్డల సంతోషంలో తన సంతోషం వెతుకుతుంది అమ్మ
అందమైన బిడ్డల నవ్వులో సర్వం మరచి తరించేది అమ్మ

అమ్మకు ప్రత్యామ్నాయం ఈ లోకంలో లేదు కాక లేదు
అమ్మ లేకపోతే సృష్టిలో జీవం లేదు – గమనమూ లేదు

సృష్టి కారణమైన అమ్మలగన్న అమ్మకు పాదాభివందనాలు
సకల భువన బాండంబుల పోషించే ఆ తల్లికి శతకోటి వందనాలు

Exit mobile version