Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అమ్మభాష!

[21 ఫిబ్రవరి 2025 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా డా. మైలవరపు లలితకుమారి రచించిన ‘అమ్మభాష!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

భాషలెన్ని వచ్చినా
మాతృభాష మనికి నింపుతుంది
అమ్మా అని పిలిచినంత మాత్రాన
అందరూ అమ్మలు కారు
నవమాసాలు మోసి
స్తన్యమనే అమృతంతో
జీవితాన్నిచ్చిన అమ్మే అమ్మ
అక్షరాలలో మొదటి అక్షరం ‘అ’
అంటే అమృతమూర్తి అమ్మ
అమ్మతో మొదలవుతుంది జీవిత గమనం
అది మరిచిపోతే జీవఛ్ఛవాలే అందరూ
అమ్మ ప్రాణం పోస్తే
అమ్మ అన్నమాట బ్రతుకునిస్తుంది
అమ్మభాషను మరిచిపోతే
అమ్మను కాదని
సవతితల్లి చెంత చేరటమే
ఎంత ప్రేమ చూపినా తల్లి సాటి రాదు
ఎంత నేర్చినా మాతృభాష సాటి మరేది లేదు
అమ్మను ప్రేమిద్దాం
అమ్మభాషను ఆదరిద్దాం!

Exit mobile version