Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అమ్మ కడుపు చల్లగా-68

[ప్రకృతిని, పర్యావరణాన్ని, వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో.]

ఎంత అద్భుతమైనదీ సృష్టి!

‘జీబ్రా’ రెక్కలు, గుండె కణజాలాలు, వెన్నుపాము భాగాలు దెబ్బతింటే తిరిగి పునరుద్ధరించుకోగలదు.

‘ఆక్యులేట్స్’ గుండె, మెదడుతో సహా తోక నుండి అన్నిటినీ రీ-ప్రొడ్యూస్ చేసుకోగలదు.

‘స్టార్ ఫిష్’ లో కొన్ని జాతులు ఒక్క అవయవం నుండే మొత్తం శరీరాన్ని పునరుద్ధరించుకోగలవు.

‘క్రే ఫిష్’ కాళ్ళు, యాంటినా లను తిరిగి పెంపొందించుకోగలదు. సీ కుకుంబర్ తన శరీర భాగాలను బయటకు పంపి శత్రువు దాడి చేసే లోపు తప్పించుకుంటుంది. గ్రీన్ అనోల్ బల్లి తోక పోయినా తిరిగి మొలుస్తుంది. గెక్కో బల్లికి ప్రతి సారీ కొత్త రకం తోక వస్తుంది.  ‘ఫ్లాట్ వార్మ్’ శరీరంలో ఏ చిన్ని ముక్క మిగిలినా మొత్తం శరీరాన్ని పునర్మించుకోగలదు.

ఆక్టోపస్ – గాయమై – ఆ గాయం లోని కణ విభజన అదుపు తప్పి బ్లాస్టోమాగా మారిన సందర్భాలలో, గాయంపై చర్మపు పొరను పెంపొందించుకుంటుంది. ప్రొటీన్ల సాయంతో (ACLE) దాని శరీర వ్యవస్థ సహకారంతో, పాడైన కండరాలను, నరాలను బాగు చేసుకోగలదు. సంక్షిష్టమైన నాడీ వ్యవస్థలను సైతం పునర్నిర్మించుకోగల ఈ అద్భుతమైన శక్తే ఆక్టోపస్‌ విపత్కర పరిస్థితులలో కూడా నిలద్రొక్కుకొని మనుగడ సాగించడానికి తోడ్పడుతోంది.

‘పాంపెల్లీ’ జాతి కీటకాలు విపరీతమైన ఉష్ణోగ్రతల నుంచి తమను తాము కాపాడుకునేందుకు ఒక రకం బ్యాక్టీరియాతో తమ శరీరాన్ని కప్పి వేసుకుంటాయి. ఆ విధంగా ఆ బ్యాక్టీరియాని రక్షణ కవచంగా చేసుకుని 176°F లో సైతం తమను తాము అధిక ఉష్ణోగ్రతల బారిన పడకుండా కాపాడుకుంటాయి.

కంగారూ జాతి ఎలుకల శరీరంలోని ఫ్లూయిడ్స్‌ని దాచుకుని ఉంచడానికి విత్తనాల నుండి తేమను తీసుకుంటూ, మూత్రాన్ని ఎక్కువ గాఢతలో విసర్జిస్తూ ఉంటాయి. అలా త్రాగడానికి నీరు దొరకనప్పుడు సైతం ఎడారుల్లో అవి వాతావరణానికి అనుకూలంగా బ్రతికేయగలవు.

15000 అడుగులలో ఎత్తులో ప్రాణవాయువు చాల తక్కువస్థాయిలో ఉండడమే కాక ఆహారం దొరకడమూ చాలా కష్టమే. విపరీతమైన ఎగుడుదిగుడుల నడుమ సైతం దారి చూసుకుంటూ/చేసుకుంటూ ‘ఆల్పైన్ ఐబెక్స్’ సునాయాసంగానే జీవిస్తూంటాయి.

అంటార్కిటికా మంచు చేపలు – వీటి రక్తంలో ఉండే ఒక ప్రొటీన్ బిగుసుకుపోకుండా నిరోధిస్తుంది. ఆ కారణంగా అవి సబ్-జీరో ఉష్ణోగ్రతల వద్ద కూడా మనుగడ సాగిస్తుంటాయి.

హిమాలయ ప్రాంతాలలో ఉండే జడల బర్రెలు శరీరం నిండా ఒత్తుగా ఉన్ని ఉంటుంది. వీటి ఊపిరితిత్తులు చాలా పెద్దవిగా ఉంటాయి.ఈ నిర్మాణం అక్కడి ఆక్సీజన్ లభ్యత కొరత నుంచి సమర్థవంతంగా ఆక్సీజన్ స్థాయిలను నిర్వహించుకోవటానికి వీటికి ఉపకరిస్తుంది.

‘ఎంపరర్ పెంగ్విన్స్’ శరీరంపై పొరలు పొరలుగా నాలుగు అంచులలో ఈకలు అమరి ఉంటాయి. చర్మం క్రింద కొవ్వు పొరలుగా ఉంటుంది. ఈ నిర్మాణం వాటికి సహజ కవచంగా పనిచేసి అంటార్కిటికా అతి శీతల వాతావరణం నుండి 80% వరకు కాపాడుతుంది. ఆ కారణంగా అవి 1.8°C లో కూడా శరీరంలో ఉష్ణోగ్రతలను నిర్వహించుకొని వెచ్చదనాన్ని పట్టి ఉంచుకోగలుగుతాయి.

చెట్ల బెరడులో కలసిపోయే బూడిదరంగు కప్పలు మైనస్ డిగ్రీలలో సైతం మనుగడ సాగించగల అద్భుతమైన శరీర వ్యవస్థను కలిగి ఉంటాయి. శీతాకాలం వస్తోందనగానే ఈ జాతి కప్పలు తమ ఉదరంలో గ్లైకోజెన్ నిల్వలను సమృద్ధిగా కూర్చుకుని ఉంచుకుంటాయి. తరువాత దానిని గ్లిజరాల్‌గా మార్చుకుంటాయి. ఈ గ్లిజరాల్ గడ్డకట్టిపోకుండా నిరోధించగల శక్తిని కలిగి ఉండటం వలన అది, ఆ కప్పలు చలికి గడ్డకట్టుకుపోతున్నప్పుడు వాటి కణజాలాన్ని/కణాలను కాపాడుతూ ఉంటుంది. చలికాలం దాటిపోగానే అవి అతి సాధారణంగా ఏమీ జరగనట్టే యథాతథంగా తమ మనుగడను కొనసాగిస్తాయి. ఈ జాతి కప్పలు అమెరికా సంయుక్త రాష్ట్రాల తూర్పు, ప్రాంతంలో, కెనడా లోని ఆగ్నేయ ప్రాంతంలో ఉంటాయి.

ఇలా సృష్టిలో ప్రతి జీవీ మనుగడకు అనుగుణమైన నైపుణ్యాలతో విపత్కర పరిస్థితులలో సైతం నెగ్గుకురాగలగడం ప్రకృతి వైచిత్రి కాక మరేమిటి?

Exit mobile version